• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సుదర్శన్ క్విక్‌బాక్సింగ్: భయోగ్రఫీ!

|

బళ్ళోంచి పారిపోయిన పిల్లాడిలా ఆకాశంలోంచి పత్తా లేకుండా పారిపోయేడు అప్పటిదాకా బలవంతంగా అటూ ఇటూ మెసిలిన సూరీడు. ఆఫీసులోంచి బాస్ బైటకి వెళ్లిన తక్షణం ఎక్కడివారక్కడ జారిపోయే ఉద్యోగుల్లా మాయమైపోయేయి వెండి మబ్బులు. తడిపి ఆరేసిన తువ్వాలులా వుంది వాతావరణం. ఏడ్చి తుడ్చుకున్న వాడి ముఖంలా కూడా వున్నది వెదర్. ఎక్సెల్ బ్లేడుతో దొరికిన బాడీని దొరికినట్టు కోస్తున్నది కోల్టు ఎయిర్. ఒంట్లో ఖాళీగా వున్నచోట్ల ఎవరో ఐస్ క్యూబ్‌లు రాస్తున్నట్టుంది.

చంపేస్తున్నది చలి అని చలికి చస్తున్నాం అనుకుంటూ వణుకుతూ నించుకున్నారు జనం బస్టాండులో. తమ తమ గూళ్లకు చేరడానికి పక్షుల గుంపులా నిలబడ్డారు జనం. ఈసారి చలి విపరీతంగా వున్నది అన్నాడొక బక్క పలచటి పొడవాటి వొళ్లూ ముక్కూ వున్న సీనియర్ సిటిజన్. ఇంత చలి ఎప్పుడూ లేదు అన్నదొక లావాటి ఆడమనిషి లావాటి బ్యాగు పట్టుకోలేక అవస్తపడుతూ. మాట్లాడే వాళ్లు మాట్లాడ్తున్నారు. మౌనంగా వుండేవాళ్లు మౌన వ్రతం చేస్తున్నారు. కాని అందరి చెవులూ బస్సు వస్తున్న శబ్ధం కోసం అటెన్షన్‌గా నిల్చున్నాయి. అందరి కళ్లల్లోంచీ చూపులు రోడ్డు చివరి కంటా పాముల్లా పాకుతున్నయి బస్సు దర్శనం కోసం.

హడావిడిగా ఇహనో ఇంకా కాస్సేపుకో భూప్రెపంచం మునిగి పోతుందేమోనన్న భయంతో వస్తూనే వున్నారు జనం బస్సు స్టాండులోకి. అందరిలాగే అతను వచ్చేడు. అంత సన్నమూ కాడు అంత లావూ కాడు అంత ఏజుడూ కాదు అంత బచ్చాగాడూ కాదు. జనాన్ని చూసి విసుక్కున్నాడు. ఈ జనానికేం పని లేదా? ఏ టైంలో చూసినా జనమే జనం ఎక్కడ్నించి వస్తారో? అనుకున్నాడు. బస్టాండును నిలబెట్టిన వో ఇనుప స్తంభానికి వీపు ఆనించి నిలబడ్డాడు. షర్టూలోపల బనీనూ వున్నా చల్లగా తగిలిందది.

chintapatla sudarshan column on swine flu

ఎదురుగా యిద్దరమ్మాయిలు కళ్లు మాత్రమే కనిపించే ముసుగులు కట్టుకున్నారు. వాళ్లిద్దరూ అమ్మాయిలే అని గ్యారంటీ అయితే లేదు. ఇద్దర్లో ఒకరు అమ్మాయి ఒకరు అమ్మ కూడా కావచ్చు. బొత్తిగా గుర్తుపట్ట వీల్లేకుండా తయారయ్యేయీ ముసుగులు అని విసుక్కున్నాడతను. బొత్తిగా కళా పోషణకు వీల్లేకుండా పోయిందీ రోజుల్లో అనీ అనుకున్నాడు.

మరుగుతున్న టీ డికాక్షన్ రంగులా చీకటి క్రమక్రమంగా చిక్కబడుతున్నది. ఒడ్డు నుంచి నీళ్లల్లోకి దిగి ఉషారుగా పళ్లికిలించే మొసలిలా విర్రవీగసాగింది. చలి. కబంధుడి చేతుల్లా దాని చేతులు అంతకంతకూ పొడుగై పోతున్నయి.

బుర్రుడుర్రుర్రు మన్న శబ్దం.. బస్సు వొచ్చేస్తుందని జనం కాళ్లు తొక్కుకుందుకీ, చేతులు విసురుకుందకీ సిద్ధపడ్డారు. బ్యాగులున్న వాళ్లు కొందరు బ్యాగుల్లేని వాళ్లు కొందరూ మొత్తం మీద కాళ్లూ చేతులూ వున్న వాళ్లే అందరూ. కొందరు ముక్కులకి గుడ్డలు కట్టుకున్నారు. కొందరు స్వెట్టర్లు వేసుకున్నారు. కొందరు స్వెట్టర్లేకాదు మంకీ క్యాపులూ పెట్టుకున్నారు. కొందరు మాత్రం ఉట్టి ముఖాలే తెచ్చుకున్నారు.

ఎవరెట్లా గుంటేనేం అందర్నీ ఎక్కించుకుంది బస్సు. కొందర్ని మర్యాదగా సీట్లో కూచోబెట్టుకుంది. కొందర్ని రాడ్‌లకి వేళ్లాడమంది. జానెడు జాగా దొరికినా సెటిలైపోయేరు జనం. ఫుట్ బోర్డు నిండా జనం. బస్సునిండా జనం.. జనం.. జనం.. ఒక్క బస్సే కాని రెండు బస్సుల జనం మూడు బస్సుల జనం కూడా వుండవచ్చు. జనం మధ్య టిక్కెట్ల కోసం దూరుతున్న కండక్టర్‌కి వున్న ప్రాక్టీసు లేక పోడంతో ఎటునుంచి ఎటుదూరాలో తెలీక చలి అయోమయంలో వుండిపోయింది. హమ్మయ్య చలి కొంచెం తగ్గింది అన్నాడు సీనియర్ సిటిజన్. జనం ఇంతగా వున్నారు కనక ప్రపంచ హగ్గింగ్ డే అయినా నిన్ను హగ్ చేసుకోలేకపోతున్నాను. కిందికి దిగుతావుగా అప్పుడు చెప్తా అనుకుంది చలి పళ్లు నూరుతూ.

డ్రైవరు ముక్కుకి బట్ట కట్టుకున్నాడు. కండక్టరూ బట్ట ముక్కుకి అడ్డంగా వేలాడదీశాడు. బస్సులో ముసుగు వనితలే కాదు ముసుగు పురుషులూ బాగానే వున్నారు. వీళ్లందరికీ ఎందుకింత భయం. ముక్కులకి ముసుగులు కట్టి తప్పించుకో గలరా అనుకున్నాడు అతను కాదు ఈసారి ‘ఇతను'. చూద్దాం అని నవ్వుకున్నాడు. ఇతను అతనికి కనిపించలేదు గానీ అతను పరిస్థితి బావున్నట్టు లేదు రేపట్నుంచీ ముక్కుకి మనమూ ఓ గుడ్డ కట్టుకోవల్సిందేనేమో అనుకున్నాడు.

కల్యాణమూ, కఫ్పూనే కాదు తుమ్ము కూడా వస్తే ఆగవు కదా! ‘హాచ్చ్‌చ్చ్' అని తుమ్మాడోశాల్తీ ముందునించి వెనక్కి తిరిగి అతని మొహమ్మీదే. ఉలిక్కిపడ్డారు చుట్టుపక్కల జనం. ఆ సౌండుకి ‘గేర్ రాడ్' ఎగిరిపోతుందేమోనని ఎడంచేతి పిడికిలితో బలంగా అదిమిపట్టాడు డ్రైవరు. డబ్బుసంచీని గుండెలకానించి పట్టుకున్నాడు కండక్టర్. పైకప్పు ఎగిరిపోలేదని సంతోషపడ్డారు జనం. సారీ సార్! అన్నాడు తుమ్మినవాడు ‘అతని' వైపు అపాలజిటిక్‌గా చూస్తూ. తుమ్ము తుమ్ముతో ఎదిరించడానికి అర్జంటుగా తుమ్మనేది రాదు గనక, తుమ్మ లేక తుమ్మాలనే ఆలోచనా లేక తుమ్మనేది తుమ్మకుండా గమ్మున వుండిపోయాడతను.

అక్కడక్కడా బస్సుస్టాండ్లల్లో పోలీసుల్లా నిలబడున్న చలికీ గాలికీ జనాన్ని అప్పజెప్పుతూ సాగింది బస్సు. అతను తను దిగాల్సిన చోటు వస్తున్నదని జనం వీపుల్నీ ఫుడ్ బాస్కెట్లయిన పొట్టల్ని తట్టుతూ తాకుతూ దారి చేసుకుంటూ మొత్తానికి బస్సు దిగేశాడు. దొరికావురా అంటూ చలి చెవుల్నీ మెడనీ చెంపల్నీ ‘లాండ్ గ్రాబర్'లా కబ్జా చేసేసింది.

ఇల్లలకంగానే పండగయిపోదు, బస్సు దిగగానే ఇల్లు ఎదురుగ్గా రాదు కదా. ఓ అర కిలోమీటరు చలిస్తే చలిలో అప్పుడు గృహమే కదా స్వర్గసీమ.

అతను అడుగు ముందుకువేశాడు. వడివడిగా అడుగులు వేద్దమనుకున్నాడు కానీ అలసట చిల్డ్ చలీ అడుగులని బరువెక్కించాయి. పగటి పూట వెలుగుతూవుండే వీధి లైట్లు ఎప్పట్లానే రాత్రయింది గనక వెలగడం మానేశాయి. తనతో పాటు ఎవరో వెనకనించి నడిచివస్తున్న శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరనిపించింది. మళ్లీ ముందుకు అడుగేశాడు. ఎవరో వస్తున్న చప్పుడు. తనని ఎవరో ‘ఫాలో' చేస్తున్నారు. ఎందుకు? వెనక్కి తిరిగిన అతనికి నల్లటి ఆకారం తన వెనకే నిలబడ్డట్టనిపించింది.

ఏమైతే అదౌతుందని అలాగ నిలబడిపోయాడు. ఆ ఆకారాన్ని పరీక్షగా చూడ్డానికి ప్రయత్నించాడు. చీకటిలో కల్సిపోయిన నల్లటి ఆకారం.

‘ఏయ్ ఎవర్నువ్వు? ఎందుకు ఫాలో చేస్తున్నవా?' అన్నాడు అతను కొంచెం కోపంగా, ఆ ఫాలో చేస్తున్నవాడు నవ్వాడులా వుంది. చప్పుడు వినిపించింది.

నా పేరు ‘ఇతను'. నిన్ను బస్సులోంచి ఫాలో అవుతున్నాను.

‘ఇతనా? ఇదేం పేరు?' అన్నాడతను.

‘ఎవరిష్టం వచ్చిన పేరు వారు పెట్టుకోవచ్చననుకుంటా' అన్నాడు కనిపించని నల్లమబ్బులాంటి ఇతను.

‘నీ పేరే దయితేనేం. నన్నెందుకు ఫాలో చేస్తున్నాువు?'

‘క్వొశ్చన్‌ను మళ్లీ మళ్లీ రిపీటెయ్యకు. చెప్పానుగా. ఫాలో అవుతున్నానని'

సరే అవుతున్నావు కదా ఫాలో వై? ఎందుకు అంటే రిపీటవుతుందని ‘వై'? అన్నాడు అతను.

‘కిడ్నాప్ చేద్దామని' అన్నాడు ఇతను ఇకిలిస్తూ.. చప్పుడే వినిపించింది. ఆకారం క్లియర్‌గా లేదు మరి.

‘ఎందుకు?' అన్నాడీసారి రిపీటయినా సరే అనుకుని.

‘నీడలా వెంటవొస్తున్నాను!' అన్నాడు ఇతను.

‘ నా దగ్గరేం లేదు. జీతం అయిపోయింది. బ్యాంక్ కార్డులూ లేవు.. అనవసరంగా ఫాలో అవకు.. వేస్త్.. 'అన్నాడు అతను ముందుకు కదుల్తూ.

కాస్సేపటికి వెనక్కి తిరిగి చూస్తే ఆ ఆకారం వెనకాలే వొస్తున్నట్టనిపించింది మళ్లీ ఆగాడు.

‘చెప్పాను గదా నన్ను చీరినా కోసినా పైసా రాలదు నీకు' అన్నాడు.

‘డబ్బు కోసం కిడ్నా చెయ్యను నేను' అన్నాడు ఇతను. ‘మరి! మరెందుకు!' అరిచాడు అతను.

‘కోటా పూర్తి చెయ్యాలి కదా' అన్నాడు ఇతను. ‘నాకేం అర్థం కావట్లేదు' అన్నాడు అతను.

మాది ‘యం లోకం' మా బాస్ ఆర్డర్. రోజుకి యింతమందిని పట్టుకురమ్మని నువ్వు నాకు దొరికావు అన్నాడు ఇతను.

వెన్నుపాములోంచి చలి మెడుల్లా ఆబ్లాంగెటా దాకా పరుగెత్తింది.

‘అంటే.. అంటే..' అతనికి షివరింగ్ వచ్చింది.

ఇందాక బస్సులో నా లాగా ఈ డ్యూటీకి వచ్చిన ‘ఇతను'లు చాలా మందే వున్నారు. నీ ముందున్నతను హాచ్చ్‌మని తుమ్మినప్పుడు గాల్లోకి వచ్చాను నేనూ నా కొలీగ్సు.. సారీ బ్రదర్ మా డ్యూటీ మేం చేయకతప్పదు కదా' అన్నాడు ఇతను.

'మమ్మల్ని మీరేం చెయ్యలేరు. డాక్టర్లున్నారు. వేక్సినేషను వుంది' అన్నాడు ధయిర్యం చేసి అతను.

అవునవును. పాపం డాక్టర్లు కూడా మా వాళ్లలిస్టులో వున్నార్లే. ఆసుపత్రులూ, డాక్టర్లూ, రాజకీయ నాయకులూ అబద్ధాలూ మమ్మల్ని ఆపలేవు. ఎవరి జాగ్రత్త వారిదే, అజాగ్రత్తగా వుంటే వొదలం సుమా. అవునూ మాకదేంటి ‘స్వైన్ ఫ్లూ' అనే పేరు పెట్టారంట గదా! భలే వుందిలే అన్నాడు ఇతను అనబడే స్వైన్ ఫ్లూ వైరస్.

హాచ్చ్ హాచ్చ్ మని తుమ్ముతూ.. ఖళ్ ఖళ్‌న దగ్గుతూ రాకెట్‌లా ఇంట్లోకి వచ్చిపడ్డాడు అతను.. కలయా.. నిజమా అనుకుంటూ. రేపట్నుంచి ముక్కుకి గుడ్డకట్టుకోవాలి అని కూడా అనుకుంటూ.

- చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about Swine Flu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X