వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్విక్‌బాక్సింగ్: మనుషులూ-మట్టీ

|
Google Oneindia TeluguNews

ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని వూరికే అనలేదు అని గొణుక్కుంటూ వెనక్కి తప్పుకుంది నడుంమీద కడవ పెట్టుకున్న ఆడమనిషి. ఆమెని వెనక్కి తోసి అడ్డంగా వచ్చినిలబడ్డది మేలి ముసుగు వేసుకుని చేత్తో పువ్వు పట్టుకున్న మరో ఆడ మనిషి.

నల్లచారల పసుపు చొక్కా వేసుకుని వచ్చిన పులిని చూసి పక్కకు తప్పుకుంది ఆవు. ఎక్కడ్నించో వచ్చి వాలిన చిలుకల జంటను చూసి పక్కకు వెళ్లి పోయింది జాంపండు. ఓ నల్ల ఏనుగు వచ్చి ఎరుపు రంగు మామిడికి అడ్డంగా నిలబడ్డది. నెమలి ఒక్కటి ఎక్కడ నుంచోవాలో తెలీక అడ్డంగా అరటిపండు మీద నిలబడ్డానికి అవస్థపడ్డది.

నువ్వు కాస్త అసింటా జరిగిదే గానీ నేను నుంచో లేను అన్నాడు హనుమంతు, వినాయకరావుతో. రాముడికీ సీతకీ మధ్య లక్ష్మి వచ్చి నిలబడ్డది. కృష్ణుడి పక్క లక్ష్మణుడికి జాగా దొరికింది. వెంకటేశ్వరస్వామి బల్ల అంచున సర్దుకున్నాడు.

కొత్తవి ఎప్పుడూ ధగధగలాడుతుంటే పాతవి పాతవి అయ్యే కొద్దీ దుమ్ముపేరుకొని ఆకారాలు అర్తంకావు. కొత్తవి వచ్చినప్పుడల్లా పాతవాటికి స్థానచలనం తప్పదు. ఓసారి ఓ వరుస వెనక్కి పోతే యింకోసారి యింకో వరస వెనక్కి పోకతప్పదు. కొత్తవి వచ్చీరాంగానే ముందు వరుసలో వాళ్లని వెనక్కి తరిమికొట్టి దర్జాగా నిలబడ్తయి.

chintapatla sudarshan column on the clay figures

వెనక్కి తప్పుకో అంటూ మీద మీదకి వచ్చాడు వినాయకరావు. ఈయన కొత్త వినాయకుడు మరి. కొత్త వినాయకుడు తప్పుకోమన్నది మరెవర్నో కాదు పాత వినాయకరావుని. కొత్త వినాయకరావులు వచ్చినప్పుడల్లా పాత వినాయకరావులు వెనక్కి యింకా వెనక్కి వెళ్లిపోక తప్పదు.

ఏంటోయి మీ జబర్దస్తీ నువ్వూ వినాయకరావే మేమూ వినాయక రావులమే, మన్లో మనకీ గొడవ దేనికీ అని పాత వినాయకరావులంటే

పొండోయ్ పొండి.. మీరు పాత వినాయకులు బాగా పాతబడి పోయారు. చేట చెవుల మీదా తొండాల మీదా దుమ్ము చూడండి. కిరీటం రంగేదీ మెళ్లో హారాలు రంగు వెలిసిపోయాయి. మిమ్మల్ని ఎవరడుగు తారింక జమానా మాది మా కిరీటాల ధగధగ చూడండి మా ఒంటి నిగనిగచూడండి. మనుషులంతా చూడ్డానికి ఒక్కటిగా కనిపించినా అంతా ఒక్కటి కానే కారు అట్లాగే పాత వినాయకరావులు కొత్త వినాయక రావులు కాలేరు. ఎవరి డిమాండు వారిది అంటారు కొత్త వినాయకరావులు.

ఈ గొడవ ఒక్క వినాయకరావులదే కాదు మిగతా దేవుళ్లందరిదీ కూడా. పాత రాముడు నీలమేఘ శ్యాముడిలావుండడు నల్లమేఘ శ్యాముడయి పోతాడు. కొత్త రాముడు నిగనిగ నీలం రంగులో వుంటాడు. పాత సీతమ్మ చీర మాసి పోయివుంటుంది. కొత్త సీతమ్మ పట్టుచీర చిలకపచ్చ రంగు మెరుస్తూ వుంటుంది. పాత ఆంజనేయుళ్ల గుంపు అసలు కనిపించదు అడ్డంగా కొత్త ఆంజనేయుళ్లు వేంచేస్తారు. పాత వెంకటేశ్వరస్వామికి మెరుపే వుండదు కొత్త వెంకటేశ్వరస్వామి అభయహస్తం కొట్టొచ్చినట్టు కనపడుతుంది.

ఇదే సమస్య జంతుజాలానిది కూడా. కొత్త పులుల మందవస్తే దుమ్ముకొట్టుకుపోయి పాత పులుల చారలసలు కనిపించవు. కొత్త గుర్రాలు, కొత్త జింకలూ, కొత్త హంసలూ, కొత్త చిలుకలూ అన్నీ కొత్తవి వచ్చినప్పుడు పాతవి పరారే.

పండ్లకి మాత్రం లేదా ప్రాబ్లమ్. పాత అరటి పండ్లు ఎవరిక్కావాలి. తాజా అరటి పళ్లకే కదా డిమాండు. మామిడి, బత్తాయి, నారింజ, ద్రాక్ష పాత వాటి మీద దుమ్ముదులిపే వాడెవడు దులిపినా రంగు పోయి వుంటుంది, పెచ్చులూడి పడ్తయి. అందుకే అవి వెనక్క వెళ్లిపోతే కొత్తవీ తాజావీ చూడగానే ఆకర్షించేవీ ముందురుసలో కొలువుదీర్తయి.

పండుగలప్పుడూ, జాతరాలప్పుడూ, ఉత్సవాలప్పుడూ రోడ్డు పక్కన షామియానాల్లో గుడారాల్లో పొడవాటి బల్లలమీద, ఎత్తు తక్కువ నించి ఎక్కువ దాకా పెట్టిన బల్లల మీద వుండే దేవుళ్లూ, జంతువులూ, పళ్లూ యింకెన్నో రకరకాల బొమ్మల గొడవయిది.

అబ్బబ్బ రాత్రయితే చాలు గలభా షురూ. షాప్ వాడు పరదాలు వేసేసి పక్కనేవున్న టెంట్ గదికి వెళ్లగానే వీల్లు నానా రభసా చేస్తున్నారు అన్నాడు లాఫింగ్ బుద్ధా, నవ్వడం మానేసి పొద్దుట్నుంచీ జనం కొండానికి వచ్చినప్పుడంతా నోరు తెరిచేవుండటం వల్ల బుగ్గలు బూరెల్లా వుబ్బివున్నయి.

లాఫింగ్ బుద్ధా అనగా నెప్పుడూ నవ్వుతూ వుండాలి కాని నోరు మూసుకోరాదు అన్నాడు ఆ పక్కనే వున్న మిలటరీ వాడొకడు. చేతిలో గన్ను కూడా వున్నవాడు.

ఏం నవ్వుతాం జవాన్ భాయ్.. ఆపైలోకాన వున్నవాడెవడో ఈ మనుషుల్ని తయారు చేసి భూమ్మీదకి తోసేస్తాడంట. అట్లాగే ఈ మనుషులు మనల్నిలా తయారు చేసి అంట్లో పెట్టి అమ్ముకుంటున్నారు. మనుషులంతా సోతంత్రం అనీ అప్రజాస్వామ్యం ఏమోమో చెప్తుంటారు ఎందుకా అనుమానం చూపు ఇవాళ్రేపు అందరి యిళ్లల్లోనూ మా లాఫింగ్ బుద్ధాలున్నారులే వాస్తు ప్రకారం వుండాలంట గదా, ఆళ్లూ ఈళ్లూ చెప్తే ఆనోటా ఈనోటా వస్తే విన్నానులే.. ఏం చెబుతున్నాను.. అదే సోతంత్రం గురించి అది ఆళ్లకున్నది గాని మనకెందుకు లేదు.

ఎక్కడ నిలబడ్తే అక్కడ అక్కడ పడివుండాలి, ఎవడు కొనుక్కుపోతే వాడింటికి వెళ్లాలి. అక్కడ టేబిల్ మీదో బొమ్మల కప్ బోర్డులోనో కదలకుండా వుండాలి దుమ్ము ధూళి మీద పడ్డా దులుపుకోకుండా..

వీడ్ని కదిలించామెందుకురా అని లోలోపల తన్ని తను తిట్టుకుంటూ జవాను మెల్లగా మరో బల్ల మీదికి వెళ్లిపోయేడు.

చీకట్లో పక్కనున్నది ఎవరో తెలీక తోక తొక్కింది జింక. పులి గాండ్రుమంది.

పులి! బాబోయ్! పులి! సారీ పులిగారూ మీ తోక అనుకుని తొక్కలేదు. చీకట్లో కనిపించలేదు అన్నది జింక.

బొమ్మల అంగడి కాబట్టి వూరుకున్న యిదే అడివయివుంటేనా ఈ పాటికి మొత్తం అంతా తినేసి టైంపాసుకి ఎముకలు నవుల్తుండే దాన్ని అన్నది పులి.

ఆ పక్కనే వున్న ఆవు ఫక్కుమని నవ్వింది. పిచ్చి పులీ! ఈ అంగట్లో పులైనా, ఆవైనా, జింకైనా అందరం ఒక్కటే. ఆకారాలలో మార్పు గానీ మనం కదలేం మెదల్లేం ఏవీ చెయ్యలేం అన్నది.

అవును.. ఏమీ చెయ్యలేం.. చూస్తూ వుంటం.. తప్ప అన్నది కోతి ఆ పక్కనే వున్న జామ, మామిళ్ల కేసి చూస్తూ.

ఇక బల్లల మీద ఒకే రకం దేవుళ్లు అనేక మంది రకరకాల రంగుల్లో సైజుల్లో వున్నారు. కృష్ణుళ్లు నీలిరంగే కాదు తెలుపు, గోధుమ రంగులోనూ వున్నారు, కానీ అందరి చేతుల్లోనూ వేణువులున్నవి. రాముళ్లు నీలమేకాదు ఎరుపు, పసుపు రంగుల్లోనూ వున్నారు. అయితే అందరికీ కిరీటాలూ బాణాలూ వున్నయి. వేరు వేరు రంగుల్లో వున్న ఆంజనేయుళ్లు కొందరు మోకాలు మీద కూచుని చేతులు జోడించి వుంటే మరికొందరు పహిల్వాన్లల్లా గదలు పట్టుకుని వున్నారు.

లాఫింగ్ బుద్ధా లెక్చర్ తప్పించుకుని యిటు వచ్చిన జవాన్‌కి ఒక్కచోట యింతమంది రాముళ్లు, కృష్ణుళ్లు, ఆంజనేయుళ్లు కనిపించడం విడ్డూరంగా వుంది. వీళ్లల్లో వీళ్లకి గొడవొస్తే ఏమవుతుంది? ఓ కృష్ణుడు యింకో కృష్ణుడి మీదకి చక్రం విసుర్తాడా? ఓ రాముడు యింకో రాముడి మీదకు బాణం ఎక్కు పెడతాడా? ఓ ఆంజనేయుడు మరో ఆంజనేయుడితో గదాయుద్ధం చేస్తాడా? అనుకుంటూ నవ్వుతున్న జవాన్‌తో ఎవరో

ఒరేయ్! నువ్వుండాల్సిన చోట వుండకుండా ఎందుకొచ్చావురా! ఫో యిక్కడ్నించి అన్నారెవరో.

చుట్టూ చూశాడు జవాన్. యింతమంది దేవుళ్లల్లో ఎవరయి వుంటారో తెలీలేదు.

ఉరేయ్! మనమంతా ఇలా రకరకాల రంగుల్లో, ఆకారాల్లో కనిపిస్తున్నా మనల్ని తయారు చేసిన మట్టీ, సిమెంటూ, ప్లాస్టర్లూ ఒక్కటే. సైజూ డిజైనూ బట్టే మన విలువ. రంగూ రూపూ జాతీ ఏదయితేనేం మనుషుల్ని తయారు చేసే ముడిసరుకు ఒక్కటే.. కానీ డబ్బున్న మనుషులకే విలువ. మనం చేసిన బొమ్మలైన మనుషులకు మనం తెలివితేటలు, స్వేచ్ఛ, ఆనందం అన్నీ యిచ్చాం కానీ వాళ్లు మాత్రం మనల్ని కదలని బొమ్మల్ని చేసి దేవాలయాల్లోనూ దుకాణాల్లోనూ అమ్ముకుంటున్నారు. మన పేర జాగాలు ఆక్రమిస్తున్నారు. నడిరోడ్ల మీద మనల్ని పాతిపెట్టి బిజినెస్ చేసుకుంటున్నారు. బొమ్మలమయిన మనం పాతగయితే మళ్లీ మట్టిలో కలుస్తాం. కొత్త మనుషులూ కొత్త తరాలూ వస్తుంటే పాత మనుషులూ, పాత తరాలూ మట్టిలో కలుస్తుండడం మామూలే. మనుషులైనా బొమ్మలయినా మట్టిలో పుట్టి మట్టిలో కలవాల్సిందే. అసలు ఈ బొమ్మల దుకాణానికీ ప్రపంచానికీ ఆట్టే తేడా లేదు. బొమ్మలు.. బొమ్మలే కాదు, మనుషులు కూడా బొమ్మలే హహ్హహ్హ.

ఈ మాటలన్నదీ నవ్విందీ వెనకాలవున్న వేంకటేశ్వరస్వామో, ఎదురుగ్గా నెమలి మీద స్వారీ చేస్తున్న కుమారస్వామో అర్థం కాలేదు జవాన్‌కి. ఈ దేవుళ్ల మధ్య మనం ఎందుకు మనముండాల్సిన చోటికి వెళ్దాం అని ‘రిట్రీట్' అయ్యాడు జవాన్.

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about clay figures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X