వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్విక్ బాక్సింగ్: గొళ్లెంలేని తలుపు-కళ్లెం లేని గుర్రం

|
Google Oneindia TeluguNews

విద్యాభ్యాసం పూర్తయ్యింది. ఇంక మీరంతా మీమీ యిళ్లకి వెళ్లవచ్చునన్నారు గురువుగారు.

శిశ్యులందరూ మూటాముల్లే సద్దుకుని సిద్ధంగా వున్నారు.

అందరూ ఏదో ఒక విద్య నేర్చుకున్నారర్రా మీమీ విద్యలకు తగిన వృత్తులు చేసుకోండి, రాజుగారి ఆ స్థానంలో ఉద్యోగాలు సంపాదించుకోండి. ఈ గురువుగారి పేరు నిలబెట్టండి అన్నాడు గురువు. శిశ్యులు ఒక్కొక్కరే ఆయనకు పాదాభివందనం చేసి వెళ్లిపోతున్నారు. చివరకు అయోమయం వంతు వచ్చింది.

ఏరా అయోమయం. ఎట్లా బతుకు తావురా ఈ లోకంలో. శిశ్యులందరికీ ఏదో ఒక విద్య వచ్చింది కాని నీకు వొట్టి పోచికోట కబుర్లు చెప్పడం తప్ప యింకేమీ వచ్చినట్టు లేదు. పైగా సామెతల పిచ్చి ఓటి నీకు అన్నాడు గురువు అయోమయం మీద జాలి పడుతూ.

అదేమిటి గురూజీ! సామెతల పట్ల చిన్నచూపు వద్దండీ. సామెతలు చెప్పడం కూడా ఓ విద్యేనండీ. 'కోటి విద్యలూ కూటి కొరకే 'అన్నారు కదా ఆ కోటిలో యిదోటి. ఇక కబుర్లంటారా! విద్య కంటే నలుగురినీ ఆకర్షించే మాటలే గొప్పవి కదా! ఆ మాట్లాడటమే రాకపోతే ‘అంగట్లో అన్నీ వున్నవి అల్లుడి నోట్లో శనివున్నది' అన్నట్టు అవుతుంది. నా తిప్పలేవో నేను పడతాను ‘అవ్వా కావలెను, బువ్వా కావలెను' కదా అంటూ సెలవు తీసుకున్నాడు.

chintapatla sudarshan column on the proverb

విద్యార్థులంతా ఊరు బయటకు చేరుకున్నారు. ఎవరిదారిన వారు వెళ్లిపోయే ముందు ఒకరినొకరు కావలించుకున్నారు. ‘ఎవరికి వారే యమునా తీరే' కదా యిక వెళ్లివస్తానురా ఏది జరిగినా ‘అంతా మన మంచికే' అంటూ తను ఎంచుకున్న దారి వెంట వొంటరిగా నడిచాడు అయోమయం. కాస్సేపు గబగబా నడిచాడు ‘ఆలస్యం అమృతం విషం' అనుకుంటూ.

కాస్సేపు వేగంగా నడిచాక అలసిపోయి అనుకుంటాం కానీ ‘నిదానమే ప్రధానం' అంటూ వేగం తగ్గించి అడుగులో అడుగు వేసుకుంటూ నడిచాడు. కాస్సేపటికి ఓ కుక్క వెనకనించి వొచ్చి అరవడం మొదలుపెట్టింది. ఆ.. ఇదేం కరవదులే ‘అరిచే కుక్క కరవదు' అనుకున్నాడు కానీ దానికి ఆ సామెత తెలియదులావుంది. వెనక నించి అయోమయం పిక్క అందుకునే ప్రయత్నం చేసింది. ఇది కుక్క కాదు ‘అచ్చోసిన అంబోతులా' వుంది అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా పరుగెత్తాడు. ఆ ఊపులో వెళ్లి ఓ బురద గుంటలో పడిలేచాడు కాళ్లు కడక్కోడానికి నీళ్లు కనపడలేదు. అడుసు తొక్కనేల కాలు కడగనేల అనుకుంటూ వెళ్లి బాగా ఆకలి వేస్తున్నదని ఓ మామిడి చెట్టు కింద నిలబడ్డాడు. ‘అందని మామిడి పళ్లకు ఆశపడ్డ' అయోమయం చెట్టు కింద కూచుని తనకు వచ్చీరాని మంత్రాలన్నీ చదివాడు. ఆ తర్వాత ‘మంత్రాలకు చింతకాయలు రాలవు' యిక మామిడి పళ్లేం రాలతాయి అని ముందుకు కదిలాడు.

దారిలో మరో వ్యక్తి కలవడంతో మాట కలిపాడు. ఆ వ్యక్తి తన పేరు గందరగోళం అని చెప్పాడు. గందరగోళం, అయోమయాన్ని అడిగాడు వూరు, పేరు, వృత్తి మొదలైన వాట్ని గురించి. నా పేరు అయోమయం నాకు ఎవ్వరూ లేరు ‘ఆర్చే వారు లేరు తీర్చేవారు లేరు అడుగున పడితే లేవదీసే వారు లేరు' అన్నాడు. పాపం అయోమయానికి ఆకలి అవుతున్నదని విన్న గందరగోళం తన సంచీలోంచి ఓ రొట్టెని తీసి అయోమయానికిచ్చాడు. హమ్మయ్య! ‘ఇచ్చే వాణ్ణిచూస్తే చాచ్చే వాడైనా లేస్తాడట' అంటూ ఆనందంగా ఆ రోట్టెని ఆవురావురంటూ తిన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ఓ చెట్టు నీడన విశ్రమించారు. విద్య పూర్తయిందంటున్నావు అనడిగాడు గందరగోళం. ఎముందీ ‘ఉద్యోగం పురుషులక్షణం అదిపోతే అవలక్షణం' అన్నారు ఏదో ఓ నౌకరీ వెదుక్కోవాలి అన్నాడు అయోమయం. ఆ తర్వాత అయోమయాన్ని రాజావారుండే నగరం అడ్రసు చెప్పి అక్కడ ఉద్యోగానికి ప్రయత్నం చెయ్యమని సలహయిచ్చాడు గందరగోళం.

రాజావారి దగ్గర ఏముద్యోగం చెయ్యలా అనే అనుమానం వచ్చింది అయోమయానికి. ‘అనుమానం పెనుభూతం పెద్ద రోగం' అనుకుని ఆ అనుమానాన్ని బయటపెట్టాడు అయోమయం. రాజావారికి నీ కబుర్లే పెద్ద కాలక్షేపమవుతయి. వాటిని నీ సామెతలతో నంజుకుని కావలసినంత ధనం యిస్తాడు లే అని వెళ్లిపోయాడు గందరగోళం.

‘ఇచ్చేవాడు దాతయివ్వని వాడు రోత' అనుకుంటూ రాజావారి నగరం వైపు ప్రయాణం కట్టాడు అయోమయం. చీకటి పడింది ఒంట్లో సత్తువ అయిపోయింది. కాలు తీసి కాలు వెయ్యడం కష్టంగా వుంది. ‘ఈడ్చుకాళ్ల వాడికి ఇద్దరు భార్యలు ఒకటి ఈడువ ఒకటి ఏడువ' అనుకుంటూ ఓ పూటకూళ్ల యింట్లో ప్రవేశించాడు. పూటకూళ్ల అవ్వకు తన దగ్గర డబ్బేమీ లేదని ‘అన్నం తిన్నవాడు తన్నులు తిన్నవాడు మరచిపోడు' అన్న సామెతని చెప్పి నవ్వించాడు. పోనీలే ఈ పూటకి యిక్కడే వుండు అన్నది. అదృష్టం అంటే యిదే మరి ‘ఒకణ్ణి చూస్తే పెట్టబుద్ధి ఇంకొకణ్ణి చూస్తే మెట్టబుద్ధి' అన్నారు అంటూ అక్కడ భోంచేసి ‘ఏపాటు తప్పినా సాపాటు తప్పదు' ‘ఓడ ఎక్కేదాక ఓడ మల్లన్న ఓడ దిగాక బోడి మల్లన్న' ‘ఎంత చెట్టుకు అంతే గాలి' వంటి బోలెడు సామెతలు చెప్పి నవ్వించాడు. పూట కూళ్లవ్వ పళ్లు లేని బోసినోటితో బోలెడె నవ్వులు నవ్వి సరిపోయింది పో నువ్వు ఆ రాజా వారి దగ్గర మంఛి ఉద్యోగం సంపాదిస్తావులే అని భరవసా యిచ్చేసింది.

మర్నాడు మధ్యాహ్నం వేళకి రాజావారి కోటకి చేరుకున్నాడు అయోమయం. ఆ సమయానికి కాపలా వాళ్ల మూడ్ బావుండటంతో లోపలికి ప్రవేశం లభించింది. సరాసరి దర్బార్‌లో ప్రవేశించాడు అయోమయం. రాజావారు ఎవరు నువ్వు, ఏం కావాలి? అనడిగాడు గంబీరంగా.

నా పేరు అయోమయం. నాకివ్వాలి ఓ ఉద్యోగం. ‘కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది' ‘కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం' కదా. ‘కదురూ, కవ్వం ఆడితే కరువేవుండదు' మహారాజా తాము తల్చుకుంటే కష్టాలు కలకాలం కాపురం వుండవు' ‘కలఫలించిందంటే అదృష్టం మనదే' అన్నాడు. గుక్క తిప్పుకోకుండే సామెతలు చెప్పేస్తున్న అయోమయం తనకు మంచి కాలక్షేపం అనుకున్నాడు రాజు. ‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా' అని లోలోపల అనుకుంటున్న అయోమయానికి ఉద్యోగం యిచ్చేశాడు.

రాజావారు సాయంత్రంపూట అలా షికారుకు వెళ్తున్నప్పుడు వెంట వెళ్లడం రకరకాల సామెతలు చెప్పడం అయోమయం ఉద్యోగం అంతే. ఉండటానికి యిల్లూ తిండానికి తిండీ అన్నీ సమకూరాయి. రాజుగారు ఏ విషయం మీద సామెత అడిగితే అందిపుచ్చుకునేవాడు అయోమయం. మీసం గురించి అడిగితే ‘కొట్టిన వంగని కొడుకు, తిప్పిన తిరగని మీసం వ్యర్థం' అనీ వైద్యుడి గురించి అడిగితే ‘కొత్త వైద్యుడి కన్నా పాత రోగి మేలు' అనీ గాడిద గురించి అడిగితే ‘కూసే గాడిది వచ్చి మేసే గాడిదను చెగొట్టిందట' అనీ చదువు గురించి అడిగితే ‘చదవక ముందు కాకరకాయ, చదివిన తర్వాత కీకరకాయ', జ్వరం గురించి అడిగితే ‘జరుగు బాటుంటే జ్వరమున్నంత సుఖం లేదు' తల్లి గురించి అడిగితే ‘తల్లిలేని పిల్ల వుల్లి లేని కూర' అనీ ఇలా ఏ దడిగితే దానికి సామెత చెప్పేవాడు.

రోజూ సామెతలు వినివినీ రాజు గారికి విసుగొచ్చేసింది. అయోమయం దగ్గర మరో విద్యేదీ లేకపోవడంతో ఇక చాలు బాబూ సామెతలు అనేవాడు. అయినా అయోమయం అలవాటు మానలేక సామెతలు వదల్లేక రాజావారిని సతాయించడం కంటిన్యూ చేశాడు. సామెతలంటే రాజావారికి రోత పుట్టింది. అది ఎంత వరకూ వెళ్లిందంటే అయోమయానికి ఉరిశిక్ష వేయనే వేశాడు. రాజుల అనుగ్రహమూ ఆగ్రహమూ జగమెరిగినవే కదా.

‘నట్టేట పుట్టి మునిగినట్లు' అయిందనుకున్నాడు అయోమయం. అయోమయాన్ని ఇంకో పది నిమిషాల్లో ఉరి తీస్తారనగా రాజావారికి జాలి కలిగి ఓ మనిషిని పంపాడు ఉరివేసే చోటికి. అయోమయం ఇక నుంచి సామెతలు మానెయ్యాలని అలా మానేస్తాడని నమ్మకం కలిగించగలిగితే ప్రాణాలతో వదిలెయ్యమని రాజావారి ఆర్డర్. ఉరిశిక్షను అమలు చేస్తున్న చెరసాల అధికారి ఆ మాటే చెప్పాడు. అయోమయానికి సరిగ్గా ఉరివేయబోతున్న సమయంంలో. బ్రతుకు జీవుడా అనుకున్న అయోమయం ఇక ఛస్తే సామెతలు చెప్పనుగాక చెప్పను.. ‘ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం' లేదన్నాడు హుశారుగా తనేం చేస్తున్నాడో తెలీక.

తక్షణం ఉరి శిక్ష అమలయ్యింది.

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about the proverb effected person story.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X