వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుదర్శన్ క్విక్‌బాక్సింగ్: తిట్ల పురాణం

|
Google Oneindia TeluguNews

రోడ్డున్నాక ట్రాఫిక్కూ ట్రాఫిక్కన్నాక జనమూ జనమన్నాక గొడవలూ తప్పవు కదా! ఏ రోడ్డయితేనేం అదో రోడ్డు. రోడ్డు మీద జనం పోగయివున్నారు గనక ట్రాఫిక్ జామ్ ముందుకి వెళ్లలేం వెనక్కి మళ్లిరాం. ఏం చేద్దాం అసలేం జరిగిందో చూద్దాం, అనుకున్న వాళ్లు బళ్లు వో పక్కన పెట్టి జనంలోకి దూరుతున్నారు. మనమేం తక్కువ తిన్నామా పొద్దున్నే రవ్వదోశా ఇడ్లీ వడా లాగించాం కదా కాస్త నాలుగడుగులు వేస్తే అదీ ఒక వ్యాయామమే కదా అనుకుంటూ తన బండీని ఓ పక్క పడేసి (అంటే పెట్టేసి తాళం వేసి కూడా) పద్మ వ్యూహంలోకి అభిమన్యుడి మాదిరి జొరబడ్డాడు ఏవీరావు.

జనం మధ్యలో నలుగురో అయిదుగురో ఆడాళ్లు మరో నలుగురూ అయిదుగురూ మగాళ్లు వీరంగం సృష్టిస్తున్నారు. కాస్సేపు ఆడవాళ్లని ఆడవాళ్లు, కాస్సేపు మగవాళ్లని మగవాళ్లు తిట్టుకుంటూ గడిపారు. తర్వాత ఆడవాళ్లని మగవాళ్లు మగవాళ్లూ తిట్టుకున్నారు. ఆ తర్వాత అందరూ దవడలు నెప్పి పుట్టేట్టు, ఎవర్ని ఎవరు తిడుతున్నారో అర్థం అవకుండా తిట్టుకున్నారు. అసలు అర్థం అనే మాటకివస్తే వాళ్లంతా ఎవరు ఎవర్ని ఎందుకు తిట్టుకుంటున్నారో తెలీదు. అలా ఎంత సేపు తిట్టుకుంటారో తెలీదు.

అది మెయిన్ రోడ్డు కాదు కాబట్టి, అచ్చోటు పోలీసులకి ఆట్టే గిట్టుబాటు అవదు కాబట్టీ అక్కడ ఖాకీ లెవ్వరూ లేరు. ఈ గోల భరించనేల అని కొందరు పక్క సందుల్లోకి జారుకున్నారు. మరి కొందరు ఎంతసేపు వీళ్లిల్లా కొట్టుకోడంతో సరిపెడ్తారా లేక కొట్టుకుంటారా అని ‘యాక్షన్' కోసం ఎదిరిచూడసాగారు.

అయితే ఈ తిట్టుకుంటున్న వాళ్లూ యథాశక్తి ‘యాక్షన్' ఫోజులు పెడ్తూనే వున్నారు. తంతానోరే అని ముందు కురికే వాడొకడయితే పోనీ లేరా పోనీ అని వెనక్కి లాగే వాడొకడు, ఏదీ కొట్టు చూద్దాం అని ముందు కొచ్చ ఆడమనిషి ఒకరయితే ‘పోనీ లేవే వాని పాపాన వాడే పోతాడు' అని వెనక్కి లాగే ఆడమనిషి మరొకరు. కథ మాంచి రసపట్టులో పెరిగి పెరిగి క్లైమాక్సుకి వచ్చి ఇక కొట్టుకు ఛస్తారా వీళ్లు, తలల ఫట్టు ఎముకలు ఫట్ ఫట్.. రక్తం బొటబొటా అని చూసేవాళ్లకి ఉత్కంట కలగడం అంతల్లోనే అది బొగ్గుల పొయ్యిలో నీళ్లు గుమ్మరించినప్పుడు తుస్సూమన్నట్టు చల్లారిపోవడం జరుగుతుంటే పనీ పాటా లేని వాళ్లు ఆ రెండూ అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరూ కలగజేసుకుందామని, ఆళ్ల గోలేమిటో తెల్సుకుందామని ప్రయత్నించలేదు.

తిట్లు మాత్రం భలే భావున్నయి. అబ్భ ఎంత వెరైటీగా వున్నాయో.. ఎన్ని కొత్త కొత్త తిట్లో.. యిదివరకు ఎన్నడూ విననివి కూడా వినే సదవకాశం కలిగింది వీక్షకులకి. వాళ్లల్లో ఓ వైపువున్న ఏ.వీ.రావుకి మరో వైపు నిలబడి చోద్యం వింటున్న బీ.వీ.రావుకి కూడా ఆ గోల్డెన్ ఛాన్సు దక్కింది.

హఠాత్తుగా ఏవీరావు కన్ను బీ.వీ.రావు మీద పడింది. సరిగ్గా అదే టైంకి బీ.వీ.రావు కన్ను ఏవీరావు మీద పడి ‘లుక్ లాకయ్యింది'.

చెరో పక్క వున్నవాళ్లు ఒక పక్కకే వచ్చి మరి కాస్సేపు తిట్ల పురాణం విన్నాక యిది యిప్పట్లో తేలేట్టు లేదు. వీళ్లకు వచ్చినన్ని తిట్లు మరెవాళ్లకీరావు.. అవి ఇప్పట్లో అయిపోవు.. యిక ఊరించే ‘యాక్షన్' తప్పని నిజం యాక్షన్ జరిగేదీ లేదు నాలుగో పాని పట్టు యుద్ధం చూడనూ లేము అనుకుంటూ వెనక్కి వెళ్లిపోయారు.

 chintapatla sudarshan column on the swearing

చాలా కాలం తర్వాత కలిశారు కదా ఏవీ బీవీరావులు నాలుగడుగులు వేసి ఆ పక్కనేవున్న పార్కులో కూలబడ్డారు.

ఏరా ఏవీరావూ నీ రీసెర్చి ఎంతవరకు వచ్చింది అనడిగాడు బీవీరావు ఏవీరావుని. మామూలుగా అయితే ఏవీరావు తనికి ఏవీరావు అని అనుకోడుకానీ తనకంటే బోల్డూ, ఇంటెలిజెంటూ అయిన బీవీరావుని చూసినప్పుడు మాత్రం ఏవీరావు నయిన తనకు ఏవీరావు అనుకునేవాడు. రీసెర్చికి సబ్జెక్టు దొరకడం లేదు బీవీ అదే సెర్చి చేస్తున్నానన్నాడు ఏవీ.

సబ్జెక్టు దొరక్కపోవడమేమిట్రా ఎక్కడ పడితే అక్కడ మోకాళ్లకి అడ్డం వస్తుంటే. ఆ మాటకి వస్తే యిప్పుడు మనం రోడ్డు మీద చూసిన సారీ విన్న తిట్ల మీదే ఒక పెద్ద థీసిస్ రాసి పారేయచ్చు అన్నాడు బీవీరావు తమాషాగా కనుబొమ్మలు ఎగిరేస్తూ.

తిట్ల మీదా అన్నాడు ఏవీరావు వాటి మీద ఏం రాస్తామబ్బా అన్నట్టు ముఖ భంగిమ ఒకటి విసిరేస్తూ.

ఓస్ ఆ మాత్రం తెలీదురా నీకు అన్నట్టు ఏవీరావు వైపు చూస్తూ షర్టు మీద పాకుతున్న ఓ చిన్నప్రాణిని వేలుతో ఆమడ దూరం విసిరేశాడు.

సరే! నువ్వు చెప్పిందాని మీద రీసెర్చి చేసినా చెయ్యకపోయినా ప్రతి విషయంలోనూ ఓ విషయం వుంటుందని ఢంకా బజాయించగలవు నువ్వు. చెప్పు... తిట్ల మీద నీకున్న పరిజ్ఞానం తెలుపుమా అన్నాడు ఏవీరావు అడిగినా అడక్కపోయినా బీవీరావు చెప్పదల్చుకున్నది చెప్పకుండా వొదలడని తెలిసివుండిన వాడవటం చేత.

అందుకే నిన్ను ఏవీరావన్నార్రా! ఏ విషయమైనా తెల్సుకోవాలనే తపన వుండాలి. ఇప్పుడు తిట్ల సంగతే తీసుకో. సూత పురాణం అంటే వినివుంటావు గదా అన్నాడు బీవీ..

అవును విన్నాను సూత పురాణం గురించి అన్నాడు ఏవీరావు మంచి విద్యార్థిలా.

ఆ సూత పురాణం లాంటిదే ఈ తిట్ల పురాణం కూడా. అసలు ఈ తిట్ల పురణాన్ని పూర్వ కాలంలో బూతు పురాణం అనేవాళ్లు. బూతు పురాణం అంటే మరీ బూతులా వుంటుందని కొంచెం కవీరింగేసి తిట్ల పురాణం అన్నారన్న మాట.

ఆహా( అలాగా అన్నట్టు తలాడించాడు, ఏవీ. కంటిన్యూయించాడు బీవీ.

అన్నీ వేదాల్లోనే వున్నాయిష అన్నాడు మనవాడొకడు. ఈ తిట్ల పురాణం కూడా అంత ప్రాచీనమైనదీ పకడ్బందీ అయినదీ. అసలు నాగరికతకూ బూతులకూ సారీ తిట్లకూ చాలా క్లోజ్ సంబంధం వుంది.

బోడిగుండుకూ మోకాలుకీ ముడిపెడ్తున్నాడ్రోయ్ అనుకున్నాడు లోల్లోపల ఏవీరావు కానీ పైకి మాత్రం.. భలే ఇంట్రస్టింగ్‌గా వుందే అన్నాడు.

మరదే నేనేదయినా ఇంటరెస్టింగ్‌గా చెప్పానంటూ మళ్లీ ‘లాగుడు' కార్యక్రమం మొదలెట్టాడు బీవీ. విను.. నాగరికతకూ బూతు పురాణానికీ వున్న లింకుయిది. అనాగరికంగా వున్నప్పుడు మనుషులు తమకోపాన్ని ఏ విధంగా వ్యక్తం చేసే వారో తెలుసా?

ఏ విధంగా? అన్నాడు ఏవీ

అది రాతియుగం కావచ్చు లోహయుగం కావచ్చు మనిషికి కోపం వస్తే ఒక్కటే పని రాతి గదలతో తలలు పగలగొట్టుకోడా, కత్తులతో కస్సుకస్సు పొడ్చుకోటం. నాగరికత పెరిగాకే కదా మనిషి తన కోపాన్ని అవతలివాడిని చంపి శవంగా మార్చకుండా, తిట్ల రూపంలో వ్యక్తం చెయ్యగల్గుతున్నాడు. అందువల్ల లోకంలో హింసను అరికట్టడానికి బుద్ధుడు చేసిన ప్రయత్నాన్నే, బూతు పురాణం కూడా చేసింది, చేస్తున్నది కాస్త ఊపిరి పీల్చుకుని బీవీ తిట్టు కూడా ఒక ‘అహింసా ఆయుధమే' అన్నాడు.

ఔరా! అనుకున్నాడు ఏవీ.

ఇప్పుడు రోడ్డు మీద మనం చూసిన గొడవలో ఏ మాత్రం హింసా జరగలేదు చూశావు కదా. వాళ్ల తిట్లు హింసను అరికట్టిన వన్నమాట. మనిషిని మనిషి చంపుకోవాలన్నంత కోపం వచ్చినా ఒక బరువైన బూతు ఒక లోతైన తిట్టుచాలు ప్రాణాల్ని రక్షించడానికి. అరణ్యాల్లో ముక్కుమూసుకుని తపస్సు చేసుకున్న మునుల కాలంలో కూడా వాళ్ల కోపం వస్తే దండంతో లాగి పెట్టి కొట్టడమో కమండలంతో బుర్రబద్దలు కొట్టడమో చెయ్యలేదు. తిట్టు తిడుతూ కమండంలో నీళ్లు చల్లే వాళ్లు దాన్నే మనవాళ్లు శాపం అని అన్నారు. కాబట్టి ఏవీరావూ ఏవీరావు అనుకోకుండా తిట్ల మీద రీసెర్చి చెయ్యి. తిట్టుదాని పుట్టు పూర్వోత్తరాలు, తిట్టు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం, తిట్టు, బూతు, శాపం ఈ మూడింటికీ సామ్య భేదాలు, ఆడవాళ్లు తిట్టే తిట్లు, మొగవాళ్లు వాడే తిట్లు, డబ్బున్న వాళ్లు వాడే తిట్లు, లేనివాడు ఉపయోగించే తిట్లు, జంతువులను ఉపయోగించి తిట్టే తిట్లు, వస్తువులని ఉపయోగించి తిట్టే తిట్లు, పురుగులను వుపయోగించి తిట్టే తిట్లు, పేడ మొదలగు మలిన పదార్థములను ఉపయోగించి తిట్టే తిట్లు, వివిధ పదాలతో మొదలయ్యే తిట్లు దొంగతో మొదలయ్యే తిట్లు, మనిషితో మొదలయ్యే తిట్లు, ఎన్ని రకాల తిట్లు కలవో పరిశోధించు, దేశ దేశాల్లో వాడబడుతున్న తిట్ల జాబితా తయారు చెయ్యి తెలుగు భాషలో వున్న తిట్ల ఖజానా సామాన్యమైనది కాదొరేయ్ ఇంగ్లీషు వాడికున్నయా మనకున్నన్ని తిట్లు ప్రపంచంలోని అన్ని భాషల్లో తిట్లు ఒక ఎత్తు అయితే తెలుగులో తిట్లు ఒక ఎత్తన్న మాట.

ఇక రాజకీయ నాయకుల తిట్ల సంగతి చెప్పనే అక్కర్లేదు. అసెంబ్లీ, పార్లమెంటు చూస్తుంటావు గద. రాజకీయ నాయకుల తిట్లకు సంబంధించి ప్రత్యేకమైన రీసెర్చి చెయ్యచ్చు అది వేరే సబ్జక్టు అంటూ హడావిడిగా వెళ్లి పోయేడు బీవీరావు. బహుశా తన దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి యివ్వలేదని ఎవడైనా బీవీ రావుని తిట్టటానికొస్తున్నాడేమో అనుకున్నాడు ఏ.వీ. రావు.

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about the swearing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X