వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్విక్‌బాక్సింగ్: మేడ్ ఫర్ ఈచ్ అదర్

|
Google Oneindia TeluguNews

వెనుకటి కాలంలో విక్రమార్కుడనే రాజావారుండేవారు. రాజావారికీ దెయ్యాల రెసిడెన్సీకీ క్లోజ్ రిలేషన్ షిప్పుండేది. అలాగని దెయ్యాల రెసిడెన్సీలోని అన్ని దయ్యాలతో విక్రమార్కుడికి దోస్తీ వుందనుకోవద్దు. విక్రమార్కుడికి అక్కడవున్న వో మర్రిచెట్టు మీద తలకిందులుగా వేలాడుతూ వుండే వో శవానికీ మంచి దోస్తీ వుండేది.

విక్రముడు రోజూ రాత్రి కాగానే టంచన్‌గా మర్రిచెట్టు కిందకి వెళ్లిపోయేవాడు కాలే చితుల మధ్యనించి ఇకలిస్తూ ఎదురొచ్చే పిల్ల దయాల్ని అదిలిస్తూ వెళ్లి ‘దోస్తు మేరా దోస్తు' అని పిలవంగానే ఫ్రెండ్ శవం తలకిందులుగా వేళ్లాడ్తూనే కళ్లు తెరిచి ‘హలో' అనేది. ఆ తర్వాత విక్రముడు ఆ శవరావుని వీపు మీద ఉప్పు మూటలా వేళ్లాడదీసి పట్టుకుని అలా సరదాగా షికారు తిప్పేవాడు. వీపు మీద వేళ్లాడుతూ బుజమ్మీద తల ఆనిచ్చే శవరావుని ‘ఏదైనా కథ చెప్పవోయ్' అనడిగేవాడు. ఉన్నమాట ఏమిటంటే శవరావుకి బోలెడన్ని కథలొచ్చు. సరే అడిగావు కనక ‘టైంపాస్'కి కథ చెప్తా కానీ కథ చివర్లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి' వుంటుందనే వాడు. అదేమిటని అడిగే వాళ్లకి ‘మీలో ఎవరు కోటీశ్వరుడంటే అర్థం అవుతుందా? సరే అదీ చెప్పాలి కదా! శవరావు కథ చివర్న ఓ క్వశ్చన్ వేసి జవాబు చెప్పమనేవాడు. అప్పుడప్పుడు ‘ఆప్షన్స్' కూడా యిచ్చేవాడు.

ఇలాగ శవరావుని మోసుకెళ్తూ కథ విని ఏ తెల్లవారుజామునో కథ అయిపోగానే క్వశ్చన్‌కి సమాధానం కరెక్టుగా చెప్పి తన జనరల్ నాలెడ్జి చాలా గొప్పదని ప్రూవ్ చేసేవాడు విక్రముడు. ఆ విధంగా నైట్ డ్యూటీ అయ్యాక శవరావు చెట్టు మీద వేల్లాడినికి, రాజారావు దర్బారుకీ వెళ్లి పోయేవారు. శవరావు విక్రముడ్ని కథలకు సంబంధించిన అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆల్ కరెక్ట్ ఆన్సర్సుయిచ్చాడు విక్రముడు కానీ ఒక కథకు సంబంధించిన క్వశ్చిన్ చాలా ‘టఫ్'గా వుంటంతో జవాబు చెప్పలేకపోయాడు. వాడుకోడానికి ‘ఫోన్ ఏ ఫ్రెండ్' లైఫ్ లైన్ కూడా లేకపోవడంతో డీలా పడిపోయాడు. ఓ మై గాడ్ అనుకున్నాడు. ఆ కథకి కరెక్టు ఆన్సర్ చెప్పలేక చేతులెత్తేశాడు. అప్పటికే ముప్పయి కథలు చెప్పేసిన శవరావు ఇదే లాస్ట్ స్టోరీ అనీ ఇక తన దగ్గర కథల్లేవనీ విక్రముడికి టాటా చెప్పేశాడు.

విక్రముడు జవాబు చెప్పలేని కథ యేమిటో తెల్సుకుందాం వీలయితే కరెక్టు ఆన్సర్ మనం చెబ్దాం.

Chintapatla sudarshan column on Vikramarkudu's story.

అనగానగా అదో పెద్ద ఫారెస్ట్. ఫారెస్టన్నాక కొండలూ కోనలూ చెట్లూ చేమలూ వుండాలి కనుక వున్నాయి. చెట్లల్లో పక్షులు పుట్టల్లో పాములూ పొదల్లో పులులూ గుహల్లో సింహాలూ వుండాలి కనుక అవీ వున్నయి. కోతుల కిచకిచమంటున్నయి వడ్రంగి పిట్టలు ముక్కులు టక్కుటక్కుమంటున్నయి. బండరాళ్ల మీద నీళ్లు హుషారుగా జారిపోతున్నాయి. కాలిబాటంట నడిచొస్తున్నారు యిద్దరు. ఆ ఇద్దరిలో ఒకడు పెద్దవాడు మరొకడు చిన్నవాడు. పెద్దాయన పొడుగ్గా రివటలా వున్నవాడు కానీ కొంచెం పొట్టముందుకు పొడ్చుకువచ్చింది. చిన్నోడు సన్నగా సాగదీసిన ఇనుక కడ్డీలా వున్నాడు కానీ వెడల్పాటి ఛాతీ బలిష్టమైన చేతులూ లోపలికి లోపలికి లాక్కుపోయిన డొక్కా వున్నాయి. వడివడిగా నడిచొస్తున్న ఆ ఇద్దరిలో ఒకడి వయస్సు అయిదు పదులకి ఓ అయిదు తగ్గివుండవచ్చు మరొకడి వయస్సు పాతికకి ఓ అయిదు తక్కువుండచ్చు. వాళ్లిద్దరూ ఒకరికొకరు రక్త సంబంధీకులే. పెద్దాయన తండ్రి అయినప్పుడు చిన్నోడు కొడుకే అవుతాడు కదా!

ఆ తండ్రీ ఆ కొడుకూ అలా దారివెంట కబుర్లు చెప్పుకుంటూ నడిచొస్తూ వుంటే ‘సోలార్ పవర్' కారణంగా వాళ్లకి విపరీతమైన దాహం వేసింది. మనుషులు ఆకలినన్నా పోస్ట్ ఫోన్ చెయ్యచ్చు గాని దప్పికని కాదనలేరు కదా. నాలుక పిడచ కట్టుకుపోతున్నది రా అన్నాడు తండ్రి. దగ్గర్లో నది గానీ ఏరుగానీ వున్నదా అన్నాడు కొడుకు. తండ్రి చెవిని స్టడీగా నిలబెట్టి ఎక్కడ్నించో వాటర్ సౌండు వినవస్తున్నది వాసన కూడా ముక్కు రంధ్రాలని అటాక్ చేస్తున్నది. ఇక్కడెక్కడో వో ఏరువుండాలి అందులో నీరు తియ్యగా వుండాలి నాకు గుర్తుకు వస్తున్నది అన్నాడు తండ్రి.

తండ్రికి బాగానే గుర్తున్నది. అలాగ వో వంద అడుగులు వేశారో లేదో వాళ్ల కాళ్లకి మెత్తటి ఇసక తగిలింది. ఇసకలో అలాగ కాళ్లు బరువుగా వేస్తూ తీస్తూ నీటి అంచుకు చేరుకున్నారు ముందుగా ముఖాలు కడుక్కున్నారు. వేడెక్కిన తలలు తడుపుకున్నారు. ప్రాణాలకి హాయిగా వున్నది అనుకున్నారు. తాగినన్ని నీళ్లు తాగారు. నీళ్లు చల్లగా వున్నయి - తియ్యగా వున్నయి. అలానీళ్లల్లో తడుస్తూ అక్కడే వుండి పోదామా అనుకున్నారు. నీళ్లల్లో సూర్యుడు ముక్కులు ముక్కలుగా మెరుస్తున్నాడు. అలా చూస్తూ నిలబడ్డారు.

చాల్లే యింక బయల్దేరుదాం అన్నాడు తండ్రి సాయంత్రం వరకల్లా ఊరు చేరుకోవాలి కదా. కొడుక్కి కదలాలని లేకున్నా కదలక తప్పలేదు. అలా నీటి అంచునే అడుగులు వేస్తూ తీస్తూ ఇసకతో అడుకుంటున్న పాదాలతో నడవసాగాడు కొడుకు. పరిసరాలని జాగ్రత్తగా గమనిస్తూ నడవసాగాడు తండ్రి. ఉన్నట్టుండి రెండు జతల పాదాల గుర్తులు ఇసుకలో కనిపెట్టాడు. అలా అలా కదిలిపోతున్న ఆ అడుగు జాడల్నే గమనిస్తూ నడవసాగాడు. తండ్రి ఏదో వైపు సీరియస్‌గా చూస్తున్నాడని గమనించిన కొడుకు అడిగాడు ‘డాడీ! ఏవిటి చూస్తున్నవాని?' ఏంలేదు మైసన్ ఇటు చూడు ఈ పాదాల జాడలు. ఈ అడుగులు చూడు. చూశాడు కొడుకు అయితే ఏమిటని అడిగాడు కొడుకు.

తండ్రి అలా నిలబడి ఆ అడుగు జాడలని పరీక్షగా చూస్తూ నా నాలెడ్జీ చెప్పున్నది ఇక్కడ్నించి కొద్ది సేపటికి కింద యిద్దరు ఈ దారంట నడిచి వెళ్లుంటారు. బహుశా వాళ్లిద్దరూ ఆడవాళ్లయి వుంటారు అన్నాడు.

ఇంకా నయం వాళ్లిద్దరూ తల్లీ కూతుళ్లయి వుంటారనలేదు అన్నాడు కొడుకు నవ్వుతూ.

‘వైనాట్? అయివుండవచ్చు' అన్నాడు తండ్రి నుదుట్నగీతలు కనపడేట్టు మడతేస్తూ

‘ఓ.కే. అయివుంటారే అనుకుందాం. సో వాట్?' అన్నాడు కొడుకు.

ఎగిరి గంతేశాడు తండ్రి ఎగిరే వయస్తూ గంతేసే వొళ్లూలేకపోయినా

మీ మమ్మీ పోయాక నాకు ‘వైఫ్'లేని లోటు తెలిసొచ్చిందిరా అన్నాడు తండ్రి.

‘వైఫ్ పోయిందని నువ్వేడిస్తే అసలు ఈ లైఫ్‌కి వైఫెట్లారా భగవంతుడా అని నేనేడుస్తున్నా'నన్నాడు కొడుకు.

‘డోంట్ వర్రీ మైసన్ టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్.. నీకూ వైఫ్ దొరుకుతుంది నాక్కూడా' అన్నాడు తండ్రి చీర్‌ఫుల్‌గా.

‘ఎలాగెలాగ?' అన్నాడు కొడుకు. త్వరగా నడుద్దాం. మనకు కాస్సేపట్లో వాళ్లు దొరుతారు. తండ్రీ కొడుకులిద్దరం తల్లీ కూతుళ్లని పెళ్లాడేద్దాం అన్నాడు తండ్రి ఇసుకలో అడుగుల వైపు చూస్తూ.

అప్పుడు కొడుక్కూడా ఆ అడుగుల వైపు తదేకంగా చూశాడు. ఒక జత పాదాలు పెద్దగా వున్నాయి ఒక జత పాదాలు చిన్న సైజులో వున్నయి. ‘ఈ అడుగుజాడల్లో ఎవరివి ఏవి అయివుంటయి పాపా' అనడిగాడు ఉత్సాహంగా.

నేచురల్లీ మైసన్. పెద్ద పాదాలు మీకాబోయే మమ్మీవి అయివుండాలి అన్నాడు డాడీ.

దెన్ డన్.. పెద్ద పాదాలు మీ వైఫ్ అయితే చిన్న పాదాలు నా వైఫ్ కదా అన్నాడు సన్.

యస్. ఇట్స్ ఎ డీల్. పెద్ద పాదాల స్తీని నేనూ చిన్న పాదాల స్త్రీని నువ్వూ పెళ్లాడేద్దాం. గాడ్ ఈజ్ గ్రేట్ అన్నాడు తండ్రి ఆకాశంలో దేవుడ్ని వెతుకుతూ పైకి చూశాడు.

తండ్రీ కొడుకులు యిద్దరూ వడివడిగా నడిచి అనుకున్నట్టుగానే యిద్దరు ఆడవాళ్లను కలుసుకున్నారు. పరిచయాలయినయి. తండ్రీకొడుకులు తమ ప్రాబ్లమ్ చెప్పుకున్నారు. తల్లీ కూతుళ్ల దీ సేమ్ ప్రాబ్లమ్. అయితే మరొక కొత్త ప్రాబ్లమ్ వచ్చి పడింది. తండ్రి పెళ్లి చేసుకుందామనుకున్న పెద్ద పాదాలు కూతురువి. కొడుకు పెళ్లి చేసుకుందామనుకున్న చిన్న పాదాలు మదర్‌వి తండ్రి కూతురునీ, కొడుకు తల్లినీ చేసుకోవాల్సిన వచ్చేట్టుంది. ‘ఎలా? హౌ?' అనుకున్నారా నలుగురూ.

‘వెనుకటి విక్రమార్కుడికి శవరావు చెప్పిన కథలోనూ యిదే ప్రాబ్లం వచ్చింది. తండ్రి కూతురినీ కొడుకు తల్లినీ చేసుకుంటే వాళ్లకు పుట్టే పిల్లలు ఒకరికొకరు ఏ వరుస అవుతారన్న చిక్కు ప్రశ్నకి విక్రమార్కుడి మెదడు ‘షట్ డవున్' అయిపోయింది' అన్నది కూతురు అందమైనమే కాదు తెలివైనది కూడా.

‘అవును మన మెదళ్లు కూడా ఇప్పుడు ‘షట్ డవున్' అవుతున్నయి కదా' అన్నాడు కొడుకు ఒక అరచేతిని మరో చేతి ముష్టితో కొట్టుకుంటూ ‘డోంట్‌వరీ' ఆ కాలం ప్రశ్నకి ఈ కాలం జవాబు నా దగ్గర వుంది' అన్నది కూతురు కాబోయే హబ్బీవైపు క్రీగంట చూస్తూ పలు వరుసని మెరిపిస్తూ.

‘వెరీ సింపుల్'. తాను బట్టిన కుందేలుకి మూడు కాళ్ల జమానా కాదిది. సమయానికి సందర్భానికి తగ్గట్టుగా పొలిటిషియన్సే కాదు మనం కూడా ఒపీనియన్స్ చేంజ్ చేసుకోవచ్చ' అన్నది కూతురు.

నలుగురికీ ఎంతో రిలీఫ్ వచ్చింది. ‘వీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్' అన్నది చిన్న పాదాల తల్లి తండ్రితో, అదే మాట అంది పెద్ద పాదాల కూతురు కొడుకుతో' విక్రమార్కుడి పాత కథలో పజిల్ సాల్వ్ అయిపోయింది.

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about Vikramarkudu's story.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X