వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్విక్ బాక్సింగ్: బహుదూరపు బాటసారి

|
Google Oneindia TeluguNews

టాటా వీడుకోలు... గుడ్ బై ఇంక సెలవు అంటూ బయల్దేరాడతను.

ఏదైనా షూటింగ్ లొకేషనా ఎక్కడి కొచ్చాం ‘మనం' తర్వాత మనం అనుకున్నాడు. ఎటు చూసినా పచ్చని చెట్లు, కొండల మీదనించి జారి పడుతున్న నీళ్లు, గాలిని పరిమళాలతో నింపేసిన రంగు రంగుల పూలని చూస్తూ.

ఎంత దూరం నడచినా ఎవరూ కనబడ్డం లేదు. ఎంత సేపు నడచినా అలుపూ లేదు ఆయాసం లేదు. ఒళ్లంతా తేలికయిపోయి గాలిలో దూది పింజలా తేలి పోతున్నది. అసలిదియేలోకం?... అనుకుంటున్న అతను ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. అయిదో పదో అడుగుల దూరంలో నుంచున్న అది ‘భౌ భౌ'మని అరిచింది.

Chintaptla Sudarshan Quick boxing on ANR's death

తెల్లగా వుండి బక్కచిక్కిన ఒక కుక్క భవ్వుమంటున్నది. పాపం ఎవరూ పట్టించుకోవడం లేదేమో ‘బ్లూక్రాస్' కోడలికి అప్ప చెప్పాలి అనుకున్నాడు. అది మరింత దగ్గరికి వచ్చింది. దానికేసి పరీక్షగా చూశాడు. ఎక్కడో చూసినట్టుంది అనుకున్నాడు. దాని అరుపులోనూ మార్పు వచ్చింది. కుయ్ కుయ్ మంటూ చుట్టూ తిరుగుతూ..

నేను.. నన్ను గుర్తు పట్టలేదా? అంది. ఉలిక్కి పడ్డాడు రెండోసారి అతను. మాట్లాడుతున్న దెవరా అని చుట్టూ చూశాడు. ఎవరూ లేరు ఆ కుక్క తప్ప. అదే మాట్లాడింది మనిషి భాషలో.

ఎవరు నువ్వు? ఈసారి ఆశ్చర్యపడుతూ అన్నాడు.

నేనే.. ఒక్కసారి గుర్తు చేసుకోండి. బక్కచిక్కిన మీ శరీరమూ, ఎక్కడో లోతుకుపోయిన మీ కళ్లూ, చేతిలో సీసా, ఆ ఖళ్ ఖళ్ దగ్గు గుర్తుచ్చానా? ఆ చెత్తకుండీ, ఆ మసక చీకటీ ఆ కుండీ పక్కన నేల మీద జారగిలబడి నేనూ, నా మీద చేయి వేసుకుని తమరూ ‘జగమే' మాయ, బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా!

ఓ.. గుర్తొచ్చింది. గుర్తొచ్చింది. నువ్వా అన్నాడతను ఇంకోసారి ఆశ్చర్యపడుతూ.

ఆ రోజుల్లో దేవదాసుని ఇరవయి సార్లు చూసిన వాళ్లున్నారు. మీ పుణ్యమా అని భూమ్మీద వెండి తెర మీద మీతో పాటు నేను, నా పుణ్యమా అని ఈ లోకంలో ఇప్పుడు నేను.. నేనే... ఎన్నాళ్లకి చూశా మిమ్మల్ని దేవదా.

నవ్వాడతను. ఆపకుండా నవ్వాడతను. కోట్లాది మందిని సమ్మోహన పరిచిన ఆ నవ్వుని విని అది పరవశించి పోయింది.

నువ్వు మాత్రమేనా యింకా నేను తెల్సిన వాళ్లు నాకు తెల్సిన వాళ్లు వున్నారా యిక్కడ. ఇంకా ఎంత దూరం నడవాలి? అన్నాడతను.

ఎంత దూరమైనా నడవచ్చు. ఇదో అనంత లోకం. రాత్రీ లేదు పగలూ లేదు. కాలమూ లేదు దూరమూ లేదు. అయితేనేం అలసటావుండదు ఆకలి దప్పులూ వుండవు. ఇంక తెల్సిన వాళ్లాంటారా ఎంతో మంది. అందరూ కనిపిస్తారు. వెడల్పాటి వెండి రేకులా తళతళలాడ్తున్న గోదావరిలో పడవలో మీరూ అమ్మాయి గారూ, గుర్తుందా? అమ్మాయి గారికి మీరు నేర్పిన పాట ‘నా పాట నీ నోట పలకాల శిలకా, నీ బుగ్గలో సిగ్గు లొలకాల శిలకా'

గుర్తుంది. బాగా గుర్తింది. నువ్వు చెప్పిన ఆ అమ్మాయి గారు వుందా, ఎక్కడుంది?

ఎక్కడో కానీ వుంది. ఎప్పుడో అప్పుడు కనపడ్తుంది. ఇక్కడంతా మన మనుకున్నట్టు జరగదు. భూమ్మీదా అంతేననుకోండి కానీ టెన్షన్లనేవే వుండవు. ఆల్ హ్యాపీసే!! ఈ మధ్య ఒకాయన కనిపించాడు ఒకసారి తన పేరు షేర్ ఖాన్ అనీ మరోసారి భద్రాచలం అనీ అన్నాడు. మరొకాయన కనిపించినప్పుడల్లా ‘నాకదో తుత్తి' అంటూ తమాషాగా నవ్వుతాడు. ఇంకొకాయన ‘ఆనందో బ్రహ్మ' అంటూ హడావిడిగా పరుగెడ్తుంటాడు. ఓ కుర్రాడయితే ‘ఈ పెద్దోల్లున్నారే' అని గొణుగుతాడు.

మరి నాకెవరూ కనిపించలేదే. చెప్పాను కదా ఎప్పుడో అప్పుడు యిలా కనిపించి అలా మాయమైతారు. మర్చే పోయాను. ఈ మధ్యే ఒకామె వచ్చింది. ‘పిలవకురా అలగకురా, నలుగురిలో నను ఓ రాజా' అని పాడుతుంది. సువర్ణ సుందరి కదూ. ఈ లోకంలో ముసలి తనమనేది లేదు కదా ధగధగలాడిపోతున్నది. ఇప్పుడు మీకు లానే.

‘అంటే'? తనని తాను చూసుకున్నాడతను. నిజమే. పాతికేళ్లనాడు ఎంత అందంగా.. స్టైల్‌గా వుండే వాడో అలాగే వున్నాడు.

దసరా బుల్లోడు లావున్నారు. మీకేమిటి ఎవర్ గ్రీన్ హీరో తమరు. ఈ ప్రేమ్‌నగర్‌లో అలా ప్రయాణం చేస్తూవుండండి. అందరూ కనపడ్తారు.

బ్రదర్.. బ్రదర్.. అని ఎక్కడ్నించో ఒక గంభీర స్వరం వినిపించింది. గుండమ్మ కథ గుర్తుకొచ్చింది. బ్రదర్ అని పిలుస్తున్నదెవరో అర్థమయ్యింది. ఇక్కడే ఎక్కడో వున్నాడు అనుకుంటూ ముందుకు నడిచాడతను. అతన్ని అనుసరించింది కుక్క ‘ఈనాటి ఈ బంధమేనాటిదో' అనుకుంటూ.

(చిన్నప్పుడు నాగ్యాడు, నాగ్యాడు అని ముద్దుగా పిల్చుకున్న నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర్రావు స్మృతికి సజల నయనాలతో)

-చింటపట్ల సుదర్శన్

English summary
An eminent columnist Chintaptla Sudarshan has payed home to Akkineni Nageswar Rao in his column.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X