వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చుక్కా రామయ్య కాలమ్: సమాజమే పాఠశాల

By Pratap
|
Google Oneindia TeluguNews

ప్రాథమిక దశలో అలవర్చుకోవలసిన అంశాలలో మరొక అంశం పరిశీలన (అబ్జర్వేషన్‌). ప్రతి విషయం పాఠ్యాంశంలోంచే నేర్చుకోవాలి. పాఠ్యాంశం కూడా సమాజంలో ఒక భాగమే. విద్యార్థి స్కూలుకు రాకపోతే చాలా విషయాలు పరిశీలన చేస్తాడు. పిల్లలు కొందర్ని చూస్తే ప్రేమిస్తారు. కౌగిలించుకుంటారు. ఇంకొందర్ని చూస్తే దూరం పోతారు. అనగా పరిశీలనాశక్తే నిజమైన బోధనా సాధనం. 7I6R42 అని చెప్పటం, దాన్ని విద్యార్థితో 10 సార్లు అనిపించటం బోధన అనబడదు. ఒక దీర్ఘచతురస్రానికి 7 అడుగుల పొడవు ఆరడగుల వెడల్పుతో ఒక తరగతి గదిని తీసుకోండి. దానిలో ఎన్ని చతురస్రపు బండలున్నాయని అడగాలి. విద్యార్థి చూస్తాడు. అవి పరిశీలించి 42 అని తెలుసుకోవటం ఒకరి ద్వారా వచ్చింది కాదు. ఆ విద్యార్థి స్వతహాగా పరిశీలించి 42 అని నేర్చుకుంటాడు. పరిశీలన వచ్చేదంతా ఆ విద్యార్థి స్యయం కృషితో సంపాదించుకున్నది.

Chukka Ramaiah

స్వయం కృషిలో ఎన్నోమార్గాలుంటాయి. దానికి ఒక అడుగు పొడుగు ఉన్న బండ కింద ఎన్ని బండలున్నాయో ఒక విద్యార్థి చూస్తాడు. ప్రతి బండ కింద ఆరుబండలుంటే, 7 బండలకింద ఎన్ని బండలుంటాయో లెక్కపెట్టుకుంటాడు. అప్పుడు విద్యార్థికి పొడువు, వెడల్పు, వైశాల్యానికుండే సంబంధం తెలుస్తుంది. ఆ గది వైశాల్యం 42 చదరపు అడుగులని చెబుతాడు. అదే మాదిరిగా దీనిని వేరే దృశ్యానికి విస్తరిస్తాడు. ఒక్కొక్క మానిటర్‌ కింద 6గురు విద్యార్థులు నిలబడితే మొత్తం ఆ స్కూలు సంఖ్య 42 అంటాడు. అంటే ఆ స్కూల్లో 7గురు మ్యానిటర్లున్నారని చెబుతాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ‘‘నీకు 7 నిక్కర్లున్నాయి. ఆ బుషర్టులుంటే ఒక్కొక్క నిక్కరును ఆరు బుషర్టులతో కలిపితే ఆరు డ్రస్సులవుతాయి. ఈ మాదిరిగా విభజించి చూస్తే 42 డ్రెస్సులు తయారవుతాయని'' పిల్లవాడు ఆలోచిస్తాడు. ఏడుగురు మగపిల్లలుండి ఆడుగురు ఆడపిల్లలుంటే ఎన్ని జంటలు తయారవుతాయో ఆలోచిస్తాడు. ఈ మాదిరిగా ఒక దృశ్యాన్ని పరిశీలించి ఒక అంశాన్ని నేర్చుకుంటే దాన్ని వివిధ దృశ్యాలకు తన పరిశీలన ద్వారా అన్వయించుకుంటాడు. ఈ అబ్జర్వేషన్స్‌ ద్వారా పిల్లలకు ఎంతో జ్ఞానం కలుగుతుంది.

ఒక దృశ్యాన్ని పరిశీలించటం దాన్ని విస్తరింపచేయటం క్రియేటివ్‌ థింకింగ్‌ (సృజనాత్మకమైన ఆలోచన) అంటారు. ప్రాథమిక దశలో విద్యార్థికి అలవడవలసిన నైపుణ్యం ఇది. చిన్నతరగతుల్లోనే ఈ పునాది ఏర్పడితే ఒక దృశ్యాన్ని, ఒక వస్తువును పరిశీలించటం, దాన్ని విస్తరింపచేయటం చేయగలుగుతారు. ఈ నైపుణ్యమే ప్రాథమిక దశలో తీసుకురాగిలితే తరగతి గదిలో మాధ్యమిక లేక సెకండరీ స్థాయిలో ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్నదానికన్నా సమాజంతో నేర్చుకుంటాడు.

ఒక పువ్వులోని భాగాన్ని తోటలోకి పోయి చూసి నేర్చుకుంటే గులాబి పుష్పంలో ఎన్ని భాగాలుంటాయో, ప్రతి పుష్పంలో కూడా అన్నే భాగాలుంటాయనే నిర్థారణకు వస్తాడు. దీన్ని జనరలైజేషన్‌ అంటాం. అందుకే చాలా దేశాల్లో ప్రాథమిక స్థాయి పిల్లలను టూర్స్‌కు తీసుకుపోతారు. మ్యూజియంలకు తీసుకుపోతారు. అక్కడ వారు చూసిన విషయాన్ని రాయమంటారు. చెప్పమంటారు. చూసిన విషయాన్ని విద్యార్థి తన రాతలో శాస్త్రీయంగా విశ్లేషణ చేస్తాడు. పువ్వులో మొదటి భాగాన్ని చూసినప్పుడు తర్వాత భాగాలను చూసినప్పుడు వివిధ రంగులు కనిపిస్తాయి. ప్రతి పువ్వులో రంగులు మారవచ్చును. కానీ ప్రతి పువ్వులో ఒకే రకమైన భాగాలని పిల్లలు నిర్థారణకు వస్తారు. అదే మాదిరిగా మనుషుల రంగులు మారవచ్చును కానీ మానవ నిర్మాణం మాత్రం ఒకటే కదా అంటారు. దీన్నే శాస్త్రీయ దృక్పథమంటారు.

అనగా నాగరికతలు మారవచ్చును. భాషలు మారవచ్చును. సమాజ నిర్మాణం అంతా ఒకటే కదా అనే భావనలు కలుగుతాయి. ప్రతి విద్యార్థికి రాయటం, చదవటం చదువులో ఎంత ప్రధానమో పరిశీలించటం కూడా అంతే ప్రధానంగా ఉంటుంది. పరిశీలనతో విద్యార్థి అంతర్ముఖుడవుతాడు. మూలాల్లోకి పోతాడు. అందుకే ప్రతి విద్యార్థిలో కూడా ఆలోచించే శక్తి ఉంటుంది. ఆలోచించే శక్తికి ప్రేరణ పరిశీలన. ప్రతి వ్యక్తిలో కూడా తనలో వున్న శక్తిని పెంచుకునే ఆలోచనలకు అవకాశాలు కల్పించటమే స్వేచ్ఛ అంటారు. ప్రతి వ్యక్తికి అలాంటి స్వేచ్ఛను కల్పించటమే ప్రజాస్వామిక హక్కు అంటారు. ప్రాథమిక విద్యను హక్కుగా ఇవ్వటమంటే తనలో ఉండే శక్తిని గుర్తించి పెంచుకోవటమే. అందుకే ప్రజాస్వామ్యానికి పునాది ప్రాథమిక విద్య. సమాజమే పాఠశాల. నేర్చుకున్నదే నాగరికత.

ఉస్మానియా దారిపై ఐఐటి రామయ్య వాకింగ్

English summary
Educationist and Ex MLC Chukka Ramaiah, well known as IIT Ramaiah explained the importanace of observation in the education system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X