వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక హోదా: ఎప్పుడైనా ఆ నాలుగు మార్గాలే

By Pratap
|
Google Oneindia TeluguNews

"తండ్రితొడ నెక్కు వేడుక దగిలెనేని
పూని నాగర్భమునఁ నాఁడు పుట్ట కన్య
గర్భమునఁ బుట్టఁ గోరినఁ గలదె నేఁడు
జనకు తొడ యెక్కు భాగ్యంబు సవతికొడుక".

"సవతి కొడుకా, నాకడుపున పుట్టక వేరే స్త్రీగర్భాన జన్మించిన నీకు తండ్రి తొడపై కూర్చొనే సరదా తీరే అదృష్టం ఎలా పడుతుంది" అని శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని ధ్రువోపాఖ్యానంలో బమ్మెరపోతన వ్రాసిన పై పద్యానికి తాత్పర్యం.

అఖిల భువనాలను పరిపాలించటానికి ఉదయించి సకల మానవ జాతికి మూలపురుషునిగా భావించబడుచున్న బ్రహ్మమానస పుత్రుడైన స్వాయంభువమనువు భార్య శతరూప. వారికి ప్రియవ్రతుడు, ఉత్తానుపాదుడను ఇద్దరు కుమారులు. వారిలో ఉత్తానుపాదునికి సునీతి, సురుచియని ఇద్దరు భార్యలు. సునీతివలన ధ్రువుడు, సురుచివలన ఉత్తముడు అను ఇద్దరు కుమారులు అతనికి కలిగారు. ఆ ఉత్తానుపాదునికి పెద్దభార్యయైన సునీతి, ఆమె పుత్రుడైన ధ్రువునిపైన కన్నా రెండవ భార్యయైన సురుచి, ఆమె పుత్రుడు ఉత్తముని పైనే ప్రేమ ఎక్కువ. ఒకనాడు ఉత్తానుపాదుడు ఉత్తముని తన తొడపై కూర్చొనబెట్టుకొని లాలించుచున్నప్పుడు మొదటిభార్య సునీతి కుమారుడైన ధ్రువునికి కూడా తండ్రి తొడపై కూర్చొని "ప్రత్యేకహోదా" అనుభవించాలని ఉత్సాహపడి తండ్రికి చేరువగా వెళతాడు. అది చూచిన సవతితల్లి సురుచి అతనితో "నా సవతికొడుకైన నీకు తండ్రితొడనెక్కే భాగ్యమెలా లభిస్తుంది" అని అంటూ ధ్రువుని లాగి క్రిందపడవేస్తుంది.

ధ్రువుడు చిన్నపిల్లవాడు. తమ్మునిలాగానే తనుకూడా తండ్రి ఒడిలో కూర్చొనాలని ఉబలాట పడటం సహజం. కాని పెద్దవారనుకొనే పురాణపురుషులలో కూడా ప్రత్యేకహోదా కోసం తపన పడిన వారు ఉన్నారు. దాని కోసం ప్రయత్నాలు చేసి సాధించినవారూ ఉన్నారు, అది పొందలేక ఓడి భంగపడినవారూ ఉన్నారు. ఓడి గెలిచినవారు కూడా ఉన్నారు. విశ్వామిత్రుని కథే ఇందుకు ఉదాహరణ.

ఒక దేశానికిరాజైన కౌశికుడు సైన్యసమూహంతో వచ్చి వసిష్ఠుని వద్దనున్న కామధేనువుని బలవంతముగా తోలుకొనిపోవడానికి ప్రయత్నించి ఓడిపోయి భంగపడతాడు. తన ఓటమికి కారణం వసిష్ఠుని బ్రహ్మర్షి హోదా(శక్తి)యేయని గ్రహించి తాను కూడా బ్రహ్మర్షి అనిపించుకొని వసిష్ఠునికున్న ప్రత్యేకహోదా పొందితేతప్ప తన గౌరవం నిలబడదని, దానికి తపస్సు ఒక్కటే మార్గమని తెలుసుకొని ఘోర తపస్సు మొదలుపెట్టినా, తనలోని అరిషడ్వర్గాలలో మొదటివైన కామ క్రోధాలను జయించలేక అనేకసార్లు ఆ తపస్సును పూర్తిచేయలేకపోవటము, అనేక పునఃప్రయత్నాల తరువాత చిట్టచివరకు బ్రహ్మర్షి గౌరవం పొంది విశ్వామిత్రునిగా ఖ్యాతిగణించటము మనందరికీ తెలిసిన కథే.
బొందితో స్వర్గానికి చేరే ప్రత్యేకహోదా పొందప్రయత్నించి మధ్యలో తలక్రిదులుగా వేలాడదీయబడిన త్రిశంకుని కథకూడా తెలిసినదే. విశ్వామిత్రుడు ప్రత్యామ్నాయ "త్రిశంకుస్వర్గం" సృష్టించి అందులో అతనిని పెట్టడం వేరేకథ.

సాధారణంగా మనలో చాలామందికిసంఘంలో కొద్దో గొప్పో ప్రత్యేక గుర్తింపు పొందాలనే కోరిక ఉంటుంది. అది సహజం. జన్మతః వచ్చిన ప్రావీణ్యంతో కవులుగా, గాయకులుగా, చిత్రకారులుగా, పండితులుగా, సంఘసేవకులుగా లేదా ప్రజానాయకులుగా ఎదిగిన కొంతమందికి గుర్తింపు దానంతటదే వస్తుంది. ఆ గుర్తింపువలన వారి వారి సామర్ద్యాన్నిబట్టి సమాజమే వారిని ప్రత్యేకంగా గౌరవిస్తుంది. మరికొంతమందికి వారు చేస్తున్న ఉద్యోగంవలననో, ప్రజాప్రతినిధులైతే వారి పదవినిబట్టి (ఎమ్ ఎల్ ఎ, ఎమ్ పి, మంత్రి) వారికిచ్చే గౌరవమర్యాదలు ఆధారపడి ఉంటాయి.

Dasu Madhusudan Rao guides to achieve specialcatgory status

సమాజంలో ఉన్న సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు కొన్ని సందర్భాలలో తాత్కాలికంగానైనా ఆ ప్రత్యేక హోదా కొంతమందికి కల్పిస్తాయి. పెళ్ళిళ్ళలో పెళ్ళికొడుకులస్థానం కూడా అటువంటిదే. అంతకంటే పెళ్ళికొడుకు తల్లి, అతని చెల్లి ఎక్కువ మర్యాదలను "డిమాండ్" చేస్తారు. అత్త, ఆడబిడ్డ లాంఛనాలు సరిగా జరగకపోతే ఆడపెళ్ళివారి మీద అలుగుతారు. అలా అలిగి పెళ్ళిళ్ళు రద్దుచేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉండేవారని వింటూ ఉంటాం.

ఇప్పటికీ ఆ అధికారం వారికి ఉందని మొగపెళ్ళివారి నమ్మకం. ఆ ప్రత్యేక మర్యాదలు హక్కుగా పొందాలనుకోవటానికి మొగపెళ్ళివారుకావడమే వారి అర్హత. ఈ సాంప్రదాయం కొద్దో గొప్పో ఈ ఇరవైఒకటో శతాబ్దంలో కూడా కొంతమంది కొనసాగిస్తున్నారని వింటూ ఉంటాం. పదవీవిరమణ చేసే చిరుద్యోగి వీడ్కోలు సభలో అతను ముఖ్య అతిథిగా తను పని చేసిన సంస్థ యజమాని లేదా ముఖ్య అధికారి పక్కన స్టేజిమీద కూర్చొని వారిచే సన్మానింపబడటం ఇటువంటిదే.

అసలు పేచీ అంతా ఎక్కడ వస్తుందంటే కొంతమంది అదనుపదును చూసుకోకుండా అయినచోటా కానిచోటా తమకుతామే మిగతావారికన్నా గొప్పవారమనుకొని ప్రత్యేక మర్యాదలు పొందాలనుకున్నప్పుడు.

గ్రామపంచాయతి అధ్యక్షుని మొదలుకొని దేశాధ్యక్షునిదాకా ఎవరి హోదాకుతగిన ప్రత్యేక గౌరవం వారు పొందుతునే ఉంటారు. కానీ వివిధహోదాలవారు ఒకేచోట చేరినప్పుడే వస్తుంది తంటా అంతా. పెద్దపెద్ద సమావేశాలు, భారీ కార్యక్రమాలు జరుగుచున్నప్పుడు చూస్తూ ఉంటాం "విఐపి"లని, "వివిఐపి"లని అతిథుల హోదానుబట్టి వర్గీకరణ చేస్తూ ఉంటారు. ఈ విఐపి, వివిఐపిల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న ఈరొజులలో కొత్తగా "ఎమ్ ఐ పి" (మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్) అనే వర్గాన్ని ఒకదాన్ని తయారుచేశారు. సభలు, సమావేశాలలోను, పబ్లిక్ మీటింగుల్లోను వారివారి హోదాకు (ప్రొటొకాల్ ప్రకారం) తగిన స్థానం వారికి ఇవ్వకపోతే వచ్చే పరిణామాలు ఆ సమావేశాలు ఏర్పాటుచేసిన అధికారులకు బాగా అనుభవమే.

పెద్దపెద్ద సభలలో తెలిసో తెలియకో ఒక ఎమ్ ఎల్ ఏ, లేదా ఒక జూనియర్ మంత్రికో స్టేజిమీద అందునా ముఖ్యమంత్రి ప్రక్కన చోటీయకపోతే సదరు ఎమ్ ఎల్ ఎ లేదా మంత్రిగారు అలిగి సభనుండి "వాక్ ఔట్" చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఆహ్వానం ఉన్నా ఆ ఆహ్వానపత్రికలో తన పేరు వేయలేదనో, వేసినా అట్టడుగున వేశారనో అలిగి ఆ కార్యక్రమానికి రామని భీష్మించుకు కూర్చునే వారూ ఉంటారు. అటువంటివారిని వారికి ప్రజలలో ఉన్న పరపతినిబట్టి ఆ సభల నిర్వాహకులు బ్రతిమిలాడి కార్యక్రమాలకి తీసుకు పోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యనే ఒకానొక రాష్ట్ర మంత్రిగారు ఒక పాఠశాల భవన ఆవిష్కరణ ఫలకంమీద తన పేరు మూడో స్థానంలో, ఆభవన నిర్మాణానికి భూరివిరాళమిచ్చిన ఇరువురి దాతల తరువాత వ్రాసినందుకు ఆ పాఠశాల ప్రిన్సిపల్ ని సస్పెండు చేస్తానని బెదిరించినట్లుగా వార్తలు వచ్చాయి.

ఒక్క మనుషులలోనే కాదు మనుషులు కట్టించిన గుళ్ళలోను, నిర్మించిన నగరాలలోను ప్రత్యేక హోదా కలిగినవి వున్నాయి. ఉదాహరణకి తిరుపతి, కాశీ వంటి క్షేత్రాలు, అమృత్సర్ స్వర్ణదేవాలయం, మక్కాలోని మసీదు, జరూసలేమ్ చర్చి మొదలైనవాటి ప్రత్యేకత అందరూ గుర్తించినదే. అలాగే ఢిల్లీ, ముంబై, బెంగుళూరులాంటి నగరాలకు మనదేశంలో, లండన్, పారిస్, న్యూయార్క్, సింగపూర్ మొదలైనవాటికి ప్రపంచంవ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉన్నదికదా. జి8, జి20 అని 'గ్రూపు'లెన్ని ఉన్నా అగ్రరాజ్యాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనాలు మాత్రం ఐదే. ఆ ఐదు అగ్రరాజ్యాల సరసన, మరీముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం అనే ప్రత్యేకాతిప్రత్యేక హోదా కోసం అనేక దేశాలతో మనదేశం కూడా విశ్వప్రయత్నం చేస్తున్నసంగతి అందరికీ తెలిసినదే.

పదవులు అధికారాలు ఏమీలేని సామాన్యులు కూడా ఈ ప్రత్యేక గుర్తింపు కోసం వెంపర్లాడటం మనం చూస్తూ ఉంటాం. దేనికంటే దానివల్ల లభించే సౌకర్యాలకోసం. అనాయాసంగా (సౌకర్యము అనేమాటకి అనాయాసము, సులభము అనే అర్థాలుకూడా ఉన్నాయి) కొన్నిపనులు జరిపించుకొనవచ్చుననే నమ్మకంవలన.
ఉదాహరణకి తిరుపతికొండనే తీసుకోండి. సామాన్య భక్తునికి స్వామి ధర్మదర్శనం కొన్నిగంటలు క్యూలో నిలబడితే తప్ప దక్కదు. పెద్దహోదాకలిగిన పదవి ఉన్నవాళ్ళకెటూ ఇబ్బంది ఉండదు.

వారిని ధర్మాధికారులు, ప్రధాన ఆర్చకులే దగ్గరుండి ఆలయమర్యాదలతో అహ్వానంపలికి ప్రత్యేకద్వారంగుండా లోనికి తీసుకొని వెళ్ళి స్వామి దర్శనం క్షణాల్లో చేయించి శేషవస్త్రం ధరింపజేసి, తీర్థప్రసాదాలు విరివిగా ఇచ్చి సాగనంపుతారు. మకొందరు పెద్దపదవులు లేకపోయినా అవి ఉన్నవారిచే సిఫార్సు చేయించుకొని "విఐపి పాస్"లు పొందటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. హోదా ఉన్న వారు తెలియటం కూడా చిన్నసైజు హోదాయే. ధనవంతులైతే బాధేలేదు. రాజపోషకులుగానో, మహారాజపోషకులగానో భారీ ముడుపులు చెల్లించి ఆసౌకర్యాలు పొందవచ్చు.

ఒక్క దేవాలయాల్లోనే కాదు హోదా ఉన్నవారు ఎక్కడకువెళ్ళినా ప్రత్యెక సౌకర్యాలు పొందుతునే ఉంటారు. విమానాశ్రయాలలో నేరుగా విమానందాకా కారులో వెళ్ళవచ్చు. వారికి ప్రత్యేక ప్రవేశద్వారాలు, ప్రత్యేక సీట్లు ఉంటాయి. సినిమాలు క్రికెట్ మాచ్ లు ఉచితంగా చూడవచ్చు. ప్రభుత్వకార్యాలయాలలోనూ మరి కొన్నిచోట్ల పనులు తొందరగా కావాలంటే అధికారంతో కూడిన హోదా అయినా ఉండాలి లేదా పైన చెప్పినట్లుగా రాజపోషకులుగా ధనమైనా వెచ్చించగలగాలని అందరికీ తెలిసిన విషయమే కదా. ఒక్కొక్కప్పుడు ధనబలం కన్నా అధికారబలమే కావలసివస్తూ ఉంటుంది. అవేమీ లేనివారు అవి ఉన్నవారిచే బ్రతిమాలో బామాలో చెప్పించి, ఫలానివారి తాలూకు అనే ప్రత్యేకతను పొంది పనులు చక్కబెట్టించుకుంటారు.

ఇలా ఎవరి శక్తి సామర్ధ్యాలనుబట్టి ఎవరికివారు అన్నివేళలా అన్నిచోట్లా ప్రత్యేకహోదా పొందడానికి తహతహలాడుతునే ఉంటారు. దాని కోసం ప్రత్యేక ప్రయత్నాలు చేస్తునే ఉంటారు. ఆ హోదా ఉన్నవారు అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అన్నిచోట్లా తమ హోదాను ప్రదర్శిస్తునే ఉంటారు. ఆ హోదాకు తగిన మర్యాదలు పుచ్చుకుంటూనే ఉంటారు. ఆ మర్యాదలలో ఏమైనా తేడా వస్తే అలుగుతునే ఉంటారు. అలా అలిగిన కొంతమంది మన్నూ మిన్నూ ఏకం చేయటానికి కూడా వెనుదీయరు.

ఒక్కొక్కప్పుడు మన అదృష్టం బాగుంటే యాదృచ్ఛికంగా మన ప్రయత్నమేమీ లేకుండానే ప్రత్యేక గౌరవం లభించటం జరుగుతూ ఉంటుంది. ఏ బ్యాంకుకో లేదా మరే యితర కార్యాలయానికో బాగా రద్దీగా ఉన్న రోజున మనం అర్జంటుపనిమీద వెళ్ళి, అక్కడ ఉన్న పరిస్థితి చూసి ఏంచేయాలిరా దేవుడా అని అనుకుంటూన్న తరుణంలో ఎవరో వచ్చి "మీరా మాస్టారూ ఏదైనా పనిమీద వచ్చారా, ఆక్యూలో మీరు నుంచోలేరుగానీ ఇలా లోపలికి రండి" అని కూర్చోపెట్టి మన పని దగ్గర ఉండి చేయించిపెట్టే పూర్వ విద్యార్థులో, చిన్నతనంలో మన పిల్లల క్లాస్ మేట్లో తారసపడతూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు తరచు కాకపోయినా అరుదుగా జరుగుతూ ఉంటాయి.

ఇలాంటి అనుభవమే నాకు తిరుమల దేవాలయంలోనే కలిగింది. సాధారణంగా చాలామంది ఒక్క దర్శనంతో తృప్తి పడక కష్టమైనా రెండు మూడు సార్లు స్వామిదర్శనంకోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకనాడు నేను ధర్మదర్శనం చేసుకొని 'ముక్కోటిప్రదక్షిణప్రాకారం'గుండా తిరిగి వస్తుండగా ఆమార్గంలో ఉన్న శ్రీవారి హుండీ 'సిరికొలువు' నుండి భక్తులు సమర్పించిన కానుకలను తీసుకొనివెళ్ళటానికి వచ్చిన అధికారులు నన్ను ఆపి కానుకలు తీసిన తరువాత నాచేత సాక్షిసంతకం చేయించుకున్నారు. సంతకంచేసి వెళ్ళిపోబోతుండగా వారు నన్ను ఆపి "సాక్షిసంతకం చేసినవారు స్వామిని దర్శించకుండా వెళ్ళకూడదు" అని చెప్పి దగ్గరుండి నేరుగా విఐపి దర్శనంచేయించారు.

ఇలా అరుదుగా జరిగే సంఘటనలను పక్కన పెడితే అనేక సౌకర్యాలు, రాయితీలు వెసులుబాటులు కలిపించే హోదా సంపాదించాలంటే కొన్ని అర్హతలుండాలి. ఆ అర్హతలు పొందటానికి చాలా కష్టపడాలి. తరువాత అనేక సంవత్సరాలు కృషి చేయాలి. ఇప్పుడు పెద్ద అధికారము, హోదా కలిగిన ఉద్యోగాలలో ఉన్నవారు విద్యనభ్యసిస్తున్నప్పుడు, వృత్తిలోను ఎంతో కృషి చేసినవారే. రాజకీయంగా ఎదిగి పదవులు పొందటానికి ఎంత శ్రమపడాలో ఆ పదవులు అనుభవించుచున్నవారే చెప్పాలి. ఆ కారణంచేతనే కాబోలు సవతి తల్లి సురుచి ధ్రువునితో ఇలా అంటుంది.

"అది గాన నీ వధోక్షజు
పదపద్మము లా శ్రయింపు పాయక హరి నా
యుదరమునఁ బుట్ట నిచ్చును
వదలక యట్లైన ముదము వడసెద వనఘా".
అంటే తండ్రితొడపై కూర్చొనటానికి ధ్రువునికి ఉండవలసిన ఒకేఒక్క అర్హత సురుచికి కొడుకుగా పుట్టటమేనని, అందుకు గాను అతను అధోక్షజుని అనగా విష్ణువు పాదాలను వదలకుండా ఆశ్రయిస్తే ఆ హరి కనికరించి వచ్చేజన్మలోనైనా అతనిని ఆమె గర్భవాసాన జన్మించేటట్లు చేయగలడని, అప్పుడుగాని అతని కోరిక తీరి అమితమైన సంతోషమును పొందలేడని ఆమె తాత్పర్యం.

తండ్రితొడపైనుండి లాగి క్రిందకు నెట్టివేయబడి అవమానంపొంది దుఃఖించుచున్న ధ్రువుని చూచి తల్లి సునీతి అతనిని ఓదార్చుచూ "బానిస బ్రతుకు నెట్టుకుని వస్తున్న నేను నీకేవిధముగా సాయపడగలను కాబట్టి పినతల్లి సురుచి చెప్పినట్లుగా శ్రీమన్నారాయణుని శరణు వేడటమే నీవు చేయగలిగినది" అని సలహా ఇస్తుంది. ఆమె సలహా గ్రహించిన ధ్రువుడు నారదముని ఉపదేశించిన "ఓం నమో భగవతే వాసుదేవాయ" అను ద్వాదశాక్షరీ మంత్రం జపిస్తూ తపస్సు చేసి శ్రీమన్నారాయణుని మెప్పించి "ధ్రువతార"యై వెలసి ఎవరికీ అందని మహోన్నతమైన హోదా పొందడం అందరికీ తెలిసిన కథే.
ఎంత శ్రమకోర్చి తపస్సుచేసినా భగవంతుడు తన భక్తుని భక్తిని, విధేయతను పరీక్షించటానికి అతను ఆశించిన హోదా(వరంగా) నేరుగా ఇవ్వకుండా అప్పుడప్పుడు వేరే వరాలు ఇవ్వజూపుతాడు. విశ్వామిత్రునికి కూడా దేముడు ఒకసారి రాజర్షిని చేస్తానని, మరొకసారి మహర్షిని చేస్తానని "ప్రత్యేక పేకేజిలు" ప్రకటిస్తాడు. అయినప్పటికీ విశ్వామిత్రుడు వాటికేమీ లొంగక మరింత నిష్ఠగా కఠోర తపస్సుచేసి అనేక కష్టనిష్టూరాలకు ఓర్చి బ్రహ్మను మెప్పించి "బ్రహ్మర్షి హోదా" సాధిస్తాడు.

దేనినైనా సాధించటానికి "సామ దాన భేద దండోపాయాలు" అను నాలుగు మార్గాలు ఉన్నాయని శాస్త్రాలు చెబుతాయి. వీటిలో దండోపాయం రెండువేపులా పదునున్న కత్తిలాంటిదని నేనకుంటాను. ఎందుకంటే దండం అంటే నమస్కారం సామము ఆంటే మంచిమాటచెప్పేముందు సాధారణంగా అందరూ చేసే పని. దండం అంటే దుడ్డుకఱ్ఱ కూడా. దీనిని భేదం అంటే విబేధించి వేరుపడిన తరువాత వాడవలసినది. ఇక రెండవది దానము అనగా సమర్పణ చేయుట అని అర్థం చేప్పుకొంటే ముడుపులు చెల్లించుట అని అనుకోవచ్చును. సమయ సందర్భాలనుబట్టి, మనం కోరుకునే కోరికనుబట్టి దండంతోకూడిన సామదానాలా లేక విభేదించి దండప్రయోగమా అను నిర్ణయం కొంచం జాగ్రత్తగా తీసుకోవాలి.

అందుకనే ఎవరినించైనా ఏదైనా వరం పొందాలంటే ఆవరప్రదాతలకు ధ్రువుని కథలో ఉత్తమునిలాగా స్వంత సంతానమై అయి ఉండాలి లేదా జన్మ కారకుడైన భగవంతుడిపాదాలను విడవకుండా ప్రార్థించాలి. తాను తృప్తిచెంది ప్రార్థించే భక్తుల కోరికలు తీర్చాలంటే వారు ఏమి చెయ్యాలో సాక్షాత్ ఆపరమాత్మే భగవద్గీతలో ఇలా చెప్పాడు

"పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి,
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః".
శ్రీమద్భాగవతంలో కూడా శ్రీకృష్ణుడు సుధాము (కుచేలు)నికి ఇవే మాటలు చెప్పుతాడు. ఈ ఫల పుష్పాదులతో చేసే ఆరాధన కోరిక సాధించుకోవడానికి చేసే సామదానోపాయల కోవలోకే వస్తాయేమో. కాని ఈమార్గంలో లక్ష్య సాధనకు చాలాకాలం పట్టటమేకాకుండా కొంచం కష్టతరము కూడాయని ధ్రువ విశ్వామిత్ర చరిత్రలే ఉదాహరణ. సామదండాలకన్నా భేదదండా(ఆయుధము)ల వలననే త్వరగా కోరికలు నెరవేరుతాయని ఆపురాణగాథలే కొన్ని చెబుతాయి.

సనకసనందనాదులుగా ప్రాచుర్యము పొందిన సనక, సనాతన, సనంద, సనత్కుమారుల శాపంచేత వైకుంఠ బహిష్కృతులైన జయవిజయులపై విష్ణువు దయదలచి వారు తిరిగి వైకుంఠ ద్వారపాలక హోదా పొందాలంటే రెండు శాపవిమోచన మార్గాలు సూచిస్తాడు. భక్తితో తనని సేవిస్తూ ఏడుజన్మల తరువాత తిరిగి వైకుంఠ ప్రవేశం లేదా విష్ణు ద్వేషులుగా విభేదించి కేవలం మూడుజన్మలు మాత్రమే దూరంగా ఉండటం. జయవిజయులు రెడవ మార్గాన్నే ఎంచుకొని మూడుజన్మలలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, రావణకుంభకర్ణులుగాను, శిశుపాలదంతవక్తృలుగా పుట్టి విష్ణువుతో విభేదించి, దండ (ఆయుధ) ప్రయోగంచేసి ఆ కోదండరాముని అండ చేరటం మనందరికీ తెలిసిన కథలే. కాలం ఏదైనా అప్పుడూ ఇప్పుడూ కార్యసాధనకు ఉపాయాలు ఆ నాలుగే.

ఆకు (పత్రం) లాగా చిగురించి ఎదిగి పండి రాలిపోయేది శరీరం; నిర్మలమై సువాసనలు వెదజల్లుతూ ఆనందింపజేసే పువ్వు (పుష్పం) లాంటిదే అరిషడ్వర్గాలను జయించిన హృదయం; దైవాంకితమైన బుద్ధియే పండు(ఫలం); అమేయ అచంచల భక్తి పారవశ్యంతో వచ్చే బాష్పాలే నీరు (తోయం) కాబట్టి లక్ష్యసాధనకు ఈనాలుగూ కలిగిన చిత్తశుద్ధితో పని చేయాలని శ్రీ సత్య సాయిబాబా అన్నారు.

ఇది కలియుగం కాబట్టి పూర్తిగా దేవునిపైనే భారం వేయ కుండా సమయానికి తగిన మార్గం ఎంచుకొని మన జీవనాన్ని నడపింపజేసే అధికారులనో, నాయకులనో పైన చెప్పిన నాలుగు ఉపాయాలతోపాటు స్థాన, అంగ, భావ, ఆత్మ లతో కూడిన చతుర్విధ శుశ్రూషలు చిత్తశుద్ధితో చేసి వారిని ప్రసన్నం చేసుకొని పని చక్కబెట్టుకోవటానికి ప్రయత్నించాలి.
ఇక చివరాఖరిగా ప్రజలు విడివిడిగా తమకోసమో, తమవారు లేక తమ ప్రాంతం కోసమే కాకుండా అందరూ కలసికట్టుగా దేశంకోసం కృషి చేస్తే యావత్ భారతావనికే ప్రపంచదేశాలన్నింటిలోను "ప్రత్యేక హోదా" సంపాదించి పెట్టవచ్చునేమో.

- దాసు మధుసూదన రావు

English summary
dasu Madhusudan Rao describes what is status and suggests how t achieve it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X