• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చంద్రబాబుపై చరిత్ర ఫక్కున నవ్వుతుంది

By Pratap
|

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ మీద ఆధిపత్యాన్ని వదులుకోవడానికి ఇష్టంగా లేనట్లుంది. హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని దేశంలోనూ విదేశాల్లోనూ ఆయన నిత్యం ఊదరగొడుతూనే ఉన్నారు. సరే హైటెక్ సిటీలాంటివి ఆయన హయాంలో వచ్చి ఉండేవి. నిజానికి, ఐటి పరిశ్రమ దేశంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా వచ్చినా ఐటి పరిశ్రమ హైదరాబాదుకు వచ్చి ఉండేది. అయితే, ఆయన కొంత ఎక్కువ అభివృద్ధికి ఎక్కువ శ్రమ పెట్టి ఉండవచ్చు.

హైదరాబాదులో ఐటి పరిశ్రమను అభివృద్ధి చెందినంత వరకు ఆయన కృషిని అంగీకరించవచ్చు. కానీ, హైదరాబాదుకు చరిత్రే లేనట్లు, ఆయన రాక ముందు హైదరాబాదులో ఏమీ లేనట్లు ఆయన మాట్లాడడం ఆయన ఆధిపత్య ధోరణికి నిదర్శనమే. హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో 1956లో విలీనం జరిగేనాటికే హైదరాబాదు అన్ని రంగాల్లోనూ అభివద్ధి సాధించింది. ఐటి కొత్త రంగం కాబట్టి ఆ తర్వాతి కాలంలో వచ్చింది. అప్పటికే హైదరాబాదు అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది కాబట్టే ఏ మాత్రం కష్టపడకుండా ఆంధ్రులకు కూడా రాజధాని లభించింది.

తాజాగా ఆయన మరో ప్రకటన చేసి ఆయన ఆధిపత్య ధోరణిని ప్రదర్శించుకున్నారు. ఉదయాన్ని నిద్ర లేవడం హైదరాబాదీలకు ఎన్టీ రామారావు నేర్పించాడనేది ఆయన తాజాగా చేసిన ప్రకటన. ఆయన ఆలోచనలు అమరావతి నిర్మాణం చుట్టూ కన్నా ఎక్కువగా హైదరాబాద్ చుట్టు తిరుగుతున్నట్లున్నాయి. హైదరాబాదీల జీవన స్థితిగతులు, జీవన విధానాలు, జీవనశైలి తెలిసినవారు ఎవరు కూడా చంద్రబాబు మాదిరిగా మాట్లాడరు.

K Nishanth on Chandrababu's view on Hyderabadis

‘హైదరాబాద్‌ జనం లేటుగా నిద్రపోయేవారు. లేటుగా లేచేవారు. కానీ ఎన్టీఆర్‌ వారికి ఉదయాన్నే లేవడం నేర్పారు. ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలు 24 గంటలు పనిచేస్తున్నారు' అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ వాసులు ఇంకా బాగా పనిచేయాలన్నారు. ‘శారీరక కష్టం అవసరంలేదు. మెదడుకు పదును పెడితే చాలు' అని పిలుపునిచ్చారు. తాము లేకపోతే హైదరాబాదు ప్రజలకు ఏమీ తెలియదు, తాము రాకపోతే సోమరిపోతులుగానే ఉండేవారు అనే అహంకారపూరితమైన ప్రకటన చంద్రబాబు నుంచి వచ్చింది.

గతంలో చంద్రలత అనే ఓ రచయిత్రి రేగడివిత్తులు అనే నవలలో తెలంగాణవాళ్లకి తామే వ్యవసాయం నేర్పించామని ఓ నవల రాసి పారేశారు. నిజానికి, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందే వ్యవసాయం ఎంత అభివృద్ధి చెందిందో పరిశీలించి ఉంటే అలా మాట్లాడి ఉండరు కావచ్చు. వ్యవసాయనికి సంబంధించిన ప్రత్యేక పత్రికలు లేదా సంచికలు కూడా తెలంగాణలో అచ్చయ్యాయనే విషయం చంద్రలతకు తెలిసి ఉండకపోవచ్చు.

చంద్రబాబులాంటివారు గానీ ఇతర తెలంగాణ మేధావులు గానీ తెలంగాణ, హైదరాబాద్ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామక్రమాన్ని తెలుసుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు. అది తెలియకపోవడం వల్ల అంతటా తామే ముందున్నామనే బాహాటంగా ప్రదర్శించుకుని తెలంగాణ ప్రజలనే కాదు, మేధావులను, రచయితలను, రాజకీయ నాయకులను అవమానించే పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పద్ధతి మారలేదు.

వ్యవసాయం నిజంగానే, ఆంధ్రులు వచ్చిన తర్వాత అభివృద్ధి చెందింది అనుకుంటే, కాకతీయుల కాలంలో గొలుసు కట్టు చెరువుల నిర్మాణం జరిగి ఉండేదా, నిజాం వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి ఉండేవారా అనే కనీస విషయాలను కూడా ఆలోచించే స్థితిలో లేరనుకోవాల్సి ఉంటుంది. తెలిసి కూడా వారు అలా మాట్లాడుతూ ఉండవచ్చు. ఇది అత్యంత ప్రమాదకరమైంది. నిద్రపోతున్న వాళ్లను లేపవచ్చు గానీ నిద్ర నటిస్తున్నవాళ్లను లేపడం కష్టం. చంద్రబాబు తాను చేసిన ఐటి కృషిని మాత్రం చెబుకుంటే సరిపోతుంది, హైదరాబాదును తానే నిర్మించానంటే, హైదరాబాదీలకు పొద్దునే నిద్ర లేపడం ఎన్టీఆర్ నేర్పించారంటే చరిత్ర ఫక్కున నవ్వుతుంది.

- కె. నిశాంత్

(ఈ వ్యాసంతో వన్ ఇండియా తెలుగుకు ఏ మాత్రం సంబంధం లేదు. అవి రచయిత అభిప్రాయాలు మాత్రమే. ఎవరైనా దీనిపై తమ అభిప్రాయాలను చెప్పదలుచుకుంటే ఈ మెయిల్ రాయండి pratap.reddy@oneindia.co.in)

English summary
K Nishanth on Chandrababu's view on Hyderabadis
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X