వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదేమిటి పవన్ కళ్యాణ్: అమాసకు, పున్నానికా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, ఎపికి ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తామని బిజెపి నాయకత్వం హామీ ఇచ్చింది. ఎపికి ప్రత్యేక హోదాను ఐదేళ్ల పాటు ఇస్తామని రాష్ట్ర విభజన సమయంలో అప్పటి యుపిఎ ప్రభుత్వం చెప్తే పట్టుబట్టి పదేళ్ల హామీని ప్రస్తుత కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు రాబట్టారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి.

ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి, ఒక్క సీటుకు కూడా పోటీ చేయకుండా మోడీని కలిసి, బిజెపి - టిడిపి కూటమికి మద్దతు తెలపడమే కాకుండా ఎపిలో పర్యటించి ప్రచారం సాగించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రశ్నించేవారిలో తానే మొదట ఉంటానని కూడా చెప్పారు.

దాదాపుగా ఎపికి ప్రత్యేక హోదా రావడం అనేది కల్లగానే తయారైంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దాదాపు ఆ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ స్థితిలో ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలు సాగుతున్నాయి. తెలుగు సినీ నటుడు శివాజీ ఆమరణ నిరాహారదీక్షతో అది మరింతగా చర్చనీయాంశమైంది.

 K Nishanth on Pawan Kalyan attitude

ప్రత్యేక హోదా విషయం వచ్చినప్పుడు కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు కాస్తా అసహనం ప్రదర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఓసారి ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేసి, తన పని అయిపోయిందని అనిపించుకున్నారు. గబ్బర్ సింగ్ 2 వంటి చిత్రాల్లో నటిస్తూ ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు.

రాజధాని భూముల సేకరణ విషయంలో కాస్తా హడావిడి చేసిన పవన్ కళ్యాణ్ తిరిగి ఆ మాట ఎత్తడం లేదు. మరి, ఈ విషయంలో చంద్రబాబు హేతుబద్దమైన నిర్ణయాన్ని తీసుకుని, అమలు చేస్తానని చెప్పారేమో తెలియదు. కానీ, ప్రత్యేక హోదా అంశం మాత్రం ఇంకా రగులుతూనే ఉన్నది. ఎపి ప్రజలకు ఇచ్చిన హామీ విషయంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారనే ప్రశ్న సహజంగానే వస్తుంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వంటివారే కాదు, ప్రతి ఒక్కరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను అడిగే పరిస్థితి వచ్చింది.

పవన్ కళ్యాణ్ తనకు వీలున్నప్పుడు ప్రజల్లోకి వచ్చి కాస్తా సందడి చేసి, మళ్లీ వెనక్కి వెళ్తే సమస్య పరిష్కారమవుతుందా అనేది ప్రశ్న. విభజన సమయంలో బిజెపి, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి పవన్ కళ్యాణ్ ఎందుకు ముందుకు రావడం లేదనేది అతి పెద్ద ప్రశ్న.

 K Nishanth on Pawan Kalyan attitude

ఎపికి ఇచ్చిన ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపడం దాదాపుగా ఖాయమైన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు కొనసాగుతున్నారని, రాష్ట్రంలో బిజెపిని ఇంకా మంత్రివర్గంలో ఎందుకు కొనసాగిస్తున్నారని అడగాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్‌కు లేదా అని అడగాల్సిన సమయం వచ్చిందనే భావిస్తున్నారు. అమాసకు, పున్నానికి ఓసారి ప్రజల్లోకి వచ్చి తనకు ఇష్టమైన రీతిలో ప్రశ్నలు సంధించి మళ్లీ ఎప్పుడు ముందుకు వస్తారో తెలియని పరిస్థితి పవన్ కళ్యాణ్ కల్పిస్తున్నారు.

ప్రశ్నించడం తన హక్కు అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రత్యేక హోదాపై బిజెపిని నిలదీయడానికి ముందుకు వస్తారనేది ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్నే. ఈ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాకపోయినా ఇక ముందైనా జవాబు చెప్పాల్సే ఉంటుంది.

- కె. నిశాంత్

రచయిత అభిప్రాయంపై ఎవరైనా తమ అభిప్రాయులు రాయదలుచుకుంటే ప్రచురిస్తాం. రచనలు హేతుబద్దంగానూ సంయమనంతోనూ ఉండాలి. మీ అభిప్రాయాలను ఈ కిందికి మెయిల్ చేయండి.

[email protected]

English summary
K Nishanth on Pawan Kalyan attitude
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X