వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోహిత్ ఆత్మహత్య: థాట్ పోలీసింగ్, సైడ్ లైన్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు) పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన పలు అంశాలను ముందుకు తెస్తోంది. దేశంలో మారుతున్న పరిస్థితులకు, వాతావరణానికి అద్దం పడుతోంది. పాలకవర్గాల్లో, పాలకవర్గాలను మోసే వర్గాల్లో గోవధ, యాగాల వంటి విషయాలపై భావజాలపరంగా ఎదురవుతున్న సవాళ్లను అది ముందుకు తెస్తోంది.

హిందూభావజాలం దేశవ్యాప్తంగా బలం పుంజుకుంటున్న నేపథ్యంలో రెండో అభిప్రాయానికి భవిష్యత్తులో ఏ మాత్రం చోటు ఉండదనే విషయాన్ని రోహిత్ ఆత్మహత్య ఉదంతం గట్టిగానే చెబుతోంది. దేశవ్యాప్తంగా థాట్ పోలీసింగ్ పకడ్బందీగా అమలవుతోంది. దానికితోడు, జరిగిన, జరుగుతున్న సంఘటనలను తప్పుదోవ పట్టించడానికి సమిష్టి వ్యూహాత్మక ఆచరణ కూడా పనిచేస్తోంది.

All Stories about rohit suicide

దళిత మేధావులు, విప్లవ మేధావులు భావజాలపరంగానే దేశంలో ఉరిశిక్షలను రద్దు చేయాలనే డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. అదే భావజాలం కారణంగా మెమెన్ విషయంలో రోహిత్ కామెంట్ చేశాడని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ మహిళా విద్యార్థిని ఓ టీవీ చానెల్ చర్చా కార్యక్రమంలో చెప్పారు. అంత మాత్రాన రోహిత్ దేశ ద్రోహి అవుతారా అనేది ప్రశ్నించుకోవాల్సిన విషయం.

K Nishanth on Rohith suicide incident

ఆ విషయాన్ని పక్కన పెట్టి జాతి వ్యతిరేకతగా, దేశద్రోహంగా ప్రచారం చేయడంలో థాట్ పోలీసింగ్ అనేది పక్కాగా అమలవుతూ వస్తోంది. అభిప్రాయాలు కలిగి ఉండడం నేర కాదని విప్లవ రచయితలపై పెట్టిన కుట్ర కేసులో గతంలో కోర్టు తేల్చి చెప్పింది. కానీ, అది చట్టపరిధిని, న్యాయపరిధిని దాటి సాంఘికాంశంగా ముందుకు తేవడంలో హిందూత్వ శక్తుల భావజాల ప్రచారం బలంగా పనిచేస్తోంది.

భారతదేశంలో చట్టాల కన్నా సాంఘికపరమైన కట్టుబాట్లు బలమైనవి. చట్టవ్యతిరేక చర్యలు అయినప్పటికీ కొన్ని సంప్రదాయాల పేరిట యధేచ్ఛగా జరిగిపోతుండడం చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో విద్యావ్యవస్థలో అసహనం విపరీతంగా పెరిగిపోయిన ఛాయలు కూడా కనిపిస్తున్నాయి.

విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఆచార్యులు యూనివర్శిటీల్లో పక్షపాత వైఖరితో, వివక్షతో వ్యవహరించడం చాలా మంది అనుభవంలో ఉన్నదే. దానివల్ల విద్యార్థులకు వారిపై గౌరవం లేకుండాపోయే వాతావరణం నెలకొంది. పైగా, వారికి వ్యతిరేకంగా మారవచ్చు కూడా.

కాగా, ఓ సంఘటన జరిగినప్పుడు దాన్ని పక్క దారి పట్టించడం అనేది వ్యూహాత్మకంగా ముందుకు వస్తోంది. రోహిత్ దళితుడు కాదనే వాదన అటువంటిదే. తండ్రి వడ్డెర కులానికి చెందినవాడనేది స్పష్టమైన విషయమే. కానీ తల్లి మాల కులానికి చెందింది. తల్లి కులం కూడా రిజర్వేషన్లకు వాడుకోవచ్చుననే నిబంధన ఉంది. దాన్ని పట్టించుకోకుండా రోహిత్ దళితుడు కాదనే ప్రచారం చేయడం విషయాన్ని పక్కదారి పట్టించడమే అవుతుంది.

మరో విషయం ఏమిటంటే, విశ్వవిద్యాలయాల్లోకి పెద్ద యెత్తున దళితులు, కింది కులాల విద్యార్థులు వస్తున్నారు. తీవ్రమైన సామాజిక వివక్షను ఎదుర్కున్న ఆ విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లోకి రాగానే పుట్టుకతో వచ్చిన తమ కులాన్ని చూసి అవమానించడంపై ఆలోచన చేస్తున్నారు. ఆ కారణంగా దళిత విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో సంఘటితం కావడం అనివార్యంగానే మారుతుంది. అప్పటి వరకు కులం గురించి, కుల వివక్షకు కారణం అర్థం కాని విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో చైతన్యవంతమవుతున్నారు.

దానికితోడు, విశ్వవిద్యాలయాల్లో అధికారాలను దక్కించుకుంటున్నవారు రాజకీయాలతో ప్రమేయం లేకుండా రావడం లేదు. దానివల్ల వారు పాలకపక్షానికి అనుకూలంగా వ్యవహరించడమనేది కాదనలేని నిజం. దానివల్ల ఘర్షణ అనివార్యంగానే మారుతుంది. ఘర్షణలు చెలరేగినప్పుడు విద్యార్థుల కన్నా అధికారులు, ఆచార్యులు సంయమనం పాటించాల్సి ఉంటుంది. అలా పాటించి వ్యవహరించినప్పుడు విద్యార్థులు వెనక్కి తగ్గి ఆలోచనలో పడే అవకాశం ఉంటుంది.

పైగా, దళిత వర్గాల నుంచి వచ్చినప్పటికీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వస్తున్న విద్యార్థులు జ్ఞానసముపార్జనకు విపరీతంగా చదువుతున్నారు. తమ సబ్జెక్టుకు దూరం జరిగి రాజకీయ, సామాజిక, తాత్విక అంశాలపై కూడా దృష్టిపెడుతున్నారు. తద్వారా తమపై అమలవుతున్న వివక్షను ఎదుర్కోవడానికి సంఘటితమవుతున్నారు. అది పాలకవర్గాలకు నచ్చడం లేదు.

విశ్వవిద్యాలయాల్లో క్రమంగా బోధనాప్రమాణాలు కూడా దెబ్బ తింటున్నాయి. పరిశోధక విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించే స్థాయిలో వారి జ్ఝానం ఉండడం లేదు. ఎప్పటికప్పుడు వస్తున్న నూతన ఆవిష్కరణలు అందుకుని విద్యార్థుల కన్నా ముందుండాల్సిన వారు వెనకబడిపోతున్నారు. ఏమైనా, విశ్వవిద్యాలయాలు విశ్వవిద్యాలయాలుగా మాత్రం లేవనేది సత్యం.

- కె నిశాంత్

English summary
K Nishanth on Rohith suicide incident
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X