వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన నిప్పు నీళ్ల వల్లే: తర్వాతా అదే వివాదం

By Pratap
|
Google Oneindia TeluguNews

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు మూడు విషయాలు ప్రధానంగా పనిచేశాయి. అవి నిధులు, నీళ్లు, ఉద్యోగాలు. నిధులు, ఉద్యోగాలను పక్కన పెడితే ప్రధానంగా నీళ్లే కీలకంగా మారాయి. గోదావరి, కృష్ణా నదుల నీటి వాడకం ప్రధాన వివాదంగా మారింది. ఈ రెండు నదుల నీళ్ల వాడకానికి తెలంగాణలో తగిన ప్రాజెక్టులను నిర్మించడం లేదనే కారణాన్ని తెలంగాణవాదులు తమ ఆందోళనలో ఎత్తి చూపుతూ వచ్చారు.

తెలంగాణకు కేటాయించిన నీటి వాడకానికి ఈ ప్రాంతంలో ఉపయోగించుకోవడానికి తలపెట్టిన నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడంలో, కొత్త ప్రాజెక్టులను నిర్మించడంలో ఆంధ్ర పాలకులు నిర్లక్ష్యం చేశారనేది సత్యం. ఆంధ్రపాలకులు, ఆంధ్ర పెత్తందార్లు కూడా రాష్ట్ర విభజన జరిగితే నీటి వివాదాలు తలెత్తుతాయని వాదిస్తూ వచ్చారు.

కృష్ణా నదిపై రాయలసీమకు నీరందించడానికి మిగులు జలాలపై ఆధారపడి ఎన్టీ రామారావు ప్రభుత్వం పలు ప్రాజెక్టులు చేపట్టారు. అయితే, అప్పట్లో నికర జలాలు కేటాయించాలని వైయస్ రాజశేఖర రెడ్డి, ఎంవి మైసురా రెడ్డి వంటి రాయలసీమ నేతలు ఆందోళనలు కూడా చేపట్టారు. కృష్ణానదిపై బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఇరు వైపులా ప్రాజెక్టులను తలపెట్టారు.

వాటిలో రాయలసీమకు నీరందించే ప్రాజెక్టులు దాదాపుగా పూర్తి కాగా, తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వం చాలా ప్రాజెక్టులను ఒక స్థాయికి తీసుకుని రాగా, వైయస్ రాజశేఖర రెడ్డి ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నారు. తెలంగాణకు నీరందించే ప్రాజెక్టులను పట్టించుకోలేదు.

దానికితోడు, దమ్ముగూడెం ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించి కృష్ణా డెల్టాకు ఆ నీరు అందుబాటులోకి తేవడానికి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రయత్నించారు. తద్వారా కృష్ణా జలాలను మొత్తాన్ని రాయలసీమకు తరలించుకుపోయేందుకు వ్యూహరచన చేశారు. కోస్తా ప్రాంతంలోని కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లను తరలిస్తే కృష్ణా నది జలాలను పూర్తి స్థాయిలో రాయలసీమకు వాడుకోవచ్చుననేది ఆయన ఆలోచన.

కాగా, రాజోలిబండ వంటి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకు అన్యాయం చేస్తూ బలప్రయోగం ద్వారా కూడా రాయలసీమకు నీళ్లు తరలించుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలోనే రాష్ట్ర విభజనకు కృష్ణానదీ జలాలు ప్రధాన కారణంగా మారాయి. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు చెప్పిన మాటలను గమనిస్తే అందులోని సత్యమేమిటో అర్థమవుతుంది.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశకు 811 టీఎంసీల నికర జలాల కేటాయింపులు ఉన్నాయని, అందులో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలని నాటి ఉమ్మడి ప్రభుత్వం చెప్పిందని హరీష్ రావు చెప్పారు. 299 టీఎంసీలతో పాటు 77 టీఎంసీల మిగులు జలాలను తెలంగాణకు కేటాయించారని చెప్పారు.

''కృష్ణా నదీ జలాల్లో ప్రతి రాష్ర్టానికీ ఎస్‌బ్లాక్‌ అలాట్‌మెంట్‌ (అంటే గంపగుత్త కేటాయింపులు) ఉంది. ఎస్‌బ్లాక్‌ అలాట్‌మెంట్‌ వాటర్‌ను ఆయా రాష్ర్టాలు తమకు అనుకూలమైన పద్ధతిలో వాడుకోవచ్చని బచావత ట్రైబ్యునల్‌ తన తీర్పులో స్పష్పంగా చెప్పింది. తర్వాత వచ్చిన బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ కూడా చెప్పింది'' హరీష్ రావు అన్నారు. దాని ప్రకారమే పాలమూరు, డిండి కడుతున్నామని అన్నారు.

అయితే, పాలమూరు, డిండి ప్రాజెక్టులను అక్రమంగా కడుతున్నారంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణపై కత్తులు నూరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ పరిస్థితిలో చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేయడానికి పూనుకున్నారు.

నదీ జలాల వాడకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఆ స్థితిలో తన వాటాను తాను వాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించడానికి నిర్ణయం తీసుకుని దానికి కార్యాచరణ రూపొందించిన స్థితిలో ఆంధ్ర పాలక వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి.

K nishanth on Telangana irrigation projects

నీటి ప్రాజెక్టులపై తెలంగాణలో ఆందోళనలు చెలరేగిన ప్రతిసారీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలకులు ఇక్కడ శంకుస్థాపనలు చేయడం, ప్రకటనలు చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు పునాది రాయి వేసిన దేవాదుల ప్రాజెక్టు, వైయస్ రాజశేఖర రెడ్డి పునాది రాయి వేసిన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులు అందుకు ముఖ్యమైన ఉదాహరణ.

నిజానికి, నీటిని పైకెత్తి పోయడం అనేది కాళేశ్వరం వద్ద తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టు. గోదావరి నదిలో కాళేశ్వరం వద్ద అన్ని కాలాల్లో నీళ్లు ఉంటాయి. ఎగువ ప్రాంతంలో ఉండవు. ఆదిలాబాద్ జిల్లాలోని బాసర వంటి ప్రాంతాల్లో ఎండా కాలంలో గోదావరి నది దాదాపుగా ఎండిపోతుంది. కానీ కాళేశ్వరం వద్ద తగిన జలాలుంటాయి. అందువల్ల కెసిఆర్ కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు.

గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు, దక్షిణ కోస్తాకు అందించే ఆంధ్ర పాలకుల ప్రయత్నాలకు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల గండి పడుతుంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజమండ్రి సభలో అప్పటి ఉండవల్లి అరుణ్ కుమార్ తెలంగాణ ఎగువన ఉంటుది కాబట్టి గోదావరి జలాలను ఎత్తిపోయాల్సి ఉంటుందని, నీరు పల్లమెరుగు కాబట్టి తమకు అందుబాటులో ఉంటాయి, వాటిని వాడుకుంటామని అన్నారు. దాన్ని బట్టి ఆంధ్ర పాలకవర్గాల అంతరంగమేమిటో అర్థం చేసుకోవచ్చు.

అందుకే కెసిఆర్ తెలంగాణకు గోదావరిలో జలాలు ఉండే ప్రాంతం నుంచి ఎత్తిపోయడానికే సిద్ధపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డిని దేవుడిలా పూజించే కాంగ్రెసు తెలంగాణ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తమ రాజనీతిని బయటపెట్టుకున్నారు.

అయితే, తెలంగాణ తన వాటాను తాను ఉపయోగించుకోవడానికి ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. దాని ప్రకారమే కెసిఆర్ కొన్ని ప్రాజెక్టుల డిజైన్లు మార్చారు. రాష్ట విభజన తర్వాత కూడా ఆంధ్ర పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవహరించినట్లుగా, ఉమ్మడి రాష్ట్రంలో చేసిన వాదనలనే ఇప్పుడూ చేస్తున్నారు. కానీ, ఆ ప్రాజెక్టులను నిలువరించడానికి తెలంగాణలో వారికి అధికారం లేకపోవడం తెలంగాణ ప్రజల వరం. కెసిఆర్ తలుచుకుంటే తప్ప ఆ ప్రాజెక్టులు ఆగేవి కావు.

- కె. నిశాంత్

English summary
K Nishanth Condemns Andhra Pradesh CM Nara Chandrababu Naidu and YSR Congress party president YS Jagan arguements on Telangana irrigation projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X