• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణ: రాజకీయ అనివార్యతే గానీ...

By Pratap
|

 K Nishanth: Political compulsion made to carve Telangana state
ఆధిపత్య వర్గాలు, పాలక వర్గాలకు సవాల్‌ ఎదురైప్పుడు విలువలు, సంప్రదాయాలు గుర్తుకు వస్తాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో సీమాంధ్ర రాజకీయ నాయకులకు అవి ఎక్కువగా గుర్తుకు వస్తుండడం ఆశ్చర్యకరమేమీ కాదు. గుర్తుకు రాకపోతేనే ఆశ్చర్యం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం విలువలు, సంప్రదాయాలు పాటించాలని నారా చంద్రబాబు నాయుడితో సహా తెలుగుదేశం సీమాంధ్ర నాయకులంతా అంటున్నారు. ఇక, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యకక్షుడు వైయస్‌ జగన్‌ గురించి చెప్పనే అక్కరలేదు. ఆయన ఏకంగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3నే తప్పు పడుతున్నారు. లగడపాటి రాజగోపాల్‌ వంటి కాంగ్రెస్‌ సీమాంధ్ర నాయకులు కూడా వాటి గురించి మాట్లాడుతున్నారు.

సీమాంధ్ర నాయకులు వాడుతున్న మరో మాట సమన్యాయం. తండ్రిలా కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని జగన్‌ అంటే, ఇద్దరు కొడుకులకు సమానంగా న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఆ తండ్రి న్యాయం గురించి జగన్‌ వదిలేసి సమైక్య రాష్ట్రం మాత్రమే కావాలని అంటున్నారు. ఎవరికీ తెలియదని సమైక్యమంటే, అందులో ఆంధ్ర ఉంటుంది, రాయలసీమ ఉంటుంది, తెలంగాణ ఉంటుంది అని వివరించి స్పష్టం చేస్తున్నారు.

ఇంకోటి కూడా ఆంధ్రప్రదేశ్‌ పార్టీ శాఖలకు అధినేతలుగా వ్యవహరిస్తున్న వారు పదే పదే అంటూ వచ్చారు. 60 రోజులుగా, వంద రోజులుగా సీమాంధ్ర ప్రజలు రోడ్డు మీదికి వచ్చి ఆందోళనలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం గానీ కాంగ్రెస్‌ అధిష్టానం గానీ పట్టించుకోవడం లేదని అంటూ వచ్చారు.

సమస్యల విషయంలో జగన్‌, కాంగ్రెస్‌ సీమాంధ్ర నాయకులు జలవివాదాల గురించి, ఉద్యోగాల గురించి, హైదరాబాద్‌ గురించి మాట్లాడుతుంటే, వాటి గురించే కాస్తా ముందుకు అడుగేసి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర కన్నా తెలంగాణకు ఎక్కువ నష్టం జరుగుతుందని అంటున్నారు.

రాష్ట్ర విభజన విషయంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని సీమాంధ్ర నాయకులు ఇప్పటికీ అంటున్నారు. రాష్ట్ర శాసనసభతో ప్రమేయం లేకుండా విభజించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిసి కూడా వారు ఆ మాట మాట్లాడుతున్నారు.

జగన్‌, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఏకంగా విభజనను వ్యతిరేకిస్తున్నట్లు బాహాటంగానే చెబుతున్నారు. చంద్రబాబు మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము అనుకూలమని చెబుతూనే సమన్యాయం పేరు మీద వారిద్దరి మార్గాన్నే అనుసరిస్తున్నారు. తమ పార్టీని దెబ్బ తీయడానికి, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని రాజకీయానుభవం అంతగా లేని జగన్‌ మాత్రమే కాదు, రాజకీయాల్లో కాకలు తీరిన చంద్రబాబు కూడా అనడం ఆశ్చర్యమే. రాజకీయ పార్టీలు తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, పోయిన అధికారాన్ని తిరిగి పొందడానికి అవసరమైన వ్యూహాలను, విధానాలను మాత్రమే అనుసరిస్తాయని ఆ నాయకులకు చెప్పాల్సిన అవసరం లేదు. అధికారం కోసం రాజకీయ పార్టీలు ఎంత దూరమైనా పోతాయి, ప్రజా ప్రయోజనం వాటికి పట్టదని వేరే చెప్పాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజిస్తే తమకు ఎక్కువ సీట్లు వస్తాయని కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌ సింగ్‌ స్వయంగా చెప్పారు.

విలువలు, సంప్రదాయాల గురించి మాట్లాడుకుందాం - పురుషులు మహిళను, ఆధిపత్య కులాలు పీడిత కులాలను, మాలలు మాదిగలను, ఆధిపత్య ప్రాంతం అన్యాయానికి గురవుతున్న ప్రాంతాన్ని, పాలక వర్గాలు పాలితులను అదుపులో పెట్టడానికి వాటి గురించి ఎక్కువగా మాట్లాడడం పరిపాటి. ఆధిపత్య సీమాంధ్ర ప్రాంత పాలకవర్గాలు తెలంగాణ ప్రాంతాన్ని తమ గుప్పిట్లోనే ఉంచుకోవడానికి వాటి గురించి మాట్లాడుతున్నాయి. నిర్ణయాధికారం తమ చేతుల్లో లేకపోవడం వల్ల ఏదో విధంగా నిర్ణయాన్ని మార్చాలనే ప్రయత్నంలో భాగంగా, వాటిని చూపించి జాతీయ స్థాయిలో తమకు మద్దతు కూడగట్టుకునే కుట్రలో భాగంగా సీమాంధ్ర పాలక వర్గాలు వాటి గురించి మాట్లాడుతున్నాయి.

నిజానికి, విలువల పట్ల, సంప్రదాయాల పట్లనే కాదు, కనీసం రాజ్యాంగ పట్లనైనా నిబద్ధత ఉండి ఉంటే రాష్ట్ర విభజన సమస్యనే వచ్చి ఉండేది కాదు. పెద్ద మనుషుల ఒప్పందం నుంచి ఆరు సూత్రాల పథకం దాకా వాటిని పాటించి ఉంటే తెలంగాణకు కూడా న్యాయం జరిగి ఉండేది. ఈ విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవడానికి కూడా సీమాంధ్ర నాయకులు సిద్ధంగా లేరు. గోదావరి నది పల్లంలో ఉంది, తెలంగాణ ఎత్తులో ఉంది కాబట్టి తెలంగాణకు జలాలు ఇవ్వడం సాధ్యం కాదని వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి గతంలో అంటే, ఇటీవలి కాలంలో రాజమండ్రి కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. అంటే, తెలంగాణకు నీరు ఇవ్వడం కుదరదు, ఇవ్వబోమని చెప్పారు తప్ప తెలంగాణకు ప్రత్యామ్నాయాలు చూపిస్తామనే మాట చెప్పలేదు.

రాజ్యాంగబద్దంగా తెలంగాణకు సంక్రమించిన హామీలను అమలు చేయలేదు. రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను, ఒప్పందాలను అమలు చేయలేదు. ఉద్యోగాల విషయంలోనే కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ఉత్తర్వులను, ఎన్‌టి రామారావు ప్రభుత్వం జారీ చేసిన 610 జీవోను, తదుపరి కాలంలో గిర్‌గ్లానీ కమిషన్‌ వంటివి చేసిన సిఫార్సులను అమలు చేయలేదు. ఈ వివరాల్లోకి వెళ్తే తెలంగాణకు శోకం తప్ప ఏమీ మిగలదు. తెలంగాణకు సంబంధించిన ఉద్యోగాల విషయాన్ని పట్టించుకోని చంద్రబాబు నాయుడు, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగితే ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. ఎపిఎన్జీవోల సంఘం అధ్యకక్షుడు తెలంగాణ ఎన్జీవోలకు ప్రాతినిధ్యం వహించడం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. తమకు అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ ఉద్యోగులు గొంతెత్తినప్పుడు అశోక్‌ బాబు మాట్లాడి ఉంటే, అన్యాయాన్ని అరికట్టడానికి ప్రయత్నించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనే ఆలోచన చేసిన దాఖలాలు లేవు. అంటే, స్పష్టంగా అశోక్‌ బాబు తెలంగాణకు దక్కిన అవకాశాలను కొల్లగొట్టడానికి, కొల్లగొట్టిన ఉద్యోగాలను కాపాడుకోవడానికి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారనేది అర్థమవుతూనే ఉన్నది. కిరణ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టంగానే ఉద్యోగాల విషయంలో సీమాంధ్ర వాదనను వినిపిస్తున్నారు. చంద్రబాబుకు గానీ, జగన్‌కు గానీ సమన్యాయం ఆ విషయంలో గుర్తుకు రాలేదు. ఉద్యోగాల విషయంలో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగిందో, రాజ్యాంగ ఉల్లంఘనలు ఏ విధంగా జరిగాయో, దొడ్డిదారులు ఎలా సృష్టించుకున్నారో సీమాంధ్ర నాయకత్వంలోని ప్రభుత్వాలు వేసిన కమిటీలే తేల్చాయి. అదంతా చెప్తే చర్వితచరణం కావడమే కాకుండా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగానూ ఉంటుంది. ఆ విషయం ప్రస్తావించడానికి ప్రధాన కారణం - తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఏలికలు సరిదిద్దడానికి ప్రయత్నించలేదు. దానివల్ల తెలంగాణలో తలెత్తిన ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యోగులు పాలు పంచుకుని అన్యాయం నుంచి బయట పడడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసుకుంటుంటే అడ్దుపడుతున్నారు. తాము చేసే అన్యాయానికి తలొగ్గి తెలంగాణ ఉద్యోగులు ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు.

అసలు, ఆంధ్రప్రదేశ్‌ అవతరణతోనే ఉద్యోగాలు కొల్లగొట్టే పని ముమ్మరంగా ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగాలకు తెలుగులో కనీసం ఐదో స్టాండర్డ్‌ ఉండాలనే నిబంధనను తెచ్చి, నిజాం ప్రభుత్వంలో తెలుగు చదవడానికి అవకాశం లేకపోవడం వల్ల ఉర్దూ మీడియంలో చదివినవారినందరినీ ఉద్యోగాల నుంచి తొలగించారు. టీచర్‌ ఉద్యోగాలను కూడా తెలంగాణలో ఆ పేరు మీద కోస్తాంధ్రులు కొల్లగొట్టారు. ఈ విషయంపై అప్పుడెప్పుడో యశోదారెడ్డి ఓ కథ రాశారు. తన చిన్నప్పుడు తమ టీచర్‌ ఉద్యోగాన్ని కోల్పోయిన వైనం ఆ కథ రాశారు.

సీమాంధ్ర ఉద్యమాల గురించి సీమాంధ్ర నాయకులు చెబుతున్న మాటలను గమనిస్తే వారెంతగా పక్షపాత వైఖరి తీసుకున్నారో అర్థమవుతుంది. వంద రోజులుగా ఉద్యమం జరుగుతున్నా పట్టించుకోవడంలేదని మాట్లాడారు. రాజకీయ పార్టీలకన్నింటికీ అధినాయకులు సీమాంధ్రులే కావడం వల్ల పార్టీ వైఖరిగా అది ముందుకు వస్తుంది. ద్వితీయ లేదా తృతీయ శ్రేణి స్థాయిల్లో ఉన్న తెలంగాణ నాయకులు మాట్లాడడానికి వీలుండదు. సీమాంధ్ర నాయకుల లెక్కల ప్రకారమే తెలంగాణ ఉద్యమం 12 ఏళ్లు నడిచింది. తెలంగాణ ఉద్యమం సాగుతున్న కాలంలో వారు మాట్లాడిన మాటలేమిటో ఓసారి గమనిస్తే వారి ఒంటి కన్ను దృష్టి బయటపడుతుంది. ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నదని, రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతున్నదని, కాంగ్రెస్‌ సమస్యను పరిష్కరించడం లేదని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం పట్ల సానుభూతిగా మాట్లాడిన దాఖలాలు లేవు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏ విధమైన అన్యాయం జరిగిందో తెలుసుకోవడానికి చంద్రబాబు, జగన్‌, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, మిగతా సీమాంధ్ర నాయకులు ప్రయత్నించలేదు. అన్యాయం జరిగిన విషయం నిజమే అయితే సరిదిద్దుతామనే ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. 610జీవోను అమలు చేయాలన్నప్పుడు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ మాట్లాడిన మాటలు పుండు మీద కారం చల్లినట్లు లేవా? దాన్ని అమలు చేస్తే తాము స్థానాలు కదలడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఉద్యోగులు చెప్పినా కూడా ఎందుకు అమలు చేయలేదు? అంటే, వారి ఉద్దేశ్యాలేమిటో అర్థం కావడం లేదా? కలిసి ఉండాలని చెప్పేవారు అనుసరించే పద్ధతి ఇదేనా?

విభజన జరిగితే జలవివాదాలు వస్తాయని మాట్లాడుతూ వచ్చిన సీమాంధ్ర నాయకులు ఇప్పుడు బహిరంగంగా తాము తెలంగాణకు చేసిన అన్యాయాన్ని ఆంగీకరిస్తుండడమే కాకుండా జలాలను కొల్లగొట్టడానికి తెలంగాణ విడిపోవద్దని అంటున్నారు. ముఖ్యమంత్రి కిరన్‌ కుమార్‌ రెడ్డి అయితే జంకూ బిడియమూ లేకుండా జలాలను తెలంగాణకు ఇవ్వకుండా తరలించుకుపోవడానికే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెబుతున్నారు. దానికి 'సర్దుబాటు' అనే ముద్దు పేరు పెట్టారు. సర్దుబాటు పేరు మీద తెలంగాణకు దక్కాల్సిన నికర జలాలను కూడా ఇవ్వకుండా, మిగులు జలాల మీద ఆధారపడి రాయలసీమలో అక్రమంగా కట్టిన ప్రాజెక్టులకు నీళ్లు తరలించడానికే రాష్ట్రాన్ని విభజించకూడదని అంటున్నారు. జగన్‌ పాడిందే పాట అన్నట్లుగా కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు మంచినీళ్లు కూడా రావని 'ఆందోళన' చెందుతున్నారు. గుడ్డిలో మెల్లలా చంద్రబాబు నాయుడు ఈ మాట అనడం లేదు.

రాజోలిండ డైవర్స్‌ స్కీమ్‌ ద్వారా మహబూబ్‌నగర్‌కు నీళ్లు అవసరం లేదు, మాకు కావాలనే పద్ధతిలో పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి నాయకత్వంలో కర్నూలు రాజకీయ నాయకులు రైతుల పేరిట దౌర్జన్యంగా తూములు ఎత్తేయడాన్ని 'న్యాయంగా', 'హక్కుగా' దక్కించుకున్నారు. అదేమి న్యాయమంటే ముఖ్యమంత్రులుగా ఉన్నవారు మాట్లాడరు. నీటి పారుదల శాఖ తెలంగాణ మంత్రి చేతుల్లో ఉన్నా దౌర్జన్యం, అన్యాయం జరిగిపోతూనే ఉంటుంది. తెలంగాణ రాజకీయ నాయకులకు పదవులు అలంకారప్రాయంగా మాత్రమే మారిన వైనం గత 60 ఏళ్ల చరిత్ర నిరూపిస్తుంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు నిజం హయాంలోనే రూపకల్పన జరిగింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత కోస్తాకు ఎక్కువ లాభం జరగడానికి వీలుగా ప్రాజెక్టును 20 కిలోమీటర్లు ముందుకు జరిపారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ఇరు ప్రాంతాలు కలిసి ఉండడం వల్లనే సాధ్యమైందని కిరణ్‌ కుమార్‌ రెడ్డి వాదిస్తారు. మొదటి ప్రణాళిక ప్రకారం దాని నిర్మాణం జరగకపోవడం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందనే మాటను ఆయన వినడానికి కూడా సిద్ధంగా ఉండరు. కృష్ణానది మీద కుడిఎడమల తలపెట్టిన ప్రాజెక్టుల గురించి చెప్పదలుచుకుంటే అది తెలంగాణకు సంబంధించి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంందన్నట్లుగానే ఉంటుంది. కేంద్ర జలవనరుల సంఘం (సిడబ్ల్యుసి) సభ్యుడిగా పనిచేసిన తెలంగాణ వంటి నిపుణులు నెత్తినోరు కొట్టుకుని చెప్పినా వారికి పట్టవు.

ఉద్యమాన్ని చల్లార్చడానికి తెలంగాణలో తలపెట్టిన ప్రాజెక్టులను పట్టించుకోరు. వాటి నిర్మాణం జరగదు. కానీ పోలవరం, పులిచింతల వంటి ప్రాజెక్టుల విషయంలో మాత్రం ప్రభుత్వం పరుగులు పెడుతుంది. నిజాం హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు మాత్రమే ఇప్పటికీ తెలంగాణకు ఆదరువుగా ఉన్నాయి. వాటిని కూడా పట్టించుకోకండా వాటంతటవి నిర్వీర్యమైపోయి ఆయకట్టు తగ్గే పరిస్థితిని కల్పించారు. జలవివాదాలు వస్తాయని, సీమాంధ్రకు నీళ్లు రావని వాదిస్తున్న నేతలు ఒక్కసారైనా తెలంగాణలో ఒక నీటి ప్రాజెక్టును నిర్మించి నీళ్లు ఇవ్వాలనే విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించారా? శంకుస్థాపనలు చేయడం తప్ప వారు చేసేందేమిటి?

రాష్ట్రావతరణ సందర్భంగా తెలంగాణ ప్రాజెక్టుల గురించి ఇచ్చిన హామీలు, చేసన వాగ్దానాలు ఏ మేరకు అమలయ్యాయనే విషయంపై తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలోనైనా పునరాలోచన చేశారా? లేదు కాబట్టే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. అలా ఆంగీకరించకపోవడం, కనీసం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని గుర్తించకపోవడం ఏ తండ్రి న్యాయం? తన మాట మాత్రమే చెలామణి కావాలని, తాను చెప్పిందే న్యాయమని బుకాయించే ఆధిపత్య ధోరణి కాదా? ఇటువంటి తండ్రి మాటను ఏ కొడుకు మాత్రం పాటిస్తాడు? ఈ విషయం చంద్రబాబు నాయుడికి తెలియదా? జగన్‌ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం లేదా కాంగ్రెస్‌ అధిష్టానం ఓ కొడుకుకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి, దాన్ని సరిచేయడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని అనుకోవడం సరైంది కాదా?

విద్యుత్తు గురించి కిరణ్‌ కుమార్‌ రెడ్డి చాలా చెబుతున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్తు కొరత వస్తుందనే విషయం కిరణ్‌ కుమార్‌ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు. అది తెలంగాణవాళ్లకు తెలుసు. తెలంగాణకు విద్యుత్తు విషయంలో ఎదురయ్యే కష్టాలేమిటో, వాటిని ఎలా ఎదుర్కోవచ్చో తెలంగాణ విద్యుత్‌ జెఎసి నాయకుడు రఘు మాత్రమే కాదు, సీమాంధ్ర నాయకులకు కంట్లో నలుసుగా, కంటగింపుగా తయారైన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యకక్షుడు కె. చంథ్రేఖర రావు కూడా చెప్పారు. అవి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పట్టించుకోడు. ఎందుకంటే, ఆయన రాష్ట్రానికి అంతటికీ ముఖ్యమంత్రి కాబట్టి తాను చెప్పిందే నిజమని నమ్మించడానికి చూస్తారు. ఆధిపత్య ధోరణి కన్నా ఈ విషయంలో తెలంగాణ ప్రజలను గందరగోళ పరచాలనే కుయుక్తి ఉంది. తెలంగాణ విద్యుదుత్పత్తి విషయంలో కొరతను ఎదుర్కోవడానికి కారణం కూడా సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయమే. తెలంగాణ ఏర్పాటు చేయాల్సిన థర్మల్‌ విద్యుత్కేంద్రాన్ని విజయవాడకు తరలించుకుపోయింది వారే కాబట్టి. తెలంగాణలో తలపెట్టిన గ్యాస్‌ ఆధారిత ప్రాజెక్టుకు పైపులైన్లు వేయడానికి దూరం అడ్డం వచ్చినట్లుగా లగడపాటి గ్యాస్‌ ఆధారిత ప్రాజెక్టులకు అడ్డం రాదు కాబట్టి. లగడపాటి విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులు ఇక్కడి వనరులతో విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఆ విద్యుత్తు తెలంగాణకు సరే, ఆంధ్రకు కూడా ఉపయోగపడదు, ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవడానికి పనికి వస్తుంది.

విద్యుత్తు కష్టాలనే కాదు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి కష్టాలేవో వాళ్లు పడుతారని వదిలేయవచ్చు కదా. కిరణ్‌ కుమార్‌ రెడ్డి వంటి సీమాంధ్ర నాయకులు దయతలిచి అంత బలవంతంగా తెలంగాణను తమ ఏలుబడిలో ఉంచుకోవాల్సిన అవసరం ఏమిటి? పంద్రబాబు తెలివైనవారు కాబట్టి నదీ జలాల విషయంలో, విద్యుత్తు విషయంలో తెలంగాణకు కష్టాలు వస్తాయని మాట్లాడడం లేదు.

ఇక నక్సలైట్‌ సమస్య విషయానికి వద్దాం - రాష్ట్ర విభజన జరిగితే నక్సలైట్లు విజృంభిస్తారని కిరణ్‌ కుమార్‌ రెడ్డి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బెదిరింపు తెలంగాణవాళ్లకు కాదు, కేంద్ర ప్రభుత్వానికి గురి పెట్టి చేసిన బెదరింపు. రాష్ట్ర డిజిపిగా పనిచేసిన ఆంజనేయరెడ్డి తనకే అంతా తెలుసున్నట్టుగా మాట్లాడారు. ఇదే రాష్ట్రానికి డిజిపిగా పనిచేసిన పేర్వారం రాములు మాటలను పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సిబిఐకి నేతృత్వం వహించిన విజయరామారావు అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా?

నక్సలైట్‌ ఉద్యమానికి సంబంధించిన సామాజిక కోణాన్ని విశ్లేషించడంలో ఇప్పటి వరకు విశ్లేషించిన దాఖలు కనిపించడం లేదు. సరైన సామాజిక చారిత్రక పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే నక్సలైట్‌ ఉద్యమం పెరిగే అవకాశమే లేదు. తెలంగాణలో అది నిర్వర్తించాల్సిన పాత్ర ప్రస్తుత ఆచరణ రూపంలో ముగిసినట్లే. మావోయిస్టు ఉద్యమ నాయకుల్లో ఎక్కువ మంది తెలంగాణకు చెందినవారేనని కిరణ్‌ కుమార్‌ రెడ్డి అంటున్నారు. అంత మాత్రాన తెలంగాణలో తిరిగి నక్సలైట్‌ ఉద్యమం పెరుగుతుందా?

తెలంగాణలోని దక్షిణ తెలంగాణలో అణచివేత, వెట్టిచాకిరి అంతం కావడానికి తెలంగాణ సాయుధ పోరాటం పనికి వస్తే, హైదరాబాద్‌ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొనసాగింది. నక్సలైట్‌ ఉద్యమంతో అది అంతమైంది. సామాజికంగా నక్సలైట్‌ ఉద్యమం తెలంగాణలో ప్రజలు చైతన్యం పొందినమాట నిజమేగానీ, సాయుధంగా రాజ్యాధికారం చేజిక్కించుకోవాలనే నక్సలైట్ల పక్కన చేరే పరిస్థితులు లేవు. ఒక రకంగా నక్సలైట్లు తెచ్చిన చైతన్యం ఆ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కాకుండా, తమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్న సీమాంధ్ర పాలకులపై ప్రజాస్వామిక ఉద్యమం చేయడానికి పనికి వచ్చింది. చైతన్యం పొందిన దళిత, బహుజన యువకులు ప్రజాస్వామ్య చట్రంలో అన్యాయాన్ని ఎదిరించడానికి, హక్కులను సాధించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకవేళ తెలంగాణ ఇవ్వకపోతే, వారు నక్సలైట్‌ ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి పూనుకునే పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. 1969లో తెలంగాణ రాష్ట్రానికి ఆంగీకరించి ఉంటే, ఓ తరం చదువుకున్న తెలంగాణ యువత ఈ రోజు రాష్ట్ర పరిస్థితిని నిర్దేశించి ఉండేది. చదువుకున్న మొదటి తరం తెలంగాణ యువత నక్సలైట్‌ ఉద్యమంలోకి వెళ్లడం వల్ల తెలంగాణలో ప్రజాస్వామిక చట్రంలో సాధించుకోవాల్సిన న్యాయం, హక్కుల సాధనలో జాప్యం జరిగింది. పైగా, ఆ ఉద్యమం తెలంగాణ యువతను నక్సలైట్ల పేర అణచివేసి, అవకాశాలను దక్కించుకునే పరిణామాన్ని పాలకవర్గాలు నిలిపేశాయి. సిద్ధాంతాన్ని కాలమానాలకు, భౌగోళిక పరిస్థితులకు, సామాజిక నిర్మాణానికి అనుగుణంగా మార్చుకుని, ఆచరణను రూపొందించుకోకపోవడం వల్ల దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాలు వెనకబడిపోయాయి. నక్సలైట్‌ ఉద్యమాలు పాలకవర్గాల్లోని వైరుధ్యాలను వాడుకుని విస్తరించాలని చూసినా, ప్రభుత్వాల మార్పిడికి పనికి వచ్చాయే గానీ తమ విస్తరణకు ఉపయోగపడలేదు. ఒకప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పరిణామాలను చూసినా, ఇప్పటి పశ్చిమ బెంగాల్‌ పరిస్థితి చూసినా ఇదే అర్థమవుతుంది. విస్తరణ ఆంటే, గతంలో ఉద్యమాలు చేసిన ప్రాంతాల్లో నిలదొక్కుకుని ఇతర ప్రాంతాలకు పాకడం విస్తరణ అవుతుంది. గతంలోని ఉద్యమ ప్రాంతాలను వదిలేసి, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం కాదు. ఇప్పుడు నక్సలైట్‌ కార్యకలాపాలు ఎక్కువగా ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లోని ఖమ్మం, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రమే కనిపిస్తాయి. రాష్ట్రంలో నక్సలైట్‌ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడానికి ప్రభుత్వాల ఘనత కన్నా నక్సలైట్‌ ఆచరణలోని లోపమే కారణం. ఈ విషయంపై ఇంకా లోతుగా విశ్లేషణ జరగాల్సే ఉంది. కమ్యూనిస్టు సిద్ధాంతం ఆచరణలో ఓ వైపు పిడచకట్టుకుపోతే, మరో వైపు పాలకవర్గం లక్షణాన్ని సంతరించుకుంది. అయితే, నక్సలైట్ల పట్ల తెలంగాణలో సానుభూతి ఉన్న మాట వాస్తవమే. దానికి కారణం కూడా పాలకవర్గాలే. సానుభూతి ఉన్నంత మాత్రాన వారి విస్తరణకు ఉపయోగపడుతారని, అందుకు సహకరిస్తారని అనుకోవడం పొరపాటే అవుతుంది. ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకుంటే తప్ప పరిస్థితి అర్థం కాదు. దాన్ని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టే, దాన్ని వాడుకోవాలని చూశారు కాబట్టే అన్ని రంగాల్లో తెలంగాణవాళ్ల అవకాశాలను దెబ్బ తీశారు.

తెలంగాణ ఏర్పడితే, మతవిద్వేషాలు పెరుగుతాయని చెప్పడంలోని డొల్లతనాన్ని కూడా బయటపెట్టాల్సిందే. బిజెపి పెరిగి మతఘర్షణలు పెరుగుతాయని చూపించడానికి రెండు, మూడు ప్రాంతాల్లో అటువంటివాటిని సృష్టించారు. కానీ, తెలంగాణలో మతాలు సహజీవనం చేసే వాతావరణమే మొదటి నుంచీ ఉంది. తెలుగుదేశం పార్టీ అవతరణకు ముందు హైదరాబాద్‌ పరిస్థితులు తెలిసినవారికి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. హైదరాబాద్‌లో మతఘర్షణలు పాలకపార్టీలోని వైరుధ్యాల వల్ల చెలరేగినవే. బిజెపి గానీ మజ్లీస్‌ గానీ మతఘర్షణల వల్ల లాభపడాలని ప్రయత్నించిన సంఘటనలు తక్కువే. రెచ్చగొట్టే ధోరణులు ఇరు వైపులా అప్పుడప్పుడు చోటు చేసుకుని వుండవచ్చు. స్వతహాగా తెలంగాణవాళ్లు లౌకికవాదులు. సహజీవనాన్ని కోరుకునేవారు. అలాంటివాళ్లు కాకపోతే సీమాంధ్రులు మారుమూల తెలంగాణ పల్లెల్లో కూడా ప్రశాంతంగా ఇప్పటికీ జీవిస్తూ ఉండడం సాధ్యమై ఉండేది కాదు. అదే నిజమైతే, ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లో, ఇతర తెలంగాణ జిల్లాల్లో బిజెపి మిగతా పార్టీలకన్నా బలంగా ఉండాల్సింది. అలా లేదంటే, పూర్తి స్థాయిలో బిజెపిని గానీ మజ్లీస్‌ను గానీ తెలంగాణ ప్రజలు స్వాగతించాలి. కానీ అలా జరగలేదు.

హైదరాబాద్‌ అభివృద్ధి గురించి సీమాంధ్ర నాయకులు మాట్లాడుతున్నారు. పెట్టుబడిదారులే రాజకీయ నాయకులు కావడం వల్ల ఇది సమస్యగా కనిపిస్తున్నది. పెట్టుబడుల విస్తరణకు, పెట్టుబడుల మీద లాభాల కోసం ప్రభుత్వం నుంచి పొందాల్సిన రాయితీలను, అనుమతులను, ప్రయోజనాలను సాధించుకోవడానికి పారిశ్రామికవేత్తలు గతంలో ప్రభుత్వంలోని రాజకీయ నాయకులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు పెట్టుబడిదారులే చట్టసభల్లోకి అడుగుపెట్టి నేరుగా తమ పెట్టుబడుల విస్తరణకు, లాభాల ఆర్జనకు కావాల్సినవాటిని సాధించుకుంటున్నారు. రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ ప్రక్రియను తెలుగుదేశం పార్టీ పారిశ్రామికవేత్తలను రాజ్యసభకు పంపించడం ద్వారా ప్రారంభించింది. రాజ్యసభ సరిపోదని అనుకున్నవాళ్లు లోకసభకు పోటీ చేసి గెలవడానికి సిద్ధపడుతున్నారు. ఈ పరిణామం తెలంగాణలో చాలా తక్కువ. తెలంగాణలో పారిశ్రామికవేత్తలే తక్కువ. అందులోనూ చట్టసభలకు వెళ్లడానికి సీమాంధ్ర నాయకత్వాల్లోని పార్టీలను ప్రభావితం చేయడానికి తగిన శక్తిని సమకూర్చుకున్నవారు కాదు.

ఈ పరిణామానికి కారణం లేకపోలేదు. నిజాం ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్‌ పారిశ్రామిక నగరంగా, ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఒక్కటిగా గుర్తింపు పొందింది. పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో మాత్రమే ఏర్పడడం వల్ల ప్రైవేట్‌ రంగం విస్తరించలేదు. దాంతో పారిశ్రామికవేత్తలు ఏర్పడలేదు. దానికితోడు, ఫ్యూడల్‌ లక్షణాలను రాచరిక పాలన వల్ల వదిలించుకోలేదు. బ్రిటిష్‌ పాలనలో ఉన్న కోస్తాంధ్ర సమాజం పెట్టుబడిదారీ లక్షణాలను అలవరుచుకుంది. వారి పెట్టుబడులు మద్రాసులోని సినీరంగానికి విస్తరించాయి. ముద్రణారంగానికి కూడా వెళ్లాయి. క్రమంగా ఇతర రంగాలకు కూడా విస్తరించాయి. హైదరాబాద్‌లో సీమాంధ్ర పెట్టుబడులు పెరిగాయి. ప్రభుత్వ రంగంలోని వివిధ సంస్థలను క్రమంగా నిర్వీర్యం చేసి వారికి కట్టబెట్టే ప్రక్రియ చంద్రబాబు పాలనలో వేగం అందుకుంది. దానికితోడు, అత్యంత విలువైన భూమి విస్తారంగా లభించింది. ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికే కాకుండా రియల్‌ ఎస్టేట్‌ రంగాన్నే భారీ వ్యాపారంగా మార్చేందుకు భూములు వీలు కల్పించాయి. భూముల జమాబందీల్లో ఉన్న లోపాలు కూడా పనికి వచ్చాయి. భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటివారికి సహకరిస్తూ వచ్చాయి. భూములు చేతులు మారిన వైనంపై విచారణలు జరగాల్సే ఉంది. పైగా, అభివృద్ధి చెందిన కోస్తా ప్రాంతం చలనశీలత కూడా అందుకు ఉపయోగపడింది. చండ్ర రాజేశ్వరరావుతో కలిసి కోస్తాలో భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసిన కుటుంబరావు అనే వ్యక్తి గుట్టలు, రాళ్లు ఉన్న నేటి బంజారాహిల్స్‌, జూబ్లిహిల్ప్‌ ప్రాంతాల భూములను కొన్నారు, కొనిపించారు. ఆ భూములు పట్టుకుంటే ఇప్పుడు బంగారంగా మారాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, తమ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని భావిస్తున్న పెట్టుబడిదారులైన రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్‌లోని సౌకర్యాలను, ఆధునికతను ఆసరా చేసుకుని తమ కార్యకలాపాలను విస్తరింపజేసుకున్నవారే వాళ్లంతా. క్రమంగా హైదరాబాద్‌ స్థానికులను మూలలకు నెట్టేసి, రాష్ట్రమంతటి నుంచి (తెలంగాణ సహా) వచ్చినవారితో నిండిపోయింది. స్థానికులు ఉన్న బస్తీలు, ప్రాంతాలు, పాతబస్తీ ఇప్పటికీ తగిన విధంగా సౌకర్యాలను కల్పించుకోలేకపోయింది. హైటెక్‌ సిటీ, బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌ వంటి సంపన్న ప్రాంతాలు ఆధిపత్యం వహిస్తున్నాయి.

నిజానికి, హైదరాబాద్‌ అభివృద్ధి అంటే, స్థానికులను భాగస్వాములను చేసుకుని జరగాల్సి ఉండింది. దానికితోడు, చారిత్రక ప్రధానమైన హైదరాబాద్‌ను అత్యంత వైభవోపేతమైన పర్యాటక నగరంగా తీర్చిదిద్దాల్సింది. ఇక్కడి బాగ్‌లను, చెరువులను పరిరక్షించి అత్యంత సుందర నగరంగా తీర్చి దిద్దాల్సి ఉండింది. పైగా, నివాసానికి పనికి రాని నగరంగా మార్చేశారు. వాన పడితే రోడ్డు నదులవుతాయి. డ్రైనేజి పొంగిపొర్లుతుంది. నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ మాత్రమే ఉంది. నిజాం నిర్మించిన పాతబస్తీలో కన్నా వర్షాలు పడితే తర్వాత రూపుదిద్దుకున్న హైదరాబాదే దుర్భరంగా మారుతుంది. ఇది అభివృద్ధి దీనిపై తమకు హక్కు ఉందని సీమాంధ్ర నాయకులు అంటున్నారు.

ఇకపోతే, ప్రజల మీద అంత ప్రేమ ఉన్నవారైతే, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికే పరిశ్రమలు పెట్టి వుంటే ఇతర ప్రాంతాలపై కూడా వారు అంతే మక్కువ చూపించాల్సి ఉండింది. విజయవాడను, కర్నూలును, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆ నగరాల్లో పరిశ్రమలు పెట్టి, విస్తరించకుండా ఆ ప్రాంత ప్రజలను వీరు మోసం చేయలేదా? ఆ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఉంటూ అక్కడి ప్రాంతాల ప్రజల ఓట్లతో గెలిచి అక్కడ ప్రాంతాల ప్రజలకు వారు చేకూర్చిన ప్రయోజనాలు ఏమిటి?

ఇక ఉద్యోగాల విషయానికి వస్తే - ఇప్పుడు ప్రైవేట్‌ రంగంలోనే ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ స్థితిలో సీమాంధ్ర యువతను ఉద్యోగాల పేరు చెప్పి రాజకీయ నాయకులు భయపెడుతున్నారు. ప్రైవేట్‌ ఉద్యోగాలు చేయడానికి ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చు, ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. బెంగుళూర్‌, చెన్నై, ఢిల్లీల్లో తెలుగువారు పనిచేయడం లేదా? తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు చేయడానికి వచ్చే ఆటంకాలేమిటో అర్థం కావు. ప్రభుత్వోద్యోగాలకు సంబంధించినంత వరకు తెలిసో తెలియకో ఏ నిజం చెప్పారు. రెండు రాష్ట్రాలు ఏర్పడితే, ఒక్క ఉద్యోగి చేయాల్సిన పని ఇద్దరు చేయాల్సి వస్తుందని అంటున్నారు. అంటే, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కదా.. సీమాంధ్ర కొత్త రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు అక్కడి యువతకు వస్తాయి కదా..

మొత్తంగా విషయాన్ని చూస్తే - సీమాంధ్ర పాలకవర్గాలకు, రాజకీయ నాయకుల ముసుగులో ఉన్న సీమాంధ్ర పెట్టుబడిదారులకు పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించిన ఆలోచన అవసరం లేదు. వారి ఆకాంక్షలు అవసరం లేదు. నిజానికి ప్రజలు అక్కరలేదు. ఇంకా విరివిగా ఉన్న సహజ వనరులు మాత్రమే కావాలి. ప్రజలు లేని తెలంగాణ ప్రాంతమైతే వారికి మరింత సుఖంగా ఉండేది. తెలంగాణ ప్రజల తమ ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి చేసిన, చేస్తున్న పోరాటానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యకక్షుడు కె. చంథ్రేఖరరావును నిందిస్తున్నారు. కెసిఆర్‌కు తాము లేకపోతే రాజకీయ జీవితమే లేదని, తాను మంత్రి పదవి వస్తే తెరాసనే ఉండేది కాదని చంద్రబాబు అంటున్నారు. కాలం, సందర్భం తనకు అవసరమైన నాయకుడిని వెతుక్కుంటుంది.

తెలంగాణ ప్రజానీకానికి తన ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి కెసిఆర్‌, ఆయన పార్టీ ఓ ఆలంబనగా ఉంది. దాన్ని ఆలంబనగా చేసుకుని ఇతర పార్టీ నాయకులపై ఒత్తిడి పెంచింది. ప్రజానీకానికి ఆ ఆకాంక్షే లేకపోతే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. ప్రజానీకమంతటిలోనూ ఆ ఆకాంక్షను సాధించుకోవాలనే తపన పెరిగింది. తెలంగాణ సామూహిక ఆకాంక్షగా అది వ్యక్తమైన సందర్భం వచ్చింది. అలా కాకపోయి ఉంటే, జానారెడ్డి ప్రారంభించినప్పుడో, ఇంద్రారెడ్డి ప్రారంభించినప్పుడో, బిజెపి ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్నప్పుడో ఇంతే ఉధృతరూపం దాల్చి ఉండేది. తగిన సమయంలో, సందర్భంలో కెసిఆర్‌ ముందుకు వచ్చారు.

మరోవైపు, కాంగ్రెస్‌ అధిష్టానాన్ని చంద్రబాబు నాయుడు, జగన్‌ మాత్రమే కాకుండా ఆ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులతో పాటు ముఖ్యమంత్రి కూడా నిందిస్తున్నారు. కాంగ్రెస్‌ అధిష్టానానికి గానీ, ఆ పార్టీ అధినేత సోనియా గాంధీకి గానీ ప్రజల పట్ల ప్రేమ లేకపోవచ్చు, రాజకీయ అనివార్యత కారణంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం చేసి వుండవచ్చు. రాజకీయ అనివార్యతతోనే తెలంగాణ సాధ్యమవుతుందని కెసిఆర్‌ మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. రాజకీయ అనివార్యతను సృష్టించి, తెలంగాణ ప్రజానీకం తమ ఆకాంక్షను నెరవేర్చుకున్నారు. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదు.

తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుండా ఉండే రాజకీయ అనివార్యతను సీమాంధ్ర నాయకులు ఎందుకు సృష్టించలేకపోయారనేది ప్రశ్న. తెలంగాణలోని ఏ ఒక్క వర్గానికైనా సీమాంధ్ర పాలకవర్గాల వల్ల ప్రయోజనం నెరవేరకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కనీసం తెలంగాణ పాలకవర్గాలకు కూడా ఆ న్యాయం జరగలేదు. ఉన్నత పదవులన్నీ సీమాంధ్ర రాజకీయ నాయకులే కొట్టేస్తూ వచ్చారు. రాష్ట్రాన్ని విభజించాల్సిన అనివార్యతలో కాంగ్రెస్‌ అధిష్టానం పడడానికి ఆ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు తెలలంగాణ ప్రజలను ఏ మాత్రం పట్టించుకోకపోవడమే కారణం కాదా? తెలంగాణ ప్రాంతంలోకి వచ్చి మీ పక్కన నేనున్నా మీకు అన్యాయం జరగకుండా చూస్తా, జరిగిన అన్యాయాన్ని సరిచేస్తా అని భరోసా ఇచ్చిన నాయకుడు ఉన్నాడా?

తెలంగాణ ప్రాంత ప్రజల భాగస్వామ్యం లేని సమైక్య ఉద్యమాన్ని నడిపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే ఆలోచన వారికి ఇప్పటికీ కూడా రాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సమైక్యవాదం పేర పూర్తి ప్రాంతీయ ఉద్యమాన్ని నడిపించాల్సిన అనివార్యత ఎందుకు ఏర్పడిందని ఆలోచించేంత విశాలదృక్పథం వారికి లేదనే అనుకోవాలా? పూర్తి సంకుచిత బుద్ధితో రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పడానికి ఏ విధమైన రుజువులు, వాదనలు, వివరణలు కావాలి. పైగా, సీమాంధ్రకు చెందిన పాలకవర్గంలోని ఆధిపత్య కులాలు మాత్రమే తెలంగాణను ఎట్టి పరిస్థితిలోనూ అడ్డుకోవాలని చూస్తున్నాయి. కాంగ్రెస్‌కు ఆలంబనగా ఉన్న దళిత, బహుజనులకు ఇందులో పాత్ర ఏమైనా ఉందా ఆలోచించాల్సిన సమయం కూడా ఇదే. సీమాంధ్రకు చెందిన దళిత, బహుజన నాయకులు పైకి సమైక్యవాదాన్ని వినిపిస్తున్నప్పటికీ లోపల ఆందోళనకు గురి కావడం లేదు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మివంటివాళ్లు బహిరంగంగానే రాష్ట్ర విభజనను సమర్థిస్తున్నారు. తెలంగాణ ప్రజలను ఆయోమయానికి, ఆందోళనకు, భయానికి గురిచేసి రాష్ట్ర విభజనను అడ్టుకోవడానికి సీమాంధ్ర ఆధిపత్య కులాల పాలక, పెట్టుబడిదారీ వర్గాల ప్రయత్నాల వల్ల సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడుతుందనే హెచ్చరికను గమనించాల్సి ఉంది.

- కె. నిశాంత్

English summary
Though the a political compulsion made Congress to carve Telangana state, the public aspirations are fulfilled. The arguement of Telugudesam party president Nara Chandrababu Naidu and YSR Congress party president YS Jagan arguements are ignoring Telangana people's aspirations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X