• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీ గర్వంగా: రేవంత్ రెడ్డిది అగ్రకుల ఆధిపత్యమే!

By Pratap
|

హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో నిందితుడైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదలైన తర్వాత ర్యాలీలో చేసిన వ్యాఖ్యలను గమనిస్తే అవి సమాజానికి ఎంత ప్రమాదకరమైనవో అర్థమవుతాయి. రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు అదో పిచ్చోడి కథ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కొట్టిపారేశారు. బహుశా, శిష్టవర్గానికి చెందిన చాలా మంది అదే అభిప్రాయంతో ఉండి ఉంటారు. అందుకే ఆయన చేసిన వ్యాఖ్యలపై గానీ ఆయన వ్యవహరించిన తీరుపై గానీ ఏమీ మాట్లాడడం లేదు.

మాట్లాడకపోవడం కూడా తప్పిదమే అవుతుంది. చాయ్ వాలా నరేంద్ర మోడీ ప్రధాని కావడాన్ని గర్వంగా చెబుకుంటున్న ఆధునిక సమాజం ఇది. శ్రామికుడైన వ్యక్తి ప్రధాని పీఠం ఎక్కే దాకా రావడం అనేది గొప్ప విషయమే. బిజెపి మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలనేది సుస్పష్టమే. ఆయన చేసిన వ్యాఖ్యలకు, ర్యాలీ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించడం మధ్య వైరుధ్యం లేదా అని ప్రశ్నించాల్సి ఉంటుంది.

తాను తెలంగాణ ముఖ్యమంత్రిని అవుతానని రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెబుకున్నారు. ఆ ఇంటర్వ్యూలోనే ఆయన కులాధిక్యతా భావం బయటపడింది. తెలంగాణలో వెలమలకు, రెడ్లకు మధ్య రాజకీయ వైరం ఉంటుందని, రెడ్డి సామాజిక వర్గం తన వెంట ఉంటుందని, అందువల్ల ఎప్పటికైనా తాను ముఖ్యమంత్రిని అవుతానని ఆయన నిర్మోహమాటంగానే చెబుకున్నారు. సరే, ఆ కులసమీకరణల విషయంలో రేవంత్ రెడ్డి వాదన హేతుబద్దంగానే ఉందని అనుకున్నా, ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఓ రాజకీయ నాయకుడు ఎలా ఉండాలనేది రేవంత్ రెడ్డి అవగాహన ఉండకూడదా అనేది ప్రశ్న.

Revanth Reddy

దాదాపు 85 శాతం శ్రామికులు, కష్టజీవులు ఉన్న భారతదేశంలో వారిని కించపరచే నాయకుడు ఉన్నత పదవిని అధిష్టిస్తే పరిస్థితి ఏమవుతుందనేది ఆలోచించాల్సిన విషయం. ఈ మాటలన్నీ ఎందుకంటే ఆయన ర్యాలీలో చేసిన వ్యాఖ్యలు శ్రామికులను, కష్టజీవులను కించపరిచే విధంగా ఉన్నాయి. ఆయన శ్రమను, శ్రామికులను కించపరిచే వ్యాఖ్యలను చూద్దాం.

"ఆలుగడ్డలవాడు, గోచి పెట్టుకునేవాడు, అమ్మలాంటి పార్టీని అమ్ముకునేవాడు, లంబూ... గ్లాసులు మోసే వాళ్లు, సోడాలు కలిపేవారు మంత్రులుగా ఉన్నారు" అని వ్యాఖ్యానించారు. న్యాయంగా జీవించినప్పుడు, శ్రమను నమ్ముకున్నప్పుడు ఏ పని అయినా గౌరవప్రదమైందేననే విషయం తెలియని రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏమవుతుందని అడగాల్సిన అవసరం మేధావి వర్గానికి ఉంటుంది.

"రాజకీయాల్లోకి రాక ముందు మేనమామ ఇంట్లో రబ్బరు చెప్పులు వేసుకుని, చాయ్ కప్పులు ఎత్తేవానికి, మేనమామ గత చరిత్ర తెలియదు" అని ఆయన ఇంకో మాట అన్నారు. బహుశా ఇది హరీష్ రావును ఉద్దేశించి అన్నారనేది స్పష్టంగానే తెలుస్తోంది. మేనమామ గత చరిత్ర గురించి అడగాలని హరీష్ రావును రేవంత్ రెడ్డి అంటే అభ్యంతరమేమీ లేదు. అది రాజకీయ వైరానికి, రాజకీయ పోరాటానికి సంబంధించిందని అనుకోవచ్చు. కానీ, రబ్బరు చెప్పులు వేసుకోవడం, చాయ్ కప్పులు ఎత్తడం అనే మాటలను సమాజాన్ని కించపరచడం కాదా అని ప్రశ్నించాల్సే ఉంటుంది.

ఈ దేశంలో రబ్బరు చెప్పులు సంగతి సరే, అసలు చెప్పులే లేనివారు ఎంత మంది ఉన్నారనే విషయం రాజకీయ వ్యవస్థకు పట్టాల్సిన అవసరం లేదా... అలా ఉండడం వారి తప్పు కాదు కదా.. ఈ దేశాన్ని, ఈ రాష్టాన్ని పాలించిన వారి రాజకీయ దారిద్ర్యం కాదా.. చాయ్ కప్పులు ఎత్తడం.. లంచాలు ఇవ్వడం కన్నా ఎలా తక్కువ స్థాయి పని అవుతుందో రేవంత్ రెడ్డి చెప్పగలరా... చాయ్ కప్పులు ఎత్తేవాడు, రబ్బరు చెప్పులు తొడిగేవాడు.. నీతిగా న్యాయంగా జీవించడం లేదా... న్యాయంగా జీవించడం కావాలా... అడ్డదారులు తొక్కి సంపద పోగు చేసుకుని, మరిన్ని పెద్ద అడ్డదారులకు మార్గం వేసుకుంటూ పోవడం గౌరవమా అనే విషయం రేవంత్ రెడ్డి ఆలోచించాల్సే ఉంటుంది.

ఆలుగడ్డలు ఆమ్మేవాళ్లు, గోచీ పెట్టుకునేవాళ్లు పదవులు అధిష్టించకూడదని, సమాజంలో పై మెట్టు అధిరోహించడానికి అనర్హులని రేవంత్ రెడ్డి అభిప్రాయమా.. ఇదంతా టిఆర్ఎస్‌పై రాజకీయ సమరంగా సాగితే ఎవరికీ ఏమీ అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ, సమాజంలో అట్టడుగు వర్గాల పట్ల, శ్రమ జీవుల పట్ల ఓ ప్రజాప్రతినిధికి ఉన్న తప్పుడు అభిప్రాయం ఏమిటో స్పష్టంగా అర్థమైపోతుంది.

పైగా, నోటుకు ఓటు కేసులో తాను పట్టుబడలేదని రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తనను ఇరికిరంచారని మాత్రమే మాట్లాడుతున్నారు. తప్పు పనులు చేస్తూ ఎవరో ఇరికించారని మాట్లాడుతున్న ఆయన తాను చేసిన తప్పునకు ఓ మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదు. తాను చేసిన పని సరైందే అన్నట్లుగా ఆయన వైఖరి ఉంది. టిఆర్ఎస్ వల్లనో, కెసిఆర్ వల్లనో తాను దొరికాను గానీ దొరకకపోతే తాను చేసింది సరైందేనని సమర్థించుకునే రాజకీయ నాయకుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించుకోవాలి. మొత్తంగా రేవంత్ రెడ్డి నరనరాన అగ్ర కులాధిపత్య అహంకారం ప్రవహిస్తోందని చెప్పకతప్పదు.

- కె. నిశాంత్

(ఈ వ్యాసంలో వ్యక్తమైన అభిప్రాయాలతో వన్ ఇండియా తెలుగుకు ఏ విధమైన సంబంధం లేదు. దీనిపై చర్చను కూడా ఆహ్వానిస్తున్నాం. మీ అభిప్రాయాలను ఈ మెయిల్‌కు పంపించండి... pratap.reddy@oneindia.co.in)

English summary
K Nishanth: Revanth Reddy insults work culture
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X