• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఒత్తిళ్లు, ఆత్మహత్యలు, ర్యాగింగ్‌లు: ఎందుకీ దుస్థితి?

By Pratap
|

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో బిఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య సంఘటన చాలా మందిని ఆలోచనలో పడేసింది. అయితే, ఆ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ను అరికట్టడానికి చర్యలు తీసుకున్నారు. అయినా అటువంటి ర్యాగింగ్ సంఘటనే పునరావృతమైంది. రిషితేశ్వరి ఘటన ఒక్కటే కాదు, ర్యాగింగ్ కారణంగా ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. నిజానికి, ఇవి సమాజానికి పెను సవాల్ విసురుతున్నట్లే భావించాలి.

కార్పోరేట్ కాలేజీల్లో కూడా పలు కారణాల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు జరిగాయి. చదువు ఒత్తిడి కారణంగా జరిగిన ఆత్మహత్యలు కూడా ఉన్నాయి. విద్యార్థులు అయాచితంగా ప్రాణాలు తీసుకోవడానికి బయటి కారణాలు ఉన్నప్పటికీ సమాజ స్థితిగతిలో వచ్చిన మార్పులు, సమాజం పట్ల మారిన అవగాహన, పెరిగిన వ్యక్తి కేంద్రీకృత ఆలోచనలు ఈ ఆత్మహత్యలకు కారణాలుగా చెప్పవచ్చు.

ఓ తరానికి ముందు ఇటువంటి సంఘటనలు చాలా తక్కువ, ఒక రకంగా లేవనే చెప్పవచ్చు. అప్పుడు విద్యావకాశాలు ఇంతగా లేవు, కార్పోరేట్ కాలేజీలు లేవు, లక్షలకు లక్షల ఫీజులు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఇప్పుడు ఉన్నత స్థాయి పదవులు నిర్వహిస్తున్నవారు ఇప్పుడు చాలా మందే ఉన్నారు. తెలుగు మాధ్యమంలో చదివి ఇప్పుడు ఆంగ్ల భాషలో ధారాళంగా మాట్లాడుతున్నవారు, వ్యవహాహరాలు నడుపుతున్నవారు కూడా చాలా మందే ఉన్నారు.

వారు పెరిగిన పరిస్థితులు ఏమిటి, వారి అభ్యసన పద్ధతులు ఏమిటి, విద్యార్థికీ ఉపాధ్యాయుడికీ మధ్య ఉన్న సంబంధాలు ఏమిటి, విద్యార్థి చదువులో తల్లిదండ్రుల పాత్ర ఎంత అనే విషయాలను ఆలోచిస్తే వీటన్నింటి విషయంలో గణనీయమైన మార్పు వచ్చింది. తల్లిదండ్రుల ఆలోచనల్లో వచ్చిన పెను మార్పు పిల్లలు ఒత్తిడికి గురి కావడానికి ఓ కారణంగా చెప్పవచ్చు. తమ పిల్లలు ఐఐటి మాత్రమే చదవాలని, మెడిసిన్ సీటు కొట్టాలని తల్లిదండ్రులు కలలు కంటూ పిల్లల స్థాయిని కూడా పట్టించుకోకుండా కోళ్ల ఫారాల వంటి కాలేజీల్లో చేర్పించి, లక్షలాది డబ్బులు కూడా ధారపోస్తున్నారు.

దాంతో విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి తగిన పరిసరాలు కూడా ఉండవు. ఒకప్పుడు విద్యాసంస్థ అంటే పెద్ద ఆవరణ, చెట్లూ చేమలూ, ఆటస్థలాలు ఉండేవి. తప్పనిసరిగా ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేవి. టీచర్లు తప్పనిసరిగా ఒక్కో విద్యార్థి స్థాయిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వెళ్లేవాడు. బడి వదిలిన తర్వాత కూడా వారి పర్యవేక్షణ ఉండేది. ఇప్పుడు టీచర్లు పాఠాలు చెప్పడంతో ముగించి, ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇంటర్మీడియట్, పదో తరగతి చదివినవారు కోఆర్డినేటర్ల రూపంలో వచ్చి గదుల్లో బంధించి విద్యార్థుల చేత చదివిస్తున్నారు. అవసరమైతే దండిస్తున్నారు.

K Nishnath on ragging incidents

విద్యావ్యవస్థలో అదో వినాశకరమైన పరిణామం కాగా, మరో విద్యావకాశాల విస్తరణ పేర ప్రభుత్వాలు చేసిన వ్యవహారాలూ ఉన్నాయి. సంపన్నుల పిల్లలకు వృత్తి విద్యా కోర్సుల్లో సీట్లు కొనుక్కునే వెసులుబాటు కల్పించడం అందులో ఒకటి, కాగా ఇంజనీరింగ్ కాలేజీలను ఇబ్బడి ముబ్బడిగా పెంచడం మరో కారణం. ఒక్కప్పుడు బిఎ పాసైతే ఎంతో గొప్పగా ఉండేది. ఈ విషయం పాత సినిమాలు చూస్తే తెలుస్తోంది. కానీ, ఇప్పుడు ఇంజనీరింగ్ డిగ్రీలు ఎవరికి పడితే వారికి వచ్చేస్తున్నాయి. మామూలు డిగ్రీ స్థాయి కన్నా అవి పడిపోయాయి. విద్యాప్రమాణాలు కూడా పడిపోయాయి.

ఇందులో మరో కోణం ఏమిటంటే, సీట్లు కొనుక్కుని వృత్తి విద్యా కోర్సుల్లో చేరిన సంపన్నుల పిల్లలకు ఇక్కడ కూడా పెద్దగా చదవాల్సిన అవసరం ఉండదు. ఏదో ఒక రోజు డిగ్రీ వచ్చేస్తుంది. ఈ స్థితిలో కాలేజీల్లో ర్యాగింగ్ భూతం, విద్యార్థుల మధ్య గ్రూపులూ తగవులు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులు రాజకీయ, అధికార యంత్రాంగాల్లోని పెద్దల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే ఓ సంస్కృతి చోటు చేసుకుంది. తాము ఏం చేసినా చెల్లుబాటు చేయించుకునే ఓ వర్గం బలంగా తయారైంది. ఈ క్రమంలో ర్యాగింగ్ మితిమీరిపోవడం, అది సరదా వ్యవహారంగా కాకుండా, నీచమైన కార్యకలాపాలకు ఆలవాలంగా మారడం చూడవచ్చు. దీనివల్ల ఎన్నో ఆశలు పెట్టుకుని కాలేజీల్లో చేరిన మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆ పరిస్థితులను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఇక మరో విషయం ఏమిటంటే, గత కాలంలో ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి పిల్లలు పుట్టుక నుంచే సిద్ధమయ్యేవారు. జీవితంలో పోరాటం వారికి విడదీయరాని అంశంగా ఉండేది. అందుకు వారికి సమాజంలో పాత్ర ఉండేది. చుట్టుపక్కల పరిస్థితులు, సామాజిక పరిస్థితులు వారిని రాటు దేలేవిధంగా తయారు చేస్తూ వచ్చాయి. ఆత్మహత్యలు చేసుకోవడం వారికి అంతిమ విషయంగా ఉండేది కాదు. పోరాడి గెలవడమే వారికి అంతిమ విషయంగా ఉండేది. అడ్డంకులు ఎదురవుతున్న కొద్దీ పట్టుదలతో ముందుకు సాగడం సమాజం నుంచి విద్యార్థులు, పిల్లలూ ఆయాచితంగానే నేర్చుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

సమాజంపై, సంస్కృతీ సంప్రదాయలపై అవగాహన లేకపోవడంతో పాటు ఇప్పటి చదువు గానీ గురువులూ పెద్దలూ గానీ ఇతరుల పట్ల సంబంధాల విషయంలో నేర్పుతున్న విషయాలు కూడా ప్రమాదకరంగా పరిణమించాయి. వ్యక్తి కేంద్రీకృత సమాజం వైపు అడుగులు వేస్తుండడంతో ఎవరికి వారు గిరిగీసుకుని బతుకుతున్నారు. మార్కులూ, పైమెట్టు ఎదగాడనికి చేసే ప్రయత్నాలు తప్ప ఏమీ పట్టడం లేదు. ఈ స్థితిలో విద్యార్థులు ఒత్తిళ్లను ఎదుర్కున్నప్పుడు అవసరమైన పోరాటపటిమను ప్రదర్శించలేకపోతున్నారు.

ఈ పరిస్థితి మారాలంటే సామాజిక అవగాహన అవసరం. సంస్కారం పెంచే విద్య కూడా అవసరం. సంస్కారమూ, సామాజిక అవగాహన లోపించిన తరమేదీ ఉన్నతంగా ఎదగలేదు. వ్యక్తిగత ఎదుగుదలలు మాత్రమే సమాజాన్ని ఉన్నతంగా నిలబెట్టలేదు. అందుకుగాను, కనీసం వృత్తి విద్యాకోర్సుల్లో, ముఖ్యంగా ఇఁజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో సామాజిక శాస్త్రం, సాహిత్యం, కళలు వంటివి సిలబస్‌లో ఉండడం అవసరం. వాటిని అన్ని కోర్టుల్లోనూ స్ధాయిని బట్టి ప్రవేశపెడితే విద్యార్థులకు సామాజిక అవగాహన ఏర్పడడంతో పాటు సంస్కారం కూడా అలవడే అవకాశం ఉంటుంది. సాహిత్యం తప్పకుండా మనిషి సంస్కారాన్ని పెంచుతుంది.

విద్యార్థులు సామాజిక జీవులుగా ఎదగడానికి అవసరమైన విద్యను కూడా ప్రత్యేక కోర్సులతో పాటు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఈ దిశగా మేధావులు ఆలోచన చేయాలి. ఎలా సంపాదించాడో అక్కర్లేదు గానీ ఎంత సంపాదించాడో మాత్రమే ముఖ్యమనే సమాజంలో ఇప్పుడు మనం జీవిస్తున్నారు. సంపాదనే వ్యక్తి అభివృద్ధికి కొలమానంగా మారిన సమాజం తిరోగమన దశలో నడుస్తున్నట్లే. ఇది మారాల్సిన అవసరం ఉంది.

- కె. నిశాంత్

English summary
K Nishanth deplores present education system, which is not helping to build students as social beings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X