వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలమ్: లక్ష్యాలను బట్టే వ్యక్తిత్వ వికాసం

By Pratap
|
Google Oneindia TeluguNews

వ్యక్తిత్వం అంటే గుణగణాలు, నడక, నడత. కాలంతోపాటు, వయసుతో పాటు వ్యక్తిత్వవికాసం సాగుతూ ఉంటుంది. ఆధునిక విద్య వ్యక్తిత్వ వికా సంలో, జీవన వికాసంలో ప్రధాన భూమిక వహిస్తున్నది. నేడు ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు, ఉపాధి అవ కాశాలు, అన్వేషణ అవకాశాలు, అపూర్వంగా పెరిగాయి. నిరంతరం పరిశోధన ద్వారా ఎన్నో నూతన పరిశ్రమలు, తద్వారా నూతన నైపుణ్యాల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. విద్యుత్‌, చలన యంత్రం, కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌ పరిశోధనల ద్వారా మానవ

జీవితంలో అనేక మార్పులు వచ్చాయి. ఇవిలేని జీవితాన్ని ఇప్పుడు ఊహించలేము.లక్ష్యాలను బట్టే వ్యక్తిత్వ వికాసం సాగుతుంది.

రకరకాల ప్రభావాల నుండి మిమ్ములను మీరు రక్షించుకోవాలి

ఆధునిక జీవితంలో నిత్యం రకరకాల ప్రభావాలు మనమీద పడుతుం టాయి. ప్రచార ప్రసార సాధనాలు, టీవీ, సినిమా, పత్రికలు, పాఠ్యపుస్తకాలు, సహచరులతో, అనుచరులతో, టీచర్లతో, గురువులతో, నాయకులతో, స్నేహితులతో చర్చలు, కలిసి పనిచేయడం, కలిసి జీవితంలో ప్రయానించడం, పుస్తకాల అధ్యయనం, రాజకీయాలు, సామాజిక ఉద్యమాలు, సాహిత్యం, కళలు మనపై నిత్యం ప్రభావం చూపుతాయి. మనకు తెలియకుండానే ఆ ప్రభావాలకు లోనవుతుంటాము.

వాటి ప్రభావాల్లో మనం ఏం సాధించాలో, ఎలా జీవించాలో, ఎలా ఎదగాలో అనే విషయాలు మర్చిపోతుంటాము. గుర్తు చేసుకుంటాము. మార్చుకుంటాము. ఉదాత్తంగా ఎదిగించుకుంటాము. అయితే స్వస్వరూప జ్ఞానంతో తనను తాను తెలుసుకోవడానికి, అంచనా వేసుకోవడానికి కాస్త ఏకాంతంగా తనలోకి తాను చూసుకోవడం అవసరం.

బయటి ప్రభావాలు తనను ఎటు తీసుకెళ్తున్నాయో... తాను నిజంగా ఆశిస్తున్నదేమిటో... తన ఇష్టాయిష్టాలు ఎలా మలచబడుతున్నాయో... వాటన్నిటిని బేరీజు వేసుకోవడం అవసరం. రోజూ పడుకొనేముందు, ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇలా బేరీజు వేసుకుంటే... సమాజ ప్రవాహంలో, ప్రభావాల్లో చెత్తా చెదారంలా కొట్టుకొని పోకుండా, మనదైన లక్ష్యాలతో, వ్యక్తిత్వంతో జీవితాన్ని గెలుచుకోవడం, ముందుకు సాగడం సాధ్యపడుతుంది.
ఆధునిక విద్య లేకుండా అభివృద్ధిని అందుకోవడం, ఎదగడం ఊహించ లేము. అనేక పరిశోధనలు, వేలాది పరిశ్రమలకు దారి తీశాయి. తద్వారా ఉపాధి అవకాశాలను, జీవన ప్రమాణాలను, మార్కెటింగ్‌ శక్తులను, పారిశ్రామికవేత్తలను, నైపుణ్యంగల కార్మికులను, విద్యావంతులను, శాస్త్రవేత్త లను, కళాకారులను, సామాజిక శాస్త్రవేత్తలను పెంచాయి. అనేక శాస్త్రాలు కొత్తగా రూపుదిద్దుకొని అభివృద్ధి చెందాయి. ప్రవర్తనా శాస్త్రం, వ్యక్తిత్వ వికాసం, మనస్తత్వ శాస్త్రం, సామూహిక శక్తి శాస్త్రం, సంస్కృతి శాస్త్రం, భాషా శాస్త్రం, టీవీ, సినిమా, పత్రికా, మీడియా శాస్త్రాలు, చరిత్ర రచనా శాస్త్రాలు మొదలైనవి మునుపెన్నడూ లేనంతగా ఎదిగాయి.

 One should have targets

సామాజిక అస్తిత్వం

సామాజిక అస్తిత్వంలో భాగంగా వ్యక్తిత్వం, వ్యక్తిచైతన్యం వికసిస్తుంది. అయితే క్లాసురూములో టీచర్‌ చెప్పే పాఠం అందరికీ ఒకటే అయినప్పటికీ కొందరికి 80 మార్కులు, కొందరికి 30 మార్కులు వస్తుంటాయి. గోడలు కూడా పాఠం వింటాయి. వాటికి ఏ మార్కులు రావు. కనుక సామాజిక అస్తిత్వంలో భాగంగా వ్యక్తి చైతన్యం, వ్యక్తిత్వ వికాసం అనేది వ్యక్తి స్వీకరణ, అభిరుచి, ఆసక్తి, లక్ష్యాలు, శారీరక, మానసిక, ఆరోగ్యాలు, ఆహారం, ఇంటి పరిస్థితులు అనేకం ప్రభావితం చేస్తుంటాయి.

కొన్ని సమాజాలు, దేశాలు, సమూహాలు, వర్గాలు, కులాలు ఇంకా వేల ఏళ్ళనాటి వెనుకబాటుతనంతో ఇదే కాలంలో జీవిస్తున్నాయి. అవి ఎదగడానికి నేటి అభివృద్ధి చెందిన దేశాలను అనుకరించడమే ఏకైక మార్గం అని భావించబడుతున్నది. ఆయా సమాజాలు, దేశాలు, తమదైన సొంత పద్దతిలో ఎదగడం సాధ్యమేమో అని వెతుకులాటలో ఉన్నాయి. తమ వేల ఏళ్ళ జీవన క్రమాన్ని, అనుభవాలను, సంస్కృతిని, భాషను, భావాలను, కుటుంబ సంబంధాల తీరును, విలువలను వదులుకోవాల్సిన అనివార్యత ఏర్పడినప్పుడు సంఘర్షణకు గురవుతున్నాయి. కొత్తది స్వీకరించాలని ఉంటుంది. పాతది వదులుకోవడం కష్టం అనిపిస్తుంది. ఇలా సాంప్రదాయం వెనక్కి లాగుతుంటుంది.

వ్యక్తిత్వ వికాసమే సామాజిక వికాసం

వ్యక్తిత్వ వికాసమే సామాజిక వికాసం. ఏమంటే సామాజిక వికాసంలో భాగంగా వ్యక్తిత్వ వికాసం సాగుతుంది. సమగ్ర వ్యక్తిత్వ వికాసం అంటే సమగ్ర సామాజిక వికాసమే. సామాజిక న్యాయం, సామాజిక మార్పు ద్వారా సమగ్ర సామాజిక వికాసం సాధ్యం. సమగ్ర వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. సమగ్ర వ్యక్తిత్వ వికాసం ద్వారా సమగ్ర సామాజిక వికాసానికి తోవ ఏర్పడు తుంది. అభివృద్ధి ఫలాలు, సైన్స్‌ టెక్నాలజీ ఫలాలు అందరికీ అందాలి. అందుకు అవకాశాలు అందుకునేవిధంగా మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహ కాలు అందించాలి. కుంటివారికి, గుడ్డివారికి, కళ్ళు, కాళ్ళు చేతులు బాగున్న వారికి మధ్య పరుగుపందెం ఆటవిక న్యాయంగా మారుతుంది. వారిపట్ల సమాన గౌరవంతో పాజిటివ్‌గా, పరోపకారంతో, కరుణతో, ప్రేమతో ఎదిగేం దుకు సహకరించాలి. స్వయంగా ఎదగడానికి కృషి చేయాలి.

ఎప్పటికప్పుడు సమాజంతోపాటు మనుషులు మారాలి. సైన్స్‌, టెక్నాలజీతోపాటు వ్యవస్థ మారాలి. నిర్మాణాలు మారాలి. వ్యక్తిత్వా ల్లోని సంకుచితత్వం, కుటుంబానికి, స్వార్ధానికి, తన వృత్తికి, ప్రాంతానికి పరిమితమైన దృక్పథం, ఆచరణ, కంపార్ట్‌మెంటల్‌ ఆలోచన మారాలి. ఏది ముందు ఏది వెనుక, ఏది ప్రధానం అనే చర్చలు కాలయాపనకు, ఆధిపత్యానికి, తనవైపు లాగడానికి దారి తీయవచ్చు.

మీరు ఏది నమ్మితే ఆ దారిలో సాగండి. ఎవరు ఏది నమ్మితే అదే నిజమవుతుంది. కారు, బైక్‌ డ్రైవింగ్‌ చేస్తూ యాక్సిడెంట్‌ అవుతుందని అను క్షణం భయపడినా, నమ్మినా నిజంగానే యాక్సిడెంట్‌ అవుతుంది. జ్యోతిష్యం, పంచాంగం, వార ఫలాలు, వాస్తు, దైవం, శకునాలు, లక్ష్యాలు, కలలు, సిద్ధాంతాలు, దృక్పథాలు వగైరా నమ్మడం ద్వారానే అవి నిజమవుతాయి. ప్రభావం వేస్తాయి.

వ్యక్తిత్వ వికాసంలో దృష్ఠికోణం

అనగనగా రాగ మతిశయిల్లుచు నుండు, తినతినగ వేము తియ్యనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన అని అన్నాడు వేమన. చేదుకూడా రోజూ తింటుంటే తియ్యగానే అనిపిస్తుంది. కాకరకాయ చేదు అని తెలిసి కూడా కూరగా వండుకొని తింటాము. కానీ బీరకాయలో, దోసకాయలో కొద్దిగా చేదు వచ్చినా బాగలేదని పడేస్తారు. కాకరకాయ కన్నా, ఎక్కువ చేదు ఉండదు. అయినా ఎందువల్ల కాకరకాయ యిష్టం?, బీరకాయ, దోస కాయ ఎందుకు కష్టం? ఇది దృష్ఠికోణం. బీరకాయ అలానే ఉండాలి అని అనుకోవడం వల్ల తినలేకపోవడం. కాకరకాయ కన్నా చాలా బాగుంది అని అనుకొని తిని చూడండి. చేదు బీరకాయ, దోసకాయ కూర కూడా చాలా బాగా అనిపిస్తుంది.

సమగ్ర తాత్విక వికాసమే, సమగ్ర వ్యక్తిత్వ వికాసం

సమగ్ర తాత్విక వికాసమే, సమగ్ర వ్యక్తిత్వ వికాసం. సమగ్ర పౌర వ్యక్తిత్వమే సంపూర్ణ వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటే అనేక నిర్వచనాలు ఉన్నాయి. 'సహజ, సహజాత స్థితినుంచి సమాజ స్థితికి మలుచుకోవడం, మలచ బడడమే వ్యక్తిత్వం'. సమాజం ఇచ్చిన అవకాశాల్లో, సమాజానికన్నా ముందుకు సాగుతూ తన లక్ష్యాలవైపు తాను సాగుతూ, సమాజాన్ని ముందుకు నడప డంలో, సమాజంతోపాటు ముందుకు సాగడంలో, సాహసంతో జీవిత లక్ష్యాలుగా ముందుకు సాగేవారే సమగ్ర సామాజిక వ్యక్తిత్వ వికాసంతోపాటు, సమగ్ర సామాజిక వికాసానికి కృషి చేసినవారవుతారు. తనను తాను తన లక్ష్యాలకు అంకితం చేసుకొని ముందుకు సాగడమే వ్యక్తిత్వం.

భయాలు, సంకోచాలు వీడి ముందుకు సాగాలి...

గతాన్ని, వర్తమానాన్ని రెంటినీ బేరీజు వేసుకుంటూ గతాన్ని తల్చు కుంటూ అక్కడే ఉండిపోకుండా, వర్తమానంలో లక్ష్యాలను నిర్ణయించుకొని, వ్యక్తిత్వాన్ని ఎదిగించుకుంటూ ఒక ఉన్నతమైన సంస్కారంతో పౌరులుగా, నాయకులుగా, కళాకారులుగా, శాస్త్రవేత్తలుగా ఎదగడం అవసరం. అప్పుడే సమాజం ముందుకు సాగుతుంది. గతాన్ని పట్టుకొని వేలాడే వ్యక్తులు, సమాజాలు, కులాలు, దేశాలు అక్కడే ఆగిపోతాయి. వారి అభివృద్ధి ఆగిపోతుంది. ఆధునిక సమా జంలో ఆదివాసీలు జీవించినట్లుగా ఆయా సమాజాలు, వ్యక్తిత్వాలు, జీవన ప్రమాణాలు ఉండిపోతాయి.

గతానికి అనువుగా బతకవద్దు. వర్తమానం నుండి భవిష్యత్‌లోకి పయ నించే విధంగా ఎదగండి. అనవసరమైన భయాలు, సంకోచాలు వదిలి వేయండి. సంస్కృతి, అలవాట్లన్ని గతంనుంచి వస్తున్నవే. మిమ్మల్ని అడ్డగించే ఆలోచనలు, సంస్కృతిని, స్నేహాలను, నాయకత్వాన్ని వదిలివేయండి. నేడు ఎదగడానికి ఎల్లలు లేని అవకాశాలు ఉన్నాయి. ఇది రాజరికం కాదు. భూస్వామ్యం కాదు. కుల వ్యవస్థ కాదు. పారిశ్రామిక సమాజం, ప్రజాస్వామిక సమాజం, ప్రపంచీకరణ పొందుతున్న ప్రజాస్వామిక సమాజం. జీవితాన్ని గెలుచుకోండి. జీవితాన్ని గెలుచుకోవడానికి స్ఫూర్తినిచ్చినవాటిని పట్టుకోండి.

మనిషిని భయపెట్టడానికి, భయపెట్టి లొంగదీసుకోవడానికి, తాము చెప్పినవిధంగా వినడానికి, చేయడానికి ఎన్నో శాస్త్రాలు, సూక్తులు, మతాలు, విశ్వాసాలు, దృక్పథాలు, సిద్ధాంతాలు పుట్టుకొస్తుంటాయి. వాటిని విశ్వసిస్తే మంచి, మేలు జరుగుతుందని, తమను నమ్మకపోతే నష్టాలు, కష్టాలు తప్పవని హెచ్చరిస్తుంటాయి. వాటిని నమ్మినా, భయపడినా, నిజంగానే అవి కష్టనష్టా లను తెచ్చిపెడతాయి. వాటిని నమ్మే మనస్సే అందుకు కారణం.

ప్రతిదీ హేతుబద్ధంగా ఆలోచించాలి. తక్షణ ఫీలింగ్స్‌ నుంచి బయటపడి ఆలోచనతో వివేచనతో నిర్ణయాలు తీసుకోవాలి. విశ్వాసాలను ఏర్పాటు చేసుకోవాలి. నూతన జ్ఞానం అందిన కొద్దీ విశ్వాసాలను మార్చుకోవాలి. ఎంత హేతుబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే అంత ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అంత మంచి ఉన్నత లక్ష్యాలు నిర్ణయించుకోగలుగుతాము. మానవ సంబం ధాలు, విలువలు, లక్ష్యాలు, ఉద్యోగం, సంస్కృతి, జీవితం, ప్రేమ, స్నేహాలు గురించి నిర్ణయాలు సకాలంలో తీసుకోవాలి. విలువలు, సంస్కృతి, దృక్పథం ప్రపంచాన్ని ఒక ఫ్రేంలోంచి చూసే అలవాటు చేస్తాయి. అది నచ్చనివాళ్ళు దాన్నే పచ్చరంగు కళ్ళ అద్దాలతో చూస్తే లోకమంతా పచ్చగా కనపడుతుంది అని అంటుంటారు. ఇలా విలువలు, సంస్కృతి, దృక్పథం, విశ్వాసాలు మనిషిని ఒక చట్రంలో ఆలోచించేటట్లు చేస్తాయి. జీవితంలో ఎదగడానికి, ఆగిపోవడానికి కూడా కారణమవుతాయి.

జీవితాన్ని భయపెట్టేవాటన్నిటిని వదిలివేయండి. దైవం సృష్టించిన ప్రతి క్షణం, ప్రతి స్థలం, ప్రతి దిక్కు పవిత్రమైనవే. అపవిత్రమైన వంటూ ఏవీ లేవు అంటారు పతంజలి యోగ గురు రాందేవ్‌ బాబా. జ్యోతిష్యం, వాస్తు, శకునాలు, నమ్మకాలు మిమ్మల్ని భయపెడితే వాటిని వదిలివేసి మీ మనస్సును ప్రశాంతం చేసుకోండి.

ఇటీవల వ్యక్తిత్వ వికాసం, మేనేజ్‌మెంట్‌, లీడర్‌షిప్‌, లక్ష్యాలు, గెలుపు మీదే, విజయ రహస్యాలు మొదలైన గ్రంథాలు అనేకం వెలువడ్డాయి. ఇవి ఆయా ప్రాంతాల, దేశాల, సంస్కృతిని, లక్ష్యాలను, జీవన విధానాలను, సైన్స్‌, విద్య ద్వారా అందిన అవకాశాలను ఉపయోగించు కొని ఎదిగే క్రమాన్ని అనుసరించి రాయబడుతున్నాయి. అమెరికా వంటి అభివృద్ధి, సంస్కృతి, విలువలు అందుకోకుండా సాగే వ్యక్తిత్వ వికాసం అమెరికా స్థాయిలో సాధ్యపడుతుందా? అయినా మనం ప్రయత్నించాల్సిందే. లక్ష్యం నిర్ణయించు కున్నాక దానికి అనుకూలంగా, మానసికంగా మైండ్‌సెట్‌ మార్చుకోక తప్పదు. అయితే ఆసియా దేశాల్లో ఆ అభివృద్ధిని అందుకున్నాక కూడా పాత సంస్కృతి, మతాలు, అలవాట్లు, పూజలు వగైరా కొనసాగుతున్నాయి.
మనకు అందుతున్న గ్రంథాల్లో చాలామేరకు యూరప్‌, అమెరికా, రష్యా సమాజాలలో సాగిన పరిశోధనలను, చేసిన విశ్లేషణలను, అనుభవాలను, ఆయా గ్రంథాల్లో పొందుపరిచారు. యూరప్‌, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాల చరిత్ర, సంస్కృతి, జీవన విధానం, వ్యక్తిత్వ వికాసం, తాత్విక వికాసం, వారి నైసర్గిక పరిసరాల, సమాజాల పరిణామాలను అనుసరించి రూపు దిద్దుకుంది. తద్వారా ఆయా దేశాల సైన్స్‌, టెక్నాలజీ, కళలు, సినిమాలు, టీవీలు, జీవన విధానాన్ని అనుకరిస్తూ, దిగుమతి చేసుకుంటున్నట్లుగానే వ్యక్తిత్వ వికాసంలో, తాత్విక వికాసంలో, సంస్కృతిలో ఆయా దేశాలను అనుకరిస్తూ వస్తున్నాము. చైనా, జపాన్‌, ఇండియా వంటి ఆసియా దేశాల కోణంలో మనదాకా వచ్చిన గ్రంథాలు, విశ్లేషణలు తక్కువ.

ఆసియా దేశాల చరిత్ర, సంస్కృతి, జీవన విధానం, వ్యక్తిత్వ వికాసం, తాత్విక వికాసం ఆసియా ఖండం యొక్క ప్రత్యేక నైసర్గిక సమాజాల పరిణామాలను అనుసరించి రూపుదిద్దుకుంది. 18వ శతాబ్దం దాకా ఆసియా దేశాల చరిత్ర, సంస్కృతి, సైన్స్‌, టెక్నాలజీ అత్యున్నతంగా ఎదిగింది. ఇతర దేశాలు, ఆసియా దేశాలను ఆదర్శంగా, మార్గదర్శకంగా చూస్తూ, వలసలు సాగిస్తూ, చివరకు వలసాధిపత్యాన్ని నెలకొల్పి, ఆసియా దేశాలను పరిపాలిం చారు. అలా 350 సంవత్సరాలు ఆసియా, ఆఫ్రికా దేశాలను కొల్లగొట్టిన సంపదలతో, నల్లవారిని, రెడ్‌ ఇండియన్స్‌ని బానిసలుగా చేసి, హింసించి, చంపి, ఉత్పత్తిని పెంచారు. దేశాలను, ఖండాలను ఆక్రమించారు.

వలస విధానం, ఆక్రమణ, విస్తరణ, దాడి, యుద్ధం, వాణిజ్యం, వ్యాపారం, యుద్దాలతో వ్యాపారం, ఆయుధాలతో వ్యాపారం, సైన్స్‌తో వ్యాపారం, కళలతో వ్యాపారం, సాహసాలతో వ్యాపారం, సృజనతో వ్యాపారం చేస్తూ, ఆయా దేశాలు, సమాజాలు, వారి తాత్విక వికాసాలు, వ్యక్తిత్వ వికాసాలు, సంస్కృతి, ఆలోచనా విధానాలు, విలువలు అభివృద్ధి నమూనాలు రూపొందుతూ వచ్చాయి.

అందుకు భిన్నంగా, సమాంతరంగా వలసలకు గురైన దేశాలు, దోపిడీకి, అణచివేతకు గురైన సమాజాలు, వనరుల దోపిడీ తరలింపు, అవమానాలు, చిన్నచూపుకు గురైన దేశాలు. సంస్కృతి విలువలు, వారి వ్యక్తిత్వ వికాసం, తాత్విక వికాసం, ఆలోచనా విధానాలు రూపొందుతూ వచ్చాయి. దోపిడీ, ఆధిపత్య విధానాలతో ఎదిగిన సమాజాలు, వ్యక్తులు, దేశాలు నూతన సైన్స్‌ ఆవిష్కరణలతో పారిశ్రామిక విప్లవాన్ని వేగవంతం చేయడం జరిగింది. అది తిరిగి వలస దేశాల వనరులను, సమాజాలను, పాలితులను దోచుకోవడానికి, పాలించడానికి, ఓడించడానికి, వ్యక్తిత్వాన్ని కించపర్చడానికి, హింసించడానికి, అణచివేయడానికి సాధనాలయ్యాయి.

అలా వేల ఏళ్ళనుండి కొనసాగుతూ వచ్చిన నిర్దిష్ట స్థానిక, దేశీయ సైన్స్‌, టెక్నాలజీ, కళలు, విలువలు, సంస్కృతి అభివృద్ధి నమూనాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. అణచివేయబడ్డాయి. అవమానించబడ్డాయి.
వ్యక్తిత్వ వికాసం కేవలం వ్యక్తికి సంబంధించింది మాత్రమే కాదు. అది సమాజానికి సంబంధించింది. సామాజిక ఉద్యమాలకు, రాజకీయ ఉద్యమాలకు, ప్రజాస్వామ్య వ్యవస్థలకు, సోషలిస్టు వ్యవస్థలకు, నియంతృతాలకు, మత రాజ్యాలకు, వ్యక్తిత్వ వికాసానికి మధ్య సంబంధం ఉంది. రెండూ పరస్పర ఆధారితాలు. ఈ రెండూ రెండు రైలు పట్టాలవంటిది. వ్యక్తిత్వ వికాసం ఈ రెండు రైలు పట్టాలమీద నడిచే రైలువంటిది.

మీరు ఏరోజు చేయాల్సినవి ఆరోజు కాగితం పై రాయండి. ఆ కాగితాన్ని జేబులో పెట్టుకోండి. మీ పనులు ఎలా జరుగుతాయో గమనించండి. కాగితం పై రాసుకోక ముందు, రాసుకున్న తర్వాత మార్పును గమనించండి.

- బిఎస్ రాములు

English summary
BS Ramulu says targets should be fixed for personality development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X