వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏళ్ళ తర్వాత మన పిల్లలు: మన సమాజం

By Pratap
|
Google Oneindia TeluguNews

మన పిల్లలు బాగా ఎదగాలని వారి 30 యేళ్ళ భవిష్యత్తును ఊహిస్తూ విద్యకోసం, ఉద్యోగాల కోసం, పెళ్ళిళ్ల కోసం ఇప్పటినుండే జీవితాలను అందుకు అనుకూలంగా మలుచుకుంటూ వస్తున్నాము. ఇల్లు, ఇండ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్‌లు, 50 యేళ్ళ దూరదృష్టితో పిల్లలను, వారి పిల్లలను దృష్టిలో ఉంచుకొని కొనడం, సంపాదించడం, కట్టుకోవడం జరుగుతున్నది.

వ్యక్తిగత ఆలోచనా విధానం - సామాజిక ఆలోచనా విధానం:

ఇది వ్యక్తిగత ఆలోచనా విధానం. ఇది వ్యక్తిగత, వ్యక్తిత్వ వికాసం. అదే సమయంలో 50 సంవత్సరాల్లో మనం, మన సమాజం ఎలా మారనున్నదో అంచనా వేయగలుగు తున్నామా...? అందుకు అనువుగా సామాజిక లక్ష్యాలను కనీసం నిర్ణయించుకో గలుగుతున్నామా...? కేవలం వ్యక్తిగతంగానే ఆలోచిస్తున్నామని ఈ విషయాలు మనకు స్పష్టం చేయడం లేదా...? సమాజం గురించి ఎన్ని చర్చలు చేసినా ఇలా కేవలం కుటుంబానికి, వ్యక్తిగత వికాసానికి పరిమితం.

50 యేళ్ళ తర్వాత పర్యావరణం, ప్రకృతి వనరులు, సైన్స్‌, టెక్నాలజీ...

Persnality Development: Our children after few years

50 యేళ్ళ తర్వాత ఈ ప్రపంచం సమాజం, సైన్స్‌, టెక్నాలజీ, మానవ స్వభావాలు, మానవ సంబంధాలు, ప్రకృతి, వనరులు, జీవితం, వ్యవస్థలు ఎలా ఉండబోతున్నాయి అని ఆలోచించడం అవసరం. అలా అలోచిస్తూ, ఆచరిస్తూ, సమాజానికి నాయకత్వం వహించినపుడే సమగ్ర సామాజిక వికాసం, సమగ్ర వ్యక్తిత్వ వికాసం ఏక కాలంలో సాధ్యపడుతుంది.

50 ఏళ్ళలో ప్రకృతి సమాజం, పర్యావరణం, సైన్స్‌, టెక్నాలజీ, వ్యవస్థలు, మానవ సంబంధాలు, ప్రేమలు, స్నేహాలు ఎన్నో పరిణామాలకు లోనవు తుంటాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని ఆలోచించడం, ఆచరించడం అవసరం. సమాజాన్ని ముందుకు నడిపే విధంగా ఆలోచించాలి.

విస్తరిస్తున్న స్నేహాలు, మానవ సంబంధాలు...

గతాన్ని పట్టుకొని వర్తమానంలోని మార్పులను సానుకూలంగా స్వీకరించలేకపోవడంవల్ల సమాజాన్ని ముందుకు నడవకుండా అడ్డగించిన వారవుతారు. ఉదాహరణకు నేడు ప్రేమలు, స్నేహాలు బాగా తగ్గిపోయాయని ఎనకటి ప్రేమలు, స్నేహాలు గొప్పవి అని అనడం చూస్తుంటాం. నేడు కులాతీతంగా, మతాతీతంగా, వర్గాతీతంగా, దేశాల సరిహద్దులకు అతీతంగా స్నేహాలు, ప్రేమలు, మానవ సంబంధాలు, సైన్స్‌ టెక్నాలజీ, కళలు, సాహిత్యం ఆదాన ప్రదానాలు కొనసాగుతున్నాయి.

ఫేస్‌బుక్‌లు, సినిమాలు, టీవీలు, ట్విట్టర్‌లు, ఈ-మెయిల్‌లు, ప్రపంచీకరణ తెచ్చిన పరిణామాలు, అవకాశాలు మనుషులను మరింత సన్నిహితం చేస్తున్నాయి. ప్రపంచం ఒక కుగ్రామంగా మారుతున్నది. నిజానికి ప్రపంచం ఒక కాస్మోపాలిటన్‌ మహానగరంలా మారిపోతున్నది.

వెనకటికి, ఇప్పటికి ఎంత మార్పో... రేపు ఇంకా మారుతుంది...

వెనకట పెళ్ళిళ్ళకు వందమంది కూడా వచ్చేవాళ్ళు కాదు. కులంవారే ఎక్కువమంది వచ్చేవారు. ఇపుడు సొంతకులంవారికన్నా స్నేహితులే ఎక్కువ. వేలమంది ఇపుడు పెళ్ళిళ్ళకు హాజరవుతున్నారు. మునుపెన్నడూ ఇంత గొప్పగా పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, పెళ్ళి రోజులు, ప్రేమ వివాహాలు జరగలేదు. వినాయకచవితి, దీపావళి, హోళీ వంటి పండగలు కూడా మునుపెన్నడూ ఇంత ఘనంగా జరిగేవి కావు. అందరూ కలుసుకోవడానికి ఈ పండగలు విస్తరిస్తూనే ఉన్నాయి.

వెనుకట కులాతీతంగా, మతాతీతంగా, కులాలవారీ, మతాలవారీ వివక్షలు లేకుండా ప్రేమలు, స్నేహాలు తక్కువ. వెనకట సాగించిన ప్రేమలు, ఆత్మీయతల్లో కులాలవారీగా గౌరవాలను ఆమోదించడంవల్లనే అవి కొన సాగాయి. అనగా కులాల ప్రకారం గౌరవిస్తేనే ఆత్మీయతలు కొనసాగించారు.

కుల వ్యవస్థ నిర్మించిన అసమానతలతో కూడిన కులాలవారీ గౌరవాల ప్రకారం కాకుండా అందరూ సమానమే అని ఆచరించేవారిని చిన్న కులా లను గౌరవించినా, పెద్ద కులాలను గౌరవించకపోయినా కష్టాలపాలు చేసే వారు. నేడు ఆ స్థితి తగ్గుతున్నది. రేపు ఇంకా తగ్గుతుంది. కులమతాల ప్రమేయం లేని స్నేహాలు, ప్రేమలు, మానవ సంబంధాలు పెరుగుతాయి. కులవృత్తి రహిత సమాజం ఏర్పడుతుంది.

మహోన్నత మానవీయ సమాజంగా ప్రపంచం...

ఎన్ని ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక అసమానతలు, వైరుధ్యాలు ఉన్నప్పటికీ ప్రతి మనిషిని ఒకే విలువతో గౌరవించే సంస్కృతి, విలువలు పెరుగుతాయి. శాంతియుత సహజీవనం, పరస్పర సహకారం పెరుగుతుంది. వసుధైక కుటుంబ భావన విస్తరిస్తున్నది. ప్రపంచం మరింత దగ్గరవుతుంది. వెబ్‌ క్యామ్‌ సెల్‌ఫోన్‌లు, ఫేస్‌బుక్‌లు, ఈ-మెయిల్‌లు, లింక్‌ ఇన్‌లు, ట్విట్టర్‌లు మొద లైనవి వేలమైళ్ళ దూరాన ఉన్న మనుషులను సన్నిహితులను చేస్తున్నాయి. ఇలా మను షులు మరింత సన్నిహితులవుతారు. మనిషికి, మనిషికి మధ్య ఆత్మీయత, ప్రేమ, స్నేహం అనుబంధాలు, మానవీయ సంబంధాలు, మానవ సమాజాన్ని ప్రేమ పూరితం చేస్తాయి.

దేశంలోని అందరూ విద్యావంతులు అవుతారు. నిజానికి బడ్జెట్‌లను సక్రమంగా సద్వినియోగం చేస్తే ఒక్క రూపాయి పన్ను పెంచకుండా... 16 సంవత్సరాలపాటు ఉచిత ఉన్నత విద్య, హాస్టల్‌ వసతి కల్పించి 7-12 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరినీ డిగ్రీ స్థాయికి ఎదిగించడం, జీవన ప్రమాణాలు పెంచడం, నూతన ఉపాధి కల్పించడం, కులవృత్తులనుండి విముక్తి చేయడం, కులవృత్తిరహిత ఉపాధి, ఉద్యోగ, పారిశ్రామిక రంగాల వికాసం సాధ్యమే.

కులవృత్తి రహిత సమాజం ఏర్పడకుండా ఆధునిక సమాజ నిర్మాణం పూర్తికాదు.

అందరికీ ఉన్నత విద్య, ఉన్నత సాంకేతిక నైపుణ్యం అందించడం ద్వారా ఆధునిక అభివృద్ధి అందుకోవడం జరుగుతుంది. తద్వారా కులవృత్తుల అవసరం తీరుతుంది. ఆయా వృత్తులు సమాజానికి అవసరమైతే ఎవరో ఒకరు ఆ వృత్తులు చేస్తారు. ఆయా కులాలవారే కులవృత్తులు చేయాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితినుండి బయటపడుతుంది. అలా కులవృత్తి రహిత సమాజం ఏర్పడుతుంది. కులవృత్తి రహిత సమాజం ఏర్పడకుండా ఆధునిక సమాజ పునర్నిర్మాణం పూర్తికాదు.

ఏ వృత్తి కులవృత్తిగా ఉండకూడదు

సమాజానికి అవసరమైతే వృత్తులు, సేవలు, ఉత్పత్తులు ఎవరైనా చేస్తారు. అవి సామాజిక గౌరవాన్ని ఆర్థికంగా ఎదిగే అవకాశాన్ని, మంచి ఉపాధిగా భావించినపుడు ఎవరైనా చేస్తారు. నేడు అనేక కులాలవాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. రాజకీయాలు చేస్తున్నారు. పరిశ్రమలు పెడుతున్నారు. అనేక వృత్తులు చేస్తున్నారు. గంజి ఇస్త్రీ, టైలరింగ్‌, బంగారం, కార్పెంటర్‌, బట్టలు ఉతకడం మొదలుకొని ఎన్నో కులవృత్తులు అనేక కులాలవారు చేస్తున్నారు. గిట్టుబాటుతోపాటు, సామాజిక గౌరవం పెరిగితే అన్ని వృత్తుల్లోకి అందరు ప్రవేశిస్తారు.
అందువల్ల ఏ వృత్తి కూడా కులవృత్తిగా ఉండకూడదు. కులవృత్తిగా ఇంకా కొనసాగుతున్నదంటే అది ఇతర కులాలవారు ప్రవేశించే ఆకర్షణ లేకుండా, లేదా అవకాశం లేకుండా కొనసాగుతున్నదని అర్థం. ఈ రెండు తొలగి అందరు ఆ వృత్తులు చేసినపుడే ఆ వృత్తి అందరికీ అందుబాటులోకి వచ్చిందని, అందరికీ గౌరవప్రదంగా చేయడానికి అంగీకారం పెరుగుతుందని అర్థం.

ఆయా కులవృత్తుల్లో, పేదరికంలో ఉండిపోతున్న వాళ్ళందరినీ వాటి నుండి విముక్తం చేసి ఉన్నత విద్యతో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌తో, పారిశ్రామిక అభివృద్ధితో ఇతర రంగాలకు మళ్ళించాలి. అలా ఏ వృత్తీ కులవృత్తిగా ఉండకుండా మొత్తం ప్రజలను ఎదిగించాలి. అపుడే నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. నిజమైన సమాన అవకాశాలు అందుబాటులోకి వచ్చినట్టు. కులవృత్తులు ఉన్నంతకాలం అందరికీ సమాన అవకాశాలు అందడంలేదని కొందరే అందుకుంటున్నారని అర్థం.

రేపటిగురించి ఇపుడే ఆలోచించడం అవసరం...

ఎపుడో కష్టపడ్డదానికి ఫలితం ఒక్కోసారి అకస్మాత్తుగా ఎదురవుతుంది. ఎపుడో ప్రాథమిక విద్య నేర్పిన ఉపాధ్యాయుడికి విద్యార్ధులు డాక్టర్లై, ఇంజనీర్లై, టీచర్లై, రాజకీయ నాయకులై ఎదురుపడి గౌరవించినపుడు, తనకు అవసర మైన పని చేసినపుడు ఆ ఉపాధ్యాయుడికి ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది.
అలాగే ఇపుడు పర్యావరణాన్ని, ప్రకృతి వనరులను, మానవీయ విలువ లను, సంస్కృతిని కాపాడుకుంటూ 50 ఏళ్ళ తర్వాత సమాజానికి మంచి వారసత్వాన్ని, జీవితాన్ని అందించినవారం అవుతాము. 50 ఏళ్ళలో కుల వృత్తులన్నీ రద్దయి అందరూ అన్ని పనులు చేసే, అన్నికులాలు, అన్ని ప్రాంతాలు, అన్నిరంగాల్లో ఉన్నతంగా ఎదుగుతారు.

మనిషి ఆశా జీవి...

మరోవైపు జాతులమధ్య సంఘర్షణలు, ప్రాంతాల మధ్య వివక్షతలు, యుద్ధాలు, అంతర్గత యుద్ధాలు, దేశాలమధ్య యుద్ధాలు, ప్రపంచ యుద్ధ ప్రమాదాలు నిరంతరం వెన్నాడుతూనే ఉంటాయి. ఇప్పటికే ఈ భూమండ లాన్ని ఎన్నోసార్లు ధ్వంసం చేయగలిగే అనుబాంబులు, విధ్వంసక ఆయుధాలు తయారయి ఉన్నాయి. ఈ రెండు పరిస్థితులమధ్య మనం చేసే కృషిని అనుస రించి మానవ సమాజం విధ్వంసానికి దారి తీయవచ్చు. మహోన్నత సమా జంగా, శాంతియుతంగా ఎదగవచ్చు.

మనిషి ఆశాజీవి. 50 ఏళ్ళ తర్వాత ఐక్యరాజ్య సమితి స్థాయిలో అనేక నూతన వ్యవస్థలు, నిర్మాణాలు ప్రపంచమంతటా విస్తరించి ప్రపంచంలో ఏ మూల ఉన్నా మనిషి పట్ల మరోమనిషి స్పందించడం, సేవ చేయడం, కలిసి ఆలోచించడం, ఆచరించడం, కలిసి పంచుకోవడం వంటివి మరెన్నో రెట్లు పెరుగుతాయని ఆశిద్దాం.

English summary
An eminent Telugu writer BS Ramulu says about our children after about 50 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X