వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌: రెండు జన్మలు ఎత్తుతారు

By Pratap
|
Google Oneindia TeluguNews

సుపీరియారిటీ, ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌లు ఏర్పడడానికి ప్రధానంగా సామాజిక అంచెలంచెల వ్యవస్థతో పాటు ఈ కింది వ్యత్యాసాలు పని చేస్తుంటాయి.

1. వయస్సు, 2. తెలివి, 3. కులం, 4. జెండర్‌, (స్త్రీ, పురుషులవివక్ష) 5. భావం వ్యక్తం చేసే శక్తిసామర్థ్యాలు, 6. ప్రత్యేక నైపుణ్యాలు, సామర్థ్యాలు (కళలు, ధైర్యం, ఆటపాటలు, లలితకళలు మొదలైనవి), 7. హోదా, అధికారం, 8.ధనం, సంపద, పెట్టుబడి, 9. యజమాని, ఉద్యోగి పని సంబంధాలు, 10. ఇతరులకు పని చెప్పి చేయించడం, ఇతరులు పని చెప్తే చేయడం, 11. భాష, సంస్కృతి వ్యత్యాసాలు, 12. ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి రావడం... మొదలైనవి.

సుపీరియారిటీ కాంప్లెక్స్‌లో తప్పుడు నిర్ణయాలు...

సుపీరియారిటీ కాంప్లెక్స్‌ అంటే తనకున్న సామర్థ్యాలకన్నా ఎక్కువ ఉన్నాయని ఊహించుకుని భేషజంతో, అహంకారంతో ప్రవర్తించడం. ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌ అంటే తనకున్న సామర్థ్యాలను తక్కువ అని,
నిరంతరం భయపడడం. సంకోచిస్తూ ప్రవర్తించడం. వాస్తవాలకు భిన్నంగా, అధికంగా ఊహించుకోవడంవల్ల తప్పుడు నిర్ణయాలకు వస్తుంటారు. ఇన్ఫిరియారిటీలోను, సుపీరియారిటీలోను రెంటిలోనూ ఇలా జరుగుతుంది.
సుపీరియారిటీ కాంప్లెక్స్‌ మనిషిని తప్పుడు నిర్ణయాలకు నడిపిస్తుంది. ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌ ఉన్న శక్తిసామర్థ్యాలను నిర్వీర్యంచేస్తుంది. అందువల్ల ఈ రెండు కూడా మనిషికి చెరుపుచేస్తాయి. కనుక ఈ రెంటిని వదిలించు కోవడం అవసరం.

అధికారంలో, ఆధిపత్యంలో ఉండేవారు తమ స్వార్థం కోసం ఈ కింది వాటిని ఆశ్రయించవచ్చు. 1. డిప్లమసీ, 2. హిపోక్రసీ, 3. భేషజం, 4. కపటం, 5. ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించడం, 6. విభజించి పాలించడం.

ఇన్ఫిరియారిటీ అనే నష్టంలో ఒక లాభం...

ఇన్ఫిరియారిటీవల్ల వినయం, సంకోచం, సిగ్గు, చొరవ లేకపోవడం జరగవచ్చు. చొరవతో స్నేహం చేయగలగడం, ప్రేమించగలగడం, ప్రేమించలేకపోవడం, మనస్సులోని భావాలు చెప్పగలగడం, చెప్పలేకపోవడం మొదలైనవి ఇన్ఫిరియారిటీ సమస్య ప్రభావానికి లోనౌతుంటాయి.

లాభం లోను కొన్ని నష్టాలుంటాయి. విజయంలోను కొన్ని వైఫల్యాలు ఉంటాయి. నష్టంలోను కొన్ని లాభాలుంటాయి. వైఫల్యంలోను ఎన్నో విజయాలుంటాయి. అలాగే ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌ అనే నష్టంలోను కొన్ని లాభాలుంటాయి. ఇన్ఫిరియారిటీని జయించడం అవసరం. ఇన్ఫిరియారిటీ ఒకందుకు మంచిదే అంటారు కొందరు.
ఏమంటే ఇన్ఫిరియారిటీ దేనికీ ఒక పట్టాన తృప్తి పడదు. ఇంకా ఏదో వెలితి, సంకోచం కలిగిస్తుంది. కనుక ఇంకా ఎదిగే ప్రయత్నం సాగించడానికి ప్రేరణ అవుతుంది. ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, వి.పి.సింగ్‌, పి.వి.నరసింహారావు మొదలైనవాళ్లు ఇన్ఫిరియారిటీని జయించడం కోసమే ఎదుగుతూ ఎదుగుతూ ప్రధానమంత్రులయ్యారు. చాలామంది రచయితలు, కళాకారులు, ఇన్ఫిరియారిటీని జయించడం కోసమే ప్రారంభమై క్రమంగా మహాకవులు, మహాకళాకారులయ్యారు.

ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌ ఇతరులను అనుమానించే స్వభావాన్ని కలి గిస్తుంది. అలాగే ప్రతిదీ తనను తానే తప్పు పట్టుతుంది. తద్వారా నష్టం జరిగినా ఆత్మవిమర్శ లేదా సింహావలోకనం అనే మేలు కూడా జరుగు
తుంది. ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌ను ఇతరుల మెప్పు పొందాలనే తపనకు గురిచేస్తుంది. తద్వారా పదిమంది మెచ్చేవిధంగా ఎదుగుతారు, కృషి చేస్తారు. ప్రతి ఒక్కరిలో తొలుత ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌ వుంటుంది.

Personality Development: How to overcome inferiority complex

ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌లో ఎందుకు పడతారు?

తనకన్నా వయస్సులో, జ్ఞానంలో, అధికారంలో, హోదాలో, కులంలో, సంస్కృతిలో, ఆధిక్యతలో వున్నవారిని చూసినప్పుడు, వారిలో ప్రేమించే స్వభావం, కరుణ లోపించినప్పుడు, ఆధిపత్యం ప్రదర్శించినప్పుడు ఇన్ఫిరి
యారిటీ కాంప్లెక్స్‌లో పడతారు. తన సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌ నుండి బయట పడతారు. ఇతరుల దయాదాక్షిణ్యాల పై ఆధారపడే స్థితి, పేదరికం, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్‌ను సృష్టిస్తుంది. ఆత్మవిశ్వాసం, నైతిక స్థయిర్యం, ఉన్నత లక్ష్యాలు, సామాజిక కర్తవ్యాలు, పరోపకారం, లక్షణాలు పెంచుకుంటూ పోతున్నకొద్దీ ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌ అదృశ్యమవుతుంది. ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌లో ఉన్నవారు స్వార్థానికి పరిమితమైతే ఆ ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌ పోవడం అంత సులభం కాదు.

ఆధిక్యతా ప్రదర్శన నాయకత్వం కాదు...

సుపీరియారిటీ కాంప్లెక్స్‌ అనేది... లేని ఆధిక్యతను ఇతరులపై ప్రదర్శించడానికి, అనుభవించడానికి సంబంధించింది. వారి సుపిరియారిటీ కాంప్లెక్స్‌ను ఆధిక్యతా ప్రదర్శనను అంగీకరించినప్పుడు వాళ్లు నాయకులుగా కనపడతారు. నాయకులుగా వాళ్లు తమను తాము ఎదిగించుకుంటారు. తద్వారా నాయకులుగా స్థిరపడతారు.

కొంతకాలం కింద పార్లమెంటు సభ్యుల గురించి ఒక పరిశోధన

జరిగింది. 542 మంది పార్లమెంటు సభ్యుల్లో డెబ్భై అయిదు శాతం మంది ఆయా కుటుంబాల్లో ఇంటికి పెద్ద కొడుకులే అని ఆ సర్వేలో తేలింది. ఇంటికి పెద్ద కొడుకుకు ఇంట్లోని తమ్ముల పట్ల, చెల్లెల పట్ల ఒక అధికారం వుంటుంది. వారిపట్ల బాధ్యత వుంటుంది. వారికి పని చెప్పే స్వభావం అబ్బుతుంది. వారికి పనులు చేసిపెట్టే స్వభావం కూడా అబ్బుతుంది. తద్వారా కొంత స్వేచ్ఛను పొంది స్వతంత్ర నిర్ణయాలను తీసుకునే అవగాహన పెరుగుతుంది. అలా ఇంటి పెద్దకొడుకులు ఇంట్లో పెరిగే క్రమంలోనే ఇంటా బయటా వ్యక్తిత్వ వికాసంలో నాయకత్వ లక్షణాలను పునికిపుచ్చుకోవడం ప్రారంభమవుతున్నది. ఇదేక్రమంగా అన్ని రంగాల్లో నాయకులుగా ఎదగడానికి ప్రాతిపదిక ఏర్పరుస్తున్నది.

పెద్ద కొడుకులో పెరిగే వ్యక్తిత్వం - నాయకత్వం

తమ్ముళ్లను, చెల్లెళ్లను ఎవరైనా కొడితే అన్న పోట్లాట పెట్టుకుంటాడు. వారికి భద్రత కలిగిస్తాడు. మా అమ్మకు చెప్తా, మా నాన్నకు చెప్తా అని అన్నట్టుగానే మా అన్నయ్యకు చెప్తా, మా అక్కయ్యకు చెప్తా, అని పిల్లలు బెదిరించడం ద్వారా ఆ మాటలో వుండే బాధ్యత ద్వారా అన్నలు, అక్కలు వ్యక్తిత్వ వికాసంలో నాయకత్వ లక్షణాలను సంతరించుకుంటారు. కుటుంబంలో పెద్దన్నగా ఎవరు ఈ బాధ్యతలను స్వీకరిస్తారో వారికి ఈ నాయకత్వ లక్షణాలు అలవడుతుంటాయి.

అన్నలకు, అక్కలకు పని చేయడంతో పాటు పని చెప్పి చేయించుకోవడం కూడా అలవాటవుతుంది. నాయకత్వ లక్షణం కూడా ఇదే. పని చేయడంతో పాటు పని చెప్పి చేయించడం, వారిని కరుణతో, ప్రేమతో చూసుకోవడం నాయకత్వం యొక్క ప్రథమ లక్షణం. ఇలా కుటుంబంలోని అంచెలంచెల వ్యవస్థ పెద్దకొడుకును, పెద్దకూతురును నాయకత్వ లక్షణాలుగా ఎదిగిస్తున్న దని పార్లమెంటు సభ్యుల సర్వే తెలుపుతున్నది.

కొన్ని సామాజిక వర్గాల నాయకత్వం వారి ప్రతిభ కాదు. అలాగే కొన్ని సామాజిక వర్గాలు ఆధిక్యతలో ఉండడం వల్ల ఆ ఆధిక్యతను ఇరుగు పొరుగు సమాజం అంగీకరించడం వల్ల ఇంట్లోని అన్నలాగే వాళ్లు నాయకులుగా ఎదిగే క్రమం జరుగుతున్నది. మిగతా కులాలు కుటుంబంలోని తమ్ములవలె, చెల్లెలవలె వారిని ఆమోదించడం వల్ల తమకు తాము పెద్ద కులం అని చెప్పుకుంటున్న వారి నాయకత్వం ఎదుగుతూ స్థిరపడుతూ వుంటుంది. అందువల్ల ఇది వారి ప్రతిభ కాదని, వారి ప్రత్యేక సామర్థ్యం కాదని తెలుసుకోవడం అవసరం. ఈ సామాజిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, ఈ కులవివక్ష తాలూకు కుల అంతరాల వ్యవస్థే వారు నాయకులుగా ఎదగ డానికి కారణమవుతున్నది.

కుటుంబంలో తమ్ముళ్ళు, చెల్లెళ్లు, అన్నల్లాగే ఎదగాలనుకుంటే అన్నలతో పోట్లాటతో పాటు దాన్ని అడ్డగించే తల్లిదండ్రుల్ని కూడా ఎదుర్కోవాల్సి వుంటుంది. ఫలితంగా కొంతకాలం తర్వాత రెండో కొడుకునైనా, చిన్న కొడుకునైనా ఇంటికి పెద్ద కొడుకు లాగే గౌరవిస్తారు. అలా నాయకత్వ లక్షణాలను, వ్యక్తిత్వ వికాసాన్ని సంతరించుకుంటారు. సరిగ్గా ఇలాగే చిన్న కులాల నుండి ఎదిగేవారు తమకు తాము పెద్ద కులాలుగా ప్రకటించుకునే వారిపై పోట్లాటతో పాటు మొత్తం సమాజం యొక్క భావజాలానికి ఎదురీది తమ నాయకత్వాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని సంతరించుకోవాల్సి వుంటుంది.

రెండుజన్మలు ఎత్తుతున్నవారు....

అందువల్ల చిన్నకులాల వాళ్లు ద్విజులు. ద్విజులు అంటే రెండు జన్మలు ఎత్తేవారు. ప్రస్తుతం ద్విజులు అంటే జంధ్యం వేసుకోకముందు ఒక జన్మ, జంధ్యం వేసుకున్న తర్వాత మరొక జన్మ అని కొన్ని కులాలను ద్విజులు అని పిలుస్తుంటారు. సరిగ్గా ఇదే అర్థంలో చిన్న కులాల వాళ్లు ద్విజులు అని చెప్పవచ్చు. వాళ్లు తమ చిన్న కులం తాలూకు నిర్ణయించబడిన లక్ష్యాలను, సంస్కృతిని, పరిమితులను అధిగమించి ఉన్నత లక్ష్యాలను, వ్యక్తిత్వ వికాసాన్ని, నాయకత్వ సామర్థ్యాన్ని సాధించుకోవడం జరుగుతుంది. అందువల్ల వాళ్లు ద్విజులౌతున్నారు. ఈ సమస్యలు లేని కులాలలో పుట్టినవారు వదిలించుకోవడానికి ఏమీలేదు. వాళ్లు ఏకజన్ములే.

సంస్థ, కుటుంబం ఒక ఐక్య సంఘటన

కుటుంబం తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఒక ఐక్యసంఘటన. ఒక సంస్థ, పార్టీ, ఉద్యమం, ప్రభుత్వం కూడా ఒక ఐక్యసంఘటనే. ఇందులోని సభ్యుల మధ్య ఉండేది ముందున్న చైతన్యానికి, సగటు చైతన్యానికి, వెనకబడిన చైతన్యానికి మధ్య ఐక్యసంఘటనే. ప్రతి సంస్థలో, పార్టీలో, ప్రభుత్వంలో కనీసం ఈ మూడుథల మనుషులు నాయకులుగా, కార్యకర్తలుగా, ఉద్యోగులుగా, అధికారులుగా వుంటారు.

నడిచే ఎద్దునే పొడుస్తారు

నడిచే ఎద్దునే పొడుస్తారు అనేది సామెత. ఎడ్లబండికి కట్టిన రెండో ఎద్దు మొదటి ఎద్దుతో పాటు నడవడం కోసం రెండో ఎద్దును కాకుండా నడిచే ఎద్దునే పొడుస్తుంటారు. అలాగే ఆయా పార్టీల్లో, ఉద్యమాల్లో, అధికారుల్లో, ఉద్యోగుల్లో పనిచేసేవారినే మరింత పొడుస్తుంటారు. ఏమీ చేయనివారిని ఏమీ అనరు. చేసేవారినే అంటారు. అందువల్ల నాయకత్వంలో ఉండేవారికి సానుభూతి లభించడం కష్టం. ఉదా||కు కుటుంబంలో తండ్రి పాత్ర పట్ల మిగతా అందరికీ కోపతాపాలే వుంటాయి. తల్లిని ప్రేమించినట్టుగా పిల్లలు తండ్రిని ప్రేమించరు.
తల్లి అధికారాన్ని చలాయించే స్థానంలో వుండదు. తండ్రి మాత్రమే వీటిని చూసుకోవాలి. అందువల్ల క్రమశిక్షణలో పెట్టడంలో భాగంగా, ఆర్థిక పరిమితుల్లో భాగంగా, కుల పరిమితుల్లో భాగంగా, కుటుంబాన్ని అదుపుచేస్తూ ఆధిపత్యం చలాయిస్తుంటారు. కనుక ఆ ఆధిపత్యాన్ని వ్యతిరేకించే క్రమంలో తండ్రి పట్ల వ్యతిరేకత, ఒక స్థాయిలో ద్వేషం కూడా పెరుగుతుంది.

పరిమితులు విధిస్తున్నది తండ్రి కాదు - సమాజమే

సమాజంలో ఎదగదల్చుకున్న అవకాశాలన్నిటినీ తండ్రి విధిస్తున్న పరిమితుల వల్ల కోల్పోయామని భావిస్తుంటారు. అవన్నీ తండ్రిపై సమాజం విధిస్తున్న పరిమితులని, తండ్రి రూపంలో సమాజమే విధిస్తున్న పరిమితులని వారికి తెలియదు. అందువల్ల నన్ను ఇంకా ఎక్కువ చదువుకోనివ్వలేదు అని ఇంకా ఎక్కువ డ్రెస్సులు కుట్టించలేదని, ఇంకా ఎక్కువ ప్యాకెట్‌ మనీ ఇవ్వలేదని జీవితమంతా విమర్శిస్తూనే వుంటారు. తండ్రి తెచ్చిందే తల్లి వండిపెడుతుంది. కాని తల్లి చాలా మంచిది అని అంటారు. ఇలా కుటుంబంలో జరిగిన పని విభజన ఒకరిని ఒకవిధంగా మరొకరిని మరొకవిధంగా భావించేట్టు చేస్తుంది. సమాజంలో కూడా పోలీసుల పట్ల తీవ్ర వ్యతిరేకతను చూడవచ్చు. కాని వారిని నడిపించే ప్రభుత్వాన్ని, నాయకులను అందుకు కారకులుగా
భావించడం చాలా తక్కువ.

కుటుంబంలో తండ్రి లేకపోతే కుటుంబ వ్యవస్థ ఇప్పుడున్న స్థితిలో ఉండడం అదృశ్యమవుతుంది. నేడు అమెరికా, రష్యా, యూరప్‌దేశాల్లో ఉన్నట్టుగా తల్లి తరఫున తండ్రి లేకుండా పిల్లలు పెరిగే కుటుంబ వ్యవస్థ రూపొందుతున్నది. తండ్రి పెత్తనం ఉండే వ్యవస్థను పితృస్వామిక వ్యవస్థ అని పిలుస్తారు. తల్లిపెత్తనం ఉండే నేటి వ్యవస్థను స్త్రీ స్వామ్య వ్యవస్థ అని పిలుస్తారు. కుటుంబంలో తండ్రి పోషించే పాత్రనే సమాజంలో ప్రభుత్వం, సంస్థలో నాయకత్వం పోషిస్తుంటారు. అలా పోషించలేని యెడల అది ఆ సంస్థగా ఉండడం అదృశ్యమవుతుంది. అది మరో రూపం దాల్చవచ్చు.

సంస్థ నిర్మాణాలన్ని పితృస్వామిక నిర్మాణాలే

అందువల్ల నేటి ప్రభుత్వం, సమాజం, సంస్థ, పార్టీ మొదలైన వ్యవస్థా నిర్మాణ రూపాలన్నీ కుటుంబంలోని తండ్రి పెత్తనం తాలూకు పితృస్వామిక వ్యవస్థ నిర్మాణాలుగా కొనసాగుతున్నాయి. ఇలాంటి వ్యవస్థా నిర్మాణాల్లో మగవాళ్లు నాయకులుగా ఎదగడం సులువవుతున్నది. అలాగే తమకు తాము పెద్ద కులాలుగా ప్రకటించుకునేవారికి నాయకత్వం ఎదగడం సులువవుతున్నది. ఇంటికి పెద్దకొడుకులైన వారి నాయకత్వం పెరగడం సులువవుతున్నది.

ఇలా కుటుంబ వ్యవస్థ మొదలుకొని సమాజంలోని అన్ని నిర్మాణాలు పితృస్వామిక, పురుషాధిపత్య, దోపిడీ కుల ఆధిపత్య వ్యవస్థలలో లాభం పొందే వారికనువుగా కొనసాగుతున్నాయి. ఈ వ్యవస్థా నిర్మాణాలను సమూలంగా మార్చడం కూడా స్త్రీలకు, చిన్న కులాల వారికి ఎంతో అవసరం. అలా మార్చకపోతే చిన్నప్పుడు చదువుకున్న నక్క-కొంగ, పల్లెం-కూజ-పాయసం కథ లాగా వుంటుంది. నక్క పల్లెంలో పాయసం పోసి కొంగను తాగమందట. కొంగకు అలా తాగరాదు. కొంగ కూజాలో పాయసం పోసి నక్కను తాగుమందట. నక్కకు అలా తాగరాదు. కూజాలో కొంగముక్కు పెట్టి పాయసం జుర్రింది. నక్క పల్లెంలోని పాయసాన్ని జుర్రింది. ఇలా ఎవరి సౌకర్యాల ననుసరించి వారు పాత్రలు తయారుచేసుకుంటారు. సామాజిక వ్యవస్థలు, నిర్మాణాలు, సంస్థలు, వాటి నాయకత్వాలు ఇలాంటి పాత్రలే. కులవ్యవస్థ అందులో ఒకటి.

అధికారంలో ఉన్నవారే ఉదారంగా ఉండే అవకాశం వుంటుంది. నాన్నను డబ్బులు అడిగితే ఇచ్చే అవకాశం అతనికే వుంటుంది. ఎందుకంటే సంపాదిస్తున్నది, ఖర్చు పెడుతున్నది అతడే కనుక. అందరి కోసం, అధికారం కోసం తొందరగా సమాజానికనువుగా మారే అవకాశం అధికారంలో ఉన్నవారికి ఎక్కువగా వుంటుంది. తండ్రి దోవతులు, తలరుమాళ్లు వదిలి ప్యాంటు షర్టుల్లోకి మారారు. కాని తల్లి చీర నుండి ప్యాంటుల్లోకి మారలేదు.
పాలితులు ఎందుకు వెనకబడిపోతుంటారు.

పూర్వం మగవాళ్లకు, ఆడవాళ్లకు ఇద్దరికీ సిగలుండేవి. ఇప్పుడు మగ వాళ్లు కటింగ్‌ చేయించుకుంటున్నారు. పాలితులు సంస్కృతిలో, చైతన్యంలో కాస్త వెనుకబడే అవకాశం వుంటుంది. అధికారంలో వుండేవాళ్లు అధికార స్థానంవల్ల కలిగే అవకాశాలను, అనుభవాలను, జ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా ఎదిగే అవకాశం వుంటుంది. వర్తమానాని కనువుగా మారే అవకాశం వుంటుంది. పాలితులు అవి అందక వెనకబడి పోతుంటారు.
అధికారం ఉంటే అందరు సమైక్యవాదులే అధికారంలో ఉండేవాళ్లు సమైక్యతను కోరవచ్చు. ఒక అధికారి, ఒక నాయకుడు తమశాఖలోని, సంస్థలోని సభ్యులను, సిబ్బందిని సమైక్యంగా పనిచేయాలని కోరుతారు. జాతీయ నాయకులు కూడా సమాజంలో సమైక్యతను కోరతారు. కాని అది తనను కూల్చేసేదిగా ఉండకుండా పని విభజన ద్వారాను, విభజించి పాలించడం ద్వారాను, విభేదాలను పెంచి పోషించడం ద్వారాను వాటినే జీవితంలో రొటీన్‌ విషయాలుగా మార్చేస్తారు. అవే అధికారంలో ఉండేవాళ్ల విచ్ఛిన్నతకు దారితీస్తే జాతీయ సమైక్యత, పార్టీ సమైక్యత, రాజ్యరక్షణ, దేశరక్షణ, భాషరక్షణ, సంస్కృతి రక్షణ పేరుతో తిరిగి సమైక్యతా వాదాన్ని చేతబూనుతారు. తద్వారా అధికారంలో ఉండేవాళ్లు ఎప్పుడూ అభివృద్ధికారకులుగా కనపడే ప్రక్రియ కొనసాగుతుంది. నిజంగా అభివృద్ధిని కోరేవారు, అసమానతల్ని నిర్మూలించాలనేవారు విచ్ఛిన్నకారులుగా వేర్పాటువాదులుగా, అభివృద్ధి నిరోధకులుగా కనపడే ప్రకియ కొనసాగుతుంది.

బిడియం నుండి నాయకత్వంగా

ఒకాయనకు ఎక్కడికి వెళ్లాలన్నా, ఎవరిని పలుకరించాలన్నా బిడియంగా ఉండేది. ఆడవాళ్లు కూడా చాలామంది బిడియంగా ఉంటారు. అలాంటి అమ్మాయికి అబ్బాయికి టీచర్‌, లెక్చరర్‌ క్లాస్‌రూమ్‌కు ఇంకా రావడంలేదని అడగాలని ఆరాటం. కాని బిడియం. సార్లేమో టీచర్స్‌ రూమ్‌లో గప్పాలు కొట్టుకుంటూ కూర్చున్నారు. ఆ అమ్మాయి లేదా ఆ అబ్బాయి నలుగురు క్లాస్‌మేట్లను బతిమాలి వెంట తీసుకుని క్లాస్‌రూమ్‌కు రమ్మని అధ్యాపకులను అడిగారు. అలా ఎప్పుడూ నలుగురిని వెంటేసుకోవడం బిడియంవల్ల అలవాటయ్యింది. కొందరు పల్లెల్లో చెరువుకు స్నానానికి, దొడ్డికి పోవడానికి కూడా ముగ్గురు నలుగురిని తోడు తీసుకుని వెళ్తారు. ఒకాయన పెళ్లిచూపు లకు కూడా ఒకరిద్దరు ఫ్రెండ్సును తీసుకెళ్లేవాడు. బట్టల సెలెక్షన్‌ కూడా తనకు సరిగ్గా రాదని ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌ను వెంట తీసుకుని వెళ్లేవారు.

కాలక్రమంలో నలుగురిని పోగుచేసుకోవడం ఎలానో వారికి తెలిసి వచ్చింది. వాళ్లు వెంట ఉండడం వల్ల ధైర్యం పెరిగివచ్చింది. తర్వాత వాళ్లే ఆ క్లాస్‌కు, స్కూల్‌కు నాయకులయ్యారు. తర్వాత ఉద్యోగాలు దొరికాక ఉద్యోగ సంఘాల నాయకులయ్యారు. ఇలా ఒకాయన బిడియంతో ఎప్పుడూ నలుగురిని వెంటేసుకుని తిరిగే క్రమంలో నలుగురిని కూడగట్టడం తెలుసుకుని తర్వాత నాయకునిగా ఎదిగి ఎమ్మెల్యే అయ్యాడు. గొప్ప నాయకుడిగా, వక్తగా గుర్తింపు పొందాడు. అతని క్లాస్‌మేట్స్‌ ఇప్పటికీ అరే వీడు చిన్నప్పుడు ఎప్పుడూ ఆడపిల్లలా సిగ్గుపడేవాడు. టీచర్‌ దగ్గరికి పోవడానికి కూడా ఉచ్చ పడేది. ఇప్పుడు చూడు ఎంత పెద్ద నాయకుడైండో? లక్షమంది మీటింగ్‌లో రెండు గంటలు ఎవరూ కదలకుండా ఎంత చక్కగా మాట్లాడ తాడో? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు.

ఒకటి గుర్తుంచుకొండి. ఏదో ఒక రంగంలో నైపుణ్యం సాధించినప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సాహిత్యం, కళలు, సంగీతం, గానం, నటన, చిత్రలేఖనం, శిల్పం, ఆటపాటలు, చెరువులో ఈతకొట్టడం, పాముల్ని చంపడం, చీకట్లో రాత్రిళ్లు ధైర్యంగా నడవడం మొదలైనవి ప్రత్యేక నైపుణ్యాలు. అలాగే వృత్తి నైపుణ్యాలు, కులవృత్తి నైపుణ్యాలు, డాక్టర్లు, టీచర్లు, ప్రధానోపాధ్యా యులు, కరెస్పాండెంట్‌లు, కులపెద్ద, క్లాస్‌ లీడర్‌, అమ్మతనం, తండ్రితనం, అన్నతనం, అక్కతనం మొదలైనవన్నీ ఆత్మవిశ్వాసం పెరగడానికి, వ్యక్తిత్వ వికాసం జరగడానికి దోహదపడతాయి.

English summary
An eminent writer BS Ramulu gives tips to overcome inferiority complex in personal life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X