వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చుట్టి రండి: పివి ప్రధాని అయ్యేవారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

స్వార్థం వదిలితే ఈ లోకమంతా నీదే. ఇల్లు, కుటుంబం, ఉన్న ఊరు వదిలితే నీ దృష్టి విశాలమౌతుంది. కొత్త ఊళ్లు, కొత్త పరిసరాలు, మనుషులు, సంబంధాలు కొత్త అనుభవాలనిస్తాయి. ఉన్న ఊళ్లోనే ఉంటే బావిలో కప్పలా జీవితం గడిచిపోతుంది. ఇల్లు వదిలితే ఈ ప్రపంచమంతా నీదే.

ఇల్లు వదిలి రచ్చ గెలిచాడు బుద్దుడు

కుటుంబం ఒక బావి. కుటుంబానికే పరిమితమైతే బావిలో కప్పలా అదే ప్రపంచం అనుకుంటారు. ఊరు దాటకపోతే, ఆ ఊరే ప్రపంచం అనుకుంటారు. లోకాన్ని చూస్తేనే, లోకం ఎలా ఉందో తెలుస్తుంది.

మగవాడు తిరగక చెడ్డాడు. ఆడది తిరగిచెడింది అని ఎనకటి సామెత. ఆడవాళ్ళు కూడా తిరగకనే చెడ్డారు. తిరిగితే లోకం తెలుస్తుంది. బుద్దుడు ఇల్లు వదిలి, ఊరు వదిలి ప్రపంచాన్ని గెలిచాడు. ఆర్యులు ఇండియాను గెలిచారు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ ప్రపంచమంతా పర్యటించి పర్యటన శాస్త్రాన్ని రూపొందించాడు.

పర్యటన వల్ల ఇతర ప్రాంతాలు, మానవ సంబంధాలు పరిచయమౌతాయి. రకరకాల మనుషులు, సంస్కృతి, భాష పరిచయమౌతాయి. జీవితమంటే కేవలం ఇల్లు, కుటుంబమే కాదని అర్థం అవుతుంది. విశాల ప్రపంచం ఇంకా ఎంతో వుందని తెలుస్తుంది. తద్వారా గొప్ప ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ప్రపంచాన్ని చూస్తూ జీవిస్తూ ఇంటిలో, ఊళ్లో గౌరవం పొందాలి.

Personality development: How PV became PM?

తొమ్మిదవ శతాబ్దంలో అక్క మహాదేవి, పద్నాలుగో శతాబ్దంలో కబీర్‌, గురురవిదాస్‌, వేమన, పదిహేడవ శతాబ్దంలో పోతులూరి వీరబ్రహ్మం ఉన్న ఊరు వదిలి అనేక రాజ్యాలు, ప్రాంతాలు తిరిగారు. గొప్ప జ్ఞానవంతులు అయ్యారు. సమాజానికి ఎంతో జ్ఞానం అందించారు. సమాజాన్ని మేలు కొల్పారు.

ఇంట గెల్చి రచ్చ గెలువు అని అంటారు. అది ఎలా సాధ్యం? కుటుంబం బంధనాలు అనే యిల్లు గెలవడం ఎలా సాధ్యం? ఇంట గెలవడం అసాధ్యం. ఇంట్లో తండ్రిపెత్తనం ఉంటుంది, తల్లి పెత్తనం ఉంటుంది, అన్నల పెత్తనం ఉంటుంది, అక్కల పెత్తనం ఉంటుంది. ఇంకా మేనమామల పెత్తనం ఉంటుంది, మేనత్తల పెత్తనం ఉంటుంది. వదినల పెత్తనం ఉంటుంది, లేదా యారాండ్ల పెత్తనం ఉంటుంది.

ఇల్లు వదులు, రచ్చ గెలువు. కులం పరిధిలోంచి బయట పడండి. మీ తాలూకా, జిల్లా పరిధిలోంచి బయట పడండి. ఈ విశాల విశ్వం మీదే. దినపత్రికల జిల్లా పేజీలు మిమ్మల్ని మీ ఊరికి పరిమితం చేస్తున్నాయి. మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని మీ జిల్లా, తాలూకా పేజీల స్థాయిని మించి ఎదగకుండా చేస్తున్నాయి. ఇంగ్లీషు దినపత్రికలను, వార పత్రికలను చూడండి. చూస్తే తెలుగు దినపత్రికలు మిమ్మల్మి, మీ చూపును ఎలా నిలిపి వేస్తున్నాయో, కుదిస్తున్నాయో తెలుస్తుంది.

తామరాకు మీది నీటి బొట్టులా ఈ సమాజంలో, కష్టసుఖాల్లో బతకడం అవసరం అని, అప్పుడే జీవితానందం అందుతుందని యోగ, ధ్యాన టీచర్లు చెప్తుంటారు. దీని సాధ్యాసాధ్యాలు ఆలోచించవలసి ఉంది.

''ఈ ఇల్లు నాదని భ్రమసేవు? ఏఇల్లు నీది మనసా !'' అని తత్వగీతాలు ఎన్నో ఉన్నాయి. ఆలు పిల్లలు ఇల్లు నీవని భ్రమలేలా? ఎవరు నీ వెంటరారు మనసా? అనే తత్వం ప్రజల్లో ప్రాచుర్యంలో ఉంది. దీన్ని ఫెమినిస్టులు పురుష భావజాలంఅంటారు.

ఇల్లు తల్లి వంటిది - ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే

సొంత ఊరు, సొంత ఇల్లు కన్నతల్లి వంటివి. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ఊరికి సర్పంచైనా నా కళ్ల ముందు చెడ్డీలేసుకోక తిరిగినోడు అని అంటారు. కన్నతల్లి, ఉన్న ఊరు నిన్ను ప్రేమిస్తుంది. లాలిస్తుంది. నీవు జీవితమంతా పోరాటం చేసినా మీ అన్న కన్నా, మీ అక్క కన్నా పెద్దవాడివి కాలేవు. వాళ్లెపుడూ నిన్ను తమ్ముడు, చెల్లెలుగానే చూస్తారు. అందువల్ల ఇంటగెలవడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు.

నారు పీకి నాటు వేస్తే మొక్క ఎదుగుతుంది...

స్త్రీ తల్లిగారి ఇల్లు వదిలి అత్తగారి ఇల్లు గెలుచుకుంటుంది. తల్లిగారింట్లో ఎప్పుడూ చిన్నపిల్లే, ఎప్పుడూ కూతురే, బాల్యమే. అత్తగారింట్లో భార్యగా, కోడలిగా, అత్తగా, తల్లిగా, వదినగా, నాయనమ్మగా ఎన్నోవిధాలుగా ఎదుగు తుంది. తల్లిగారింట్లో ఉన్నంతకాలం కూతురుగానే ఉండిపోతుంది. అలాగే నారు మడి నుండి పైరు పుట్టినచోటే ఉంటే పెరగదని అక్కడి నుంచి తీసి ఇతర మళ్ళలో నాట్లువేస్తారు. ఇల్లు, సొంత ఊరు నారుమడి వంటివి. అక్కడే ఉంటే పెరుగుదల ఆగిపోతుంది. ఉన్న ఊరువదిలి ఇతర ఊళ్ళల్లో, స్కూళ్ళల్లో, హాస్టళ్ళలో చేరి చదువుకునే విద్యార్థులకు ఊళ్ళోనే, ఇంట్లోనే ఉండి చదువుకొనే విద్యార్థుల్లో చొరవ, జ్ఞానంలో ఎంతో వ్యత్యాసం
ఉంటుంది. పదిమందిలో తిరిగే విద్యార్థులకు ఎన్నో విషయాలు తెలుస్తాయి.

బయటి ప్రపంచాన్ని గెలుచుకునే క్రమంలో ఇంట్లో కూడా గెలుపు దానంతట అదే సంభవిస్తుంది. నా కొడుకు, నా తమ్ముడు, నా చెల్లెలు, మా ఊరోడు గొప్పవారు అయ్యారు అని తల్లిదండ్రులు, ఊరివాళ్లు చెప్పుకుని బతుకుతారు.
అసలు గెలుపంటే ఏమిటి? రెండు వర్గాలుగా విడిపోయినప్పుడు ఒక వర్గం మరొక వర్గంపై పోరాటం చేసినప్పుడు గెలుపు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. నీ ఇల్లు ఒకటే. నీ కుటుంబం ఒకటే. నీ ఊరు ఒకటే. ఒకటిగా ఉన్నదాన్ని రెండుగా చీల్చి, ఒక భాగాన్ని గెలుచుకోవడం కోసం మరో భాగాన్ని అణిచివేయడం కోసం ఇంట గెల్చి, రచ్చ గెలువు అనే సామెత పుట్టింది.

నీ మనస్సులో ఉండే ఆరు చెడులైన ఈర్ష్వ్య, క్రోధం, అసూయ, మద, మోహ, మాత్సర్యాలు, ద్వేషం మొదలైన అరిషడ్వర్గాలను జయించాలని నీ మనస్సే, నీ శరీరమే ఒక ఇల్లు అనే భావన సాధువులు, సన్యాసులు చెప్తుంటారు. అరిషడ్వర్గాలను జయించడం ఎలా సాధ్యం? వాటిమీద అనగా నీమీద నీవు నిరంతరం పోరాటం చేసుకుంటూ ఉండిపోవడం. దాన్ని గెలవడం సాధ్యం కాదు, ఆ తర్వాత రచ్చ గెలవడం అనే సమస్య ఉత్పన్నం కాదు. అరిషడ్వర్గాలను జయించడం అనేది ఒక ఆదర్శం మాత్రమే.

మనస్సు ఇల్లయితే బయటి దుమ్ము ధూళి నిత్యం మనస్సుపై పడుతూనే ఉంటుంది. వాటిని గెలవడం, అంటే రోజూ ఊడ్చి, అలికి, ముగ్గులేసే ఇల్లాలుగానే మిగిలిపోవడం. అందువల్ల ఇల్లు గెలిచి రచ్చగెలవడం ఎన్నడు సాధ్యం కాదు. రచ్చగెలుస్తూ ఇల్లు గెలవడం సులభం. బుద్దుడు దీన్ని ఆచరించి చూపాడు. సామాజికంగా ఎదుగుతున్న క్రమంలో మనిషి తననుతాను ఉన్నతీకరించు కుంటాడు. తాను ఎదిగే క్రమంలోనే మనస్సులోని పాతభావాలు, సంస్కారాలు వదిలించుకుంటాడు. ఉన్నతమైన మానవుడుగా ఎదుగుతాడు.

భారత జాతీయోద్యమంలో జాతీయ నాయకులుగా పనిచేసినవారు చాలామంది లండన్‌లో ఉన్నత విద్యను అభ్యసించినవారే. వాళ్లు ఉన్న ఊళ్లోనే ఉంటే జాతీయ నాయకులు అయ్యేవారా? గాంధీ దక్షిణాఫ్రికా వెళ్లాడు. అంబేడ్కర్‌ అమెరికా, లండన్‌లలో చదివాడు. అలా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే ఆ ఊరి సర్పంచ్‌ గానో, ఓడిపోయిన సర్పంచ్‌ గానో మిగిలి వుండేవారు. ఊరికే పరిమితమైతే, ఇంటనే గెలవాలి అనుకుని కూర్చుంటే అక్కడే
ఆగిపోతారు.

ఇంటికే పరిమితమై ఆలోచిస్తే
ఆవగింజంత సమస్య ఆకాశమంత కన్పిస్తుంది...

కుటుంబానికే పరిమితమై, ఇంటికే పరిమితమై ఆలోచిస్తే ఆవగింజంత సమస్య ఆకాశమంత కన్పించి నిన్ను భయపెడ్తుంది. ముప్పైవేల అప్పులకు భయపడి ఎందరో పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ముప్పై వేల బాకీ చుట్టే ప్రపంచమనుకున్నాడు. అదే సముద్రమంత, ఆకాశమంత ఎత్తు కనపడి భయపెట్టింది. ఇది కుటుంబం పరిధిలో, ఇంటి పరిధిలో ఆలోచిస్తే కలిగిన పరిష్కారం.

విశాల ప్రపంచాన్ని చూస్తే ఎంత గొప్ప సమస్య అయినా చిన్నదిగా కనపడు తుంది. సమస్యనుండి వెలికివచ్చి సమస్యకు పరిష్కారాన్ని కనుక్కుంటారు. కుటుంబానికి పరిమితమై ఆలోచిస్తే సమస్యనుండి బయట పడకుండా, సమస్యలో భాగమవుతారు. తానే సమస్యగా మారతారు.

డిప్రెషన్‌కు గురవుతారు. విశాల ప్రపంచాన్ని గమనించాలి. అందులో ఒక బిందువుగా బతుకుతున్నామని తెలుసుకోవాలి.

ఇందిరాగాంధీ 1980లో ఉత్తర భారతదేశంలో ఓడిపోయాక మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మెదక్‌ జిల్లా నుండి పోటీ చేసి గెలిచారు. ప్రధానమంత్రి అయ్యారు. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్‌ నుండి ఎన్నికై ప్రధానమంత్రి అయిన మొదటి వ్యక్తి ఇందిరాగాంధీ. అలాగే పి.వి. నరసింహా రావు కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో ఓడిపోయాడు. మహారాష్ట్రలోని రాంటెక్‌లో, రాయలసీమలోని నంద్యాలలో గెలిచాడు. ప్రధానమంత్రి అయ్యాడు. ఇక్కడే నా ఇల్లు, నా ఊరు, నా వాళ్లు అనుకుంటూ కూర్చుంటే గెలుపు సాధ్య మయ్యేదా? ప్రధానమంత్రి అయ్యేవాడా?

ఏదేశమేగినా నీ ఇల్లు, నీ ఊరు, నీ కన్న తల్లి, నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. కొత్త ఊళ్లో కొత్త జీవితం, కొత్త వ్యక్తిత్వంతో కొత్తగా ప్రారంభించ వచ్చు. అందువల్ల ఉన్న ఊరువదలండి. కొత్త ఊళ్లు తిరగండి. దేశమంతా పర్యటించండి. ఇల్లు వదలండి. రచ్చ గెలవండి. రచ్చ గెలిచిన వ్యక్తిత్వంతో, నాయకత్వంతో ఇల్లు కూడా గెలవండి.

English summary
An eminent writer BS Ramulu in his personality development article stressed the need of roaming around the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X