వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యక్తిత్వ వికాసంలో యోగ, ధ్యానం

By Pratap
|
Google Oneindia TeluguNews

ఓషో రజనీష్‌ వద్ద శిక్షణ పొంది ఋషి ప్రభాకర్‌ రూపొందించిన సిద్ధ సమాధి యోగ (ఎస్‌.ఎస్‌.వై.), అడ్వాన్స్‌ మెడిటేషన్‌ కోర్స్‌ (ఎ.ఎమ్‌.సి.) అనే యోగ ధ్యాన శిక్షణను 1993లో పొందాను. దాంతో ఆరోగ్యం కుదుట పడింది. కిడ్నీలో రాళ్లు కరిగిపోయాయి.

మానసికంగా అనేక ఒత్తిడులు తగ్గిపోయాయి. వందలాది గ్రంథాలు చదివిన బరువు భారం అన్‌ లెర్నింగ్‌తో తొలగించుకున్నాను. నాలోగల అహంకారాన్ని గమనించాను. మా శిక్షణలో టీచర్‌గా పనిచేసిన మనోహర్‌ అనేక శిక్షణలు కూడా అదనంగా పొందిన అనుభవం కలిగినవాడు కావడంతో మరింత ఆనంద దాయకంగా క్లాసులను నిర్వహించారు.

బిక్షలో ఏముంది...

ఎస్‌.ఎస్‌.వై. అనేది 15 రోజులపాటు రోజు మూడు గంటలు శిక్షణ. ఇందులో పంచకోశ శుద్ధి శిక్షణ ఉంటుంది. తర్వాత మూడు రోజులు ఎ.ఎమ్‌.సి. ఫుల్‌ టైం రెసిడెన్షియల్‌ కోర్స్‌. ఎస్‌.ఎస్‌.వై. చేశాక ఎ.ఎమ్‌.సి.లో చేరడానికి ముందు టీచర్లు ఒక నియమం పెట్టారు. కనీసం 20 మంది వద్దనైనా బిక్షాటన చేసి ఆ బిక్షలో లభించినదాన్ని గురుదక్షిణగా ఇవ్వాలని అన్నారు. మొదట బిక్షాటన చేయడం సిగ్గనిపించింది. ఏదో ఉద్దేశించే ఈ బిక్షాటన చెప్పారని పట్టుదలతో ప్రారంభించాను. ఒకటి, రెండూ, మూడు ఇలా 10 మందిని అడిగాక సిగ్గు, అహం తొలగిపోయింది. వందమందిని బిక్ష అడిగాను. బిక్ష అడగక ముందుకు బిక్ష అడిగిన తర్వాత స్వభావంలో, వ్యక్తిత్వంలో ఎంతో మార్పు కనపడింది. ఎంతో బరువు దిగిపోయింది.

యోగా, ధ్యానంలో శిక్షణ...

Personality development: Importance Yoga

ఎస్‌.ఎస్‌.వై.లో ఆరవ రోజు ఏదైనా మురికివాడకు వెళ్లి రోడ్లు ఊడవడం, మురికి కాలువలు తీయడం, ఎత్తిపోయడం చేసే కార్యక్రమం పెట్టారు. అప్పుడొకసారి ఇలాగే భేషజం నుండి బయట పడేశారు. ఆ మరుసటి రోజు ఒకరోజంతా ధ్యాన శిక్షణ ఏర్పాటు చేశారు. ధ్యానం చేస్తూ మనస్సు ప్రశాంతంగా ఉండే అభ్యాసం చేశాను. ఒక అద్భుతం జరిగింది. అంతదాకా తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రాలు, ప్రసంగాలు చేస్తూ కథలు రాయడానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు.

ఎస్‌.ఎస్‌.వై., ఎ.ఎం.సి. శిక్షణలు పూర్తి చేశాక ఇక విరివిగా మళ్లీ కథలు రాయడం మొదలైంది. ఎంతోమంది బిడియస్తులు కూడా, ఎన్నడూ ఉపన్యాసాలు ఇవ్వనివారు, పాటలు రాయనివారు ఉపన్యాసాలు ఇచ్చారు. పాటలు రాశారు. ఎన్నడూ డ్యాన్స్‌ చేయనివారు డ్యాన్స్‌ చేశారు. ప్రకృతిని చక్కగా వర్ణించారు. గడ్డిపూలతో సంభాషించారు. అలా మనిషి తనకు తాను స్వయంగా నేర్చుకున్న పిరికితనం, బిడియం వదిలి స్వేచ్ఛా జీవులయ్యారు.

ఈ క్షణంలో చనిపోతున్నావు...

నీవు ఈ క్షణంలో చనిపోతున్నావు. నీకు అత్యంత సన్నిహితులైనవారికి ఒక ఉత్తరం రాయి... అని ఎ.ఎం.సి.లో ఒక శిక్షణ. ఆ ఉత్తరం రాసే క్రమంలో అందరూ ఏడ్చేవారు. అలాగే నీవు బాగా ద్వేషించేవారిని గురించి రాయమన్నారు. పదిమంది మిత్రులుగురించి రాయమన్నారు. పదిమంది శత్రువుల గురించి రాయమన్నారు.

ఆదర్శాలు, లక్ష్యాలు రాసి గోడకు కనపడేటట్టు పెట్టు...

ఎస్‌.ఎస్‌.వై. ఎ.ఎం.సి. శిక్షణలో నీవు జీవితంలో సాధించదలుచుకున్న లక్ష్యాలను చక్కగా, అందంగా స్కెచ్‌ పెన్‌తో రాసి బెడ్‌రూంలో, ఆఫీసులో పెట్టుకోవాలన్నారు. వాటిని వీలైనప్పుడల్లా చూడాలని చెప్పారు. ఇవి ఎంత గొప్ప మార్పు తెచ్చాయంటే అది మాటలకు అందదు. మామిడిపండు రుచి తెలియనివారికి ఎన్ని రకాల పోలికలు చెప్పినా ఆ రుచి అందదు. మామిడి పండు స్వయంగా తినడం ద్వారానే ఆ రుచిని తెలుసుకోవడం సాధ్యం. యోగ ధ్యానం అనుభవాలు స్వయంగా పొందాల్సినవే. యోగ ధ్యాన శిక్షణ శిబిరాలు... ఎన్నో జరుగుతుంటాయి. వాటిల్లో చేరి శిక్షణ పొందితే ఎంతో ఉపయోగం.

ఏదీ చదవకూడదు. టీవీలు, సినిమాలు చూడకూడదు...

ఎస్‌.ఎస్‌.వై., ఎ.ఎం.సి. శిక్షణా కాలంలో దినపత్రికలు, వారపత్రికలు, పుస్తకాలు చదవకూడదని, రేడియో, టీవీలు, సినిమాలు చూడకూడదని, ఇతరులతో ఎలాంటి చర్చలు చేయకూడదని, ఏ విషయంపట్ల సంఘర్షించ కూడదని, రోజువారీ ఆహారం తీసుకోకుండా తాము చెప్పిన ఆహారం మాత్రమే తీసుకోవాలని చెప్పారు. 15 రోజులు పత్రికలు, రేడియో, టీవీలు, సినిమాలు చూడకుండా, ఎలాంటి పుస్తకాలు చదవకుండా ఉండడం మాటలు కాదు. దానివల్ల జరిగే పరిణామం ఏమిటో మీరు స్వయంగా ఈ పని చేస్తేనే తెలుస్తుంది.

నేను యోగ ధ్యానం శిక్షణ చేశాక నా పైగల అధ్యయన భారం, అను భవం, అధికారం వల్ల మనస్సుపై ఎంతో బరువు పడిందని, అది తొలగి పోవడం గమనించాను. అంతకుముందు ఎంతో బరువు అనిపించే శరీరం ఎంతో బరువు తగ్గినట్టుగా ఫీలయ్యాను. బరువు చూసుకుంటే పెద్దగా ఏమీ తగ్గలేదు. శరీరం, మనస్సు దూదిలాగ గాలిలో తేలిపోయేంత తేలికగా మారిపోయింది. ఎంత ఆనందం వేసిందో... మళ్లీ అలాంటి శిక్షణ పొందాలని... శిక్షణ పొందే వారికి సేవలు చేస్తూ... వచ్చాను. అలాగే సత్యనారాయణ గోయెంకాగారి విపాసన, ఓషో రజనీష్‌, సుభాష్‌ పత్రి వంటివారి యోగ ధ్యానం శిక్షణలు కూడా కొంత తెలుసుకున్నాను.

పుస్తకాలు చదివినా... శిక్షణ అవసరం...

చదవడం ద్వారా ఏడు శాతం మాత్రమే అందుతుంది అని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అందువల్ల పుస్తకాలు చదివినా... శిక్షణ అవసరం. అనుభవం, ఆచరణ అవసరం. ప్రయోగం అవసరం. శిక్షణ ద్వారా, అనుభవం, ఆచరణ, ప్రయోగం ద్వారా 70 శాతం దాక ప్రయోజనం ఉంటుంది. కేవలం పుస్తకాలతోనే అంతా పొందగలిగేదైతే, స్కూళ్ళు కాలేజీలు, యూనివర్శిటీలు, విద్యావ్యవస్థ, శిక్షణా కేంద్రాలు ఎందుకు? డిస్టెన్స్‌
ఎడ్యుకేషన్‌తో పుస్తకాలు చదివి పాస్‌ కావచ్చు. ప్రైవేటుగా చదివి పాసయ్యే వారు కాలేజీలో, యూనివర్శిటీ క్యాంపస్‌లో చదివేవారు ఒకటేనా...? మంచి స్కూలు, మంచి క్యాంపస్‌ కావాలని ఎందుకు కోరుతుంటారు...? వాతావరణం, పరిసరాలు, సహచర్యం, గొప్ప ప్రభావం వేస్తాయి. పల్లెల్లో చదివేవారికి, నగరంలో చదివేవారికి తేడా ఉంటుంది.

పుస్తకాలు కేవలం చదవడానికి పనికివస్తాయి. శిక్షణ అనేది ఆచరణతో కలిపి నేర్చుకునేది. ఎలా ఆచరించాలో నేర్పేది కూడా. అందువల్ల ఎన్ని పుస్తకాలు చదివినా శిక్షణా తరగతులు ఎంతో అవసరం. శిక్షణ పొందిన తర్వాత కూడా కొంతమంది మిత్రులు ఒక బృందంగా కలుసుకుంటూ ఉండడం వాటిని, ప్రాక్టీసు చేయడం ద్వారా నిత్యం మనపై పడే బయటి ప్రభావాల నుండి బయట పడతాం. మనపై మనం కంట్రోల్‌ సాధించుకుంటాం. స్వీయ చైతన్యాన్ని పొందుతాం. నిత్యం స్వీయ చైతన్యాన్ని పొందడానికి బయటి ప్రభావాలు నిరంతరం అడ్డగిస్తుంటాయి. తమవైపు ఆకర్షిస్తుంటాయి.

ఎస్‌.ఎస్‌.వై., ఎ.ఎం.సి. శిక్షణ ఒక సమగ్ర వ్యక్తిత్వ వికాస శిక్షణ

ఋషి ప్రభాకర్‌ గురూజీగా ప్రతిపాదించి రూపొందించిన ఎస్‌.ఎస్‌.వై., ఎ.ఎం.సి. వంటి కోర్సు మరొకటి నా జీవితంలోకి అనుభవంలోకి రాలేదు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. మొదలుకొని, ఉపాధ్యాయ శిక్షణ, ఉద్యోగ శిక్షణ, ఉద్యమాల శిక్షణ, విప్లవాల శిక్షణ, మార్క్సిజం, లెనినిజం, మావోయిజం శిక్షణ తరగతులు, అంబేడ్కరిజం, స్త్రీవాద, విప్లవ రచయితల శిక్షణ తరగతులు, క్రిషి, రాందేవ్‌ బాబా పతంజలి యోగా, భారతీయ యోగా సంస్థాన్‌ శిక్షణ తరగతులు మొదలైన ఎన్నో రకాల శిక్షణలను పొందాను. ఇచ్చాను. అయితే వాటిల్లో ఇంత సమగ్రమైన అనుభవాలు సాధ్యం కాలేదు.

ఎస్‌.ఎస్‌.వై., ఎ.ఎం.సి. ల శిక్షణ ఒక సమగ్ర వ్యక్తిత్వ వికాస శిక్షణ. శరీరం, మనస్సు, ఆరోగ్యం, ఆహార అలవాట్లు, ఆలోచన, స్పందన వంటి పంచకోశ శుద్ధి అద్భుతంగా జరుగుతుంది. నా జీవితంలో ఇంత గొప్ప శిక్షణ మరెందులోనూ కనపడలేదు. నేను నా శిక్షణా తరగతుల్లో, రచనల్లో ఈ అనుభవాలన్నిటిని సమన్వ యిస్తూ, సంశ్లేషిస్తూ, రచనలను, శిక్షణా తరగతులను రూపొందిస్తూ వచ్చాను. మీరు కూడా ఇలాంటి యోగాధ్యాన శిక్షణ తరగతులు అందుబాటులో ఉన్న వాటిని పొందితే ఎంతో ఉపయోగం.

రెండు జట్లుగా విడగొట్టడం అవసరమా...?

రెండు జట్లుగా విడగొట్టకుండా అందరూ కలిసి ఆడే ఆటలను బాగా ప్రాచుర్యంలోకి తేవాలి. అలాంటి ఆటలే ఆడాలి. రెండు జట్లుగా విడగొట్టి ఆడాల్సి వచ్చినప్పుడు ప్రతి ఆటలో జట్లనుండి సభ్యులను ఎప్పటికప్పుడు ఆజట్టునుండి ఈ జట్టుకు, ఈ జట్టునుండి ఆ జట్టుకు మార్చుతూ ఉండాలి. ఆర్‌.ఎస్‌.ఎస్‌. శిక్షణలో, యోగాధ్యాన శిక్షణలో ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటారు. చివరకు ఆర్‌.ఎస్‌.ఎస్‌.లో అందరు కలిసి గెలిచిందెవరు అని నినాదం ఇస్తూ మళ్ళీ వాళ్ళే వాళ్ళు అంటుంటారు. యోగాధ్యానాల్లో వాళ్ళు అనే భావనకూడా ఉండదు.
యోగాధ్యాన శిక్షణలో పరస్పరం స్నేహం కోసం కొన్ని ఆటలు ఆడిస్తారు. ఏకాగ్రత పెంచడం కోసం కొన్ని ఆటలు ఆడిస్తారు. నమ్మకం ఎంత గొప్పదో తెలపడానికి కొన్ని ఆటలు ఆడిస్తారు.

నమ్మకం ఎంత గొప్పది...

ఒకరు కళ్లు మూసుకొని నడవాలి. మరొకరు వారిని నడిపించాలి. ఇదొక ఆట. నడిపించేవాళ్లు చాలా ప్రమాదకరమైన అంచులవెంట, లోయల వెంట కూడా నడిపిస్తారు. కళ్ళు మూసుకున్నవారు ఎంతో నమ్మకంగా నడుస్తారు. ఆ నడక పూర్తయ్యాక తాను నడిచివచ్చిన దారి చూశాక ఆశ్చర్యపోతారు. భయపడతారు. ఇంత భయంకొల్పే దారుల్లో నడిచానా అని ఆశ్చర్యపోతారు. ఈ ఆటలో రెండు పరిణామాలు జరుగుతాయి. ఒకటి ఎదుటివారిని పూర్తిగా నమ్మితే వారు జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళాల్సిన కర్తవ్యం. నమ్మకంతో ఎంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా భయం కొల్పే దారుల్లో కూడా హాయిగా నడవడం సాధ్యమే.

ఇలా జీవితంలో నమ్మకం ముఖ్యం. నీవు నమ్మితే జరుగుతుంది. నీవు నమ్మిందే జరుగుతుంది. కళ్ళు మూసుకున్నపుడు హాయిగా నడిచావు. కళ్లు తెరిచాక నేను నడవలేను అనే భయాన్ని సృష్టించుకున్నావు. అపుడు నడవలేవు. భయపడిపోతావు. కనుక భయాలు, సంకోచాలు స్వయంగా మనకు మనమే కష్టపడి నేర్చుకున్నాము. వాటిని వదిలించుకోవడం ఎలాగో ఈ ఆటలో తెలుస్తుంది.

ఎస్‌.ఎస్‌.వై., ఎ.ఎం.సి., ఎం.ఎం.వై., ఓషో వంటి ధ్యాన శిక్షణలో దైవపూజ, మానవపూజ కూడా ఒక కార్యక్రమంగా ఉంటుంది. దైవపూజ ఇష్టం లేకపోతే చేయకండి. చేయకపోయినా ఆ శిక్షణలో వచ్చే ప్రయోజనం తగ్గేదేమి లేదు. నిజానికి యోగా ధ్యాన శిక్షణకు దైవ భావనకు సంబంధమే లేదు. ప్రజలు అలవాటైన జీవితంనుండి తొందరగా ధ్యానంలోకి రావడానికి వాటిని ఆసరాగా చేసి చెప్తుంటారు.

విభిన్న రూపాల్లో ధ్యానం...

భారతీయ తత్వ శాస్త్రాల్లో ఆస్తిక, నాస్తిక శాస్త్రాలని పరిశీలిస్తుంటారు. ఈ రెండూ పాయలే కాకుండా, మూడవ పాయకూడా ఉంది. అదే ధ్యానం, యోగ, వైద్యం, ఆరోగ్యం.

ధ్యానాన్ని ఆస్తికులు దైవభక్తిలో, పూజలో భాగంగా చేశారు. అలా ధ్యానం అనేది పూజలో భాగంగా కొనసాగుతూ వస్తున్నది. ముస్లిముల నమాజులో అనేక యోగా ప్రక్రియలు ఉన్నాయి. మౌనంలో శక్తి అనే అంశం పై ఋషికేష్‌ శివానంద, జిడ్డు కృష్ణమూర్తి, విపాసన ధ్యానం చాలా గొప్పగా వివరిస్తారు. శిక్షణ ఇస్తారు. 'పవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌' అనేది ధ్యాన ప్రక్రియలో మౌలికాంశం. పూజలో, నమాజులో, మౌనంలో ఈ 'పవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌' ప్రక్రియ కొనసాగుతుంది. దీన్ని ఆధునిక పరిభాషలో కాస్త ఏకాంతంగా ఉంటాను అని అంటుంటారు. ప్రైవసీ ఉండాలంటారు.

అనేక సంస్థల ప్రతినిధులుగా ఒక బృందంగా మేము దేశ వ్యాప్తంగా 'అఖిల భారత ప్రజా సమాచార సాంస్కృతిక పర్యటన' చేస్తున్నపుడు మా బృందంలో సభ్యుడైన ఒక వాగ్గేయకారుడు అపుడపుడు కొన్ని పాటలు
రాశారు. అయితే మరొక సభ్యుడు ప్రముఖ వచన కవి కవిత్వం రాయలేదు. ఎందుకు రాయటంలేదని నేను అడిగాను. 'బి.ఎస్‌...! ఎంతైనా సృజన, కవిత్వం అనేది సమూహంలో కాస్త ఏకాంతం ఉన్నపుడే సాధ్యం' అన్నాడు. మనం నెలల తరబడి 24 గంటలూ కలిసే ఉంటున్నాం. మనకు ఏకాంతం అంటూ అసలు లేదు. సమూహంలో ఒంటరి అనే ఒక ప్రైవసీ థ ఉన్నపుడే తనలోకి తాను వెళ్ళి, తన సృజన శక్తులను వెలికి తీయడం సాధ్యపడుతుంది అని అన్నారు. మూడ్‌ అంటే ఇదే... ధ్యానం అంటే ఇదే. 'పవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌' గురించి జిడ్డు కృష్ణమూర్తి, 'థాట్‌ పవర్‌' గురించి ఋషికేష్‌ శివానంద ఎంతో అద్భుతంగా చెప్పారు. విపాసన శిక్షణ ద్వారా తెలుసుకునేట్టు చేశారు.

'పవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌'...

ఇలా 'పవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌' ఏకాంతంగా వుండడం, పార్కుల్లో కాస్త సేద తీరడం, పొలాల వెంట వెళ్ళడం, వగైరా ఇలాంటి ఏకాంతాన్ని, ధ్యానాన్ని, ప్రశాంతతను అందిస్తాయి. ప్రశాంతత లేకపోతే మనస్సు చికాకు అవుతుంది. వ్యక్తిత్వం దెబ్బతింటుంది. నిద్ర ఎంత అవసరమో, ఏకాంతం, ప్రశాంతత అంత అవసరం. దైవభక్తులు పూజ రూపంలో కొంత ప్రశాంతత పొందు తారు. స్నానం స్వయంగా ఒక హాయినిస్తుంది. స్నానం ఒక ఫ్రెష్‌నెస్‌ని ఇస్తుంది. ధ్యానం అంటే మనస్సుకు స్నానం.

English summary
An eminent writer BS Ramulu stressed the need of yoga in personality development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X