వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలిసి పని: చెప్పులేసుకుని నడిచేవారితో ఎలా?

By Pratap
|
Google Oneindia TeluguNews

'దాచిన మొగడా వేరుందామా' అని అందట వెనకటకి ఒక కొత్త కోడలు. పోట్లాడి వేరుపడ్డాక 'ఏం దాచావే తీయి' అన్నాడట భర్త. నా రెక్కలు దాచాను. పొత్తుల ఉన్నప్పుడు వంగి పని చేయలేదు. ఇపుడు రెక్కల కష్టం చేస్తాను అందట. ఇలా ఉమ్మడి కుటుంబాల్లో పొత్తుల పనులు కొందరు సరిగా చేసేవారు కాదు. ఒంటరిగా ఏ పనీ చేయలేము. ఎవరిదివారు చేసుకుంటారు. పొత్తుల పని అంటే చేయరు.

వీధిలో కరెంటు రావాలన్నా, రోడ్డు వేయాలన్నా, చెత్త పేరుకుపోయిన చెత్త తీయించే ఏర్పాట్లు చేయాలన్నా ఆ వీధి వాళ్ళు నలుగురు కలిసి మునిసిపాలిటీకో, సంబంధీకులనో కలవడం అవసరం అవుతుంది. నలుగురు కలిసి దరఖాస్తు ఇవ్వడం, కలిసి చెప్పడం, ప్రజా ప్రతినిధిని కలవడం అవసరం అవుతుంది. ఇలా నిరంతరం కలిసి పని చేయాల్సిన సందర్భాలు ఉంటాయి.

చాలామంది తాము కలిసి పనిచేయనవసరం లేని ఎన్నో విషయాలు మాట్లాడుతుంటారు. బస్సు, రైలు, బాటసారి, కాలినడక ప్రయాణాల్లో ఇలాంటివి సహ జంగా జరుగుతుంటాయి. అయితే రోజూ కలుసుకొనే మిత్రులు, బంధువులు, ఏకీభావం గల వ్యక్తులు, రకరకాల సందర్భాల్లో సంస్థల్లో, ఉద్యమాల్లో, ఉద్యోగాల్లో, వృత్తుల్లో, కలుసుకొనే వ్యక్తులు కలిసిన ప్రతిసారీ ఇలాగే జరిగితే ఆ చర్చ, సమయం వృధా ప్రయాస.

నాకీవిషయంలో కాలం కరిగిపోయిన కొద్దీ ఏదో లోపం కనపడసాగింది. అన్నీ ఇష్టమైన విషయాలే మాట్లాడినప్పటికీ కలిసి పనిచేసే ఆచరణ అంశం అందులో లోపించింది. తద్వారా టైం వేస్ట్‌, టైం పాస్‌, పరస్పర ఏకీభవించు కోవడం, విభేదించుకోవడం వల్ల కలుగుతున్న ప్రయోజనం ఏమీ కనిపించ లేదు. దాంతో ఒక థ పరిచయం, పలకరింపులు పూర్తయ్యాక మనమిద్దరం ఏయే విషయాల్లో కలిసి పనిచేయగలమో మాట్లాడుకుందాం అని... మీ లక్ష్యాల కోసం నేను... నా లక్ష్యాల కోసం మీరు. మనం కలిసి ఎలా పనిచేయగలమో మాట్లాడుకుందాం అని ఎజెండాను ముందుకు తెచ్చాను.

Personality Development: Working together

దాంతో ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇద్దరు కలిసి తమతమ లక్ష్యాల కోసం, పరస్పరం ప్రయోజన కరమైన కార్యక్రమాలు, సమాజానికి ఉపయుక్త మైన కార్యక్రమాలు తీసు కోవడం జరుగుతుంది. నేను పుస్తకాలు రాస్తాను. ప్రచురిస్తాను. ప్రసంగాలు చేస్తాను. కథలు, వ్యాసాలు రాయడం ఎలానో నేర్పుతాను. మన చరిత్ర సంస్కృతి, జీవన వికాసం గురించి అధ్యయనం, అనుభవం అనుసరించి తెలుపుతాను.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధి ఎలా సాగుతున్నదో, ఎలా సాగాలో ఎప్పటి కప్పుడు విశ్లేషిస్తాను. నేను మీకు ఏ విషయంలో సహాయ పడగలను? మీరు నా రంగంలో, లక్ష్యాల్లో ఏ విషయాల్లో సహకరించడం వీలవుతుంది? అని ఎజెండాను ముందుకు తెచ్చాను. ఎంతో జీవితాన్ని, కాలాన్ని నష్టపోయాక, ఎన్నో కష్టాలు అనుభ వించాక అనుభవం మీద ఇలా ఆలస్యంగా ప్రారంభించాను.

చెప్పులున్న వారితో నడిచేటప్పుడు జాగ్రత్త

చెప్పులున్న వారితో చెప్పులు లేకుండా నడిచి ఎన్నో ముళ్లపాలయ్యాను. ఈతాకు ఇచ్చి తాటాకు తీసుకునే వారితో, అగ్గిపుల్ల ఇచ్చి సిగరెట్టు లాక్కొనే వారితో కోల్పోయింది ఎంతో... ఒక మిత్రుడు పదివేల రూపాయలు తీసుకొని ముంచితే అతని స్వభావం ఏమిటో తెలుసుకోవడానికి పదివేలు రూపాయలు ఖర్చయ్యాయి అన్నాడట... మంచి మాటలకు తీర్థం పోతే నువ్వు గుడిలో నేను చలిలో అన్నట్టు ఎన్నో అనుభవాలు... బాధ్యత వహించనివారు చేసే సూచనలు, చేసే నిర్ణయాలు, మార్గదర్శకాలు మన జీవితాన్ని వారికి ప్రయోగశాలగా మార్చుతాయి. సూచించినవారు, కేవలం మాటలకే నాయ కత్వం పరిమితమై కష్టాల్లో తోడుండనివారు మన జీవితాలతో ప్రయోగాలు చేస్తుంటారు. లక్ష్యం వారిది. శరీరం మనది. తద్వారా మనం ఇతరులకు సాధనాలుగా ఉపయోగపడతాం.

కష్టాల్లో, భిన్నాభిప్రాయాల్లో కూడా తోడుండేవారే నిజమైన మిత్రులు కష్టాల్లో, భిన్నాభిప్రాయాల్లో కూడా తోడుండేవారే నిజమైన మిత్రులు. కేవలం లక్ష్యాలకోసం కలిసి పనిచేసేవారు కష్టాల్లో కలిసి వస్తారేమో గాని కలిసి పనిచేసే క్రమంలో భిన్నానుభవాలు, భిన్నాభిప్రాయాలు కలిగినపుడు దూరం జరిగేవారు, శత్రువులుగా చూసేవారు నిజమైన మిత్రులు కారు. వారు వారి లక్ష్యాలకోసం లేదా స్వార్ధం కోసం ఇతరులను కలుపుకుపోవటం, బలి పశువులు చేయడం అనే పరిమితితో కలిసి పని చేస్తారని, నాయకత్వం వహిస్తారని, జీవితం అనేక అనుభవాలను ఇచ్చింది. అందుకు 30 ఏళ్ళ జీవితం ఖర్చయిపోయింది. అలా అని ఒడ్డున కూర్చొని ఎంత కాలం చూసినా ఈత నేర్చుకోవడం సాధ్యం కాదు. ఈత రావాలంటే నీళ్ళల్లోకి దిగక తప్పదు. నేర్చుకోక తప్పదు. ప్రయోగాలు చేయక తప్పదు. ఉద్యమాలు చేయక తప్పదు. ఇదే జీవితం నాకు నేర్పిన పాఠం.

ప్రయోగాలు, కష్టాలు వృధా కావు

థామస్‌ ఎడిసన్‌ ఫిల్మెంట్‌ను, విద్యుత్‌ వాహకాన్ని కనుక్కోవడానికి 1000 రకాల ప్రయోగాల్లో విఫలమై చివరికి కనుక్కున్నారు. దాన్ని ఆయన వైఫల్యంగా భావించలేదు. 1000 రకాలు విద్యుత్‌ వాహకానికి పనికిరావు అనే విషయాన్ని కనుక్కున్నాను అని అన్నారు. నా వైఫల్యాలు కూడా వైఫల్యాలు కావు. ఆ అనుభవాల ద్వారా లక్ష్యాల సాధనకు అవి పనికిరావు అని కను క్కున్నాను. అలా నూతన సిద్ధాంతాలతో, నూతన ప్రయోగాలను, ప్రయ త్నాలను, ఉద్యమాలను, సంస్థలను ప్రారంభించడం, నిర్వహించడం జరిగింది.

జంషెడ్‌జీ టాటాను ఇన్ని రకాల పరిశ్రమలు ఎందుకు పెడుతున్నారు... ఉన్నవాటిలో ఎన్నో లాభాలు వస్తున్నాయి కదా... మళ్ళీ ఇంకా కొత్తవి ఎందుకు పెడుతున్నారు అని ఎవరో అడిగారట... అన్నీ సక్సెస్‌ కావు కదా అని చెప్పాడట జంషెడ్‌జీ టాటా. నిజమే... జీవితంలో అన్నీ సక్సెస్‌ కావు. బిర్లాలు, ఈస్టర్న్‌ స్టార్‌ అనే సైకిల్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. దాన్నుంచి ఎంతో ఆశించారు. కోట్ల కొద్ది లాభం వస్తుందనుకుంటే లాభం వేలల్లోకి కుదించుకుపోయింది. సైకిల్‌ ఉత్పత్తిని మూసివేశారు. ఇలా ఎందరో ఎన్నో సంస్థలను మూసివేశారు.

ఆదిలాబాద్‌లోని సర్‌ సిల్క్‌ పరిశ్రమను బిర్లాలు మూసివేయడం వల్ల 9 వేలమంది బట్టలమిల్లు కార్మికులు ఉపాధి కోల్పో యారు. జీవితాలు ధ్వంసం అయిపోయాయి. ఎందరో దిక్కులేక వేశ్యలుగా మారిపోయారు. దీనిపై పి.చంద్‌ యాదగిరి 'బిర్లా మందిర్‌' అనే కథను, నేను 'ప్రేమధార' అనే కథను రాశాను.

ఇలాంటి సందర్భాల్లో నష్టపోయిన పరిశ్రమలను జాతీయం చేసి, కార్మికుల ఉపాధిని కాపాడాలని వామపక్షాలవారు ఎన్నో ఉద్యమాలు చేశారు. పరిశ్రమల జాతీయీకరణ అనే ఉద్యమం కార్మికుల శ్రేయస్సుకోసం ముందుకు వచ్చింది. అలా పరిశ్రమలను జాతీయం చేస్తూ, బట్టల పరిశ్రమలను జాతీయం చేసి వాటన్నిటిని కలిపి 'నేషనల్‌ టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌' అనే సంస్థలో కలిపారు. ఇలానే అనేక రంగాల్లో జాతీయం చేస్తూ, కొత్త కొత్త సంస్థలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, సామాజిక న్యాయం, ఉపాధి కల్పన, కార్మికుల ప్రయోజనాలు అనే దృష్టితో 1990 దాక నేషనలైజేషన్‌ కొనసాగింది.

ప్రపంచ మార్కెటీకరణకు, సరళీకరణకు అనుకూలంగా 1985 నుండి డంకెల్‌ ప్రతిపాదనలు, గాట్‌ ఒప్పందం... ఆ తర్వాత ప్రపంచీకరణ మొదలైంది. 1990 నుండి ఇలా జాతీయీకరణ స్థానంలో దానికి భిన్నంగా ప్రైవేటీకరణ చేయడం పెరిగింది. అలా రాష్ట్ర ప్రభుత్వంలోని ఆల్విన్‌, నిజాం షుగర్స్‌... వంటివెన్నో ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు ప్రైవేటీకరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల పెట్టుబడితో పెట్టిన పరిశ్రమలను అతి తక్కువ ధరలకు ప్రైవేటు పరం చేసింది. ప్రైవేటు సంస్థల యజమానులు కార్మికులను వదిలించుకున్నారు. కొందరు పరిశ్రమలు మూసేసి స్థలాలను ప్లాట్లు చేసి అమ్ముకుని లాభపడ్డారు. ఇలా ప్రభుత్వాల, నాయకుల, దేశాల వ్యక్తిత్వ వికాసంలో, తాత్విక వికాసంలో, సామాజిక న్యాయం, ఉపాధి కల్పన కోణం తగ్గుతూ ప్రజలను గాలికి వదిలివేస్తున్నారు.

ఇది నిరాశకు దారితీస్తున్నది. సామూహిక శక్తిగా మారి ఉద్యమాలకు దారి తీస్తుంది. నూతన పరిస్థితుల్లో, నూతన సిద్ధాంతాలు, ఉద్యమాలు, వ్యక్తిత్వ వికాసాలు, తాత్విక వికాసాలు రూపు దిద్దుకుంటాయి. ప్రతి ఆర్థిక ఉపద్రవం ఒక వరమే అంటాడు అంగలకుర్తి విద్యాసాగర్‌. ఆర్థిక ఉపద్రవాన్ని ఒక వరంగా ఎలా మార్చుకోవాలో, మలుచుకోవాలో సూచిస్తాడు. ఇది కూర్చున్న కొమ్మను నరికివేసిన తర్వాత పక్షి స్వేచ్ఛగా ఎగురుతూ తన రెక్కల సామర్ధ్యాన్ని తెలుసుకోవడానికి కూడా దారితీస్తుంది.

ఇలాంటి కష్టాల్లో, ఉద్యమాల్లో, జీవన అభద్రతలో... జీవితంలో నిజమైన మిత్రులెవరో మన జీవితాలను, శరీరాలను, వారి సిద్ధాంతాలకు, ఉద్యమా లకు, స్వార్ధాలకు, ప్రయోజనాలకు, ప్రయోగ శాలగా మార్చేదెవరో... తెలు స్తుంది. కేవలం టైం పాస్‌ కోసం కాలాన్ని వృధా చేయించేవారెవరో... స్వార్ధపరులెవరో తెలుస్తూ వచ్చింది. దాంతో వదిలిన బాణం సూటిగా ముందుకు సాగినట్లుగా నా లక్ష్యం కోసం సహకరించే వారిని, నేను కలిసి నడవాల్సినవారిని, నాతో కలిసి నడిచేవారిని గుర్తించడం సులభమైంది. తద్వారా నేను ఎవరెవరికి సహకరించాలో, ఎవరెవరితో కలిసి పని చేయాలో తెలిసి వచ్చింది.

మా ఇల్లుకు మీ ఇల్లు ఎంత దూరమో, మీ ఇల్లుకు మా ఇల్లు అంతే దూరం... అనే అంశం జీవితంలో గుర్తుంచు కుంటే నిజమైన కృషి, నిజమైన పరస్పర సహకారంతో తమకోసం, ప్రజల కోసం, సమాజ వికాసం కోసం పని చేయడం సాధ్యపడుతుంది. తద్వారా లక్ష్యం సూటిగా, ఉన్నతంగా ముందుకు సాగుతుంది.

గతానికి అనువుగా బతకవద్దు

కొందరు వెనకటి కాలమే మంచిదని అంటుంటారు. వాళ్ళో, వాళ్ళ పూర్వీకులో, వాళ్ళ కులమో, వర్గమో వెనకటి కాలంలో వారు బాగా బతికిన వారై ఉంటారు. అపుడు కుల వ్యవస్థతో, వర్ణ వ్యవస్థతో, గ్రామీణ స్వయం పోషక ఆర్థిక వ్యవస్థతో, కొందరే కొన్ని పనులు చేయాలి, అందరూ అన్ని పనులు చేయడానికి వీల్లేదు అని కొన్ని మంచి పనులు, అధికారం, గౌరవం ఉండే పనులు, కూర్చుండి తినే పనులు, అవకాశాలు ఉన్న కులవృత్తుల్లో, అధికారంలో ఉంటూ బతికి వచ్చినవాళ్ళు వెనకటి కాలమే గొప్ప అని అనవచ్చు.

అప్పుడు వాళ్ళ గొప్ప వృత్తులకు పోటీ లేకుండా, కర్మ, పునర్జన్మ, కులవృత్తి, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, కుల వివక్షల ద్వారా వాటి సిద్ధాంతాల ద్వారా, వ్యక్తిత్వాలను అణచివేయడం ద్వారా తమకు పోటీ లేకుండా చేసుకొని బతికి వచ్చారు. ఇప్పుడు మొత్తం అందరికీ సమానావకాశాలు వచ్చాయి. అవకాశాలు అందుకోవడానికి మౌలిక సదుపాయాల కల్పన కూడా కల్పించ బడుతున్నది. అందరితో పోటీ పడి జీవితాన్ని గెలుచుకోవడం నేటి అవసరంగా ముందుకు వచ్చింది. కొందరికే అన్ని రిజర్వు చేసి పెట్టే కుల వ్యవస్థ కర్మ, పునర్జన్మ సిద్దాంతాల నుండి అందరూ బయట పడుతున్నారు.

ఇలాంటి వెనకటి కాలమే మంచిది అనేవాళ్ళు కనీసం ఒక యేడాది పాటు వెనుకటి కాలంలో వలే జీవించి, ఆచరించి చూపడం అవసరం. ఆవిరి యంత్రం, విద్యుత్‌, రైలు, రోడ్డు, బస్సు, కారు, టెలిఫోన్‌, సెల్‌ఫోన్‌, సినిమా, టీవీ, రేడియో మొదలైనవి ఏవీ ఉపయోగించకుండా ఏడాది పాటు బతికితే వెనకటి కాలం మంచిదో, ఇప్పటి కాలం మంచిదో తెలుస్తుంది. వెనుకటి కాలం మంచిది అనేవారిని ఆధునిక అభివృద్ధి ఫలాలు, సౌకర్యాలు పొంద కుండా, ఉపయోగించుకోకుండా మాట్లాడాలని, ఆచరించాలని నిలదీయడం అవసరం.

తనకే బాగా తెలుసుననుకుంటే...

ఒకాయన తనకు బాగా తెలుసని టీవీ చర్చలో తాను మిగతా వారిని బాగా అదరగొట్టానని అనుకున్నాడు. కానీ వీక్షకుల స్పందన వేరు. వీడెవ డండీ... ఆ మిగతా నలుగురిని మాటాడనీయకుండా దబాయిస్తూ అడ్డ గాడిదలా మాట్లాడుతున్నా డేమిటి అని భావించారు. వాదనలో ఓడిపోతుంటేనే అరుస్తారని అంటారు. నీవే నమ్మని విషయాన్ని ఎదుటివారు మాత్రం నమ్మాలని కోరడం ద్వారా అరవడం మొదలవుతుందట.

సమిష్టి కృషిలో ఎన్నో పరిమితులు ఉంటాయి. చర్చలు, భిన్నాభిప్రాయాలు, భిన్న వ్యక్తిత్వాలు, భిన్న ప్రాధాన్యతలు గల సమిష్టి నిర్మాణంలో అందరినీ కలుపుకుంటూ సమన్వయిస్తూ అందరితో వారి అభిరుచులు, సామర్ధ్యాలు అనుసరించి పని కల్పిస్తూ ముందుకు నడిపించడమే నాయకత్వం.

English summary
An eminent writer BS Ramulu stresses the need of working together to build up Personality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X