వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యక్తిత్వ వికాసం: తల్లిదండ్రులు, కుటుంబం

By Pratap
|
Google Oneindia TeluguNews

అమ్మలు, నాన్నలు చిన్నప్పటినుంచే తమ సాంఘిక హోదాను, కులాన్ని, కుల సంస్కృతిని అలవాటు చేస్తుంటారు. కుటుంబ వ్యవస్థ, పేదరికం, కుల వివక్ష, అంటరానితనం, ఆర్థిక వ్యత్యాసాలు వంటి రకరకాల కారణాలతో కుటుంబ వ్యవస్థలో స్వార్ధాన్ని, కుల వివక్షను అంటరాని తనాన్ని నేర్పుతుంటారు. కొందర్ని ఇంటిలోపలికి తీసుకురావద్దని చెప్తుంటారు. ఎవరెవరితో కలిసి ఆడుకున్నారో... స్కూళ్ళో ఎవరెవరు స్నేహితులో తెలుసుకొని స్నానం చేసేదాక ఇంటిలోకి రాకుండా బయట నిలబెట్టి బట్టలు విడిపించి స్నానం చేయించి ఇంటిలోకి తీసుకొంటారు.

వయస్సులో పెద్దవాళ్ళను కూడా పేదరికం, కులవివక్షతో అరేయ్‌, తురేయ్‌ అని అవమానిస్తూ పిలుస్తుంటారు. పిల్లలు ఇవన్నీ తమకు తెలియకుండానే సహజం అనుకుంటారు. ఆచరిస్తుంటారు. అలా ప్రతి తరంలో కుటుంబ వ్యవస్థ, కుల వివక్షను, అంటరాని తనాన్ని, స్వార్ధాన్ని సహజం అని అలవాటు చేస్తున్నది.

పేదలు, చిన్న కులాలవారు ఆ అవమానాలను, కష్టాలను చిన్నప్పటి నుండే అనుభవిస్తుంటారు. ఎదిగే క్రమంలో ఇవన్నీ అడ్డంకిగా మారుతుం టాయి. కొందరు వాకిట్లోనే నిలబెడతారు. మరికొందరు అరుగు, వరండా వరకే రానిస్తారు. వంట గదులు గానీ, మిగతా ఇల్లు గానీ ఎవరూ ప్రవేశించ కూడని వాటిగా భావిస్తారు. కొందరికి ఇంట్లో భోజనం పెడ్తారు. కొందరికి అరుగుపై, వాకిట్లో భోజనం పెడతారు. ఇలా అనేక విధి నిషేధాలు పాటిస్తూ ఇంటి బయట మాత్రం అందరితో కలిసి స్నేహాలు, చదువులు, ఉద్యోగాలు కొనసాగించాల్సి వస్తున్నది. ఆధిక్యతను అనుభవించేవారు దాన్ని వదులు కోవడం కష్టం. తద్వారా అందరితో స్నేహాలు చేయడం కష్టంగా మారుతుంది. వివక్ష వల్ల కలిగే అల్పత్వ భావన అందరితో స్నేహాలు చేయడానికి సంకోచం కలిగిస్తుంది. ఇలా కులాధిక్యత, ఆర్థిక అసమానతలు, అధికారం కలవాళ్ళు... అలాగే అవిలేనివాళ్ళు కూడా కలిసి జీవించడంలో ఇవన్నీ ఆటంకాలుగా కొనసాగు తుంటాయి. ఇవి ఇరుపక్షాలకు నష్టదాయకమే... ఇవి ఇరుపక్షాల ఎదుగుదలను అడ్డగిస్తూనే ఉంటాయి. బానిసను చేయదలుచుకున్నవాడు కాపలా ఉంటూ తానుకూడా బానిసకు బందీ అయిపోతాడు.

Personality developments: Parents and family members role

ఇంటిలో, కుటుంబ వ్యవస్థలో కులవివక్షతో, సామాజిక అంతరాలతో నేర్పే సంస్కృతిలో, వ్యక్తిత్వ వికాసంలో స్వార్ధం ఉంటుంది. కుటుంబానికి వెలుపల జీవించే జీవితంలో, స్నేహాల్లో, ప్రేమల్లో, ఉద్యోగాల్లో, సంస్కృతిలో, సంస్కారంలో స్వేచ్ఛా సమానత్వం, సామాజిక జీవితం తాలూకు వ్యక్తిత్వ వికాసం అలవడుతూ ఉంటుంది. అయితే కుటుంబం, కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రులు నేర్పే సంస్కృతి, ఆలోచనా విధానం అంతచ్ఛేతనలో పునాదిగా ఉంటూ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. సమాజం మారినా, కులం, కుటుంబ వ్యవస్థ, కుల వివక్ష స్వభావం కుటుంబంలో భాగంగా కొనసాగిస్తూ రావడంలో సంప్రదాయికతకన్నా స్వార్ధమే మిన్నగా పని చేస్తూ ఉంటుంది.

వ్యక్తిత్వం ఈ రెంటిమధ్య సంఘర్షణకు లోనవుతుంటుంది. అందువల్ల వాటినుంచి బయటికి రాలేక స్నేహాలను, ప్రేమలను, పెళ్ళిళ్లను స్వంత కులాలకే పరిమితం కావాలని నిర్దేశిస్తుంటారు. ఆశిస్తుంటారు. కానీ వ్యక్తిత్వ వికాస క్రమంలో కులాతీతంగా, మతాతీతంగా స్నేహాలు, ప్రేమలు, పెళ్ళిళ్ళు జరగడం సహజ క్రమంగా పెద్దలను ఎదిరించి ముందుకు సాగే సాహసాలను కూడా ఇస్తుంది. ఇదే సమాజాన్ని సమూలంగా, మానవీయ సమాజంగా మార్చుతుంది. ఇదే తిరిగి కుటుంబ వ్యవస్థలో సంస్కృతిగా, సంస్కారంగా ఎదిగినపుడు కుటుంబ వ్యవస్థ, స్వభావం మారుతుంది.

చిన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పే స్వార్ధం...

చిన్నప్పుడు తల్లిదండ్రులు తాము ఇచ్చింది తిను అని ఇచ్చేవాటిని అక్కడే తినకుండా బయటకు వెళ్ళి స్నేహితులదగ్గర ఊరించి వాడికి కొంత పెట్టి తినేదాంట్లో ఎంతో ఆనందం ఉంటుంది. తినేవాటిని తుంచడానికి అవ్వకపోతే చొక్కాతోనో, లంగాతోనో మడిచి కొరికి కాకి ఎంగిలి అని పెట్టడం. కాల క్రమంలో కుటుంబ వ్యవస్థలో కుటుంబానికి పరిమితమైన ప్రయోజనాలు నేర్పబడతాయి. అలవాటు చేయబడతాయి. అలా స్వార్ధం సంస్కృతిగా మార్చబడుతుంది. నాది అని పిల్లలకు రెండేళ్ళ వయస్సునుండే నేర్పిస్తారు. ఒక వస్తువు చేతికిచ్చి లాక్కుంటారు. పిల్లలు ఆ వస్తువు నాదని ఏడుస్తారు. అప్పుడు ఆ వస్తువును ఇస్తారు. ఈ ఆటలో నేను, నాది అనే భావనని, స్వార్ధాన్ని నేర్పడం మొదలవు తున్నది.

ఇలా కుటుంబ వ్యవస్థ స్వార్ధాన్ని నేర్పడంవల్ల ఆ స్వార్ధం తల్లిదండ్రులను వదిలించుకొనేదిగా మలుపు తిరుగుతున్నది. వృద్ధాశ్రమాలు పెరుగు తున్నాయి. తల్లిదండ్రుల పోషణను వదిలివేయడం పెరుగుతున్నది.

కుంభమేళాలో తల్లిదండ్రులను వదిలివేసే స్వార్ధపరులు...

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ప్రదేశం త్రివేణి సంగమం. అక్కడ కుంభమేలా అయిపోయాక వేలాది మంది వృద్దులు మిగిలిపోయారు. వారివద్ద ఎలాంటి ఆచూకీలు, అడ్రసులు లేవు. ప్రభుత్వం వారిని వారి కుటుంబాలకు చేర్చాలని ఎంత ప్రయత్నించినా వీలు పడలేదు. అలా వదిలివేసిన వేలాదిమందిని అలహాబాదు, కాశీ కుంభమేలాల్లో చూసినపుడు స్వార్ధ సౌఖ్యాలకోసం మనిషిలో మానవత్వం నశించి ఎంత క్రౌర్యం కొనసాగు తున్నదో... హృదయం కలచివేస్తుంది. తమను పెంచిన వారిని వదిలివేస్తే తాము పెంచినవారు కూడా తమను అలాగే వదిలేస్తారు అనే విషయం వారు కలలో కూడా ఊహించలేరు. ఆస్థుల గురించి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధుమిత్రులు పోట్లాడు కోవడంలో స్వార్ధమే తప్ప, మిగతావారి ప్రయోజనం చూడరు. సహృదయతతో ప్రవర్తించడం, ఆదర్శ వ్యక్తిత్వం.

ఏదీ నీది కాకపోతే అన్నీ నీవవుతాయి...

ఏదీ నీది కాకపోతే అన్నీ నీవవుతాయి అంటాడు బుద్ధుడు. నీది కానిది ఏదీ నీది కాదు. కానీ నీదంటూ ఏదీ లేకపోతే అంతా నీదిగానే ఈ సమాజాన్ని, ప్రకృతిని ప్రేమిస్తాము. ప్రకృతిలోని అందాన్ని ఆస్వాదిస్తాం.
తనది అని ఎప్పుడైతే గిరిగీసుకున్నావో దానికే పరిమితం కావడం ద్వారా స్వార్ధం రూపొందుతూ ఉంటుంది. ఈ భావాన్ని చెప్పడానికి బుద్ధుడు, జిడ్డు కృష్ణమూర్తి ఏదీ నీది కాకపోతే అన్నీ నీవవుతాయి అని చెప్పారు. అందుకే బౌద్ధ భికక్షువులకు రేపటి గురించిన పొదుపు, చింత అవసరం లేకుండా బతకాలని చెప్పారు. ఏదీ కూడబెట్టకూడదని చెప్పారు. అది స్వార్ధానికి దారి తీస్తుందని అన్నారు.

పిల్లల పెంపకంలో స్వార్ధాన్ని నేర్పకూడదు. స్నేహాలను అడ్డగించ కూడదు. స్కూల్లో హెడ్మాస్టరు పిల్లలను నిత్యం భయపెట్టడం జరగదు. క్లాసు టీచర్లు ప్రతిక్షణం పిల్లలను గమనిస్తుంటారు. హెడ్మాస్టరు అందరినీ గమనిస్తూనే ఏమి తెలియనట్లు ఉంటాడు. అవసరమైనపుడే కాస్త జోక్యం చేసుకుంటాడు. కులం రీత్యా ఆచరిస్తున్న నేర్పుతున్న, నేర్చుకుంటున్న ఆధిక్యతలు, స్వార్ధాన్ని బలోపేతం చేస్తున్నాయి. అనుభవిస్తున్న అవమానాలు వ్యక్తిత్వ వికాసాన్ని అడ్డగిస్తున్నాయి.

పిల్లలను చూసీచూడనట్టు వారి స్వేచ్ఛకు వదిలివేయాలి...

పిల్లలు తమంతట తాము తమ పనులు చేసుకునేటట్లు తల్లిదండ్రులుగా మన బాధ్యత. ఉత్తమశ్రేణి తల్లిదండ్రులు పిల్లలకు స్ఫూర్తినిస్తారు. ఎదగడానికి అవకాశం ఇస్తారు. ప్రతినిత్యం భయాలు, సంకోచాలు నేర్పి క్రమశిక్షణ ఉల్లంఘించారని దండించేవారు, హెచ్చరించేవారు, తమ మాట వినాలని నిర్బంధించేవారు పిల్లల వికాసాన్ని నాశనం చేస్తారు. పిల్లలు ఎదగకుండా పోతారు. అన్ని సమకూర్చినా, పిల్లలు సోమరులుగా మారుతారు.

అమ్మానాన్నలు క్లాస్‌ టీచర్‌లా కాకుండా హెడ్మాస్టర్‌లా ఉండాలి...

అమ్మనాన్నలు క్లాస్‌ టీచర్లలాగ ప్రవర్తిస్తే, పిల్లల వ్యక్తిత్వం గిడసబారి పోతుంది. డిపెండెంట్‌ సైకాలజీ వస్తుంది. హెడ్మాస్టరులాగ చూసీ చూడనట్టు ఉండాలి. పిల్లల పోట్లాటలో పెద్దలు జోక్యం చేసుకోకూడదు. దెబ్బలు తిని వచ్చేవారిని వాళ్ళజోలికి ఎందుకు పోయావని మరో రెండు ఉతికితే ఆ పిల్లల వ్యక్తిత్వాలు ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌లో పడిపోతాయి. అలాగని గారాబం చేసి ఎవరు కొట్టింది అని పిల్లల తరఫున పోట్లాటకు దిగితే రెండువైపులా తల్లిదండ్రులు పెద్దలు పోట్లాడుకోవాల్సి వస్తుంది. తద్వారా పిల్లల స్నేహాలు, పెద్దల స్నేహాలు రెండూ దెబ్బతింటాయి.

పిల్లలకు కులాతీతంగా స్నేహాలు చేయడం నేర్పాలి...

పిల్లలకు స్నేహాలు చేయడం నేర్పాలి. పిల్లలు కొట్లాడుకోవడం, తిరిగి వెంటనే కలుసుకోవడం సహజం. వాటిని ద్వేషంతో వ్యతిరేక భావనలతో పెంచి పోషించకూడదు.

ఏ వయసులోనైనా రోజూ ఒక గంట ఆటలు, పాటలు, డ్యాన్సులతో గడపడం ఎంతో అవసరం. అది శరీరానికి, మనస్సుకు, వ్యక్తిత్వానికి ఆహ్లాదాన్ని ఇస్తుంది. ప్రశాంతతను ఇస్తుంది. ఆటల్లో పేకాట, చదరంగం వంటి ఆటలు మంచివి కావు. అవి మేధస్సుపై ప్రభావం వేసి భారం వేస్తాయి. గెలుపు ఓటముల ప్రాధాన్యత ఉండే ఆటలు ద్వేషాన్ని, నెగెటివ్‌, వ్యతిరేక భావాలను సృష్టిస్తాయి. రెండు జట్లుగా విడగొట్టి ఆడే ఆటలు రాజరికాల యుద్ధాలకు సంబంధించిన శిక్షణే.

పిల్లల అభిరుచులను గౌరవించాలి...

పిల్లల స్నేహితులు తల్లిదండ్రులకు నచ్చకపోవచ్చు. అయినా వారిని దూరం చేయవద్దు. పిల్లలు బయట సంబంధాలు, స్నేహాలు పెరిగినపుడే ఎదుగుతారు. చాలామంది తల్లులు తమ పిల్లల పట్ల అతిప్రేమతో పిల్లల మంకుకు, డిపెండెంట్‌ సైకాలజీకి కారకులవుతుంటారు. మళ్ళీ వారే తాము పిల్లలను ఎంతో ప్రేమిస్తున్నామని, ఇలా ఎందుకయ్యారని ఏడుస్తుంటారు.

తల్లిదండ్రులు ఎంత స్వేచ్ఛ ఇచ్చినా తల్లిదండ్రులనుండి పారిపోవడంలో పిల్లలు స్వేచ్ఛను అనుభవిస్తారు. దాని పరిణామం ఎలా ఉన్నాసరే తల్లిదండ్రులనుండి దూరం కావాలని కోరుకుంటారు.

నేను చిన్నప్పుడు అమ్మమీద అలిగి ఎన్నోసార్లు మా చిన్నమ్మ దగ్గరికి 16 కిలోమీటర్లు నడుచుకుంటూ పల్లెకు వెళ్లేవాణ్ణి. చిన్నమ్మ ఎందుకు వచ్చావు అని అడిగేది కాదు. అమ్మకన్నా ఆత్మీయంగా అవీ ఇవీ తినడానికి చేసి పెట్టేది. కొద్దిరోజుల తర్వాత అమ్మ వచ్చి బతిమాలి తీసుకువెళ్ళేది.

స్వేచ్ఛతోపాటు ఎదురుతిరిగే స్వభావాన్ని గౌరవించాలి...

ఇంట్లో పిల్లల డ్రెస్సులు ఎలా ఉండాలో, చివరకు హెయిర్‌ కటింగ్‌ కూడా ఎలా ఉండాలో తల్లిదండ్రులే నిర్దేశిస్తుంటారు. మంగలిషాపుకు వచ్చి ఎలా చేయాలో కూడా చెప్తుంటారు. ఈ బాధ భరించలేక ఒక విద్యార్ధి ఏం చేయాలని ఒక విద్యార్ధి నాయకుణ్ణి అడిగారు. మొట్టమొదట నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లుగా కటింగ్‌ చేసుకో. ఆ తర్వాత మీ అమ్మానాన్నలు ఎంత అరిచినా నా యిష్టం అని ఎదురు తిరుగు అని చెప్పాడు. ఆ తర్వాత గమనించు అన్నాడు. అదే పని చేశాడు. తల్లిదండ్రుల కోపానికి హద్దు లేదు. కొట్టబోతే ఇంట్లోంచి పారిపోయాడు. రాత్రిదాక దొరకలేదు.

అలా ప్రారంభమైన తిరుగుబాటుతో, ఎదురు తిరగడంతో, సమాజంలో జరిగే అనేక అన్యాయాలపై ఎదురు తిరిగి న్యాయం కోసం పోరాడే కార్య కర్తగా, నాయకుడిగా ఎదిగాడు.

ఎదురు తిరగడం ఇంటినుండే ప్రారంభం కావాలి. తల్లిదండ్రులను ఎదిరించాలి. అలగడం, తలుపుచెక్కచాటున నిలబడటం, తలుపుచెక్క పగలగొట్టడం, పల్లాలు ఎత్తివేయడం, థలు దాటి తనకు కావలసిన దాన్ని సాధించడానికి చర్చించాలి. తన మాట వినేవారితో చెప్పి ఒప్పించాలి. తిరుగుబాటు నెగెటివ్‌ వ్యతిరేక దృక్పథంతో కాకుండా ఉండాలి. అనుకున్నది సాధించగానే తిరిగి ప్రభుత్వంతో కలిసి చెప్పిన పని చేసే ఉద్యోగుల్లాగా అమ్మానాన్నలతో ఆత్మీయంగా ఉండాలి. చెడ్డ పిల్లలు అంటూ ఎక్కడా ఉండరు.

చెప్పినట్టు విను అనే ధోరణి వ్యక్తిత్వాలను కుదిస్తుంది. తల్లిదండ్రులపై పిల్లలు ఎదురు తిరగడం, తిరుగుబాటు చేయడం అంటే ఏమిటి? పిల్లలకు సొంత భావాలు, సొంత వ్యక్తిత్వాలు రూపుదిద్దుకుంటున్నా యని అర్థం. అందువల్ల పెద్దలు వీటిని వాత్సల్యంతో అర్థం చేసుకోవాలి. గౌరవించాలి. వారి భావాలను స్వీకరించాలి. కోర్కెలను వీలైనమేరకు తీర్చాలి. అపుడే నూతన తరం, నూతన భావాలతో, నూతన సమాజానికి అనుకూలంగా ఎదుగుతుంది.

English summary
An eminent writer BS Ramulu has explained the role of parents and family members in personality development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X