వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చుక్కా రామయ్యను యువత తిరస్కరించిందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

''మీ లక్ష్యాలని రాసిపెట్టుకోండి. వాటిని సాధించేందుకు ప్రణాళికలు వేసుకోండి. ప్రతిరోజూ ఆ ప్రణాళికల ప్రకారం పనిచేయండి''. - 'లక్ష్యాలు' పుస్తకంలో... బ్రయన్‌ ట్రేసీ.

ఇది చాలా సాదాగా కనబడే గొప్ప మాట. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో వుండే మా నాలుగో కొడుకు నరేష్‌ దగ్గరికి వెళ్లినప్పుడు బ్రయన్‌ ట్రేసీ రాసిన 'గోల్స్‌' అనే ఇంగ్లీషు పుస్తకం కనపడింది. ఆసక్తిగా చదివాను. ఎన్నో విషయాలు తెలిశాయి. నా జీవితంలోని అనేక అనుభవాలను గుర్తుకు తెచ్చాయి. ఆ పుస్తకం చదివాక నిజంగానే నేను లక్ష్యాలను రాసుకొని ప్రతిరోజూ వాటికోసం పని చేయడానికి పూనుకున్నాను. అద్భుతాలు జరిగాయి. ఆశించిన దానికన్నా ముందే కోరుకున్నవన్నీ పొందండి అని లక్ష్యాల పుస్తకంలో రాసిన ట్యాగ్‌ లైన్‌ నిజంగానే జరిగింది. లక్ష్యాలను బట్టే వ్యక్తిత్వ వికాసం సాగుతుంది.

లక్ష్యాలు పుస్తకం చదివాక...

తర్వాత మిత్రుడు నిజాం వెంకటేశం 'గోల్స్‌' పుస్తకాన్ని సుప్రసిద్ధ రచయిత, 'లక్ష్యాలు' అనే పేరుతో వెలువడిందని చెప్పారు. తెలుగు పుస్తకాన్ని కొని చదివి మరింత సులభంగా అర్థం చేసుకున్నాను. అనేకమందితో ఈ పుస్తకాన్ని కొనిపించాను. మీరు కూడా ఈ పుస్తకాన్ని కొని చదవండి. జీవితంలో సాధించాల్సిన వాటిపట్ల ఒక స్పష్టత ఏర్పడడంతో పాటు ఎలా కృషి చేయాలో తెలుస్తుంది.

నామటుకు నేను 'లక్ష్యాలు' పుస్తకం చదివాక నా పుస్తకాల ప్రచురణని ఇక ఆలస్యం చేయకూడదని దృఢ నిశ్చయానికి వచ్చాను. డబ్బులు ఎలా సమకూర్చుకోవాలో అనేక విధాలుగా ఆలోచించాను. మిత్రులకు ఫోన్లు చేశాను. కలిశాను. నేను రాసిన, ప్రచురించిన 80కి పైగా పుస్తకాల్లో ప్రస్తుతం వున్న 30 - 35 పుస్తకాలను ఒక సెట్టుగా తీసుకోవాలని తద్వారా పుస్తక ప్రచురణకు సహకరించాలని, కొత్త పుస్తకాలు అచ్చువేయడంలో పాల్గొనాలని వివరించాను. అలా 20 ఏళ్లలో బిడియంతో, సంకోచంతో వున్నవాడిని దాన్ని వదిలించుకొని అమ్మకాలు సాగించాను. అలా 'కాలం తెచ్చిన మార్పు', 'చికాగో లో నానమ్మ', 'గెలుచుకున్న జీవితం', 'జర్నీ ఆఫ్‌ లైఫ్‌' - నా కథల ఇంగ్లీషు అనువాదం, బతుకుపోరు నవల ఇంగ్లీషు అనువాదం 'స్ట్రగుల్‌ ఆఫ్‌ లైఫ్‌'. ప్రచురించాను. ఈ పుస్తకం కూడా అదే వరుసలో వెలువరించాను.

'లక్ష్యాలు' గ్రంథంలో నాకు బాగా నచ్చిన వాక్యాలు...

'లక్ష్యాలు' గ్రంథంలో నాకు బాగా నచ్చిన మాట. అందరూ గుర్తుంచు కోవాల్సిన మాట 'మనం పిరికితనాన్ని, భయాన్ని ఎంతో కష్టపడి నేర్చుకున్నాం'.

అలాగే మరొక మాట... 'మీకోసం మీరు గొప్ప లక్ష్యాలు ఎన్నుకోవడంలో నిజమైన ప్రమాదం ఉంది. దాన్ని తప్పించుకోవడంలో మీరు జాగ్రత్త వహించాలి. ఆ దారి ఎక్కడికీ వెళ్ళకపోవచ్చు'. 'పొందటం సాధ్యం కాని, లక్ష్యాలను ఏర్పర్చుకుంటూ తమంతట తామే ఓటమికి సిద్దమవుతున్నారు.

ఒకాయన తన ప్రధానమైన లక్ష్యం ప్రపంచ శాంతి అని చెప్పాడు. తాను ఏదైనా మహా శక్తివంతమైన దేశానికి అధ్యకక్షుడైతే తప్ప ఆ లక్ష్యం కోసం ప్రభావితం చేయలేరని, వ్యక్తిగత లక్ష్యానికి అటువంటి విశాలమైన లక్ష్యం అతన్ని దూరంగా ఉంచుతుంది' అని బ్రయన్‌ ట్రేసీ చెప్పినమాటతో... నిర్దిష్టంగా రోజువారీగా తక్షణం సాధ్యపడే చిన్న చిన్న లక్ష్యాలను ఎంచుకున్నాను. అలా రోజు నలుగురైదుగురు మిత్రులను మాత్రమే కలిసి నా పుస్తకాల సెట్ల గురించి, పుస్తక ప్రచురణ గురించి చెప్పాను. అలా లక్ష్యం సాధించడం జరిగింది.

Personanality development: need of targets

అనుమానం, భయం, అహం, నిస్సహాయత, పిరికితనం మొదలైనవన్నీ నేర్చుకుంటే వచ్చేవే...
అనుమానం, భయం, అహం, నిస్సహాయత, పిరికితనం మొదలైనవన్నీ నేర్చుకుంటే వచ్చేవే అని బ్రయన్‌ ట్రేసీ 'లక్ష్యాలు' గ్రంథంలో చక్కగా విశ్లేషించారు. 'చిన్నపిల్లలు ఈ ప్రపంచంలోకి భయాలు, అనుమానాలు అనేవి లేకుండానే అడుగు పెడతారు.
నేర్చుకున్నదేదైనా సరే దాన్ని వదిలి వేయడంకూడా సాధ్యమే. దానికి అభ్యాసం, పునరుక్తి అవసరం. అనుమానా నికీ, భయానికి ముఖ్యమైన విరుగుడు... ధైర్యం, విశ్వాసం' అంటారు బ్రయన్‌ ట్రేసీ. ఎస్‌.ఎస్‌.వై., ఎ.ఎం.సి. శిక్షణలో నేర్చుకున్న పిరికితనాన్ని, భయాన్ని, అనుమానాలను, సంకోచాలను మనకు మనమే వదిలివేసే శిక్షణ లభిస్తుంది.

ఒక్కోసారి దీర్ఘకాలిక విజయాలకు అన్నిటికన్నా గొప్ప శత్రువుగా తయారయ్యేది మన తాత్కాలిక విజయాలే. దీన్నే మరో మాటలో 'గుడ్‌ ఈజ్‌ ఎనిమి టు బెస్ట్‌' అని కూడా చెప్తారు.

'లీడర్‌ షిప్‌ అండ్‌ సెల్ఫ్‌ డిసెప్షన్‌ - గెట్టింగ్‌ ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్‌'...

ఇది ఒక గొప్ప విశ్లేషణాత్మక పుస్తకం. ఈ గ్రంథంలో తనకు తెలియ కుండానే తాను ఓటమిని, తనకు వ్యతిరేకమైన వాటిని ఎలా ఆచరణలో కొనసాగిస్తారో వాటినుండి ఎలా బయట పడాలో ఒక గొప్ప విశ్లేషణ అందించారు. ఈ పుస్తకం పాఠ్య పుస్తకంలా ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ చర్చిస్తూ పోయేక్రమంలో అంతర్లీనంగా ఒక నవలలాగ అనేక పరిణామాలు, పాత్రలు, స్వభావాలు, ముగింపులు కొనసాగుతుంటాయి. ఒక అద్భుతమైన ప్రయోగం ఇది. రాబిన్‌ శర్మ కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తూ, రచన చేస్తున్నారు.

మారాల్సింది ఎవరు?

ఒక కంపెనీకి కొత్తగా ఒక సీనియర్‌ను సిఈవోగా తీసుకుంటారు. అతడు వచ్చాక ఆ కంపెనీలో చాలామంది బాధపడుతుంటారు. కొందరు రాజీనామా చేసి వెళ్ళిపోతుంటారు. అతడు తాను గొప్పవాడినని చక్కని క్రమశిక్షణ కలిగినవాడినని అనుకుంటాడు. మిగతావాళ్ళందరూ పని దొంగలు అని శాసిస్తేనే పని చేస్తారని భావిస్తుంటారు. కసురుకోవడం, మాటలతో హింసించడం, ఆధిక్యతను ప్రదర్శించడం వగైరా అహం ప్రదర్శిస్తుంటారు.

ఒకావిడ తన క్యాబిన్‌లో తన భర్త పిల్లల ఫోటో అతికించుకుంటుంది. అది తప్పు అనుకుంటాడు. స్నేహంగా మాట్లాడ్డం అలుసవుతుందని అనుకుంటాడు. ఇలాంటివారిని మార్చడం ఎలా...? అతన్ని మార్చాలి. ఎలా మార్చాలి. అతడు తనకు తానే నష్టం చేసుకుంటున్నాడు. సంస్థకు అంతకన్నా ఎక్కువ నష్టం చేస్తున్నాడు. ఎంతో సిన్సియర్‌గా పనిచేసేవారు వెళ్ళిపోవడానికి కారకుడవుతున్నాడు. అతడ్ని మార్చాలని ప్రత్యక్ష శిక్షణ ఇస్తుంటారు.

రాత్రి బాగా అలసిపోయి నిద్రపోతుంది ఒక తల్లి. అర్ధరాత్రి పాప ఏడు స్తుంటే లేవదు. తండ్రి లేచి ఊరడిస్తాడు. భార్యను లేవలేదని కోపగిస్తాడు. ఆ పాపను ఊరడించడం తన బాధ్యత అని గుర్తిస్తే కోపం రాదు. ఆమె ఎంతో అలసిపోతే తప్ప అలా నిద్రపోదు అని సానుభూతిగా ఆలోచిస్తే కోపంరాదు. ముందు తన వ్యక్తిత్వంలో, దృక్పథంలో మార్పు తెచ్చుకోవాలి. ఎదుటివారిపట్ల చిన్నచూపు వల్ల తాను, తన వ్యక్తిత్వం ఎలా దిగజారిపోతుందో ఈ గ్రంథంలో విశ్లేషిస్తారు. నవలంత ఆకర్షణీయంగా రాసిన ఈ గ్రంథం వ్యక్తిత్వంలో, నాయకత్వంలో అనుక్షణం జరిగే పొరపాట్ల ద్వారా దిగజారే తీరు, దానినుండి బయట పడి ఎదగాల్సిన తీరు వివరిస్తుంది.

యువతరం కర్తవ్యాలు, లక్ష్యాలు...

ఒకసారి ఈ టివిలో యువతరం కర్తవ్యాలు, జీవిత లక్ష్యాలు అనే అంశం పై విద్యార్ధులు, యువకులు, పెద్దలతో 15 ఆగష్టు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 12వ తేదీన చర్చా కార్యక్రమం రూపొందించారు. ఐఐటి చుక్కా రామయ్య, జ్వాలాముఖి, యండమూరి వీరేంద్రనాథ్‌, నేను ఆ చర్చలో పాల్గొన్నాము. యండమూరి వీరేంద్రనాథ్‌ తను రాస్తున్న వ్యక్తిత్వ వికాసం, విజయానికి ఐదు మెట్లు ఒరవడిలో కొన్ని సూచనలు చేశారు.

చుక్కా రామయ్య సూచనలను వ్యతిరేకించిన యువతరం...

చుక్కా రామయ్య విద్యార్ధులు, యువకులు పేద ప్రజలను పట్టించుకోవా లని, గ్రామాలకు వెళ్ళి పేద ప్రజలకు సేవ చేయాలని, పట్టణాలను వదలాలని వగైరా వామపక్ష భావాలతో ఉద్భోదించారు. జీవిత లక్ష్యాలను అలా రూపొందించుకొని ప్రజలకోసం ఉద్యమాలు చేపట్టాలని అందుకు ఉద్యమకారులుగా ఎదగాలని చెప్పారు.
దాంతో యువతరం మహిళలు కొందరు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. మా జీవితాలను మేము ఎలా గెలుచుకోవాలో చెప్పాలి. మా జీవిత లక్ష్యాలు ఎలా సాధించుకోవాలో చెప్పాలి. మేము ఉన్న స్థితినుంచి మరింత ఉన్నత స్థితికి ఎదగాలి. మేము ఎదుగుతూ సమాజానికి ఉపయోగపడాలి. మేము ఎదగకుండా పల్లెలకు పోయి ప్రజలకు సేవ చేయాలని అనడం ఏమిటి? మేం ఎదగకూడదా? పల్లెలకే ఎందుకు పోవాలి?
పట్టణాల్లో జీవించకూడదా?

మేం ఎంత ఎదిగితే అంత సమాజానికి సేవ చేయడం వీలవుతుంది. మాకు అభిరుచి, ఆసక్తి, అవకాశాలు ఉన్న రంగాల్లో ఎలా ఉన్నత శిఖరాలకు ఎదిగి జీవితాన్ని గెలుచుకోవాలో అని చెప్పాలి గానీ, ఈ జీవితాన్ని వదిలేసి పల్లెలవెంట వెళ్ళాలని, ఉద్యమాలు చేయాలని, ఎందుకు చెప్తున్నారు? మీరు ఐఐటి శిక్షణ ఇచ్చి ఎంతోమందిని ఎదిగిస్తున్నారు. మేం అలా విభిన్న రంగాల్లో ఎదగడానికి మార్గదర్శనం చేయాలి... అని నిలదీశారు. చుక్కా రామయ్య అవాక్కయ్యారు. యువతరం ఆలోచనలు, లక్ష్యాలు విని చకితులయ్యారు. నేను ఆ యువతరాన్ని అభినందించాను. అలాంటి యువ తరాన్ని అభినందిస్తున్నాను. మీరు ఎదిగితేనే సమాజానికి సేవ చేయడం సాధ్యం. ఎంత ఎదిగితే అంతగా సేవ చేయడం సాధ్యం.

ఇప్పుడున్నన్ని అవకాశాలు ఇంతకుముందు లేవు...

మన లక్ష్యాలను సాధించడానికి ఇప్పుడున్నన్ని అవకాశాలు మునుపెన్నడూ లేవు. రాజరికాల కాలంలో రాజులు రాజోద్యోగులు తప్ప మిగతావారు ఏవో వృత్తులు చేసుకొని బతకడం తప్ప, అత్యున్నతంగా ఎదిగే అవకాశాలు లేవు. పారిశ్రామిక విప్లవం అనేక అవకాశాలను సృష్టించింది. సామాన్యులే వందలాది నూతన ఆవిష్కరణలను కనుగొన్నారు. నూతన సైన్స్‌, టెక్నాలజీ, పరిశ్రమలు, నూతన విద్యా విధానం, నూతన ఉపాధి అవకాశాలు, శిక్షణ పొంది నైపుణ్యం పెంచుకొనే అవకాశాలు విస్తరించాయి. వంశపారంపర్య, తరంనుండి తరానికి సాంప్రదాయికంగా అనుకరణతో, సంస్కృతితో, వృత్తితో, కులవృత్తితో అందే నైపుణ్యాలు గ్రంథస్థం అయ్యాయి. శాస్త్రాలయ్యాయి. ఇక వాటిని ఎవరైనా నేర్చుకోవచ్చు. విస్తరించవచ్చు.

భయం, అభద్రతా భావం, ఇన్ఫిరియారిటీ, సాహసలేమి, ఉన్నదాంతోనే సంతృప్తి పడడం, కష్టాల్లో సైతం ఎదిగే ప్రయత్నం, సాహసం చేయకపోవడం, తమ పట్ల తమకు నమ్మకం లేకపోవడం అనేవి ఆయా జాతులకు, కులాలకు, దేశాలకు, మహిళలకు, వ్యక్తులకు వీడని శాపాల వల్ల కంపార్ట్‌మెంటల్‌ ఆలోచన, పరిధి, థాట్‌ పోలీసింగ్‌ వల్ల వ్యక్తిత్వ వికాసం, వ్యక్తి వికాసం, సమాజ వికాసం ఆగిపోతున్నది.

అన్‌ లెర్నింగ్‌...

మనం వేల యేళ్ళ గడిచి వచ్చిన చరిత్రను, సంస్కృతిని, మానవ సంబంధాల పరిణామాలను గమనిస్తూ ఆచరిస్తున్నాము. ప్రభావితం అవు తున్నాం. అమెరికా అభివృద్ధిని అందుకోకుండా అలాంటి వ్యక్తిత్వం ఎలా సాధ్యం? అన్నం తినకుండానే కడుపు నిండినట్టు శరీరం, మనస్సు, నడక, నడత పని చేస్తుందా?
తెలిసీ తెలియని వయస్సులో ఏవో ముద్రలు పడతాయి. కులం, మతం, ప్రాంతం, తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు, ధనిక, పేద, భాష, యాస, సంస్కృతి, కులవృత్తి, ఆధిపత్య కుల భావన, అల్పత్వ కుల భావన మొదలైన ముద్రలు ఎన్నో ప్రభావితం చేస్తుంటాయి. ఇదంతా గతం. ఈ గతాన్ని వదిలించుకోవాలి. వర్తమానంలో, ఈ క్షణంలో జీవించాలి. బుద్ధుడు, జిడ్డు కృష్ణమూర్తి, ఓషో రజనీష్‌, యోగధ్యాన శిక్షణా తరగతులు వర్తమానంలో ఈ క్షణంలో జీవిం చాలని... శరీరానికి, మనస్సుకు మధ్య అనుసంధానం సాధించాలని, మనో వాక్కాయ కర్మలు సంశ్లేషణతో, ఒకే విధంగా శరీరంలో, మనస్సులో, మాటలో, ఆచరణలో కొనసాగాలని ప్రవచించారు.

నీ గ్లాసు నిండుగా ఉన్నది. దాన్ని పారబోయి...

జిడ్డు కృష్ణమూర్తి... 'నీ గ్లాసు నిండుగా ఉన్నది. దాన్ని పారబోయి. కొత్త నీరు రావాలంటే నీ గ్లాసులోని నీరు పార బోయక తప్పదు' అని అంటారు. దీన్నే తెలుసుకున్నదాన్ని, గతాన్ని, గతానుభవాలను, అధ్యయనాలను అన్‌లెర్నింగ్‌ ద్వారా వదిలించుకోవాలి అని అంటారు జె.కె. అప్పుడే వర్తమానంలో జీవించడం, కొత్తగా జీవించడం సాధ్యం. లేకపోతే గతంలోనే జీవిస్తారు.

దీనికి ఒక సుళువైన ఉదాహరణ ఇస్తాను. ఎప్పుడో, ఏదో అన్నారని, అనుకున్నారని కోపతాపాలు, ద్వేషాలు, శతృత్వాలు పెంచుకొని ఇప్పటికి అలాగే ప్రవర్తిస్తే అది గతంలో జీవించడమే. మన వర్తమానాన్ని నాశనం చేసుకోవడమే. కొత్తగా జీవించడం జరగదు. కొత్తగా జీవించాలంటే వాటిని వదిలివేయాలి. అప్పుడే వాటి ప్రభావాల నుండి విముక్తమై స్వచ్ఛంగా ఆలోచిస్తాము. ఆచరిస్తాము. స్పందిస్తాము.

వాటిని వదిలివేయడమంటే ఆ అనుభవాలు, జ్ఞానం లేకుండ పోవడం జరగదు. అది మరుగున పడిపోతుంది. మ్యూజియంలా ఉండిపోతుంది. అది మనలను నడిపించడం జరగదు. దాన్ని మనం నడిపిస్తాము. అలా వర్తమానంలో జీవిస్తూ, గతంలో కోల్పోయినదాన్ని, గుణపాఠాల ద్వారా పునర్నిర్మించుకుంటాము. సాధించుకుంటాము. ఈ క్రమం ద్వారానే ఓటమి నుండి విజయానికి, వైఫల్యాలనుండి, సాఫల్యాలకు ముందుకు సాగుతాం.

వ్యక్తిత్వ వికాసం అంటే జీవిత సాఫల్యం...

వ్యక్తిత్వ వికాసం అంటే జీవిత సాఫల్యం. సమగ్ర సామాజిక వికాసం. వ్యక్తిత్వ వికాసం అంటే ఆదర్శ సమాజాన్ని ఊహించడం, సాధించడం, నిర్మించడం, అందులో పాల్గొనడం, హెచ్చుతగ్గుల భావాలు, అల్పత్వ భావాలు, ఆధిక్యత భావాలు తొలగిపోవాలి. తొలగించుకోవాలి. అహంకార ఆధిపత్య భావాల వ్యక్తిత్వం ఇతరులను హింసిస్తూ, తాను ఏమి నేర్చుకోలేక వెనుక బడిపోతుంది. నా జ్ఞానం, నా సంపద, నా కులం, నా పదవి, నా అధికారం గొప్ప అనుకునే అహంకార ఆధిపత్య భావాలు వ్యక్తిత్వం నుండి తొలగించుకున్నప్పుడే అత్యున్నతంగా ఎదగడం సాధ్యం. కులవృత్తి రహిత సమాజం ఎదగాలి. కొందరే కొన్ని వృత్తులు చేయాలి అనే కుల వ్యవస్థ తాలూకు భావాలనుండి ప్రజలు బయట పడాలి. అవి చేస్తున్నవారు, వాటినుండి ఆశిస్తున్నవారు... ఇరుపక్షాలు కూడా... మారాలి. అప్పుడే సమగ్ర వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది.
లేనిది కోరుకోవడం సహజం, ఉంటే ఎందుకు కోరుకుంటాం. కోరిక అంటేనే లేనిది. ఆశ అంటేనే లేనిది. ఆశయం అంటేనే లేనిది. లక్ష్యం అంటేనే లేనిది. అలా లేనివి కావాలని, సాధించాలని అనుకోవ డంలో
నుంచే కోరికలు, లక్ష్యాలు, కార్యక్రమాలు, అవగాహన, దృక్పథం రూపొం దించుకుంటూ వస్తుంటారు. వ్యక్తిత్వ వికాసం అంటేనే ఇది.

లక్ష్యం ఉన్నప్పుడే సాధించడం సాధ్యం. సాధించింది నిలుపుకోవడం సాధ్యం. లాటరీ ద్వారా సంపాదించాలనుకున్నవాళ్ళు నిజంగా లక్ష్యాన్ని సాధించినప్పటికీ సంపన్నులుగా ఎదగలేకపోయారు.

సంపన్నులు కావడం ఒక వ్యక్తిత్వ వికాసమే...

ఎందుకంటే సంపన్నులు, ధనవంతులు అనేది ఒక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినది. లాటరీలో కోట్ల రూపాయలు వచ్చినా, ఐదేళ్ళ తర్వాత ఎప్పటిలాగనే చాలామంది వుండిపోయారు. దీనిపై అమెరికా ప్రొఫెసర్లు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు చేశారు. అంతటా ఇదే తీరు. సంపన్నులుగా తమ వ్యక్తిత్వాన్ని ఎదిగించుకోక పోవడంతో వారివద్ద సంపద మిగలలేదు. వృధాగా ఖర్చయిపోయింది. అనుత్పాదక రంగాల్లో వినియోగ వస్తువులకు ఉపయోగించారు. మజా ఉడాయించారు. పారిశ్రామిక వేత్తలుగా, పెట్టుబడిదారులుగా, సంపన్నులుగా ఆలోచించే తీరు లోకి వాళ్ళు తమ సంపదపై ఆలోచించకపోవడంవల్ల, అలా ఎదగక పోవడం వల్ల పేదలుగా మారిపోయారు.

ఇలా వ్యక్తిత్వం ఎదగకపోతే ఎంత వచ్చినా నల్లాకింద బిందె పెడితే బిందె నిండిన తర్వాత మిగతా నీళ్ళన్నీ వృధా పోయినట్లుగా ఒలికిపోతుం టాయి. మిగలవు. అందువల్ల వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకున్నప్పుడే ధన వంతులు కావడం, సంపన్నులు కావడం, పారిశ్రామికవేత్తలు కావడం జరుగుతున్నది.

ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు దానికి 20 రకాల పరిష్కారాలను కనుగొని తీరాలి అనుకోవాలంటారు సి. నరసింహారావు.

వ్యక్తిత్వ వికాసంలో ముఖ్యాంశాలు:

1. లక్ష్యాలు
2. జీవిత అవగాహన...
3. సమాజ అవగాహన
4. స్వీయ సమీక్ష
5. వ్యూహం, ఎత్తుగడలు, కార్యక్రమాలు.
6. ఐక్య సంఘటన
7. మిత్రులను సంపాదించుకోవడం.
8. కుటుంబాన్ని, మిత్రులను అనుకూలంగా మార్చుకోవడం, మలచుకోవడం.

నిరంతరం కొత్తగా ఆలోచించాలి...

నిరంతరం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేకపోతే గతంలోనే కూరుకుపోయి కొనసాగుతారు. కొత్తగా ఆలోచించడంతోపాటు, కొత్త లక్ష్యాలు, కొత్త మార్గాలు రూపొందించుకోవాల్సింది ఉంది. లక్ష్యాలు బాణంలా సూటిగా సాగితే ఏకాగ్రత. లక్ష్యాలు కత్తి తిప్పినట్టుగా సాగితే అక్కడికక్కడే గింగిరులు కొట్టవచ్చు. కొందరు కత్తి తిప్పినట్టుగా వాదాలు, వివాదాలు, ఆచరణలు కొనసాగిస్తుంటారు. అది తమ దగ్గరికి వచ్చినవారినే ఖండించి, పొడిచే విద్యగా మలుపు తిరగవచ్చు.

English summary
An eminent writer BS ramulu has stressed the need of targets in personality development and says youth rejected Chukka Ramaih's suggestions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X