వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పల్లెకుపోదాం..........

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: 2003 ఆంధ్రప్రదేశ్‌లో చరిత్రలో మరుపురాని చేదు ఘట్టాలను రికార్డు చేసింది. దాడులు, ఉద్యమాలు, కరువకాటకాలు, తుపాను తాకిడి రాష్ట్రాన్ని కుదిపేశాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు అక్టోబర్‌ చేసిన హత్యాప్రయత్నం దేశాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది. కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సిఎల్‌పి) మాజీ నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన 60 రోజుల పాదయాత్ర మైలురాయి అయింది. రాజకీయ నాయకులకు అది మార్గం చూపింది. ఈ బాటలోనే సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం నడిచి రికార్డు సృష్టించారు.

చంద్రబాబుపై అక్టోబర్‌ 1వ తేదీన పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు మందుపాతర పెట్టి దాడి చేశారు. అయితే చంద్రబాబు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటనలో గాయపడిన మంత్రి గోపాలకృష్ణారెడ్డి, శాసనసభ్యుడు రాజశేఖర్‌ రెడ్డి, ముఖ్యమంత్రి కారు డ్రైవర్‌ కూడా ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే ఈ సంఘటన మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రాన్నే మార్చేసింది. ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ తీవ్రవాదాన్ని ఎజెండాగా చేసుకొని ఎన్నికల పోరాటానికి సిద్ధమైంది. తనపై దాడి జరిగిన తర్వాత చంద్రబాబు అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో నక్సలైట్లను ఎజెండాగా చేసుకుని ఎన్నికల పోరాటం చేసిన పార్టీలు లేవు. నక్సలైట్లను ఎజెండాగా చేసుకొని ఎన్నికల రణరంగంలోకి దిగిన మొదటి నాయకుడు చంద్రబాబే అవుతారు. అదే సమయంలో రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డుల్లోకి ఎక్కారు.

ప్రధాన రాజకీయ చిత్రపటం మీదికి వచ్చిన పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు కోవర్టులపై దృష్టి నిలిపి సిరాజ్‌ అనే కోవర్టును హత్య చేశారు. ఇదే సమయంలో పౌరహక్కుల ఉద్యమచరిత్రలోనే కనీవినీ ఎరుగని సంఘటన చోటు చేసుకుంది. ఉస్మానియా యూనివర్శిటీ అధ్యాపకుడు, ఆంధ్రప్రేదశ్‌ పౌర హక్కుల సంఘం (ఎపిసిఎల్‌సి) నాయకుడు లక్ష్మణ్‌ డిసెంబర్‌ 6వ తేదీన కిడ్నాప్‌నకు గురయ్యారు. కిడ్నాప్‌నకు గురైన లక్ష్మణ్‌ తీవ్ర అవమానాన్ని చవి చూడాల్సి వచ్చింది. గుండుతో ఆయన తిరిగి వచ్చారు. ఈ సంఘటనలు రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనంత కలవరానికి గురి చేశాయి.

స్టాంపుల కుంభకోణంలో అధికార తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు సి. కృష్ణా యాదవ్‌ అరెస్టు కావడం ఓ సంచలనం. దేశవ్యాప్తంగా జరుగుతున్న పలు నేరాలకు, ఘోరాలకు హైదరాబాద్‌ కూడా కార్యస్థలం కావడం ప్రారంభమైంది. గుజరాత్‌ హోంమంత్రి హరేన్‌ పాండ్యా హత్య కేసు వంటి పలు కేసుల్లో హైదరాబాద్‌కు లంకె ఉన్న విషయం బయట పడుతూ వచ్చింది. కృష్ణా యాదవ్‌ అరెస్టు మరో పెద్ద షాక్‌. దీంతో కృష్ణా యాదవ్‌ను తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణంలో చంద్రబాబుకు కూడా ప్రమేయం ఉందని విమర్శలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.

ఈ ఏడాది జరిగిన మరో దురదృష్టకరమైన సంఘటన- హైదరాబాద్‌లో మతఘర్షణలు. హైదరాబాద్‌ చాలా యేళ్లుగా మతఘర్షణలకు, కర్ఫ్యూకు దూరంగా వుంటూ వచ్చింది. అయితే ఈ ఏడాది హైదరాబాద్‌ పాతబస్తీలో ఘర్షణలు చెలరేగి కర్ఫ్యూకు దారి తీశాయి. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువ కాలం కొనసాగకపోవడం గుడ్డిలో మెల్ల.

రాష్ట్రవ్యాప్తంగా జలఉద్యమాలు ఈ ఏడాది ఊపందుకున్నాయి. కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు నిరాహార దీక్షలకు పూనుకున్నారు. ఈ ఉద్యమాలు ప్రాంతాలవారీగా జరిగి ప్రాంతీయ విభేదాలను ఎత్తి చూపాయి. కృష్ణా డెల్టాకు నీరు వదలాలంటూ కోస్తా నాయకులు ఆందోళన చేపట్టారు. రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ నీళ్ల కోసం రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల రైతులు రెండుగా చీలిపోయారు.

ఈ ఏడాది జనవరిలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. అయితే ప్రారంభంలో ఇది పలు ఒడిదొడుకులను ఎదుర్కొంది. మధ్యాహ్న భోజనం చేసిన పిల్లలు అస్వస్థతకు గురవుతూ ఆస్పత్రుల పాలవుతుండడం తీవ్ర కలవరానికి గురి చేసింది. క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంది.

కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్ర సమితి వంటి ప్రతిపక్షాలకు నక్సలైట్లతో సంబంధాలున్నాయంటూ చంద్రబాబు పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఆధారాలు దొరికితే ప్రతిపక్షాల నాయకులపై పొటా ప్రయోగిస్తామని కూడా ఆయన ఒకానొక సందర్భంలో చెప్పారు. ఈ పరిస్థితికి పునాది ఏప్రిల్‌లోనే పడింది. వరంగల్‌ జిల్లాలోని కాంగ్రెస్‌ శాసనసభ్యురాలు కొండా సురేఖపై, ఆమె భర్త కొండా మురళిపై పోలీసులు పొటా నమోదు చేశారు. నక్సలైట్లతో సంబంధాలున్నాయనే ఆరోపణపైనే వారిపై పొటా పెట్టారు. అయితే రాజకీయ నాయకులపై పొటా ప్రయోగించమని చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత వారిపై పొటాను ఉపసంహరించుకున్నారు. రాజశేఖర్‌ రెడ్డి 60 రోజలు ప్రజాప్రస్థానం యాత్ర ఏప్రిల్‌ 9వ తేదీన ప్రారంభమైంది.

జాతీయ క్రీడలు నిర్వహించిన ఘనకీర్తితో పాటు అపకీర్తిని కూడా రాష్ట్రం మూటగట్టుకుంది. జాతీయ క్రీడల్లో మాదకద్రవ్యాలు వాడారనే ఆరోపణపై రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది అథ్లెట్లపై ఒలింపిక్‌ అసోసియేషన్‌ వేటు వేసింది.

ఈ ఏడాది ఇద్దరు కాంగ్రెస్‌ శాసనసభ్యులు కేసుల్లో ఇరుక్కుని అరెస్టయ్యారు. విధి నిర్వహణలో ఉన్న తనను దూషించారని ఎపి ట్రాన్స్‌కో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఖాసిం సాహెబ్‌ ఫిర్యాదు చేయడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ శాసనసభ్యుడు జె. కృష్ణారావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఫిబ్రవరిలో జరిగింది. యువ ఇంజనీర్‌ హత్య కేసులో జూన్‌ 15వ తేదీన చిత్తూరు శాసనసభ్యుడు సి.కె. జయచంద్రారెడ్డి (సి.కె. బాబు)ను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఏడాది రెండు పార్టీల అధ్యక్షులు మారారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడిగా ఎన్‌. ఇంద్రసేనారెడ్డి నియమితులు కాగా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్‌ ఎంపికయ్యారు. ఇంద్రసేనారెడ్డి చిలకం రామచంద్రారెడ్డి స్థానంలో రాగా, డి. శ్రీనివాస్‌ ఎం. సత్యనారాయణరావు స్థానంలో వచ్చారు.

ప్రధానంగా చెప్పుకోవాల్సింది గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, సింగరేణి బొగ్గు గనుల ప్రమాదాలను. సింగరేణి బొగ్గు గనుల్లో 17 మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారు. ఈ ప్రమాదం జూన్‌లో జరిగితే జులైలో గొల్కొండ ఎక్స్‌ప్రెస్‌ రైలు వరంగల్‌ వద్ద వంతెనపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. కోస్తా ప్రాంతాన్ని అకాల తుపాను కుదిపేయగా, మొత్తంగా రాష్ట్రాన్ని వర్షాభావ పరిస్థితులు, కరవు పీడించింది.

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య కాలధర్మం రాష్ట్రాన్ని విషాదంలో ముంచెత్తింది. తుది శ్వాస వరకు ప్రజల గురించే ఆలోచించిన ఆయన ఏప్రిల్‌ 29వ తేదీన కన్ను మూశారు.

నక్సలైట్ల హింసతో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్‌ వచ్చే సంవత్సరంలో కొత్త ప్రభుత్వాన్ని చూడనుంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం రాజకీయ పార్టీలు ఎత్తులకు పైయెత్తులు వేయడంలో నిమగ్నమై ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రజా హిత బస్సుయాత్రలు, తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సదస్సులు, తెలంగాణ రాష్ట్ర సమితి బహిరంగ సభలతో బలప్రదర్శనలు చేస్తున్నాయి. చంద్రబాబుతోనే కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని బిజెపి స్పష్టం చేయగా, తెలుగుదేశం- బిజెపి కూటమికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ సిద్ధాంత వైరుధ్యాలను పక్కన పెట్టి ఏకమయ్యేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. వచ్చే ఎన్నికలు కాంగ్రెస్‌కే కాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా అత్యంత కీలకమైనవి. వచ్చే ఎన్నికల్లో సాధించే ఫలితాలపైనే రాష్ట్రంలో వాటి మనుగడ ఆధారపడి వుంటుంది. దీనికి తోడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ ఈ ఎన్నికలతో ముడిపడి ఉంది. తెలంగాణ ప్రజలను రాజకీయ నాయకులు మరోసారి ముంచుతారో, ఈసారైనా తేలుస్తారో తేల్చేది కూడా ఈ ఎన్నికలే; ఈ ఎన్నికల తర్వాతి రాజకీయ పరిణామాలే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X