వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ చిన్నారిని ఆదుకుందాం

By Staff
|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి యాభై సంవత్సరాలు పైబడిపోయినా 1954 నుండి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగుతూనే వుంది. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో దాదాపు 370 మంది విద్యార్థులు అమరులైన విషయం మనకందరికీ తెలిసిన విషయమే. ఆనాటి నుండి నేటి వరకు తెలంగాణ కోసం నిరంతరం పోరాటాన్ని కొనసాగిస్తూనే వున్నారు. అయినా ప్రత్యేక రాష్ట్రం ఈనాటికీ ఏర్పడలేదు. గత అయిదారు సంవత్సరాలుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో పాలకవర్గాలు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే ఇబ్బందిలో పడిపోయే ప్రమాదముందని గుర్తెరిగి ప్రత్యేక తెలంగాణ అంశాన్ని రాష్ట్రపతి ఉపన్యాసంలో పొదిగారు. పార్లమెంటులో బిల్లు పెట్టడానికి దేశంలోని వివిధ రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టుకొని పార్లమెంటు ఆమోదానికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అంతిమ దశకు చేరుకుంది.

తెలంగాణకు ఎన్ని ఆటంకాలు కల్పించాలో ప్రత్యేక తెలంగాణ అంటే గిట్టనివారు అన్ని ఆటంకాలు కల్పించారు, కల్పిస్తున్నారు కూడా. ప్రత్యేక తెలంగాణ అవసరం లేదని, తెలంగాణ అభివృద్ధి అయితే చాలు అని మరొక్క మారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నీరు కార్చడానికి ప్రయత్నించారు. అయినా పట్టువిడవని తెలంగాణ ప్రజలు నిరసనలు, ధర్నాలు, ఉపన్యాసాలు పత్రికల ద్వారా సాంస్కృతిక దళాల ద్వారా ఎదుర్కొంటున్నారు. ఎన్ని ఎత్తులు వేసినా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఎదుర్కోలేమని భావించిన ప్రభుత్వాలు ఇప్పుడు రూటు మార్చి హైదరాబాదు జంటనగరాలను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి పబ్బం గడుపుకోవాలని యోచిస్తున్నాయి. సచ్చినోనికి పెండ్లికి వచ్చిందే కట్నమన్నట్లు జంటనగరాల పరిసరాల ప్రాంతాల భూములన్నింటినీ నామమాత్రపు ధరలకే మల్టినేషనల్‌ కంపెనీలకు అంటగడుతున్నది. వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో సమకూర్చుకోజూస్తున్నది. బడా బడా కాంట్రాక్టర్లకు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు జంటనరగ పేద ప్రజలకు దక్కవలసిన భూములన్నింటినీ వ్యాపారులకు అంటగడుతున్నది. విద్యతో కార్పోరేట్‌ వ్యాపారం చేస్తున్నది. వైద్య రంగాన్ని సామాన్య మధ్యతరగతి వారికి అందకుండా చేస్తున్నది.

రంగారెడ్డి జిల్లాలోని పంట భూములన్నింటితో వ్యాపారం చేస్తుంది. భూములు కోల్పోయిన రంగారెడ్డి హైదరాబాదు జిల్లాల ప్రజలు మోసపోతున్నారు. హైదరాబాదు మురికివాడల్లో నివసిస్తున్న పేదలకు సెంటు భూమి దొరకని పరిస్థితి నెలకొన్నది. పాతబస్తీ పరిస్థితి ఇందుకు భిన్నంగా మరిన్ని సమస్యలతో సతమవుతున్నది. తాగునీరు సమస్య - ఇరుకు రోడ్లు - సరైన కాలేజీలు లేక పాతబస్తీ విద్యార్థులు ఎన్నో యిబ్బందులు ఎదుర్కుంటున్నారు. పాత నగరవాసులకు వైద్య సదుపాయం అందడం లేదు. మూలికే నక్కపనై తాటికాయ పడినట్లు పాత నగర ప్రజలు ఎదుర్కునే మరొక్క సున్నితమైన సమస్య మతకలహాలు. ఏ క్షణంలో మత ఘర్షణలు జరుగుతాయో ఎవ్వరూ ఊహించని పరిస్థితి. గత కాలం చరిత్రను తిరగేసి చూసినట్లయితే మతకలహాలు లేవు. రాజకీయ నాయకుల పుణ్యమా అని ఇటీవలి కాలంలోనే మతకలహాలు పెచ్చరిల్లాయి.

అగ్నికి ఆజ్యం తోడయినట్లు పాతనగరానికి పట్టిన మరొక్క జాడ్యం తీవ్రవాదం. పాత నగర ప్రజల సమస్యలు చెపుతూ పోతుంటే మహా గ్రంథమే రాయొచ్చు.హైదరాబాదు చుట్టూర వున్న వందకు పై చిలుకు చెరువులన్నీ ఆక్రమణలకు గురి పోయాయి. రోజు రోజు నగరంలో జనాభా పెరుగుతున్నది. రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. నగరంలో కాలుష్యం కోరలు చాస్తున్నది. హుసేన్‌సాగర్‌ దుర్గంధంతో నిండిపోయింది. ఫలితంగా పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురి కావలసి వస్తున్నది.

హైదరాబాదు ఒక ప్రత్యేకమైన సంస్కృతి కలిగి వున్నది. దినదినం కనబడే సినిమా టీవీ లాంటి విదేశీ సంస్కతి మన నడింట్లోకి వచ్చి కూర్చుంది. జంటనగరాల ప్రజల దినచర్య మారిపోయింది. ఉరుకులు పరుగుల జీవితమైంది. రోజూ హత్యలు, మానభంగాలు, దోంగల బెడదలతో జంట నగరాల ప్రజలు దినదినగండంగా రోజులు వెళ్లదీయవలసి వస్తున్నది. స్కూలు, కాలేజీ ఆఫీసులకెళ్లినవారు తిరిగి ఇంటికొచ్చే దాకా నమ్మకం లేని పరిస్థితిలోనికి హైదరాబాదు నెట్టబడింది. ఇందుకు రోజూ జరుగుతున్న హత్యలు, రోడ్డు ప్రమాదాలే ఉదాహరణ. సాంస్కృతికంగా సినిమాలు, టీవీల దాడికి తట్టుకోలేక తెలంగాణ పండుగలు, భాష, నాటకాలు, జానపదాలు మూలనపడ్డాయి. తెలంగాణ ఆంధ్రరాష్ట్రంలో విలీనమైన నాటి నుండి తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తూనే వచ్చారు. ఎప్పుడూ ముఖ్యమంత్రులుగా ఆంధ్రులే. అరకొరగ తెలంగాణ వారు ముఖ్యమంత్రులుగా ఉన్నా వారిని ప్రోత్సహించలేదు సరికదా, జోకర్లుగా, భాషరాని వారుగా చట్టసభల్లో అవమాన పరిచారు.

పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఆరు సూత్రాల పథకాన్ని తుంగలో తొక్కారు. ముఖ్యమంత్రి ఆంధ్రుడు అయితే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వారు ఉండాలనే నిబంధనను చేతికి ఆరోవేలు ఎందుకని తిరస్కరించారు. నదీ జలాలన్నింటినీ తరలించుకుపోయారు. ఈ విషయాల్లో ఆంధ్ర నాయకత్వాన్ని ఎంతగా విమర్శిస్తున్నామో అంతకంటే ఎక్కువ మోతాదులో తెలంగాణ రాజకీయ నాయకులను నిందించవలసి వుంది.

తెలంగాణలో కొన్ని ఏళ్లుగా నిరుద్యోగులుగా వున్న యువకులకు 610 జీవో అమలు జరగలేదు. అడుగడుగున ఆంధ్ర నాయకత్వం చేసే ద్రోహాన్ని ఎదరించడానికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఏర్పడిన విషయం పాఠకులందరికీ తెలిసిన విషయమే. ఈనాడు రింగు రోడ్ల నిర్మాణంతో జంటనగరాలతో పాటు నల్లగొండ, మెదక్‌, రంగారెడ్డి ప్రజలు కూడా భూములు కోల్పోయి, వలస కూలీలుగా మార్చే ప్రమాదాన్ని ముందే గుర్తెరిగి హైదరాబాదు బచావో నినాదం బయలుదేరింది.

వందల యేళ్ల చరిత్ర కలిగిన హైదరాబాదు, సికింద్రాబాదులను లష్కర్‌, భాగ్యనగరం అని కూడా పిలుచుకునేవారు. ఇక్కడి కట్టడాలైన చార్మినార్‌, మక్కా మసీదు, గోల్కొండ, ఫలక్‌నుమా, హుస్సేన్‌సాగర్‌, హైకోర్టు, గండిపేట, ఒక్కటేమిటి ఇక్కడి బిర్యాని, ఇరాని చాయ్‌లకు పెట్టింది పేరు. ఇక్కడి పురాతన బంగ్లాలన్ని కళాత్మకంగా నిర్మించబడినవే. ఆనాటి ఇంజనీర్ల నైపుణ్యం అడుగడుగున కనిపిస్తుంది. హైదరాబాదును ఒక సుందర నగరంగా తీర్చిదిద్దడానికి ఎందరో కృషి చేశారు. ముఖ్యంగా హైదరాబాదు పట్టణ నిర్మాణంలో తెలంగాణ ప్రజల రక్తమాంసాలు ఉన్నాయి. హైదరాబాదు వారి హక్కు హైదరాబాదు వారి కలల పంట. అది వారి ఆస్తి, ఇక్కడి గాలి, ఇక్కడి నీరు, అన్నీ హైదరాబాదీల సొత్తు.

భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఒక్క భాషా ప్రాతిపదిక మీదనే తెలంగాణలోకి కోస్తాంధ్ర పెత్తందార్లు రావడం మొదలు పెట్టారు. తెలంగాణ జిల్లాల్లో ఆంధ్ర కాలనీలుగా వెలిసారు. హైదరాబాదు జంటనగరాల్లో ఎక్కడికక్కడ హద్దులు నిర్మించుకొని కాలనీ వాసులుగా ఉండిపోయారు. వారి భాష మార్చుకోలేదు. వారి సంస్కృతిని మార్చులేదు. వారి పండుగలు మార్చుకోలేదు. వారి తిండి మార్చుకోలేదు. వారి దినచర్యలను మార్చుకోలేదు. పై పెచ్చు తెలంగాణ జీవితాన్ని తెలంగాణ భాష, తెలంగాణ తిండి, తెలంగాణ వాసులను వెక్కిరింతలకు గురి చేశారు.

తెలంగాణవాసులకు ఇంగ్లీషు రాదని, సోమరులనీ అవహేళన చేస్తారు. కోస్తాంధ్ర పెత్తందార్లు హైదరాబాదును ఒక వ్యాపార కేంద్రంగానే మలుచుకున్నారు. పై పెచ్చు రాజ్యాధాకారానికొచ్చి హైదరాబాదు చారిత్రక కట్టడాలను రక్షించవలసింది పోయి ధ్వంసం చేయసాగారు. సినిమా, టీవీ, పత్రికలు, మీడియా అంతా ఆంధ్రులకు అనుకూలంగా చేసుకొన్నారు. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల ప్రజల భూములను చౌకధరలకు కాజేసి సినిమా సిటీలుగా మార్చుకున్నారు. తెలంగాణవారంటే తెలివి, బలం, ఐక్యత లేని వారని అపోహపడుతున్నారు కోస్తాంధ్రులు.

- గూడ అంజయ్య
(మన తెలంగాణ సౌజన్యంతో)

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X