• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాఠకులకు చిన్నవిన్నపం

By Staff
|

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) చేవ నీరుగారిందా? ఎన్నికల సంరంభం మొదలైనప్పటి నుంచి టిఆర్‌ఎస్‌ క్రమక్రమంగా బలహీనపడుతూ వస్తోందనే వాదన వినిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయమని ప్రకటించిన టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు పార్టీని క్రమంగా ఎన్నికల ఎత్తులకు, జిత్తులకు పరిమితం చేశారనే విమర్శ వినిపిస్తోంది. పార్టీని స్థాపించింది ఎన్నికల ద్వారా అధికారం సంపాదించుకోవడానికి కాదని, ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకోవడం ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని టిఆర్‌ఎస్‌ అవగాహనగా ఉంటూ వచ్చింది. ఇదే విషయాన్ని కెసిఆర్‌ మొదటి నుంచీ చెప్పుకుంటూ వస్తున్నారు.

అయితే అకస్మాత్తుగా టిఆర్‌ఎస్‌ ఎజెండా మారినట్లు అనిపిస్తోంది. అలా అనిపించడానికి కారణం ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కారణం. కాంగ్రెస్‌తో సహా వామపక్షాలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఎన్నికల బరిలో పోరాటం చేయాలని తలపెట్టాయి. చంద్రబాబును గద్దె దించడమే వాటి ఏకైక లక్ష్యంగా మారింది. ఈ లక్ష్యసాధనకు కలిసి రానివారందరూ చంద్రబాబు ఏదో రకంగా అధికారంలోకి రావడానికి ఉపయోగపడినట్లే అవుతుందని ఆ పార్టీలు ఒక మెలిక పెట్టాయి. ఈ మెలిక చంద్రశేఖర్‌ రావును డైలమాలో పడేసింది. కాంగ్రెస్‌, వామపక్షాల మెలిక మిగతా పార్టీలకు ఆహ్వానించదగిందిగానే ఉంటుంది. టిఆర్‌ఎస్‌కే అది గుదిబండగా మారింది. దీంతో కాంగ్రెస్‌తో పొత్తు కోసం ఆయన చకోరపక్షిలా ఎదురు చూస్తూ వచ్చారు.

చంద్రశేఖర్‌ రావు తెలిసో, తెలియకో ఒక మాట అన్నారు కాబట్టి దానికి కట్టుబడాల్సిన అనివార్యతలో పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించే పార్టీలతో ఎన్నికల సర్దుబాటు ఉంటుందనేది ఆ మాట. అందువల్ల ఆయన వెనక్కి తగ్గడానికి వీలు చిక్కింది. లేకుంటే పరిస్థితి టిఆర్‌ఎస్‌ విషయంలోనే కాదు, తెలంగాణ విషయంలోనే మరింత ఘోరంగా ఉండేది.

అన్ని రకాల రాష్ట్రం భ్రష్టు పట్టింది కాబట్టి, చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే మరింత భ్రష్టు పట్టిస్తారు కాబట్టి తమను గెలిపించాలని కాంగ్రెస్‌ ఒక సాధారణీకరించి చెబుతోంది. చంద్రబాబు ప్రపంచ బ్యాంక్‌కు అమ్ముడుపోయాడని, దాని వల్ల ప్రజల బతుకులు వీధిన పడతాయని, అందుకని చంద్రబాబును ఓడించాలని వామపక్షాలు వాదిస్తున్నాయి. చంద్రబాబును ఓడించాలని చెప్పడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. అలా కారణం లేనిదల్లా టిఆర్‌ఎస్‌ మాత్రమే. తన ఎజెండా విషయానికి వస్తే చంద్రబాబును ఓడిస్తే తన లక్ష్యం నెరవేరుతుందనే గ్యారంటీ టిఆర్‌ఎస్‌కు లేదు. అలాంటి కనీస గ్యారంటీ ఉండాలంటే కాంగ్రెస్‌ బేషరతుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తాము కట్టుబడి ఉంటామని బహిరంగ ప్రకటన చేయాలి. దాన్ని కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించాలని చంద్రశేఖర్‌ రావు డిమాండ్‌ చేస్తున్నారు. అలా కాంగ్రెస్‌ ముందుకు వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. కాంగ్రెస్‌కు కావాల్సింది ఏదో విధంగా చంద్రబాబును ఓడించి అధికారంలోకి రావడం. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే తాపత్రయం తప్ప కాంగ్రెస్‌కు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పట్ల చిత్తశుద్ధి లేదని అర్థమవుతూనే ఉన్నది. రాష్ట్రాల పునర్విభన కమీషన్‌ను మరోటి ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను నీరు గార్చే ప్రయత్నం చేసింది. అంతకు మించి ముందుకు రావడానికి అది సిద్ధంగా లేదు. అందువల్ల టిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడమనేది 1969ని కాస్తా తక్కువ నష్టంతో పునరావృతం చేసే దిశకు నడిపించినా ఆశ్చర్యం లేదు.

ఇక వామపక్షాలు మొదటి నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకమే. మంచికో చెడుకో సిపిఎం ఒక వైఖరికి కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ విషయంలో సిపిఎంకు తెలుగుదేశం పార్టీకి తేడా లేదు. బిజెపితో తెగదెంపులు చేసుకుంటే తెలుగుదేశంతో చేతులు కలపడానికి వరుసలో ముందు ఉండేది సిపిఎమ్‌యే. ఇక సిపిఐ ఎప్పటికప్పుడు ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తూ ఉంటుంది. విశాల హృదయంతో సిపిఐ మరో ప్రతిపాదనను ముందుకు తెస్తోంది. పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లో సహకరించుకుని చంద్రబాబును ఓడించాలని సిపిఐ వాదిస్తూ వస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మాత్రం తాము సుముఖం కాదని చెప్తోంది. తాము నెరవేర్చాలనుకున్న కార్యాన్ని టిఆర్‌ఎస్‌ సహకారంతో సాధించాలని సిపిఐ తాపత్రయం. ఈ విషయంలో తమ సోదర పార్టీ సిపిఎం తమను వ్యతిరేకిస్తున్నందుకు సిపిఐ బాధపడుతూనే ఉంది. గత ఎన్నికల్లో సిపిఐ ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది. ఇప్పుడు టిఆర్‌ఎస్‌ మరింతగా నడ్డి విరిచే ప్రమాదం ఉంది. అందువల్ల ఎంతో కొంత బలం శాసనసభలో ఉండాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకమై ఎన్నికల పోరాటం చేస్తే తప్ప సాధ్యం కాదు.

టిఆర్‌ఎస్‌తో పొత్తు విషయాన్ని కాంగ్రెస్‌ నాన్చడం అనేది కేవలం తెలంగాణపై స్పష్టంగా ముందుకు రావడానికి వెనకాడడం ఒక్కటే లేదు. పొత్తు అనే అంశం ద్వారా టిఆర్‌ఎస్‌ను మభ్యపెట్టి, దాని కార్యకలాపాలను స్తంభింపజేయడం కూడా కాంగ్రెస్‌ నాన్చుడు ధోరణిలో ఉన్నదనేది రాజకీయ పండితుల అభిప్రాయం. చంద్రబాబును ఓడించే ఉమ్మడి కృషి ప్రయత్నంలో పడిపోయి ఇప్పటికే టిఆర్‌ఎస్‌ను స్తబ్దత ఆవరించింది. ఈ స్తబ్దత కాంగ్రెస్‌ పొత్తు విషయం తేల్చే దాకా కొనసాగితే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని గుర్తించే చంద్రశేఖర్‌ రావు కాంగ్రెస్‌తో దోస్తీకి చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నారని అనుకోవచ్చు.

ఎన్నికల్లో గెల్చుకునే సీట్లకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చంద్రశేఖర్‌ రావు ముడిపెట్టడం వల్లనే పరిస్థితి ఇంత దాకా వచ్చింది. తెలుగుదేశం నాయకుల ప్రలోభాలకు, వేధింపులకు లొంగిపోయి ఇప్పటికే కిందిస్థాయి నాయకులు టిఆర్‌ఎస్‌ నుంచి తప్పుకున్నారు. తెలుగుదేశంలోకి వెళ్లి లబ్ధి పొందినవారు తక్కువైతే వేధింపుల నుంచి ఊరట పొందినవారు చాలా మంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంతో ముందుకు పోతున్న తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకత్వం కిందిస్థాయి నాయకుల మనోనిబ్బరాన్ని కాపాడడానికి చర్యలు తీసుకుని వుంటే పరిస్థితి ఇంతకన్నా మెరుగ్గా ఉండేది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X