వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ జూదం

By Staff
|
Google Oneindia TeluguNews

సెంట్రల్‌ యూనిర్శిటీ కుల రాజకీయాలతో అట్టుడుకుతోంది. జనవరి 11వ తేదీన హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనిర్శిటీ విద్యార్థులు పది మందిని వైస్‌ ఛాన్సలర్‌ యూనివర్శిటీ నుంచి శాశ్వతంగా బహిష్కరించడంతో వివాదం చిలికి చిలికి గాలి వాన అయింది. రస్టికేషన్‌కు గురైన పది మందిలో ఇద్దరు పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు కాగా, ఎనమండుగురు రీసెర్చి స్కాలర్లు. ఛీఫ్‌ వార్డెన్‌పై దాడి చేసినందుకు వీరిని రస్టికేషన్‌ చేశామని వైస్‌ ఛాన్సలర్‌ చెబుతున్నారు. వైస్‌ ఛాన్సలర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా, విద్యార్థులకు మద్దతుగా సెంట్రల్‌ యూనివర్శిటీ దళిత విద్యార్థుల సంఘీభావ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో ఎపిసిఎల్‌సితో పాటు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు ఉన్నారు.

రస్టికేషన్‌కు ముందు విద్యార్థుల అభిప్రాయాలు వినాలా, వద్దా అనేది చర్చనీయాంశంగా మారింది. విచారణ కమిటీని నియమించి విద్యార్థుల వాదనలు వినకుండా ఏకపక్షంగా వైస్‌ ఛాన్సలర్‌ విద్యార్థులను రస్టికేట్‌ చేశారని ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం (ఎపిసిఎల్‌సి) జంటనగరాల శాఖ అధ్యక్షుడు కె.వి.కె. సుబ్రహ్మణ్యం విమర్శిస్తున్నారు. గతంలో వేంకటేశ్వర యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌పనై దాడి చేసిన ఘటనలో బహిష్కరణ శిక్ష విధించలేదని, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓ టీచర్‌పై దాడి చేసి మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించిన విద్యార్థులను రస్టికేట్‌ చేయలేదని ఆయన అంటున్నారు. ఈ సంఘటనల్లో దాడికి పాల్పడిన విద్యార్ధులు దళితేతరులు కావడమే అందుకు కారణమని, దళిత విద్యార్థులు కావడం వల్లనే సెంట్రల్‌ యూనివర్శిటీలో రస్టికేషన్‌ శిక్ష వేశారని ఆయన విమర్శిస్తున్నారు.

నేపథ్యం

తాజా వివాదానికి నేపథ్యం మెస్‌ వ్యవహారం. విద్యార్థులే హాస్టల్‌ మెస్‌లను నిర్వహించుకునే వారు. దీని వల్ల మెస్‌ బిల్లు ఒక్కో విద్యార్థికి ఏ రోజు కూడా 16-18 రూపాయలకు మించలేదని అంటారు. అయితే, విద్యార్థుల స్వయం నిర్ణయాధికారానికి గండి కొడుతూ మెస్‌ల నిర్వహణకు యూనివర్శిటీ యంత్రాంగం టెండర్లు ఆహ్వానించింది. టెండర్‌దార్లు ప్రకటించిన కనీస ఖర్చు రోజుకు 45 రూపాయలు ఉంది. హాస్టల్‌ భోజనాలకు అవసరమైన సరుకుల కొనుగోలుకు కేంద్ర కొనుగోలు కమిటీ ఏర్పాటయింది. దీంతో విద్యార్థుల స్వయం నిర్ణయాధికాం రద్దయింది. హాస్టళ్ల నిర్వహణ కేంద్ర కొనుగోలు కమిటీ చేతికి వచ్చింది. అప్పటి నుంచి ఒక్కో విద్యార్థి ఒక్క రోజు మెస్‌ బిల్లు 25 రూపాయలకు చేరుకుంది.

ఇదంతా జరగడానికి ముందు యూనివర్శిటీలో కొన్ని పోస్టర్లు వెలిశాయి. దళిత విద్యార్థులు మెస్‌ సెక్రటరీ పదవులు నిర్వహించడానికి తగరనేది, వారు పరాన్నభుక్కులనేది ఈ పోస్టర్ల సారాంశం. ఒక రకంగా ఇది దళిత విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేదే. ఇదే సమయంలో రిసెర్చ్‌ స్కాలర్స్‌ హాస్టల్‌ వార్డెన్‌గా డాక్టర్‌ రత్నం వుండగానే రెండవ వార్డెన్‌గా డాక్టర్‌ పాణిగ్రాహిని నియమించారు. డాక్టర్‌ పాణిగ్రాహికి ఆర్థికాధికారాలతో పాటు ముఖ్య అధికారాలన్నీ అప్పగించి, డాక్టర్‌ రత్నంను సానిటేషన్‌, గార్డెనింగ్‌ వంటి పనులు అప్పగించారు. డాక్టర్‌ రత్నం దళితుడు కావడం వల్లనే ఇలా చేశారనేది ఎపిసిఎల్‌సి ఆరోపణ.

తమను అవమానాల పాలు చేస్తున్న సంఘటనలన్నింటిపై అంబేడ్కర్‌ విద్యార్థి సంఘం వైస్‌ చాన్సలర్‌కు నివేదనలు చేస్తూనే వుంది. అయితే ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. మెస్‌ల నిర్వహణలో తమ స్వయం నిర్ణయాధికారాన్ని రద్దు చేస్తూ కేంద్ర కొనుగోలు కమిటీని ఏర్పాటు చేయడం పుండు మీద కారం చల్లినట్లయింది. డాక్టర్‌ రత్నంకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడేందుకు జనవరి 9వ తేదీన ఛీఫ్‌ వార్డెన్‌ అప్పారావు వద్దకు అంబేడ్కర్‌ విద్యార్థి సంఘం ప్రతినిధులు వెళ్లారు. అయితే అప్పారావు విద్యార్థుల డిమాండ్‌కు సానుకూలంగా ప్రతిస్పందించలేదు. అయితే, తమకు సమాధానం చెప్పాల్సిందేనని విద్యార్థి ప్రతినిధులు పట్టుబట్టారు. ఈ సమయంలో తోపులాట జరిగిందని, దీంతో అప్పారావును సెక్యూరిటీ గార్డులు పక్క గదిలోకి తీసికెళ్లారని ఎపిసిఎల్‌సి అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం అంటున్నారు. తమను వారించడానికి ప్రయత్నించిన మరో దళిత వార్డెన్‌ రాజశేఖర్‌ను విద్యార్థులు పక్కకు తోసేశారు. రాజశేఖర్‌ ఈ ఘర్షణలో స్వల్పంగా గాయపడ్డారు.

ఆ తర్వాత దళిత విద్యార్థులు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం కింద అప్పారావుపై ఫిర్యాదు చేశారు. ఇది పదో తేదీన జరిగింది. మరునాడు యూనివర్శిటీలో సాయుధ పోలీసు బలగాలు దిగాయి. పాలక మండలి అత్యవసర సమావేశం జరిగింది. పది మంది దళిత విద్యార్థులను రస్టికేట్‌ చేస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది. దాంతో రస్టికేషన్‌కు గురైన పది మందిలో ఆరుగురిని నాగరాజు, నాగేశ్వరరావు, శేషగిరి, లెనిన్‌, విజయ్‌, కరుణాకర్‌లను పోలీసు స్టేషన్‌కు తీసికెళ్లి వారిపై అప్పారావుపై దాడి చేశారనే అరోపణపై కేసులు పెట్టి కోర్టులో హాజరు పరిచారు. వీరు బెయిల్‌పై విడుదలయ్యారు.

ఈ స్థితిలో ప్రజా సంఘాలు దళిత విద్యార్థులకు మద్దతుగా రంగంలోకి దిగాయి. రస్టికేషన్‌ విషయంలో కనీస పద్ధతులు పాటించకపోవడాన్ని ఈ ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సెంట్రల్‌ యూనివర్శిటీ దళిత విద్యార్థుల సంఘీభావ కమిటీని ఏర్పాటు చేశాయి. విద్యార్థుల రస్టికేషన్‌ను ఉపసంహరించుకోవాలని, విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, క్యాంపస్‌లో గత కొన్నేళ్లుగా సాగుతున్న దళిత వ్యతిరేక చర్యలపై సమగ్ర విచారణ జరిపించాలని, సంస్కరణల పేరుతో హాస్టళ్ల ప్రైవేటీకరణ ప్రయత్నాలను మానుకోవాలని ఈ కమిటీ డిమాండ్‌ చేస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X