• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిస్సిగ్గు సమర్థన వెనక...

By Staff
|

ఉద్యోగులను బెదిరించడానికే జీవో నెంబరు 5ను విడుదల చేశామని ఆర్థిక మంత్రి కె. రోశయ్య చెబుతున్నారు. కష్టపడి పని చేయకుంటే, సంస్థలను లాభాల బాటల నడపకపోతే తొలగిస్తామని ఒక యజమాని చేసే హెచ్చరిక లాంటిది ఆ జీవో అనేది రోశయ్యగారి అంతరార్థం. రోశయ్య మాటలు బుకాయింపు అనే విషయం అర్థం చేసుకోలేనంత అమాయకులు కారు రాష్ట్ర ప్రజలు. 30 సంస్థల్లో 68 వేల మంది ఉద్యోగులను తొలగించడానికి ప్రభుత్వం ఆ జీవో జారీ చేసింది. దీనిపై పెద్ద యెత్తున నిరసన వెల్లువెత్తడంతో ప్రభుత్వం స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. జారీ చేసిన జీవోలన్నీ అమలు చేస్తామా అని ఒక అర్థం లేని ప్రశ్న ఒకటి వేశారు. ప్రభుత్వం తాను విడుదల చేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడం అనేది జరుగుతూనే వుంది. అలా అమలు కాని జీవోలపై ఆయా వర్గాలు ఎప్పటికప్పుడు ఆందోళనలకు దిగుతూనే వున్నాయి. జీవోలను అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఇప్పటి వరకు అమలు కాని జీవోలకు, ఇప్పుడు జారీ అయిన ఐదో నెంబర్‌ జీవోకు తేడా వుంది. ఆర్థికపరమైన భారం పడుతున్నప్పుడో, ఇతరత్రా సమస్యలు ఎదురైనప్పుడో ప్రభుత్వ జీవోల అమలు పట్ల ఉదాసీన వైఖరి ప్రదర్శించడం పరిపాటిగా వస్తూనే వుంది. కానీ ఇప్పటి జీవో అటువంటిది కాదు, దీన్ని అమలు చేయాల్సిన అగత్యం ప్రభుత్వంపై వుంది. నిజానికి రోశయ్య లాంటి ఒక బాధ్యత గల సీనియర్‌ మంత్రి అలాంటి ప్రకటన చేయడం ప్రభుత్వం ఎంత బాధ్యతారహితంగా నడుస్తున్నదో తెలియజేస్తుంది.

ఇకపోతే రాష్ట్రంలోని 30 సంస్థల్లో మూడవ దశ సంస్కరణలను చేపట్టాలని రాష్ట్ర మంత్రి వర్గం ఇటీవల నిర్ణయం తీసుకుంది. సంస్కరణలంటే అర్థం మారిపోయి చాలా కాలమే అవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, ప్రైవేటు సంస్థలకు అమ్మడం సంస్కరణల్లో భాగమని ఇవాళ కొత్తగా చెప్పాల్సిన అవసరమేమీ లేదు. అది అందరికీ అర్థమయ్యే విషయమే. ఇలా సంస్కరణలు చేపట్టాల్సిన సంస్థల్లో లాభాల బాటలో నడుస్తున్న సింగరేణి, ఆర్టీసి వంటి సంస్థలు కూడా వున్నాయి. ఆర్టీసి కొంత మేరకు సామాజిక సంక్షేమ కార్యక్రమంలో కూడా భాగం పంచుకుంటున్నది. కొన్ని వర్గాలకు రాయితీలు ఇవ్వడం ద్వారా కొంత ఊరట కలిగిస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించిన పాత్ర, అవి నడిచిన తీరు, అవి కనబరిచిన ప్రతిభ విస్మరించరానిది. ఆల్విన్‌ వంటి పలు సంస్థలు లాభాలు ఆర్జించే దిశగానే సాగాయి. అయితే వాటిని తెల్ల ఏనుగుల్లా తయారు చేసింది ప్రభుత్వమే. అనుభవం లేని ఉన్నతాధికారులను వాటికి అధిపతులుగా నియమించడం ద్వారా, కొంత అవినీతి వల్ల చాలా ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. వాటిని నష్టాల్లోకి నెట్టింది కూడా ప్రభుత్వ విధానాలే తప్ప వాటిలోని ఉద్యోగులు, కార్మికులు కాదనే విషయం విశ్లేషణ చేస్తే తెలిసిపోతుంది.

అసలు విషయానికి వస్తే, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో సంస్కరణలు ఊపందుకున్నాయి. ప్రపంచబ్యాంకు, ఇతర అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థల షరతుల మేరకు సంస్కరణలను అమలు చేయాల్సి వుంటుంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులను గణనీయంగా తగ్గించడం, ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం ద్వారా ఆర్థిక వనరులను సమీకరించుకోవడం ప్రధానమైన అంశాలు. ఇందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలను సంస్కరణల పేర ప్రైవేట్‌పరం చేయడానికి ప్రభుత్వం సిద్ధపడింది. ఒకేసారి అమ్మడం వల్ల ఎదురయ్యే ప్రతిఘటనను తట్టుకోవడం కష్టమవుతుంది కాబట్టి సంస్కరణల పేర వాటిని క్రమక్రమంగా ప్రైవేట్‌పరం చేసే ప్రక్రియను ప్రభుత్వం అనుసరిస్తున్నది. ఈ విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వ విధానాలను ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి ముందుకు తీసుకుపోతున్నారు. తేడా ఏమిటంటే, చంద్రబాబు ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల షరతులను ఆదర్శాలుగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఆ ఆదర్శాలతో అభివృద్ధికరమైన సమాజం ఏర్పడుతుందని ఆయన ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రచార ఘట్టాన్ని అటక మీద పడేసి తనదైన శైలిలో వాటిని కొనసాగించేందుకు సిద్ధపడింది.

హైదరాబాద్‌ సమీపంలోని విలువైన భూముల వేలం పాటలు కూడా ప్రభుత్వ ఆస్తులను అమ్మే ప్రక్రియలో భాగంగానే కొనసాగుతున్నాయి. వివిధ పేర్లతో భూసేకరణ చేసి వాటిని కోట్లాది రూపాయలకు విక్రయించడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలనేది ప్రభుత్వ కార్యాచరణ. ఈ విషయంలో ప్రభుత్వం చాలా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం కొంత మంది వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకున్నది. ఈ విషయంలోని అక్రమ విధానాలను, ప్రభుత్వ దమననీతిని కొన్ని పత్రికలు బయటపెట్టాయి. ఆ సమయంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి సబితారెడ్డి ఇచ్చిన వివరణ ప్రభుత్వం సామాన్యులకు వ్యతిరేకంగా ఎంత దూకుడుగా వెళ్తుందో తెలియజేస్తుంది. రైతుల వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకుని వారికి ఇళ్ల కోసం కొద్దిపాటి భూమి ఇస్తామని, డబ్బులు ఇస్తే ఖర్చు చేసుకుంటారు కాబట్టి వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలనుకుంటున్నామని ఆమె చెప్పారు. అంటే ఎకరాల కొద్ది వ్యవసాయ భూములను వారి నుంచి లాక్కుని ఇంటి కోసం చిన్నపాటి స్థలాన్ని ఇస్తుందనేది ఆమె మాటలను బట్టి స్పష్టంగా అర్థమవుతూనే వుంది. అంటే చేతిలో పైసా పెట్టి వంద లాక్కున తీరులో ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది వేరే చేపాల్సిన అవసరం లేదు. వేలం పాటలు ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికేనని ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి చెప్పారు. ప్రభుత్వం భూములను కాపాడడం కూడా కష్టమవుతున్నది ఆయన చెప్పారు. అక్రమ ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవడం దుర్లభమవుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ భూములు చాలా అక్రమ కబ్జాలకు గురైన మాట వాస్తవమే. ప్రభుత్వ ఆస్తులనే కాపాడలేని ప్రభుత్వాలు సామాన్యుల ఆస్తులను, ప్రాణాలను కాపాడడంలో తీసుకునే శ్రద్ధ ఏపాటిదో అర్థం కావడం లేదా?

భూకబ్జాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నది ఎవరు? విలువైన ప్రైవేట్‌ భూములను అదిరించి, బెదిరించి కబ్జాలు చేస్తున్నదెవరు? ఇందులో ప్రభుత్వ యంత్రాంగాల పాత్ర ఏ మేరకు ఉంది? ఈ చర్యలకు పాల్పడుతన్నవారిని ప్రభుత్వం ఏం చేయలేనంత అసక్తతతో వుందా? కొంత మంది వ్యక్తులను, భూబకాసురులను అదుపు చేయలేని ప్రభుత్వం ప్రజలకు ఏ మాత్రం రక్షణ కల్పించగలదు? ఇప్పుడు తాజాగా ప్రభుత్వమే ఆ భూబకాసురుల వంటి పాత్రన రాజమార్గంలో అనుసరించడం ఎంత వరకు న్యాయం?

భూములను వేలం వేయకపోతే జలయజ్ఞంలాంటి బృహత్తర అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడం ఎలా సాధ్యమని ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు ఎవరికి ఉపయోగపడతాయి, వాటి వల్ల నష్టపోతున్నదెవరు? అంతేకాదు, లాభపడేది ఎంతమంది, నష్టపోయేది ఎంతమంది? ప్రభుత్వ ప్రాజెక్టులు మధ్య దళారులను పెద్ద యెత్తున ప్రభుత్వ కార్యక్రమాలు పెంచి పోషిస్తున్న మాట నిజం కాదా? కన్సల్టెన్సీ సంస్థల పేర ఎంత ప్రభుత్వ ధనం వృధాగా పోతున్నది? ఈ కన్సల్టెన్సీ సంస్థలు కూడా బహుళ జాతి సంస్థల పేరు ముందుకు వస్తాయి. అవి తమకు లాభాలు పండే ప్రాజెక్టు నివేదికలను మాత్రమే ఇస్తాయి తప్ప స్థానిక అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవనే విషయం తెలియదా? రాజకీయాలు మొత్తం ఇప్పుడు ఒక దళారీ పాత్ర నిర్వహిస్తున్న వైనం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న భూముల వేలం పాటల ద్వారా బహిరంగంగా వెల్లడువుతోంది.

భూముల నుంచి బేదఖల్‌ అయి రోడ్డు మీద పడ్డ రైతుల దీనస్థితి ఎంత హృదయవిదారకంగా వుందో ఎప్పుడైనా ప్రభుత్వానికి పట్టిందా? తమ చర్యను సమర్థించుకోవడానికి డాంబికాలు పలకడమే దాని పనిగా మారింది. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల లోగుట్టు ప్రజలకు తెలియంది కాదు. కానీ ఇటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వెల్లువలా ఎగిసిపడే రాజకీయాలే బలహీనంగా ఉన్నాయి. ఇదే ఇప్పటి ప్రభుత్వాల బలం.

- రవికిరణ్‌

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more