వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్పులతో దశ తిరుగుతుందా?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సినీనటి, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు విజయశాంతి కర్ర విరగకుండా పాము చావకుండా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ పోరాటం చేస్తానంటూనే బిజెపి పట్ల మక్కువ ఉన్నదని ప్రకటిస్తున్నారు. బిజెపి వదిలేది లేదంటూనే ఊహాగానాలకు, ప్రచారాలకు వీలు కల్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌ పట్ల తమ పార్టీ నాయకత్వ వైఖరిని మార్చేందుకు ప్రయత్నిస్తానని ఆమె చెబుతున్నారు. ఇది సాధ్యమయ్యే విషయమేనా అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం అంత కష్టమేమీ కాదు. బిజెపి తెలంగాణ ఎజెండాను స్వీకరించేందుకు సిద్ధంగా లేదని అందరికీ తెలుసు. తెలుగుదేశంతో స్నేహం చేసినంత కాలం తెలంగాణ తమ ఎజెండా కాదని బిజెపి రాష్ట్ర నాయకులు చెబుతూనే ఉన్నారు. పైగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బిజెపి జాతీయాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బద్ధవిరోధి. చంద్రబాబుకు, వెంకయ్యనాయుడుకు మధ్య స్నేహం విడదీయరానిది. అది ఎంత కాలమైనా కొనసాగవచ్చు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం విజయశాంతి పార్టీ పెడతారనే ఊహాగానాలు గతంలో ఊపందుకున్నాయి. సెప్టెంబర్‌ 17వ తేదీననే ఆమె పార్టీని ప్రకటించాల్సి వుంది. కానీ అనేక అవాంతారాల కారణంగా ఆమె వెనక్కి తగ్గారు. ఆమె కాంగ్రెస్‌లో చేరుతారని కూడా ప్రచారం జరిగింది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ ఆమెను కలుసుకున్నారు కూడా. తెలంగాణ కాంగ్రెస్‌ ఫోరమ్‌ (సిఎఫ్‌టి) నాయకులు కూడా ఆమెతో సమావేశమయ్యారు. ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌)లో చేరుతారని కూడా ప్రచారం జరిగింది. ఆమె తమ పార్టీలో చేరడం ఖాయమని టిఆర్‌ఎస్‌ నేత ఎ. నరేంద్ర ఇటీవల దట్స్‌ తెలుగు డాట్‌ కామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఆమె అడుగు ఎటు వేస్తారో తెలియడం లేదు. తాను బిజెపిలోనే ఉండి తెలంగాణ కోసం పోరాడుతానని ఆమె తరుచుగా ప్రకటనలు ఇస్తున్నారు. నిత్యం వార్తల్లో నలగడానికి ఆమె తెలంగాణ రాజకీయాల పేర ప్రయత్నిస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతోంది.

నిజానికి, సినిమావాళ్ల నిర్ణయాలే గమ్మత్తుగా ఉంటాయి. గ్లామర్‌ ప్రపచంలోంచి రాజకీయాల్లోకి రావడానికి వారు వ్యవహరించే తీరు గమ్మత్తుగా ఉంటుంది. గ్లామర్‌, ఖ్యాతి వున్న సినీ ప్రముఖులు చాలా మంది ఏకంగా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తారు. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటారు. దాని కోసం తర్జనభర్జనలు పడతారు. వెనక్కి తగ్గుతుంటారు. ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు పార్టీ పెట్టడానికి సమాయత్తమై దాన్ని విరమించుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ నుంచి రాజ్యసభలో అడుగు పెట్టారు. ప్రముఖ సినీనటుడు చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం గురించి చాలా కాలంగా ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం విజయశాంతి రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆమె పోషించబోయే పాత్ర గురించి ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇటువంటి సందర్భాల్లో వారు చేసే ప్రకటనలు కూడా ఊహాగానాలకు వీలు కల్పిస్తూ వుంటాయి.

ఇదంతా పక్కన పెడితే, తెలంగాణ అనేది రాజకీయ నాయకులు ఒక ఆటబొమ్మగా మారిందని అనిపిస్తోంది. విజయశాంతికి కూడా తెలంగాణ ఎజెండా ఒక ఆటబొమ్మనేనా అనే అనుమానం కలుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X