వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాఠకులకు చిన్నవిన్నపం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఐక్య సంఘటన కట్టడానికి గల అవకాశాలు ఎంత బలహీనంగా ఉన్నాయో బయటపడుతున్నాయి. తెలుగుదేశం- బిజెపి కూటమిని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఐక్యం కావాలనే నినాదం గత కొంతకాలంగా ఊపందుకుంది. ఈ ఐక్యతను సాధించేందుకు బోగస్‌ ఓట్ల ఏరివేతకు చేపట్టిన ఆందోళనను ప్రారంభంగా ప్రతిపక్షాలు చెప్పుకున్నాయి. బోగస్‌ ఓట్ల ఏరివేత చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళన కొంత మేరకు విజయం సాధించింది. అయితే ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం జరిగిన ప్రయత్నాలు మాత్రం ముందుకు సాగలేదు.

మతతత్వానికి ఊతం ఇస్తున్న, ప్రపంచ బ్యాంక్‌కు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఓడించడమే ప్రధమ కర్తవ్యం కావాలని కాంగ్రెస్‌ అభిప్రాయపడుతోంది. ఈ ఏకైక ఎజెండా మీద ప్రతిపక్షాలను కూడగట్టే పెద్దన్న పాత్రను పోషించే బాధ్యత తమ మీద ఉన్నదని కాంగ్రెస్‌ చెప్పుకుంటూ వచ్చింది. కొంత మేరకు ఈ ఐక్యతా యత్నాలు ముందుకు సాగినట్లే అనిపించాయి. అయితే కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుకు తాము సిద్ధంగా లేమని, తాము పోటీ చేయని చోట సహకరిస్తామని సిపిఎం చెబుతోంది. ఇందులోని అస్పష్టత అటు కాంగ్రెస్‌ కార్యకర్తలను, ఇటు సిపిఎం కార్యకర్తలను గందరగోళంలో పడేస్తుందనడంలో సందేహం లేదు. కిందిస్థాయిలో పరస్పరం సహకరించుకోవడానికి తగిన పునాదిని సహకారం అనే వైఖరి ఏర్పాటు చేయలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌)తో సిపిఎం శత్రువైరుధ్యాన్నే ప్రదర్శిస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తన బద్ధవిరోధాన్ని సిపిఎం మరోసారి బయట పెట్టుకుంది. చంద్రబాబును ఓడించడానికి అందరూ తన మాట వినాలనే వైఖరిని సిపిఎం ప్రదర్శిస్తోంది. ఆ పార్టీకి ఉన్న బలం, అది ప్రభావం చూపే స్థాయి సిపిఎం మాటల తీరును ప్రతిబింబించడం లేదు. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.

సిపిఐ మాత్రం కొన్ని మెట్లు దిగి మాట్లాడుతోంది. అలా మాట్లాడడానికి దానికున్న కారణాలు దానికి ఉన్నాయి. ప్రస్తుతం సిపిఐకి రద్దయిన శాసనసభలో ప్రాతినిధ్యం లేదు. ఏదో కొంత మేరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం సంపాదించాలంటే సిపిఎం స్నేహం ఒక్కటే సరిపోదు. అందుకని తాము తెలంగాణ రాష్ట్రానికి తాము వ్యతిరేకమంటూనే టిఆర్‌ఎస్‌తోనూ, కాంగ్రెస్‌తోనూ కలిసి పని చేయడానికి సిద్ధపడుతోంది. ఈ స్థితిలో సిపిఐ, సిపిఎంలతో టిఆర్‌ఎస్‌ కలిసి పని చేయడం అంత తేలిక కాకపోవచ్చు.

ఇదిలా వుంటే కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌లకు మధ్య పొత్తు కుదురుతుందనే అభిప్రాయం ఇంకా బలంగానే ఉంది. అడిగినన్ని సీట్లు ఇవ్వనందునే కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుంటామని చంద్రశేఖర్‌ రావు ప్రకటించారని కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అయితే, తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు బేషరతుగా ముందుకు రావాలని టిఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. అయితే ఈ విధంగా కాంగ్రెస్‌ ముందుకు రాకపోయినా అడిగినన్ని సీట్లు ఇస్తే చంద్రశేఖర్‌ రావు పొత్తుకు అంగీకరిస్తారనే ప్రచారం కూడా ఉంది. చంద్రశేఖర్‌ రావు అలా అంగీకరిస్తే వ్యతిరేకిస్తామని టిఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధలు ఫోరమ్‌ అధ్యక్షుడు ఎ. నరేంద్ర అన్నారు. అందువల్ల తెలంగాణ ఏర్పాటుకు ముందుకు వస్తేనే కాంగ్రెస్‌తో టిఆర్‌ఎస్‌ పొత్తుకు అవకాశాలుంటాయనేది అర్థమవుతోంది. అందుకు కాంగ్రెస్‌ అంగీకరిస్తుందా అనేది ప్రశ్న.

కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ పొత్తు ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేయవచ్చునని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే తెలంగాణలో తెలుగుదేశం సీట్లు తగ్గుతాయని సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి. తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు మూడు లోక్‌సభ సీట్లు వస్తాయని అరుణ్‌ నెహ్రూ అంచనా వేస్తున్నారు. ఈ మేరకు శాసనసభ సీట్లు కూడా రావచ్చు. టిఆర్‌ఎస్‌కు ఆ మేరకు బలం ఉన్నది కాబట్టే టిఆర్‌ఎస్‌తో పొత్తుల లేదా అవగాహన తెలుగుదేశం ఎదుర్కోవడానికి తప్పనిసరి అని తేలిపోతుంది. ఈ స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే ఏర్పడిన టిఆర్‌ఎస్‌ దాన్ని వ్యతిరేకించే పార్టీలతో పొత్తుకు ఎలా సిద్ధపడుతుంది. ఒక వేళ సిద్ధపడితే వ్యతిరేక ఫలితాలు రావని గ్యారంటీ ఏమీ లేదు.

ఏ పార్టీకి ఉండాల్సిన పరిమితులు ఆ పార్టీకి ఉండడంతో రాష్ట్రంలో ప్రతిపక్షాల మధ్య ఐక్యత అనేది మేడిపండు నీతే అవుతుందనే అభిప్రాయం బలంగా ఉంది. అవగాహన, సహకారం వంటి వైఖరులు ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఇదే చంద్రబాబు బలం కూడా.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X