• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పొలిటికల్‌ డైవర్షన్‌స్కీమ్‌

By Staff
|

ఆర్‌డియస్‌ జలరాజకీయాలు ముదిరి పాకాన పడడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల సీనియర్‌ మంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కర్నూలుకు చెందిన రాష్ట్ర మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బి.వి. మోహన్‌ రెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి ముఖ్యమంత్రి ఎదుటే కత్తులు దూసుకున్నట్లు సమాచారం. దీంతో ఆ సమావేశంలో ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయారు. ఆ తర్వాత వీరిరువురు లేకుండా ఏర్పాటు చేసిన సమావేశంలో మహబూబ్‌నగర్‌ జిల్లా భూములకు తూములు మూయకుండా ప్రత్నామ్నాయ పద్ధతుల్లో నీరందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌డియస్‌ ఎత్తును నాలుగు అడుగుల పెంచాలని, జూరాల లింక్‌ కాల్వ ద్వారా 70 వేల ఎకరాలకు నీరందించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంకా 17 వేల ఎకరాలకు ఎలా నీరందించాలనే విషయాన్ని ఆలోచించాల్సి ఉంది. ఈ ఆలోచన చేసి మార్గం కనిపెట్టే బాధ్యతను నీటి పారుదల శాఖ అధికారులకు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరికి అప్పగించారు. ఇది ఆచరణ సాధ్యమేనా అనే ఆలోచన చేయడానికి ముందు అసలు ఆర్‌డియస్‌ కథ గురించి తెలుసుకోవడం అవసరం. ఈ కథ తెలిస్తే సామరస్యపూర్వకంగానే సమస్యను పరిష్కరించే మార్గం కూడా దొరకవచ్చు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందుకు సిద్ధంగా ఉన్నారా అనేది ప్రశ్న. తెలంగాణ నీటి నిపుణులు రెండు జిల్లాలకు ఆమోదయోగ్యం కాగల పరిష్కార మార్గాన్ని సూచించే స్థితిలో ఉన్నారన్న విషయాన్ని ఆయన అంగీకరించడానికి సిద్ధంగా లేకపోవచ్చు. ఇదే రాజకీయం.

నిజాం నవాబు 1952లో రాజోలిబండ వద్ద ఈ డైవర్షన్‌ స్కీమ్‌ను ప్రారంభించాడు. అయితే ఇది 1958లో పూర్తయింది. ఆంధ్ర, కర్ణాటకల ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యామ్‌ నుంచి రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌కు నీరందుతుంది. ఈ స్కీమ్‌ ద్వారా లభించే మొత్తం 17.1 టిఎంసిల నీటిలో కర్ణాటకకు 1.2 టిఎంసిలు, ఆంధ్రప్రదేశ్‌కు 15.9 టిఎంసిలు కేటాయించారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారమే ఈ కేటాయింపులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు దక్కే నీటి వాటాను మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 80,745 ఎకరాల భూమిని సాగు చేయడానికి కేటాయించారు.

కర్నూలు, కడప జిల్లాలోని భూములకు సాగునీరందించడానికి కె.సి. కెనాల్‌ను తలపెట్టారు. కె.సి. కెనాల్‌కు నీరందించడానికి సుంకేశుల బ్యారేజీని నిర్మించారు. కె.సి. కెనాల్‌కు కేటాయించిన 39.9 టిఎంసిల ద్వారా కడప, కర్నూలు జిల్లాలోని 93వేల ఎకరాలకు నీరందించాలి. అంటే మొత్తం తుంగభద్ర జలాశయం నుంచి ఈ రెండు పథకాలకు 57 టిఎంసిల నీరు రావాలి. 1987-88, 1988-89, 1990-91 సంవత్సరాల్లో మినహాయిస్తే ఎప్పుడు కూడా ఈ పథకాలకు అంతకన్నా తక్కువ నీరు వచ్చిన దాఖాలు లేవని రికార్డులు చెబుతున్నాయి. అంటే నిర్ణయించిన ప్రకారం నీటి వాటాల పంపిణీ జరగకపోవడం వల్లనే సమస్య ఉత్పన్నమైందనేది దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు.

కర్ణాటక ఎగువ ప్రాంతంలో నీరు కొల్లగొట్టడం వల్లనే వివాదం చెలరేగిందనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వాదనలో కూడా నిజం లేదని వాస్తవాలు పరిశీలిస్తే తెలిసిపోతుంది. లభించిన గణాంకాల ప్రకారం కర్ణాటక అర టిఎంసి నుంచి నాలుగున్నర టిఎంసిల మేరకు మాత్రమే నీటి చౌర్యానికి పాల్పడుతోందని కేంద్ర జలసంఘం రిటైర్డ్‌ ఛీఫ్‌ ఇంజనీర్‌ ఆర్‌. విద్యాసాగర రావు అంటున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా భూములకు ఏనాడు పూర్తి స్థాయిలో నీరందింన దాఖలాలు లేవు. 15.9 టిఎంసిల నీరు అందాల్సిన మహబూబ్‌నగర్‌ జిల్లాకు సగటున ఏడాదికి ఆరేడు టిఎంసిల నీరు మాత్రమే లభిస్తోంది. ఒకవేళ కర్ణాటక చౌర్యం చేసింది మినహాయించిన అంతకన్నా ఎక్కువ నీరు మహబూబ్‌నగర్‌ జిల్లాకు రావాల్సిందే కదా!

కెసి కెనాల్‌కు కేటాయించిన ఎక్కువ నీరే అందుతుందనడానికి తగిన ఆధారాలున్నాయి. కెసి కెనాల్‌కు 39.9 టిఎంసి నీటి కన్నా తక్కువ ఎప్పుడూ రాలేదని విద్యాసాగర రావుతో పాటు పౌర హక్కుల సంఘం మహబూబ్‌నగర్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. నర్సింహులు వాదిస్తున్నారు. కెసి కినాల్‌ కింద 93 వేల ఎకరాలకు నీరందించాలని తలపెట్టగా 3 లక్షల ఎకరాల దాకా సాగు చేస్తున్నారు. నీరు అధిక మొత్తంలో లభ్యం కావడంతో రైతులు ఆ విధంగా సాగు చేసుకుంటూ పోయారు. ఇందులో రైతులను తప్పు పట్టాల్సిన పనేం లేదు. నీరందుతోంది కాబట్టి సాగు చేసుకుంటున్నారు. అంటే, మహబూబ్‌నగర్‌ జిల్లాకు దక్కాల్సిన నీటిని పూర్తి స్థాయిలో అందించడానికి ప్రయత్నాలేవీ జరగలేదని అనుకోవాల్సి ఉంటుంది.
ఈ రెండు ప్రాజెక్టులకు నీరు పూర్తి స్థాయిలో అందడం లేదని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు. ఈ రెండు ప్రాజెక్టులకు నీరందించే తుంగభద్ర జలాశయం నీటి వినియోగ సామర్థ్యం 230 టిఎంసిలు. గత రెండేళ్లుగా తప్ప తుంగభద్ర జలాశయంలోకి 275 టిఎంసిల కన్నా తక్కువ నీరు ఎప్పుడూ రాలేదని కేంద్ర జలసంఘం రిటైర్డ్‌ ఛీఫ్‌ ఇంజనీర్‌ ఆర్‌. విద్యాసాగర రావు అంటున్నారు. అందువల్ల నీటి పంపకం సరిగా జరగుతూ వస్తుంటే ఈ వివాదం చెలరేగి ఉండేది కాదని ఎవరికైనా ఇట్లే అర్థమైపోతుంది.

నీటి రాజకీయాలు ప్రధానమైన నేపథ్యంలో, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత వాతావరణంలో సహజంగానే మహబూబ్‌నగర్‌ జిల్లా రైతులు తమ వాటా కోసం ముందుకు వచ్చారు. దీంతో అది వివాదంగా మారింది. మహబూబ్‌నగర్‌ జిల్లా రైతులు తమ వాటాను డిమాండ్‌ చేయకుండా ఉండి ఉంటే సమస్య వచ్చేది కాదు. అలా డిమాండ్‌ చేయకూడదని అనడం ఎంత అవివేకమో అర్థం చేసుకునే స్థితిలో ప్రభుత్వాలు లేవా? రాజోలిబండ తూములను మూసేసి కె.సి. కెనాల్‌ కింది భూములకు తగిన నీరు అందిస్తామని హామీ ఇచ్చి అందుకు అనుగుణమైన నిర్ణయం తీసుకుంటే బహుశా సమస్య పరిష్కారం కావచ్చు. కానీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. తూములను మూయిస్తామని ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశం కూడా నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలు కాలేదు.

ఇదిలా వుంటే, అక్రమ రంధ్రాలను మూసేయాలని, రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ ఆనకట్ట ఎత్తు పెంచాలని, ఆనకట్ట దగ్గర నదిలో పూడిక తీయాలని, కాలువ మరమ్మతులు చేపట్టాలని రాజోలిబండపై వేసిన నిపుణుల కమిటీ సూచించింది. ఈ సూచనలను అంగీకరించిన ప్రభుత్వం అందుకు కర్ణాటకకు 70 లక్షల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించి, 50 లక్షల రూపాయలు కూడా ఇచ్చింది. అంటే, నిపుణుల కమిటీ చేసిన సూచనల్లో ఎత్తు పెంచే విషయాన్ని ఆచరణలో పెట్టి తూములను మూసే సూచనను బుట్టదాఖలా చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నదని అనుకోవాల్సి వుంటుంది. ఏమైనా, రాజోలిబండ ద్వారా మహబూబ్‌నగర్‌ జిల్లాకు తగిన నీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.

ఇప్పుడు రాజోలిబండ మళ్లింపు పథకం వివాదం రాష్ట్ర రాజకీయంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్నామ్నాయాల కోసం వెతుకుతోంది. జూరాల నుంచి లింక్‌ కాల్వ ద్వారా రాజోలిబండ మళ్లింపు పథకం కింది భూములకు నీరు ఇస్తానని చెబుతోంది. నిజానికి జూరాల కింద మహబూబ్‌నగర్‌ జిల్లాకు దక్కాల్సిన నీరే పూర్తిగా దక్కడం లేదు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు తుంగభద్ర జలాలు రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ ద్వారా 15.9 టిఎంసిలు, కృష్ణా నదీ జలాలు జూరాల ద్వారా 17.84 టిఎంసిలు దక్కాలి. మొత్తం మహబూబ్‌నగర్‌ జిల్లాకు బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం 33.74 టిఎంసి నీరు దక్కాలి. జూరాల నీటిని రాజోలిబండ కింది రైతులకు అందిస్తే నష్టపోయేది మళ్లీ మహబూబ్‌నగర్‌ జిల్లానే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X