వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగారు కొలికి

By Staff
|
Google Oneindia TeluguNews

కర్ణుడి చావుకు కారణలనేకం అన్నట్లు రాజశేఖర్‌ రెడ్డి కాంగ్రెస్‌ను విజయ పథాన నడిపించలేకపోవడానికి కారణాలు ఉన్నాయి. ఫలితంగా ఆయన ఆచరణ సాధ్యం కాని సవాళ్లు చేసి ఇప్పటికే కొంత పలుచనయ్యారు. అయితే, హైదరాబాద్‌ ప్రచార కార్యక్రమంలో సవాల్‌ విసరడంలో ఆయన కొంత జాగ్రత్త పడినట్లు కనిపిస్తున్నారు. కనీసం ఐదేళ్ల పాటు ప్రజలపై పన్ను పోటు వుండదని తెలుగుదేశం ప్రభుత్వం స్పష్టమై హామీ ఇస్తే తాము బల్దియా ఎన్నికల నుంచి తప్పుకుంటామని ఆయన మంగళవారం బల్దియా ఎన్నికల ప్రచార సభలో గర్జించారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచాల్సిన అనివార్య స్థితిలో ప్రభుత్వం పడిందని ఆయన చెప్పారు. కరెంట్‌ ఛార్జీలు, నీటి పన్ను, ఆస్తి పన్ను పెంచబోమని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి విసిరిన సవాల్‌ను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వీకరించే స్థితిలో లేరు. కరెంట్‌ ఛార్జీల భారం పేద ప్రజలపై భారం పడకుండా చూస్తామని, అవసరమైతే వచ్చే ఏడాది సబ్సిడీని మరింత పెంచుతామని మాత్రమే ఆయన చెప్పగలిగారు. ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలను మళ్లీ పెంచుదంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. అయితే, అశ్వత్థామ హతా హతః కుంజర అనే పద్ధతిలో మాట్లాడడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. విద్యుత్‌ ఛార్జీల పెంపుతో ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేదంటూ తప్పించుకునే మాట కూడా ఆయన చెప్పుతున్నారు. ప్రభుత్వం కేవలం సబ్సిడీ ఇవ్వడం వరకు మాత్రమే పరిమితమవుతుందని, విద్యుత్‌ ఛార్జీల ఆంశాన్ని నిర్ధారించే పని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ చూస్తుందని ఆయన చెప్పాల్సిన విషయాన్ని చెప్పేశారు.

కరెంట్‌ ఛార్జీలు పెరగబోవని ప్రభుత్వం హామీ ఇచ్చే స్థితిలో లేదనేది వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ట్రాన్స్‌కో విద్యుత్‌ ఛార్జీల పెంపుదలకు నివేదిక రూపొందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 465 కోట్ల రూపాయల మేరకు విద్యుత్‌ ఛార్జీలు పెంచడం అనివార్యమని ఎపి ట్రాన్స్‌కో స్పష్టం చేసింది. ఈ నెలాఖరులోగా ఏయే కెటగిరీల వారికి ఎంతెంత ఛార్జీలు పెంచాలో నిర్ణయించి కొత్త టారిఫ్‌ ప్రతిపాదనలను రెగ్యులేటరీ కమిషన్‌కు అందజేస్తుంది. అంటే, విద్యుత్‌ ఛార్జీలు పెంచక తప్పదనేది స్పష్టమై పోతూనే వుంది. నిజానికి, ఆంధ్రప్రదేశ్‌ విద్యుచ్ఛక్తి సంస్థ రెండుగా విభజన కావడమే సబ్సిడీలను తగ్గిస్తూ కరెంట్‌ ఛార్జీలు పెంచేందుకు. ఏ ప్రభుత్వం గానీ కరెంట్‌ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చే స్థితి దాటిపోయింది.

ఇంత జరుగుతున్నా, చంద్రబాబునాయుడును కాంగ్రెస్‌ గానీ, ఇతర ప్రతిపక్షాలు గానీ ఎందుకు మట్టి కరిపించలేకపోతున్నాయి. ఇందుకు సవాలక్ష కారణాలున్నాయి. చంద్రబాబు ప్రచార వ్యూహంతో, సమర్థతలతో పాటు ప్రతిపక్షాల బలహీనతలు తెలుగుదేశం పార్టీ నిలదొక్కుకుంటూ రావడానికి ప్రధానమైన కారణం. చంద్రబాబు దూరదృష్టి ముందు, వ్యూహప్రతివ్యూహాల ముందు, వర్తమాన తరానికి ప్రాతినిధ్యం వహించే ముందు మిగతా పార్టీలన్నీ దిగదిడుపే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X