వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరికి వారే....

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త పరిణామాలు, కొత్త పొత్తులు చోటు చేసుకునే వాతావరణం ఏర్పడింది. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌)తో ఎన్నికల అవగాహనకు సిద్ధపడుతోంది. తెలుగుదేశం- భారతీయ జనతా పార్టీ (బిజెపి)ల కూటమిని ఓడించేందుకు లౌకిక పార్టీల మధ్య ఐక్యత అవసరమనే అంశం మీద సిపిఐ కాంగ్రెస్‌తోనూ, టిఆర్‌ఎస్‌తోనూ ఎన్నికల్లో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఆ పార్టీ జాతీయ సమితి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని సిపిఐ రాష సమితి కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి ఈ నెల 21వ తేదీన ధృవీకరించారు.

సిపిఐ నిర్ణయం వామపక్షాల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉంది. సిపిఎం టిఆర్‌ఎస్‌ రాజకీయ నినాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌ను ఆ పార్టీ విచ్ఛిన్న చర్యగా అభివర్ణిస్తోంది. సిపిఐ కూడా చాలా కాలం ఇదే వైఖరితో ఉంటూ వచ్చింది. అయితే ఇటీవల అది ఈ విషయంలో కొంత తన పట్టును సడలించుకుంది. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను తాము గుర్తించామని సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి రాజా అన్నారు. అయితే ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌ను బలపరుస్తారా, లేదా అనే విషయాన్ని ఆయన తేల్చలేదు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని సిపిఐ చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ వస్తోంది. అయితే ఈ డిమాండ్‌ను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు.

టిఆర్‌ఎస్‌తో ఎన్నికల అవగాహన విషయంలో ఒక మెట్టు దిగిరావాలని సిపిఐ తన సోదర పార్టీ సిపిఎంకు విజ్ఞప్తి చేస్తోంది. టిడిపి- బిజెపి కూటమిని ఓడించేందుకు ప్రతిపక్షాలు బేషరతుగా ఐక్య కార్యాచరణకు ముందుకు రావాలనేది సిపిఐ ప్రతిపాదన. కాంగ్రెస్‌- టిఆర్‌ఎస్‌ల మధ్య స్నేహం ఉండాలని కూడా సిపిఐ వాంఛిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రజాహిత బస్సు యాత్రను అడ్డుకోకూడదని టిఆర్‌ఎస్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ హర్షించింది. సిపిఎం సిపిఐ వైఖరిని ఏ మేరకు ఆహ్వానిస్తుందనేది ప్రశ్నార్థకమే.

నిజానికి, కింది స్థాయిలో వామపక్షాల కార్యకర్తలు తెలంగాణలో తీవ్ర అయోమయంలో పడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం, దాని కార్యక్రమాలు వామపక్షాల ఉనికికి విఘాతం కలిగించే స్థాయికి చేరుకున్నాయి. తెలుగుదేశంతో స్నేహాన్ని తెంచుకున్న తర్వాత వామపక్షాల బలం అసెంబ్లీలో గణనీయంగా పడిపోయింది. సిపిఐ గత ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. అయితే అసెంబ్లీ సీట్లు ఎన్ని వచ్చాయనేది తమకు ప్రాతిపదిక కాదని ఆ పార్టీలు వాదిస్తూ వుంటాయి. కానీ వాటి బలం కొత్త పార్టీల, కొత్త అలయెన్స్‌ల నేపథ్యంలో పడిపోతూ వస్తోందనేది వాస్తవం. తెలంగాణలోని కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు టిఆర్‌ఎస్‌ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కుంటున్నారు. దీనికి రాష్ట్ర నాయకత్వం నుంచి సరైన సమాధానం రావడం లేదు. తాము రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని, విశాలాంధ్రను కోరుకుంటున్నామని తమ
వైఖరిని వెల్లడించడం మినహా ప్రజలను సంతృప్తి పరిచే వివరణ ఇవ్వలేకపోతున్నారు.

టిఆర్‌ఎస్‌ పట్ల సిపిఐ అనుసరిస్తున్న వైఖరి ఉభయ కమ్యూనిస్టుల మధ్య దూరాన్ని పెంచుతుందా, సిపిఎం టిఆర్‌ఎస్‌ పట్ల ఏ కొంత మెతకవైఖరినైనా ప్రదర్శిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X