వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేరు నింపండి, ఉచిత బహుమతి అందుకోండి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాంగ్రెస్‌కు అలవాటే. దాని వల్ల కాంగ్రెస్‌కు ఒనగూరే ప్రయోజనం ఉండకపోగా ఉన్నది కాస్తా ఊడ్చుకుపోవడం పరిపాటి. ఎన్నికలకు ముందే పొత్తుల కోసం కాంగ్రెస్‌ ఇప్పుడు అర్రులు చాచడం కూడా అలాంటిదే. తాము సంకీర్ణ కూటమికి సిద్ధమని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. అయితే అది ఏ మేరకు ఫలితం సాధిస్తుందనేది చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు.

బిజెపి నాయకత్వంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) పకడ్బందీ సంకీర్ణ కూటమిగా రూపు దిద్దుకుంది. దాన్ని బీటలు వార్చడం కనాకష్టం. ఎన్‌డిఎ నుంచి బయటకు వచ్చిన పార్టీలకు కాంగ్రెస్‌ నమ్మకం ఇవ్వలేకపోతోంది. నమ్మకం ఇవ్వలేకపోవడమే కాదు, మార్గదర్శకత్వం వహించలేకపోతోంది. బిజెపి ఎన్‌డిఎ కూటమిలో పెద్దన్న పాత్రను సమర్థంగా పోషిస్తున్న తీరు దేశ రాజకీయాల్లో ఒక నూతన ఒరవడి. ఎన్‌డిఎ నుంచి వైదొలగిన తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి పార్టీలు తిరిగి అదే గూటికి చేరాల్సిన రాజకీయ వాతావరణం ప్రస్తుతం దేశంలో నెలకొన్నది.

నిజానికి, సంకీర్ణ కూటమికి చేయి అందిస్తే కూడా అందుకోలేనంత దూరంలో గతంలో కాంగ్రెస్‌ ఉంది. రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఎప్పుడూ కాంగ్రెస్‌కు బాసటగా నిలుస్తానని హమీ ఇస్తూనే ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌కు కాంగ్రెస్‌ పట్ల కొన్ని పరిమితులు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో పిడిఎఫ్‌తో జత కట్టి కాంగ్రెస్‌ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం జరిగిన రాజకీయ తంతులో కాంగ్రెస్‌ కొంత పలచనైంది. కాంగ్రెస్‌తో జత కట్టడానికి ఇప్పుడు దేశంలో మిగిలి వున్న పార్టీలేవి? ఎన్‌డిఎలో లేని చాలా పార్టీలది నామమాత్రం బలం. వీటిలో కూడా కొన్ని పార్టీలు కాంగ్రెస్‌తో జత కట్టడానికి సిద్ధంగా లేదు. ఇక తమిళనాడులోని కరుణానిధి నాయకత్వంలోని డిఎంకె పార్టీ ఎన్‌డిఎతో తెగతెంపులు చేసుకుంటుందనే ఆశ కాంగ్రెస్‌కు ఉంది. దాంతో పాటు ఎండిఎంకె కూడా అదే దారి పడుతుందని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. ఈ ఆశతోనే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరుణానిధితో ఫోన్‌లో మాట్లాడారు. తమిళనాడులో జయలలితకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కలిసిరావాలనే కరుణానిధి ప్రకటన సోనియాకు ఆ ఆశను రేకెత్తించింది. డిఎంకెతో పొత్తు కుదురుతుందనేది గాలిలో దీపం పెట్టి ఎదురు చూడడంలాంటిదే.

ఉలిపిరి కట్టెది ఓ దారి అన్నట్లు ఉభయ కమ్యూనిస్టులది ఓ ప్రత్యేకమైన వైఖరి. అవి స్పష్టంగా ఉన్నట్లు ప్రకటనలు గుప్పిస్తూనే రాజకీయ ఆచరణలో బోలెడంత అస్పష్టతకు అవకాశం కల్పిస్తాయి. కాంగ్రెస్‌తో అవి కూటమి కట్టడమనేది సాధ్యమయ్యే పని కాదు. కట్టినా కాంగ్రెస్‌కు పెద్దగా ఒరిగేదేమీ లేదు. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కొంత ఫలితం సాధించే అవకాశాలు లేకపోలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో ఆ దిశగా కొంత ప్రయత్నం జరిగింది. అయితే చివరగా ఒక అస్పష్టమైన చేయూత పాత్ర పోషించడానికి మాత్రమే పరిమితమవుతామని సిపిఐ, సిపిఎంలు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌లో మరో అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకునే అవకాశం కాంగ్రెస్‌కు ఉంది. అయితే ఇది కూడా సాధ్యమవుతుందా లేదా అనేది చివరి నిమిషం వరకు చెప్పలేని పరిస్థితి. కొన్ని అంశాలపై కాంగ్రెస్‌ నాన్చుడు ధోరణి ప్రదర్శించడం, ఎటూ తేల్చకపోవడం వంటివాటి వాళ్ల ఇతర పార్టీలతో కలిసి పని చేసే అవకాశం కూడా కోల్పోతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఒక వైపు టిఆర్‌ఎస్‌తోనూ, మరో వైపు వామపక్షాలతోనూ భుజం భుజం కలిపి నడవాలంటే కాంగ్రెస్‌కు ఒంటి కాలి మీద జపం చేయడమే.

పైగా కాంగ్రెస్‌లో పార్టీ నాయకులు గోరంత బలంతో కొండంత ఆశపడుతుంటారు. ఆ ఆశ వల్ల ఇతర పార్టీలతో స్నేహానికి గండి కొడుతుంటారు. దీని వల్ల ఇతర పార్టీలకు కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయం తీసుకుంటే అది అమలవుతుందన్న నమ్మకం ఉండదు. కచ్చితమైన నిర్ణయాలు తీసుకుని నష్టానికి, కష్టానికి కూడా సిద్ధపడేలా కింది స్థాయి నాయకత్వాన్ని, క్యాడర్‌ను సిద్ధపరచడంలో కాంగ్రెస్‌ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

ఈ వాతావరణంలో సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేయడం ఒక ఎత్తయితే, దాన్ని నడిపించడం మరో ఎత్తు. దీన్ని సాధించే నైపుణ్యం, రాజకీయ సమర్థత కాంగ్రెస్‌ నాయకత్వానికి లేదు. కింది స్థాయి నాయకత్వాన్ని, క్యాడర్‌ను అన్ని అంశాలపై కచ్చితమైన వైఖరులు తీసుకుని ముందుకు నడిపించడంలో నాయకత్వ వైఫల్యమే ఇప్పుడు కాంగ్రెస్‌ను పీడిస్తున్న సమస్య. దీన్ని సరిదిద్దుకోకుండా ఎప్పటికప్పుడు గాలివాటంగా వ్యవహరిస్తూ పోతే లాభం ఉండదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X