వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కథానాటికలతో కొత్తనీరు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట మార్చారు. ఇలా మాట మార్చడం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. నక్సలైట్లను ఎదుర్కోవడానికి తాను ప్రజలకు తుపాకులు ఇస్తానని అనలేదని ఆయన తాజా ప్రకటన ఒకటి చేశారు. ప్రజలకు తుపాకులిస్తానని తాను చేసిన ప్రకటనపై నాలుగైదు రోజులుగా రాద్దాంతం జరుగుతోంది. ఆ రాద్దాంతం మధ్యలోనే తన ప్రకటనను, ప్రజలకు తుపాకులిచ్చే విషయంలో తన వైఖరిని సమర్థించుకోవడానికి ఆయన చేసిన ప్రకటనలు ఎవరి దృష్టి నుంచీ దాటిపోలేదు.

నక్సలైట్‌ సమస్యపై ఎవరి వైఖరి ఏదైనా దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత మాత్రం అధికారంలో ఉండేవారిదనే విషయం అందరూ అంగీకరించాల్సిన అంశం. నక్సలైట్లతో సంబంధాలున్నాయనే అనుమానంపై తెలంగాణ పల్లెల్లోని ప్రజలను పోలీసులు నిత్య యాతనకు గురి చేయడం అబద్ధమేమీ కాదు. వేధించాలనుకున్నవారికి నక్సలైట్‌ ముద్ర వేయడం కూడా తెలంగాణలో ఒక రాజకీయ సంప్రదాయంగా, పోలీసు నీతిగా మారింది. నక్సలిజం సామాజిక, ఆర్థిక సమస్య కాదని చంద్రబాబు విశ్వసిస్తున్నారు. విశ్వాసం ఏదైనా నక్సలిజం వల్ల ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత నిజానికి చంద్రబాబుదే. ఆ బాధ్యతను ప్రజల మీదికి నెట్టే ప్రయత్నం ఆయన చేస్తూ వస్తున్నారు. తనపై తిరుమలలోని అలిపిరి వద్ద నక్సల్స్‌ దాడి చేసిన నాటి నుంచి ఆ బాధ్యతను మరింతగా ప్రజల మీదికి నెట్టడానికి ప్రయత్తిస్తున్నారు. నక్సలైట్లను తరిమికొట్టండని పిలుపునిస్తున్నారు. ఈ పిలుపులోనే అంతర్యుద్ధాన్ని ప్రోత్సహించే లక్షనం ఉంది.

ప్రజలకు తుపాకులిస్తామని ఆయన ప్రకటించిన మరుక్షణమే ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రతిస్పందించాయి. అంతర్యుద్ధాన్ని ప్రోత్సహించే చర్యకు చంద్రబాబు ఒడిగడుతున్నారని కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) ధ్వజమెత్తాయి. (సిఎల్‌పి మాజీ నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి వాడిన సివిల్‌ వార్‌ అనే పదానికి మన మీడియా ప్రతినిధులు కొందరు ప్రజా యుద్ధం అనే అనువాదం చేశారు, ఇది వేరే సంగతి). ఇప్పటికే తెలంగాణ పల్లెలే కాదు, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, కొన్ని రాయలసీమ జిల్లాలు నక్సలైట్లు తమ కార్యకలాపాలతో అట్టుడుకుతున్నాయి. తమను చంద్రబాబు ప్రజాతీర్పునకు ఎజెండాగా స్వీకరించననాటి నుంచి నక్సలైట్లు మరింతగా రెచ్చిపోతున్నారు. దీనికి ప్రతిపక్షాలను నిందించే పనికి చంద్రబాబు పూనుకున్నారు. ఇది ఎన్నికల్లో ఉపయోగపడుతుందని ఆయన అనుకుంటున్నారు. ఆయన ఎజెండాపై ప్రజలు త్వరలోనే తీర్పు ఇవ్వబోతున్నారు. ఒక వేళ చంద్రబాబు ఓటమి పాలైతే నక్సలైట్లను ప్రజలు సమర్థిస్తున్నారని అనుకోవాలా? దీన్ని అంగీకరించడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా? లేరనే విషయం ఇప్పటికే తేలిపోయింది.

నక్సలైట్ల నుంచి ప్రమాదం ఉన్నవారికి గన్‌ లైసెన్స్‌లు ఇచ్చే విషయాన్ని ప్రతిపాదిస్తున్నామని ఇప్పుడు అంటున్నారు. దీన్ని అమలులోకి తెస్తే సంభవించే ప్రమాదం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? ప్రభుత్వం అమలు చేసే ఏదైనా సక్రమంగా అమలైన చరిత్ర ఉందా? దాని వల్ల గ్రామాలు మరింతగా అల్లకల్లోలమయ్యే ప్రమాదం లేదా? వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? ఎన్నికల ఏడాదిలో ప్రజలకు వరాలు ఇవ్వడం చంద్రబాబు చేస్తూ వస్తున్న పని. అది ఈసారి మరింత పరాకాష్టకు చేరుకుంది. అవి అమలైన దాఖలాలున్నాయా? వాటికి ఎన్ని శంకుస్థాపన రాళ్లు సాక్ష్యం ఇవ్వడం లేదు?

ప్రజలకు తుపాకులిచ్చే ప్రతిపాదనను తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన బిజెపి కూడా వ్యతిరేకస్తోంది. నక్సలైట్లను ఎజెండాగా తీసుకునేంత వరకు బిజెపికి పెద్ద అభ్యంతరం లేదు. ఒక రకంగా సమర్థిస్తుంది కూడా. సైద్ధాంతిక నేపథ్యం దృష్ట్యా బిజెపి నక్సలైట్లపై అణచివేతను ప్రోత్సహిస్తుంది. అయితే నక్సలైట్లను ప్రభుత్వం తన అధికారం ద్వారా అణచివేయాలని ఆశిస్తుందే తప్ప ప్రజలకు తుపాకులిచ్చి చేతులు దులుపుకోవడాన్ని అనుమతించదు. అందుకే చంద్రబాబు ప్రకటనను బిజెపి వ్యతిరేకిస్తోంది. వివిధ రాజకీయ పార్టీల నుంచే కాకుండా మిత్రపక్షం నుంచి కూడా ప్రతికూల అభిప్రాయం వ్యక్తం కావడంతో చంద్రబాబు మాట మార్చినట్లు అర్థం చేసుకోవాలి.

తెలుగుదేశం, బిజెపిలను నక్సలైట్లు లక్ష్యంగా ఎంచుకోవడం కూడా చంద్రబాబు దృష్టిలో తప్పే. నక్సలైట్లు ఎవరైనా చెప్తే వినే స్థితిలో ఉన్నారా? అలాగే చంద్రబాబు కూడా ఇతరులు చేసే సూచనలను స్వీకరించే స్థితిలో లేరు. తనకు అనుకూలంగా లేని ప్రతిదీ ఆయన దృష్టిలో తప్పే. ఆయన విధానాన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ అభివృద్ధి నిరోధకులే. ఇప్పుడైతే నక్సలైట్లతో చేతులు కలిపినవారే. అందువల్ల అటు ప్రభుత్వానికి గానీ, ఇటు చంద్రబాబుకు గానీ సూచనలు చేసి ఒప్పించే స్థితిలో ఎవరూ లేరు. వారి మానానికి వారిని వదిలేసి మనుగడ సాగించడం ఎలాగో కొత్తగా అభ్యసించాల్సిన స్థితి వచ్చేసింది. నక్సలైట్లను ఎజెండాగా చేయడమే ఆ సమస్యను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసినట్లు. ఇక గతి ఎవరు?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X