వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్ ది గ్రేట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sachin Tendulkar
ఇరవై ఏళ్ల పాటు క్రికెట్ కొనసాగుతూ ప్రపంచంలోనే మేటి బ్యాట్స్ మన్ గా పేరు పొందడం సామాన్య విషయమేమీ కాదు. సచిన్ టెండూల్కర్ కు మాత్రమే అది సాధ్యమవుతుంది. అతను ఆదివారం తన అంతర్జాతీయ క్రికెట్ 20 ఏళ్ల సంబరాలను నిర్వహించుకుంటున్నాడు. పదహారేళ్ల పసి వయస్సులో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన సచిన్ టెండూల్కర్ క్రికెట్ క్రీడలో అత్యున్నత స్థానానికి చేరుకున్నాడు. అత్యధిక పరుగుల మైలు రాయి, సెంచరీలు వంటివి అతనికి సర్వసాధారణమయ్యాయి. అయితే ఇరవై ఏళ్ల పాటు నిలదొక్కుకోవడానికి పట్టుదల, ఏకాగ్రత, క్రమశిక్షణ, కఠిన పరిశ్రమలే కారణమని చెప్పవచ్చు. ఈ అన్ని లక్షణాలు సచిన్ లో ఉన్నాయి కాబట్టే క్రీడాభిమానులకు అతను ఆరాధ్యదైవంగా మారగలిగాడు. అదే సమయంలో తన వ్యక్తిత్వాన్ని కూడా తీర్చి దిద్దుకుంటూ వచ్చాడు.

అంత ఎత్తుకు ఎదిగిన సచిన్ కు ఆయన అన్న అజిత్ టెండూల్కర్ అండదండలు ఎల్లవేళలా ఉన్నాయి. ఒక రకంగా అజిత్ చేదోడువాదోడు వల్లనే అతను ఈ స్థాయికి ఎదగాడని చెప్పవచ్చు. ఈ విషయాన్ని సచిన్ స్వయంగా చెప్తాడు. తన బ్యాటింగ్ గురించి అన్నయ్యకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమోనని సచిన్ చెప్పుకున్నాడు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వారిని ఒప్పించి సచిన్ ను క్రికెట్ కోచింగ్ కు పంపించింది ఆయనే. కోచ్ తో మాట్లాడి రోజూ దిగబెట్టి తీసుకురావడం కూడా అతనే చేసేవాడు. వినోద్ కాంబ్లీని సచిన్ కు పరిచయం చేసింది అజిత్ టెండూల్కరే. అన్ని విధాలుగా సచిన్ ను వెన్నంటి ఉన్న వ్యక్తిగా అతన్ని చెప్పుకోవచ్చు. ఈ 20 ఏళ్లలో క్రికెట్ క్రీడలో అనేక మార్పులు వచ్చాయి. ట్వంటీ 20 వంటి ఫార్మాట్ లు వచ్చాయి. అయినా సచిన్ వెనక్కి తగ్గలేదు. అతని పటిమ తగ్గలేదు. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ వాటికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

తన 20 ఏళ్ల అంతర్జాతీయ క్రీడల సందర్భంగా అతను శుక్రవారం మీడియాతో మాట్లాడాడు. తాను ఇంకా 16 ఏళ్ల కుర్రాడినేనని అతను ఈ సందర్భంగా అన్నాడు. క్రికెట్ తన హృదయంలో భాగమని, తన పరుగుల దాహం ఎప్పటికీ తీరదని అతను అన్నాడు. 20 ఏళ్ల కెరీర్ సుదీర్ఘమైందని, లెక్కలేనన్ని ప్రత్యేక ఇన్నింగ్స్ ఉన్నాయని అతను చెప్పుకున్నాడు. వాటిలో కొన్నింటిని తాను బాగా గుర్తు పెట్టుకున్నానని, 2003 ప్రపంచ కప్ లో 75 బంతుల్లో 95 పరుగులు చేయడం మరిచిపోలేదని అతను అన్నాడు. 1989లో హైదరాబాద్ టెస్టులో పాక్ పై అర్థ సెంచరీ సాధించడం తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అని అతను చెప్పుకున్నాడు. షేన్ వార్న్ ను ఎదుర్కోవడానికి తాను ప్రత్యేకంగా కృషి చేశానని చెప్పుకున్నాడు. శివరామకృష్ణన్ తో బంతులు వేయించుకుని ప్రాక్టీస్ చేసినట్లు తెలిపాడు. షేన్ వార్న్, మురళీథరన్ ల్లో ఎవరు గొప్ప బౌలర్ అంటే తాను చెప్పలేనని ఆయన అన్నాడు.

సచిన్ పరుగుల రాజుగా ఎదిగినప్పటికీ కెప్టెన్ గా రాణించలేకపోయాడు. అయితే, పరుగుల కోసం అతను కెప్టెన్సీ వదులుకున్నాడు. నిజానికి, కెప్టెన్సీని వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. ధోనీ కెప్టెన్ కావడానికి ముందు కూడా బిసిసిఐ సచిన్ కే ఆ ఆఫర్ ఇచ్చింది. కానీ అతను తిరస్కరించి అందుకు ధోనీ పేరును సూచించాడు. తనకన్నా ఎంతో జూనియర్ అయిన ధోనీ నాయకత్వం కింద ఆడడానికి ఏ మాత్రం వెనకాడలేదు. మైదానంలో తన సత్తాను చాటుకోవడం తప్ప మరేమీ ముఖ్యం కాదన్నట్లుగా వ్యవహరించాడు. ఈ వ్యక్తిత్వం కూడా సచిన్ ను అగ్ర స్థానంలో నిలబెట్టిందని చెప్పవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X