వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవాస్కర్ కు సచిన్ సాటి రాడా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sachin Tendulkar-Sunil Gavaskar
మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కు సచిన్ టెండూల్కర్ సాటి రాడనే వాదనను శివసేన ముందుకు తెచ్చింది. సచిన్ టెండూల్కర్ పై శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో దుమ్మెత్తిపోస్తోంది. ముంబై భారతీయులందరిదీ అన్నందుకు టెండూల్కర్ శివసేన చీఫ్ బాల్ థాకరే చేత మొట్టికాయలు తినాల్సి వచ్చింది. తన రెండు దశాబ్దాల కాలంలో తొలిసారి టెండూల్కర్ రాజకీయాల కొరవితో తల గోక్కున్నాడు. ఇప్పుడు గవాస్కర్ తో పోలిస్తే టెండూల్కర్ పనికి రాడని శివసేన ఆదివారం వ్యాఖ్యానించడం మరోసారి చర్చకు దారి తీసింది. టెండూల్కర్ మహారాష్ట్ర విధేయుడు కాడని శివసేన ఆడిపోసుకుంది. మరాఠీ క్రికెటర్లకు టెండూల్కర్ ఏ మాత్రం సాయపడలేదని, గవాస్కర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు మరాఠీలకు ఎంతో సహకరించారని సామ్నా పత్రికలో రాసిన వ్యాసంలో శివసేన పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. తన చిరకాల మిత్రుడైన వినోద్ కాంబ్లికే సచిన్ సాయం చేయలేదని ఆయన ఆరోపించారు.

గవాస్కర్ జట్టు కెప్టెన్ గా ఉన్నప్పుడు జట్టులో సగం మంది ముంబైవారో, మరాఠీవారో ఉండేవారని ఆయన అన్నారు. జుల్ఫికర్ పార్కర్, సురు నాయక్ వంటి వారికి కూడా ఒక్క టెస్టుకో, రెండు టెస్టులకో గవాస్కర్ అవకాశం కల్పించారని ఆయన అన్నారు. నిజమైన మరాఠీగా గవాస్కర్ వ్యవహరించారని, అయినా గవాస్కర్ ను దేశమంతా అభిమానించిందని ఆయన అన్నారు. సచిన్ డబ్బులు సంపాదించుకున్నాడని కూడా ఆరోపించారు. క్రికెట్ క్రీడ వల్ల సచిన్ ధనవంతుడయ్యాడని, ఆయన ఆస్తి 200కోట్ల రూపాయలకు మించుతుందని శివసేన ఎంపీ అన్నారు. బెంగాల్ వాడిగా సౌరవ్ గంగూలీ గర్వపడుతున్నట్లుగానే మహారాష్ట్రవాడిగా సచిన్ గర్వపడాలని ఆయన అన్నారు. రాహుల్ ద్రవిడ్ మరాఠీవాడే అయినా కర్నాటకకు విధేయంగా ఉంటున్నాడని ఆయన రాశారు.

సునీల్ గవాస్కర్ కాలంలో ముంబై క్రీడాకారులు క్రికెట్ జట్టులో అధిపత్యం చెలాయించేవారనడంలో సందేహం లేదు. ఆ సమయంలో దేశంలో మిగతా ప్రాంతాల నుంచి జట్టు కూర్పుపై విమర్శలు వస్తుండేవి. కొంతకాలం బెంగుళూర్ ఆధిపత్యం చెలాయించిందని, ఇప్పుడు ఢిల్లీ క్రీడాకారులదే ఆధిపత్యమనే విమర్శలున్నాయి. ఏమైనా సచిన్ టెండూల్కర్ ఇంత వరకు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఆయన వ్యాఖ్యలు కూడా మహారాష్ట్ర రాజకీయాలు ప్రాంతీయ విద్వేషాలతో అట్టుడుకుతున్న సందర్భంలో వెలువడ్డాయి. తాను భారతీయుడినని అన్నంత మాత్రాన మహారాష్ట్రను సచిన్ తక్కువ చేస్తున్నాడని చెప్పలేం. ఆయన ప్రాంతీయ రాజకీయాల నినాదాలను వ్యతిరేకించాడంతే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X