వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు సినిమా దారిద్ర్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

Mahesh Khaleja
తెలుగు చిత్రసీమ అత్యంత భావ దారిద్ర్యంతో, చిల్లర రాజకీయాలతో భ్రష్టుపోతుందనే విషయం అందరికీ తెలుసు. కానీ, కథలకే కాదు, టైటిళ్లకు కూడా దారిద్ర్యం ఏర్పడుతుందని ఎవరూ అనుకుని ఉండరు. సినిమా కథల విషయంలో పలు మార్లు వివాదాలు చెలరేగిన సందర్భాలున్నాయి. ఒక్కోసారి అటువంటి వివాదాలు కావాలని కూడా చెలరేగుతాయి. కానీ, మన తెలుగు చిత్రసీమ కథల కొరతను ఎదుర్కుంటోందని సినిమా హీరోలతో పాటు దర్శకులు, నిర్మాతలు కూడా అన్న సందర్భాలున్నాయి. కానీ, తెలుగు చిత్రసీమ టైటిళ్ల వివాదంలో ఇరుక్కోవడాన్ని చూస్తుంటే భావ దారిద్ర్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మహేష్ ఖలేజా వివాదం ముగిసిన మరుక్షణం మరో టైటిల్ వివాదం ముందుకు వచ్చింది. ఖలేజా టైటిల్ తనదంటూ విజయభాస్కర్ రెడ్డి అనే నిర్మాత కొర్టుకెక్కారు. అయితే, తమది ఖలేజా కాదని, మహేష్ ఖలేజా అని వాదించి కోర్టులో సాంకేతిక కారణాలతో మహేష్ ఖలేజా సినీ నిర్మాతలు గట్టెక్కారు. కానీ నైతికంగా వారు ఓడిపోయినట్లు కాదా అనేది ప్రశ్న. ఖలేజా పదాన్ని రాసిన పద్ధతిలోనే మహేష్ అనే పదాన్ని కూడా రాశారా అంటే లేదు. ఖలేజా పేరుతోనే అది ప్రచారాన్ని పొందింది.

ఇక, ఇప్పుడు కళ్యాణ్ రామ్ కత్తిపై వివాదం ముందుకు వచ్చింది. కత్తి టైటిల్ ను తాను మూడేళ్ల క్రితం రిజిష్టర్ చేసుకున్నానని గుణశేఖర్ చెబుతున్నారు. గుణశేఖర్ చిన్న దర్శకుడేమీ కారు. అటువంటి దర్శకుడికే టోపీ పెట్టే విధంగా కత్తి నిర్మాతలు వ్యవహరించారంటే పరిస్థితి ఎంత నీచ స్థాయిలో ఉందే అర్థం చేసుకోవచ్చు. నిర్మాతల మండలికి గానీ ఫిల్మ్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ గానీ ఈ విషయంలో న్యాయం చేసే స్థితిలో లేవు. బలం ఉన్నవాడిదే బర్రె అన్నట్లు బలం ఉన్నవాడిదే టైటిల్ అయిపోతోంది. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిబంధనలను ఎప్పటికప్పుడు తమకు అనుకూలంగా సవరించుకునే అధికారం కూడా పెద్దలకు ఉందట. ఇంకేం, తాము చేసిందే న్యాయమైపోతుంది. గుణశేఖర్ వంటి వారికి ఇంత అన్యాయం జరిగితే చిన్నా చితకా తెలుగు చలనచిత్ర రంగంలో బతికే పరిస్థితి ఉంటుందా అనేది సందేహమే.

పెద్ద హీరోలతో చేస్తున్న సినిమాలే కాదు, చాలా సినిమాలు ఓ హాలీవుడ్ సినిమాలకో, లేదంటే ఇతర భారతీయ సినిమాలకో కాపీలనే విషయం మాస్ ప్రేక్షకులకు తెలియక పోవచ్చు గానీ మధ్యతరగతి చదువుకున్నవారికి చాలా మందికి తెలుసు. దృశ్యాలకు దృశ్యాలు హాలీవుడ్ సినిమాల నుంచి దింపేసిన ఘనత కూడా మన దర్శకులకు దక్కుతుంది. తెలుగు సినీరంగంలో సృజనాత్మకతకు చోటు లేదు. కథలు దొరకడం లేదనే ఏడుపు తెలుగు సినీ రంగానికి సంబంధించింది, తెలుగు సాహిత్యానికి సంబంధించింది. తెలుగులో కథా రచయితలు, నవలా రచయితలు ఏ స్థాయిలో ఉన్నారో, వారి సృజనాత్మకత ఏపాటిదో తెలుగు సినీరంగం పెద్దలకు ఏమైనా తెలుసా అనేది ప్రశ్న. తమ చుట్టూ తిరిగే వారికి కూడా అవకాశాలు ఇవ్వడానికి నిరాకరించే ఆధిపత్య ధోరణి సినీరంగంలో ఉంది. వారి కథలను కాపీ కొట్టి ఉత్త చేతులు చూపే నైజం కూడా పెద్దలకు ఉందనే ఆరోపణలున్నాయి.

నంది అవార్డుల గొడవ ఏ స్థాయిలో జరిగిందో చూసినా, బడా హీరోలు మోహన్ బాబు చిరంజీవిలకు మధ్య జరిగిన వివాదాన్ని గుర్తు చేసుకున్నా మనకు తెలుగు చలనచిత్ర రంగం దుస్థితి తెలిసి వస్తుంది. అమీర్ ఖాన్ లాంటి మగాడు తెలుగులో లేడని అన్నందుకు నానా యాగీ చేసినవారు నిజంగానే ఆత్మపరిశీలన చేసుకున్నారా అంటే సమాధానం నిరాశాజనంగానే ఉంటుంది. హీరోలను బట్టి కథలను తయారు చేసి, ఆరు పాటలు, ఇద్దరు హీరోయిన్లు, ఓ ఐటం సాంగ్, నాలుగైదు ఫైట్లు పెడితే సరిపోతుంది, ఆ హీరో సినిమాను విరగబడి చూస్తారనే నమ్మకంపై ప్రేక్షకులు ఎన్నిసార్లు దెబ్బలు కొట్టినా సినీ పెద్దలకు బుద్ధిరావడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X