వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఐటి రామయ్య సరే, కార్పొరేట్ కాలేజీల సంగతి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chukka Ramaiah
ఐఐటి రామయ్య బోధనా పద్ధతిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తప్పు పడుతున్నారు సరే, మరి కార్పొరేట్ కాలేజీల సంగతేమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. రామయ్య బోధనా పద్ధతి వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారనే ముఖ్యమంత్రి మాట ఒక రకంగా ఆహ్వానించదగింది గానే ఉంది. ఐఐటి ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు రాష్ట్రంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. అది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అనుభవంలోకి వస్తున్నదే.

ఐఐటిల్లో తెలుగు విద్యార్థుల ప్రవేశానికి పునాది వేసింది చుక్కా రామయ్య. చుక్కా రామయ్య వల్లనే తెలుగువారికి ఐఐటి అంటే ఏమిటో తెలిసి వచ్చింది. ఆయన యేటా పరిమితంగానే విద్యార్థులను తీసుకుని శిక్షణ ఇస్తారు. ఎట్టి పరిస్థితిలోనూ ఆ పరిమితిని మించనీయరు. పైగా, తన విద్యా సంస్థల్లో ఐఐటి కోచింగ్ ఇవ్వడానికి ప్రవేశ పరీక్ష నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేసుకుంటారు. ఒక రకంగా ఐఐటి స్థాయిని అందుకోగల విద్యార్థులను మాత్రమే ఆయన చేర్చుకుంటూ వస్తున్నారు. అందుకుగాను చుక్కా రామయ్య ఇంటి పేరు ఐఐటిగా మారిపోయింది. అంతటి కీర్తిని ఆయన సంపాదించుకున్నారు.

ఒక రకంగా ఐఐటి రామయ్య వేసిన పునాదిని వ్యాపారంగా మార్చింది రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీలు. ఈ కాలేజీల తీరు పరిశీలిస్తే దిమ్మ తిరగక మానదు. ఐఐటి ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సిద్ధం చేయడానికి ఈ కాలేజీలు నిర్వహించే స్క్రీనింగ్ టెస్టు ఏదీ ఉండదు. తల్లిదండ్రులు ఆశ కొద్దీ తమ పిల్లలను ఐఐటి కోచింగ్ కమ్ ఇంటర్మీడియట్ విద్యార్జనకు ఈ కార్పొరేట్ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. దానివల్ల సామాన్య విద్యార్థి తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిళ్లకు గురవుతున్నాడు. పైగా, ఈ కాలేజీలు వసూలు చేసే ఫీజుల సంగతి చెప్పనే అవసరం లేదు.

కార్పొరేట్ కాలేజీల తీరును గుంటూరుకు చెందిన విజ్ఞాన్ విద్యా సంస్థ అధిపతి రత్తయ్య మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. అందుకు సరైన కారణాలనే ఆయన చూపుతూ వస్తున్నారు. కార్పొరేట్ కాలేజీలు విద్యార్థులను కొల్లలుగా చేర్చుకుంటూ డబ్బులను దండుకున్నాయి. ఇతర ఇంటర్మీయట్ విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులను కూడా ఐఐటి కోచింగ్ తీసుకునే విద్యార్థుల మీద పెడుతున్నారని, ఇతర విద్యార్థులకు సరైన బోధన అందించడం లేదనే విమర్సలున్నాయి. ఐఐటి కోచింగ్ తీసుకునే కొద్ది విద్యార్థులను రహస్యంగా చదివిస్తూ, మిగతా విద్యార్థుల నుంచి వేరు చేసి వారి మీద దండిగా ఖర్చు చేస్తున్నాయని అంటారు. ఏవో కొన్ని ర్యాంకులు రాబట్టి డంకా బజాయించుకుంటున్నాయి. మొత్తం మీద, ఐఐటిల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యార్థుల సంఖ్య దండిగానే ఉంటుంది. కానీ, కార్పొరేట్ కాలేజీలు చేస్తున్న మాయాజాలం ముందు చుక్కా రామయ్య పెడుతున్న కఠిన శ్రమ అసలు లెక్కలోకే రాదని అంటున్నారు.

కార్పొరేట్ కాలేజీలు మీడియాకు ఇచ్చే వాణిజ్య ప్రకటన ఖర్చు చూస్తే ఏ వ్యాపారవేత్తకైనా కళ్లు బైర్లు కమ్ముతాయి. అలాగే, అధికారంలో ఉన్న పార్టీలకు నిధులు కూడా సమకూర్చడంలో ఈ కాలేజీల యజమానులు ప్రముఖ పాత్ర వహిస్తారనే వాదన కూడా ఉంది. కార్పొరేట్ కాలేజీలు పెడుతున్న ఒత్తిడి చుక్కా రామయ్యను తప్పు పట్టే ముందు ముఖ్యమంత్రికి ఎందుకు గుర్తుకు రాలేదనేది అసలు ప్రశ్న. ఇందులో తిరకాసు ఏమిటనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మొత్తం విద్యా విధానమే తప్పుల తడకగా ఉన్నప్పుడు కేవలం ఒక్క చుక్కా రామయ్యనే ముఖ్యమంత్రి వేలెత్తి చూపడం ఎంత మాత్రం సమంజసం కాదు.

English summary
While criticising IIT Ramaiah's method of teaching, why is CM Kirankumar Reddy not seeing at the corporate colleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X