వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిటాల రవి హత్య కేసులో మలుపులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran-Maddelacheruvu Suri
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసు పలు మలుపులు తిరిగింది. చివరికి ఆరున్నరేళ్ల తర్వాత అనంతపురం కోర్టు ఎనిమిది మందికి జీవిత ఖైదు విధిస్తూ, నలుగురిని కేసు నుంచి విముక్తి చేస్తూ తీర్పు చెప్పింది. పరిటాల రవి 2005 జనవరి 24వ తేదీన అనంతపురంలో పట్టపగలు హత్యకు గురయ్యారు. జిల్లా పార్టీ సమావేశానంతరం కార్యాలయం వెలుపల తన అనుచరులతో మాట్లాడుతుండగా ఆయనను కాల్చి చంపారు. ఈ హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

నక్సలైట్ రాజకీయాల నుంచి వచ్చిన పరిటాల రవి స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరి పెనుకొండ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. ఆయన ఎన్టీ రామరావు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంపై దృష్టి పెట్టారు. పలు సెటిల్మెంట్లు చేసినట్లు కూడా ఆయనపై ఆరోపణలున్నాయి. శ్రీరాములయ్య వంటి సినిమాల ద్వారా తెలుగు సినీ రంగంలో కూడా అడుగు పెట్టారు. తన సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో ఉన్న పరిటాల రవి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో హత్యకు గురయ్యాడు.

పరిటాల రవి హత్యపై జగన్మోహన్ రెడ్డి, శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి, రవి ప్రత్యర్థి మద్దెలచెర్వు సూరిలపై ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం పార్టీ కాంగ్రెసు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ క్రమంలో 2005 జనవరి 28వ తేదీన కేసును సిబిఐకి అప్పగించారు. మద్దెలచెర్వు సూరి, షార్ప్ షూటర్ జూలకంటి శ్రీనివాస రెడ్డి అలియాస్ మొద్దు శీను, కాంగ్రెసు నాయకుడు టి. కొండా రెడ్డిలపై ప్రధాన అనుమానితులుగా కేసు దర్యాప్తు ప్రారంభమైంది. సిబిఐ అధికారులు వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్, దివాకర్ రెడ్డిలను ప్రశ్నించారు. అయితే, వారి పేర్లను కేసు నుంచి తొలగించారు.

సిబిఐ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో మొద్దు శీను లైవ్ ఇంటర్వ్యూ ఓ టీవీ చానెల్‌లో వచ్చింది. అది పెద్ద సంచలనంగా మారింది. సూరి బావ కళ్లలో సంతోషం చూడడానికి తాను పరిటాల రవిని హత్య చేసినట్లు అతను చెప్పాడు. కానీ, అతని ఆచూకీ లభించలేదు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేఖమయ్య పోలీసుల ముందు లొంగిపోవడంతో చాలా వరకు కేసు చిక్కు ముడి వీడింది. అతను చెప్పిన వివరాల ఆధారంగా హత్యకు వాడిన ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జూబ్లీహిల్స్ బాంబు పేలుడు కేసులో ముద్దాయి అయిన మద్దెలచెర్వు సూరి పరిటాల రవి హత్యకు మొద్దు శీనును నియోగించాడనే ఆరోపణలు వచ్చాయి. పరారీలో ఉన్న మొద్దు శీను విచిత్ర పరిస్థితిలో పోలీసులకు చిక్కాడు. హైదరాబాదు శివారులోని ఓ లాడ్జీలో సంభవించిన పేలుడులో గాయపడి ఆస్పత్రి పాలైన మొద్దు శీనును గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మొద్దు శీను జైలులో దారుణ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత టి. కొండారెడ్డి ప్రత్యర్థుల చేతిలో హతమయ్యాడు. మద్దెలచెర్వు సూరి తన అనుచరుడు భాను కిరణ్ చేతిలో మరణించాడు. సిబిఐ దర్యాప్తు జరుగుతున్న క్రమంలో దేశభక్త విప్లవ పులుల పేరిట పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హల్‌చల్ చేశాడు. దీంతో అతన్ని, మరికొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు.

English summary
After several twists and turns, a verdict has come out in the sensational murder case of TDP leader Paritala Ravindra with the conviction of eight persons. Over six-and-a-half years have passed since Ravi's murder, which has drawn a lot of attention all over the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X