తెరపైకి బి-గ్యాంగ్: నగరంలో పేలుళ్లకి 10 లక్షలు

మక్బూల్‌ను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి తీసుకోని ఎన్ఐఏ విచారిస్తోన్నవిషయం తెలిసిందే. ఈ విచారణలో మక్బూల్ ఎన్నో నివ్వెరపర్చే విషయాలు బయటపెట్టాడట. దావూద్ గ్యాంగ్ (డి-గ్యాంగ్) క్రమంగా తెరమరుగు అవుతుంటే భత్కల్ గ్యాంగ్ (బి-గ్యాంగ్) క్రియాశీలంగా మారుతోంది. దావూద్ బాటలోనే పయనిస్తోంది. దేశ ఆర్థిక రంగాన్ని చిన్నభిన్నం చేసే దొంగ నోట్ల చలామణీనీ విస్తృతంగా నిర్వహిస్తోంది.
కేవలం ఉగ్రవాద కార్యకలాపాల్లోనే కాకుండా దొంగ నోట్ల చలామణీలోనూ ఇండియన్ ముజాహిదీన్ క్రియాశీలంగా వ్యవహరిస్తోందని, నకిలీ కరెన్సీ చలామణీ సందర్భంగా వచ్చిన లాభంలో రూ.10 లక్షలనే దిల్సుఖ్నగర్ పేలుళ్లకు వాడామని ఎన్ఐఏ అధికారులకు ఐఎం ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. 2012లో కేరళ పోలీసులు దొంగ నోట్ల ముఠాను పట్టుకున్నారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారించారు.
రెండు కోట్ల రూపాయల నకిలీ కరెన్సీని చలామణీ చేస్తున్నట్లు కనిపెట్టారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఈ ముఠా నకిలీ కరెన్సీని చలామణీ చేస్తున్నట్లు గుర్తించారు. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌కు అక్కడి నుంచి భారత్‌లోకి ఈ ముఠా సొమ్మును తరలిస్తున్నట్లు తెలుసుకున్నారు. నిందితులను జైలుకు పంపారు. చాలా దొంగ నోట్ల కేసుల్లాగే ఇది కూడా సాదాసీదా అనుకున్నారు. నిందితులను జైలుకు పంపి కేసును క్లోజ్ చేసేశారు. ఇప్పుడు మక్బూల్ ఆర్థిక కోణంలోనూ టార్గెట్ చేశామని చెప్పడం గమనార్హం.
నకీలీ కరెన్సీ పెద్ద మొత్తంలో చలామణి చేసినట్లు చెప్పాడట. నకిలీ కరెన్సీ చలామణీ సందర్భంగా వచ్చిన లాభంలో రూ.10 లక్షలు ఖర్చు చేసి దిల్సుఖ్ నగర్ పేలుళ్లకు పాల్పడ్డామని వివరించాడట. దీంతో, కర్ణాటక, కేరళ పోలీసులను హైదరాబాద్‌కు రప్పించారు. దొంగ నోట్ల కేసు విషయమై వారితో చర్చించారు. ఇదే కేసులో అప్పట్లో అరెస్టైన నిందితులను మరోసారి విచారించేందుకు ఎన్ఐఏ సిద్ధమైందని తెలిసింది.