వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలచందర్‌కు నివాళి: తెలుగులోనూ విప్లవకారుడే...

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు చలనచిత్ర రంగంలో కె. బాలచందర్ విప్లవం తెచ్చారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన గత నాలుగు దశాబ్దాల కాలంలో తెలుగులో తెచ్చిన సినిమాలు విశేషమైన ప్రజాదరణ పొందాయి. అయన తెలుగు సినీరంగంపై తనదైన ముద్ర వేశారు. ఆయన మరో చరిత్ర సినిమాకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినిమాను కేవలం వినోదాన్ని అందించే కళగా కాకుండా సామాజిక నిబద్ధత గల కళగా ఆయన తీర్చి దిద్దారు. ఆయన సినిమాల ద్వారా మనిషి అంతరంగాలను ఆవిష్కరించే పనిచేశారు.

మరో చరిత్రతో పాటు ఆకలిరాజ్యం సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. చలం తెలుగు సాహిత్యంలో ప్రారంభించిన స్త్రీవాద దృక్కోణాన్ని బాలచందర్ సినిమాల్లో అందిపుచ్చుకున్నారు. ఇది కథ కాదు సినిమాకు చలం మాటలను ఉంటకించారు. ఇది కథ కాదు సినిమాలో జయసుధ నటించిన పాత్ర చిత్రీకరణ చలన చిత్ర రంగంలో అమోఘమైంది. జయప్రద, జయసుధలను డీగ్లామరైజ్ పాత్రల్లో నటింపజేసి మెప్పించిన ఘనత ఆయనది. అలాగే, కమలహాసన్‌ను కూడా. ఆకలి రాజ్యంలో విప్లవ భావాలతో నిత్యం అశాంతితో రగిలిపోయే నిరుద్యోగ యువకుడి పాత్రలో కమలహాసన్‌ను చూపించిన తీరును తెలుగు ప్రేక్షకలు ఎన్నడూ మరిచిపోరు.

అంతులేని కథ, ఇది కథకాదు, ఆడవాళ్లూ మీకు జోహార్లు వంటి సినిమాలను స్తీ దృక్కోణం నుంచి ఆవిష్కరిస్తే, ఆకలి రాజ్యం, రుద్రవీణ సినిమాలను సమకాలీన దేశ పరిస్థితుల్లో యువత మానసిక స్థితిని ఆయన అద్భుతంగా ఆవిష్కరించారు. కులమతాలను రద్దు చేయడానికి యువత చేసే తిరుగుబాటు కళాత్మకంగా ఆయన చిత్రించారు. ఆ మాటకు వస్తే, మరో చరిత్ర కూడా. ఈ మూడు సినిమాల్లో తరాల అంతరాల మధ్య సంఘర్షణను ఆయన అద్భుతంగా చిత్రిక కట్టారు.

Balachander mark on Telugu film world

స్త్రీల పట్ల, యువత పట్ల ఆయన విపరీతమైన సానుభూతి ఉందని చెప్పడానికి ఆయన సినిమాలే నిదర్శనంగా నిలుస్తాయి. ఆకలి రాజ్యం సినిమాలో ఆయన శ్రీశ్రీ కవిత్వాన్ని వాడుకున్న తీరు అప్పట్లో తెలుగు యువతను ఉర్రూతలూగించింది. తమిళంలో సుబ్రహ్మణ్య భారతి కవిత్వాన్ని వాడుకుంటే, తెలుగులో విప్లవ కవి శ్రీశ్రీ కవిత్వాన్ని వాడుకున్నారు. ఆ సినిమా వచ్చిన కాలంలో తెలుగు సమాజంలోని యువత శ్రీశ్రీని నెత్తికెత్తున్నది.

అందమైన అనుభవం కొంత అబ్రాస్టక్ట్‌ సినిమాగా అనిపిస్తుంది గానీ యువత ఆంతరంగిక ప్రపంచాన్ని లోకానికి సమాజం ముందు బాలచందర్ పరిచారు. తెలుగు సినిమా రంగం సాంప్రదాయిక మూసలో నడుస్తున్న కాలంలో బాలచందర్ సినిమాలు విప్లవాత్మకమైన మార్పును చూపించాయి. బాలచందర్ వారసత్వాన్ని తెలుగులో అందుకున్నవాళ్లు కనిపించలేదు, అందుకోవడానికి ప్రయత్నించివారు కూడా ఉన్నట్లు కనిపించరు. కానీ, ఆయన ప్రభావం మాత్రం ఉంది. 47 రోజులు సినిమాలో ఆయన ఓ స్త్రీ కథను అద్భుతంగా చిత్రీకరించారు. దేశం కాని దేశంలో మహిళలు పడుతున్న ఇబ్బందులకు ఆ చిత్రం చిత్రిక కడుతుంది. ఈ సినిమాలోనూ ఇది కథ కాదు సినిమాలోనూ చిరంజీవి చేత అద్భుతంగా నటింపజేసిన ఘనత కూడా బాలచందర్‌కే దక్కుతుందేమో.

బాలచందర్ దర్శకుడిగా మూస పాత్రలోను తోసిపుచ్చి, జవజీవాలు ఉన్న పాత్రలను సృష్టించారు. నటీనటులు అందులో ఒదిగిపోయే విధంగా చిత్రీకరించారు. ఆయన శారీరక సౌందర్యం కన్నా మానసిక సౌందర్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ఆ మానసిక సౌందర్య చిత్రీకరణ కూడా అద్భుతంగా ఉండేది. ఆ పాత్రలను తీర్చి దిద్దిన తీరు వల్ల సినిమాల్లోని పాత్రలపైనే కాకుండా నటీనటులపై కూడా ప్రేక్షకులకు అభిమానం పెరిగేది. మరో చరిత్రలో హీరోయిన్‌గా నటించిన సరితకు అప్పట్లో యువత ఆదరాభిమానాలు విపరీతంగా లభించాయంటే అతిశయోక్తి కాదు. పాత్రల స్వభావాలు ఆ పాత్రల ప్రవర్తనల్లో, వేషభాషల్లో వ్యక్తమయ్యే విధంగా తీర్చిదిద్దారు.

ఆయన మానసు కవిగా పేరు పొందిన ఆత్రేయతో ఎక్కువగా తెలుగులో పాటలు రాయించుకున్నట్లు కనిపిస్తున్నారు. ఆ పాటలు కూడా మావన మనోలోకాలకు అద్దం పట్టేది. నిజానికి, ఆకలి రాజ్యంలోని సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ అనే పాటను అప్పట్లో చాలా మంది విప్లవ కవి శ్రీశ్రీ రాశాడని అనుకున్నారు. కానీ, ఆ విప్లవాత్మకమైన పాటను కూడా ఆత్రేయనే రాశాడు. రాసి ప్రేక్షకులను, రాయక నిర్మాతలను ఇబ్బంది పెడుతారనే పేరు ఆత్రేయకు ఉండేది. అటువంటి ఆత్రేయతో ఆయన చాలా పాటలు రాయించుకున్నారు. గుప్పెడు మనసు సినిమాలో పాట మౌనమె నీ భాష ఓ మూగ మనసా.... ఒక పొరపాటుకు యుగములు పొగలేవు అనే పాటను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. పాటలు కూడా సినిమాల్లో పాత్రల స్వభావాలకు అనుగుణంగా, పరిస్థితులకు అద్దం పట్టే విధంగా, ప్రేక్షకులను రసోన్ముఖం చేసే విధంగా ఉంటాయి.

విలనీని మేళవించుకుని రూపుదిద్దిన పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించారు. చిరంజీవి మాస్ అప్పీల్‌ను సంపాదించుకున్న తర్వాత తీసిన రుద్రవీణ సినిమాలోనూ ఆయన చేత ఏం కావాలో బాలచందర్ అదే రాబట్టుకున్నారు. ప్రత్యామ్నాయ సినిమాకు, కమర్షియల్ సినిమాకు మధ్య ఒక రకంగా అమీర్ ఖాన్‌ కన్నా ముందే బాలచందర్ హద్దులు చేరిపేశారు. తమిళ తెరకు మాత్రమే కాకుండా తెలుగు తెరకు కూడా రజనీకాంత్, కమలహాసన్‌లను ఆత్మీయులుగా చేసిన ప్రతిభ కూడా బాలచందర్‌దే. ఏమైనా, బాలచందర్ వంటి దర్శకుడు మళ్లీ వస్తాడా, చూడాలి. ఆయనకు వన్ ఇండియా తెలుగు నివాళి...

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
The well known director K Balachander will remembered by Telugu cine goers forever.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X