వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆషామాషీ కాదు, అడుగు దూరమే: నేడే ఇస్రో ‘బాహుబలి’

అంతరిక్ష పరిశోధనలో ‘భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)’ కీర్తి కిరీటంలో మరో మైలురాయి నమోదు కావడానికి కొన్ని గంటల గడువు మాత్రమే ఉన్నది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

శ్రీహరికోట: అంతరిక్ష పరిశోధనలో 'భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)' కీర్తి కిరీటంలో మరో మైలురాయి నమోదు కావడానికి కొన్ని గంటల గడువు మాత్రమే ఉన్నది. భవిష్యత్‌లో మానవ సహిత (వ్యోమగ్యాముల) రాకెట్ల ప్రయోగానికి మరొక అడుగు దూరంలో.. 125 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను తన శిరస్సుపై మోసుకుంటూ శ్రీహరికోట వేదికగా భారత జియో సింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ) మార్క్ ‌ -3 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనున్నది.

ఇది ఆషామాషీ.. సాదాసీదా అంతరిక్ష వాహక నౌక కాదు.. భారతీయుల పాలిట కల్పతరువు. ఈ 'రాకెట్‌ మహాలక్ష్మి' పైపైకి ఎగబాకుతూ.. మనపై కాసుల వర్షం కురిపించనున్నది. ఇది రమారమీ 200 ఏనుగుల బరువును మించి ఉంటుంది. ఇక చౌక మంత్రంతో ఇది అంతర్జాతీయ అంతరిక్ష పరిశ్రమను కొల్లగొట్టడం ఖాయం.

ప్రచ్ఛన్న యుద్ధానికి నేపథ్యమైన సూపర్‌ పవర్లు అమెరికా, సోవియట్‌ యూనియన్‌ మధ్య ఆధిపత్య పోరుతో 1957లో భారత అంతరిక్ష ప్రస్థానం ప్రారంభమైంది. ఖర్చుకు వెరవకుండా రెండు దేశాలూ పోటాపోటీగా అంతరిక్ష యాత్రలు చేపట్టాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. ఆధునిక పరిజ్ఞాన మేళవింపుతో వ్యోమనౌకల్లో సంక్లిష్టతలతోపాటు వాటి వ్యయమూ పెరిగింది.

మరోపక్క అంతరిక్ష వ్యాపారంతోపాటు సేవలకు డిమాండ్‌ విస్తరించింది. పరిశ్రమలను, ప్రైవేట్ పెట్టుబడిదారులను ఈ రంగం ఆకర్షిస్తోంది. అంతరిక్ష వ్యాపారం రూపరేఖలు మారిపోతున్నాయి. భారీ పెట్టుబడి, రిస్కుతో కూడుకున్న అంతరిక్ష రంగ పరిశోధనలో ఖర్చు తగ్గించడమే ఇప్పుడు మూలంగా మారింది. ఈ మంత్రాన్ని పఠించే సంస్థలే మనుగడ సాగిస్తాయి.

 Countdown begins for GSLV-Mark III human-rated launch on June 5

జోరుగా వృద్ధి

అంతర్జాతీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో అంతరిక్ష రంగం కూడా ఒకటి. ఆధునిక మానవ జీవితంలోని అన్ని అంశాల్లోకీ ఇది విస్తరించింది. ఉపగ్రహ కమ్యూనికేషన్ల తోడ్పాటు, ఇంటర్నెట్‌, టీవీ సేవలు, దూర విద్య, దూర వైద్యం, వాహన గమన పరిశీలన, భూ పరిశీలన, విపత్తు పర్యవేక్షణ, మత్స్యసంపద నిర్వహణ, పంటల దిగుబడి అంచనా, పట్టణ ప్రణాళిక, దిక్సూచి సేవలు వంటివి దీనికి ఉదాహరణలు.

ఈనాడు అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఏటా 330 బిలియన్‌ డాలర్లు. అంతరిక్ష పరిశోధనలో ఒకనాడు ప్రభుత్వాల ఆధిపత్యమే సాగేది. ఇప్పుడు వాణిజ్య కార్యక్రమాల జోరు పెరిగింది. ప్రస్తుతం ఈ రంగంలో 76 శాతం మేర ఆదాయం వాణిజ్య సేవల ద్వారానే అందుతోంది. ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల కోట్ల డాలర్ల వార్షిక సామర్థ్యమున్న టెలికం రంగంలో నియంత్రణలను ఎత్తివేశారు. దీంతో రోదసి ఆధారిత టెలికం సేవలు భారీగా విస్తరించడానికి వీలు కలిగింది. అంతరిక్ష ఆధారిత నేవిగేషన్‌ సేవల్లో అనూహ్య వృద్ధి చోటుచేసుకున్నది. సెల్‌ ఫోన్లకూ దిక్సూచి, ఇంటర్నెట్‌ సేవలు; ఉపగ్రహాల ద్వారా నేరుగా వినియోగ సేవలు అందించడం వల్ల మార్కెట్‌ విస్తరణకు మరింత అవకాశం ఏర్పడింది.

ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనకు వివిధ దేశాలు ఏటా 75 నుంచి 130 ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నాయి. సగటున ఒక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపడానికి 75 మిలియన్‌ డాలర్ల మేర ఖర్చవుతోంది.

ఇదీ ఇస్రో సత్తా..

ప్రగతి పథంలో దేశీయ అవసరాలు తీర్చే ఉద్దేశంతో ఆవిర్భవించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) క్రమంగా విదేశాలకూ సాయమందించే స్థాయికి ఎదిగింది. తన కదనాశ్వం పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) వల్లే ఇది సాధ్యమైంది. దిగువ భూ కక్ష్యలోకి 1750 కిలోలను, భూ బదిలీ కక్ష్య (జీటీవో)లోకి 1425 కిలోలను మోసుకెళ్లడంలో ఈ ఉపగ్రహానికి తిరుగులేని చరిత్ర ఉంది. చంద్రుడి వద్దకు చంద్రయాన్‌-1ను, అంగారక కక్ష్యలోకి మంగళయాన్‌లనూ ఇదే పంపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇది ఏకంగా 104 ఉపగ్రహాలను ప్రయోగించి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలోనే చరిత్ర నెలకొల్పింది.

ఇప్పటివరకూ ఈ రాకెట్‌.. 225 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రయోగిస్తే వాటిలో 175 ఉపగ్రహాలూ విదేశాలవే కావడం విశేషం. విదేశీ ఉపగ్రహ ప్రయోగాల విషయమై ఈ ఉపగ్రహ వాహక నౌక నూరు శాతం విజయాలను నమోదు చేసింది. అనునిత్యం విశ్వసనీయత పెంపొందించుకోవడంతోపాటు ధర తక్కువ కావడం వల్ల చిన్న ఉపగ్రహాల ప్రయోగం విషయంలో ఈ వాహన నౌకకు ఇంత ఆదరణ పెరిగింది. ఈ వాహక నౌక ప్రయోగ ఖర్చు దాదాపు 15 మిలియన్‌ డాలర్లు ఉంది. సమకాలీన ఇతర ఉపగ్రహ వాహక నౌకలతో పోలిస్తే ఇది మూడో వంతే.

పీఎస్‌ఎల్‌వీ జోరుతో ఇస్రో.. 2015 - 16లో వాణిజ్య ప్రయోగాల ద్వారా రూ.230 కోట్లు ఆర్జించింది. ప్రపంచ ఉపగ్రహ ప్రయోగ సేవల్లో ఇది 0.6 శాతంగా ఉంది. గత ఏడాది 1-50 కిలోల తరగతి చిన్న ఉపగ్రహాల ప్రయోగం విషయంలో అమెరికాకు చెందిన అట్లాస్‌-5 రాకెట్‌ మొదటిస్థానంలో ఉండగా.. పీఎస్‌ఎల్‌వీ రెండో స్థానంలో నిలిచింది. నానో, సూక్ష్మ ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌.. వచ్చే మూడేళ్లలో 300 కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. వచ్చే పదేళ్లలో నేవిగేషన్‌, సముద్ర పరిశీలన, నిఘా, ఇతర అవసరాల కోసం దాదాపు 3వేల ఉపగ్రహాలను ప్రయోగించాల్సిన అవసరం రావొచ్చు. వీటిలో గరిష్ఠ వాటాను పీఎస్‌ఎల్‌వీ అందిపుచ్చుకుంటే మనకు కాసుల వర్షమే.

ఉపగ్రహాల కక్ష్య పెరగాల్సిందే..

చిన్న, నానో ఉపగ్రహాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నా వాటివల్ల గణనీయ స్థాయిలో ఆదాయం సమకూరదు. ఇందుకు భారీ ఉపగ్రహాలను ప్రయోగించాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా 40 శాతానికి పైగా అంతరిక్ష ప్రయోగాలు మధ్య భూ కక్ష్య/ భూస్థిర కక్ష్యలోకే జరుగుతున్నాయి. పీఎస్‌ఎల్‌వీ సామర్థ్యానికి మించిన ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)కు చెందిన ఏరియాన్‌-5 రాకెట్‌ సేవలను ఇస్రో పొందుతోంది.

ఇందుకోసం ఒక్కో ప్రయోగానికి 85 - 90 మిలియన్‌ డాలర్లను చెల్లిస్తోంది. ఇలా విదేశాలపై ఆధారపడడం తగ్గించడం కోసం జీఎస్‌ఎల్‌వీ పేరిట స్వదేశీ పరిజ్నానంతో శక్తిమంతమైన ఉపగ్రహ వాహక నౌకను అభివ్రుద్ధి చేసే కార్యక్రమాన్ని ఇస్రో విజయవంతంగా చేపట్టింది. దీనికింద జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-1, 2 రాకెట్లకు భూఅనువర్తిత బదిలీ కక్ష్యలోకి 2500 కిలోల బరువును మోసుకెల్లే సామర్థ్యం ఉంది. తాజాగా సోమవారం ప్రయోగించనున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 ఉపగ్రహ వాహక నౌక 4వేల కిలోల బరువును తీసుకెళ్లగలదు. క్రమంగా దాన్ని ఐదు టన్నులకు పెంచుతారు. కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలు ఎక్కువగా 4000 - 5000 టన్నుల తరగతిలో ఉంటాయి కాబట్టి దీనివల్ల విస్తృత ప్రయోజనం ఉంటుంది.

అంతరిక్ష వాహన నౌకల ప్రయోగానికి ఇవీ అవకాశాలు

జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ - 3 వినియోగంతో ఇస్రో విదేశీ రాకెట్లపై ఆధారపడటం గణనీయంగా తగ్గించుకోవచ్చు. దీనివల్ల ఒక్కో ఉపగ్రహానికి కనీసం 40 మిలియన్‌ డాలర్ల మేర ఆదా చేసుకోవచ్చు. మిగతా సంస్థలతో పోలిస్తే ధర తక్కువగా ఉండటం వల్ల విదేశీ ఉపగ్రహ సంస్థలూ భారత్‌ ముందు బారులు తీరడం ఖాయం. దీనివల్ల భారీగా ఆదాయాన్ని ఆర్జించవచ్చు. అంతర్జాతీయ వాణిజ్య అంతరిక్ష ప్రయోగాలకు హబ్‌గా భారత్‌ మారే వీలుంది. ఇందుకు అనుగుణంగా భవిష్యత్‌లో ఏటా 12 నుంచి 18 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలను చేపట్టాలని ఇస్రో భావిస్తోంది. జీఎస్‌ఎల్‌వీకి కనీసం నాలుగు ప్రయోగాలకు డిమాండ్‌ ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇలా పునన్వినియోగ మంత్రం

అంతరిక్ష ప్రయోగ ధరలు అధికంగా ఉండటానికి ప్రధాన కారణం.. ఒక్కసారి ప్రయోగిస్తే ఆ రాకెట్‌ను ఒక్కసారే వాడేందుకు వీలుండటమే. కొన్ని భాగాలనైనా తిరిగి సేకరించి, తదుపరి ప్రయోగానికి వాడితే ఖర్చు తగ్గుతుంది. పునర్‌వినియోగ తంత్రంపై వివిధ దేశాలలోని ప్రధాన అంతరిక్ష సంస్థలు దృష్టిసారించాయి. ఈ విషయంలో స్పేస్‌ఎక్స్‌ ముందంజలో ఉంది. ఇప్పటికే పునర్‌వినియోగ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ పరిజ్ఞాన వినియోగంలో పూర్తిస్థాయి పరిపక్వత సాధిస్తే.. ప్రయోగ ధర 40 శాతం వరకూ తగ్గుతుంది. ఇది మన మార్కెట్‌ను ఇది దెబ్బతీస్తుంది. ఈ నేపథ్యంలో ఇస్రో కూడా కసరత్తు ప్రారంభించింది. గత ఏడాది మేలో పునర్‌వినియోగ వాహకనౌక పరిజ్ఞానాన్ని తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. ఇది అందుబాటులోకి వస్తే ప్రయోగ ధర పదో వంతుకు తగ్గిపోతుంది.

ఇది ఇస్రో విశ్వరూపం

చౌకైన అంతరిక్ష ప్రయోగాల విషయంలో ఇస్రో విశ్వరూపం మంగళయాన్‌ ప్రయోగమే నిదర్శనం. కేవలం రూ.450 కోట్లతో ఈ సుదూర రోదసి యాత్రను చేపట్టింది. ఈ వ్యోమనౌక 650 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. ప్రధాని నరేంద్ర మోదీ మాటల్లో చెప్పాలంటే.. మంగళ్యాన్.. అంగారకుడిని చేరడానికి ఇస్రోకు కిలోమీటర్‌కు రూ.7 మేర మాత్రమే ఖర్చయ్యింది.

ఇలా యాంత్రిక్స్‌ దూకుడు

చౌక మంత్రం ద్వారా అంతరిక్ష రంగంలో వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇస్రో.. 1992లో యాంత్రిక్స్‌ అనే సంస్థను ఏర్పాటు చేసింది. మొదట్లో దేశీయ రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలు అందించే డేటాను విక్రయించింది. తర్వాత పీఎస్‌ఎల్‌వీ విదేశీ ఉపగ్రహ ప్రయోగంపై దృష్టి సారించింది. 1999లో జర్మనీ, కొరియా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపడం ద్వారా రోదసి ప్రయోగ మార్కెట్‌లోకి యాంత్రిక్స్‌ ప్రవేశించింది. ఐరోపాకు చెందిన 'ఈఏడీఎస్‌ ఆస్ట్రియం' భాగస్వామ్యంతో విదేశాలకు కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను తయారు చేసి, సరఫరా చేసే బాధ్యతనూ తలకెత్తుకున్నది. ఇప్పుడు అనేక రంగాలకు సేవలను విస్తరించింది.

పర్యాటకులతోనూ ఆదాయం

జీఎస్‌ఎల్‌వీ ద్వారా వ్యోమగాములను తీసుకెళ్లే వీలుండటంతో అంతరిక్ష పర్యాటక రంగంలోకీ ఇస్రో అడుగుపెట్టవచ్చు. చందమామను చుట్టి రావడానికి, భూకక్ష్యలోకి ప్రైవేటు వ్యోమగాములను తీసుకెళ్లడానికి 'స్పేస్‌ ఎక్స్‌' సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకూ అంతరిక్ష యాత్రికులు 8 నుంచి 11 రోజుల ప్రయాణం కోసం 30-40 మిలియన్‌ డాలర్లు చెల్లించారు. ఇందులో పదో వంతు ధరకే ఔత్సాహికులతో ఇస్రో అంతరిక్ష యాత్రలు నిర్వహించవచ్చు.

పోటీ పడలేక అమెరికా కంపెనీలు ఇలా అడ్డదారులు..

ధర విషయమై ఇస్రోతో పోటీ పడలేని అమెరికా కంపెనీలు అడ్డదారుల్లో ప్రయత్నిస్తున్నాయి. అమెరికా ఉపగ్రహాలను భారత్‌ ద్వారా ప్రయోగించకుండా అడ్డుకునేలా నిబంధనలు రూపొందించేందుకు అక్కడి కంపెనీలు, లాబీయిస్టులు తెగ ప్రయత్నిస్తున్నారు. వీరి వాదనకు అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ)కు చెందిన వాణిజ్య అంతరిక్ష రవాణా సలహా కమిటీ మద్దతు పలికింది. భారత ప్రయోగ సేవలు.. మార్కెట్లో పోటీ నిబంధనలను దెబ్బ తీస్తున్నాయని చెబుతోంది.

భవిష్యత్‌లో మరింత వృద్ధి..

అంతర్జాతీయ అంతరిక్ష మార్కెట్‌ ఇంకా విస్తరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్నేళ్లలో ఉపగ్రహాల సంఖ్య 8000కు పెరగొచ్చు. కమ్యూనికేషన్లు, డేటా ఎనలిటిక్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి అంశాల్లో పురోగతి వల్ల భారీ గిరాకీ ఏర్పడుతుంది. ఉగ్రవాదం, భూమి ఆరోగ్యం, ప్రకృతి వనరుల పర్యవేక్షణ, మెరుగైన వాతావరణ అంచనాలు వంటి అంశాలకు అధునాతన అంతరిక్ష వ్యవస్థలు అవసరం. కక్ష్యల్లో పేరుకుపోతున్న అంతరిక్ష వ్యర్థాల తొలగింపు, కక్ష్యలోనే ఉపగ్రహాలకు మరమ్మతులు చేసే సేవలకు మంచి గిరాకీ లభించనున్నది.

English summary
THIRUVANANTHAPURAM: As the countdown begins at 3.58 pm on Sunday for the launch of the Geosynchronous Satellite Launch Vehicle (GSLV) -Mark III from Sriharikota on Monday at 5.28 pm, ISRO centres behind the design of the launch indicate that in addition to being a human-rated vehicle, it marks the efforts of the 'Make in India' space project that's fully indigenous and will be a major fete of self-reliance for the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X