వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీచర్స్ డే స్పెషల్: విద్వత్పద్ధతి

మానవ వికాసానికి విద్య అనగా ఙ్ఞానం అనివార్యమని అందరకు తెలిసినదే. శాస్త్రఙ్ఞానానికి కొంత లౌకికఙ్ఞానం కూడా తోడైతే మానవుడు చేయలేనిదేది ఉండదు.

By Pratap
|
Google Oneindia TeluguNews

"విద్య నిగూఢగుప్తమగు విత్తము, రూపము పూరుషాళికి౯;

విద్య యశస్సు, భోగకరి; విద్య గురుండు, విదేశబంధుఁడు౯;
విద్య విశిష్టదైవతము, విద్యకు సాటి ధనంబు లేదిల౯;
విద్య నృపాలపూజితము, విద్యనెఱుంగనివాఁడు మర్త్యుడే"(?).

విద్యవలన మానవునికి కలుగు యోగములెన్నియోనని తేలికగా అర్థమయే మాటలలో ఏనుగు లక్ష్మణకవి పైపద్యంలో వివరించాడు. అంతటితో ఆగక విద్య లేనివాడు 'మర్త్యుడే', అంటే మనిషిగా పరిగణించగలమా అని కవి ప్రశ్నించినట్లుగా ఉంది. సంస్కృత మూలంలో భర్తృహరి "విద్యావిహీనః పశుః" అని సూటిగ చెప్పాడు. పశు శబ్దానికి నాలుగు కాళ్ళ జంతువని నిఘంటువుల నిర్వచనం. ఆందుకనేనేమో రెండుకాళ్ళ విద్యలేని మూఢమానవుణ్ణి "వింత పశువు" అని వర్ణించారు కొంతమంది కవులు.

ఏది ఏమయినా మానవ వికాసానికి విద్య అనగా ఙ్ఞానం అనివార్యమని అందరకు తెలిసినదే. శాస్త్రఙ్ఞానానికి కొంత లౌకికఙ్ఞానం కూడా తోడైతే మానవుడు చేయలేనిదేది ఉండదు. మరి పైన పద్యంలో చెప్పిన ప్రయోజనాలన్నీ పొందటానికి సరిపడే విద్య అనే సాటిలేని ధనాన్ని ఎలా సంపాదించాలనేది ప్రశ్న. ఇది ఏమీ కఠినతరమైన ప్రశ్నగా అనిపించకపోవచ్చు. విద్యాసాధనకు చదువే (Reading) మార్గం అని అందరి అభిప్రాయం. చదువుకు పఠనం, అభ్యాసించు అని పర్యాయపదాలున్నాయి. అయితే గ్రంథాలను ఊరకే అభ్యసించినంత మాత్రాన, అంటే మరల మరల పఠించినంత మాత్రాన విద్యావంతులు అవుతారా? కాలేరు. ఎందుకంటే,

Dasu Madhusudan Rao writes on the occasion of Teachers day

"చదువది యెంతగల్గిన రసఙ్ఞత యించుకచాలకున్న నా
చదువు నిరర్థకంబు, గుణసంయుతు లెవ్వరుమెచ్చ రెచ్చటం,
బదునుగ మంచికూర నలపాకము చేసిననైన, నందు నిం
పొదవెడు నుప్పులేక రుచిపుట్టఁగ నేర్చునటయ్య భాస్కరా".

అని శతకకారుడు మారవి (మారద) వేంకయ్య చెప్పినట్లుగా ఒకడు ఎంత గొప్పచదువు చదివినా, వానికి కొద్దిపాటి అయినా రసఙ్ఞత, అంటే ఆచదివిన చదువులోని సారాన్ని గ్రహించి, అనుభవించే శక్తి లేకపోతే అట్టిచదువు రాణించక, రాజిల్లక, చట్టుబండలై పోతుంది. అలా నిష్ప్రయోజనమైన చదువు చదివినవానిని ఉత్తములెవరు మెచ్చుకొనరు. సారగ్రహణశక్తి సంపాదించి తనకు, సమాజానికి ప్రయోజనకరంగా ఉండే విద్యనభ్యసించాలంటే మంచి గురువు అనివార్యమని పెద్దలంతా అంగీకరించిన విషయమే. సాక్షాత్ శ్రీమన్నారాయణుడి అవతాఅరమైన శ్రీరాముడు బాల్యంలో వశిష్ఠుని వద్ద, ఆ తరువాత విశ్వామిత్రుని వద్ద విద్యనభ్యసించాడు. మరి ఆ మహావిష్ణువుయొక్క పరిపూర్ణావతారముగా వర్ణింపబడి, వందేజగద్గురుమని ఆరాధించబడుతున్న శ్రీకృష్ణుడుకూడా సాందీపుని వద్ద శిష్యరికం చేసినట్లుగా భాగవతపురాణం చెబుతోంది. మరి సామాన్య మానవులమైన మనమనగానెంత.

అలనాటి గురువులు నిష్ఠాగరిష్ఠులై, ధర్మాచరణబద్ధులై విద్యనేర్పేవారని ప్రతీతి. గడచిన ఒకటి రెండు శతాబ్దాలుగా వలసపాలనా ప్రభావంవల్ల పురాణాలలో వర్ణించిన "వనవాసాల"లోని గురుకులాలు పోయి జనవాసాలలో పాఠశాలలు, కళాశాలలు వచ్చినా, మూడు, నాలుగు దశాబ్దాల క్రితంవరకు ఆవిద్యాలయాలలోని అధ్యాపకులు కొన్ని నిర్దుష్టమైన నియమ నిబంధనలకు బద్ధులై విద్యాబోధన చేసేవారని చాలామంది అభిప్రాయము, అనుభవము కూడా. కాని ఇటీవలికాలంలో, కొన్ని ప్రత్యేక శాస్త్ర సాంకేతిక విద్యాలయాలలోను, విశ్వవిద్యాలయాలలోను తప్ప, మిగిలిన వేలాది పాఠశాలలోను, కళాశాలలోను నాణ్యతావిలువలులేని విద్యాబోధన జరుగుతోందని వింటున్నాం.

కొందరు ఉన్నతపాఠశాల విద్యార్థులకు అక్షరాలు వ్రాయడం, చిన్నచిన్న కూడికలు తీసివేతలు చేయడం కూడా రావడంలేదని పత్రికలలో చదువుతున్నాం. అదేకాక దేశంలోని సాంకేతిక కళాశాలలనుంచి బయటకు వచ్చే లక్షలాదిమంది యువతీయువకులలో తొంభైశాతం మంది ఏ ఉద్యోగానికి అర్హులు కారని అనేక నివేదికలు చెబుతున్నాయి.

లక్షలాదిమంది విద్యార్థులు కోట్లాది రూపాయలు, దశాబ్దన్నర కాలం వెచ్చించి సంపాదిస్తున్నదేమిటి. 'రసఙ్ఞత ఇంచుక' లేక నిరర్థకమౌతున్న చదువులా? ఈ విద్యావిషయక రసాభాసకు కారణాలేమీటి? "ఆచార్యవా౯ పురుషో వేదః" అన్న ఉపనిషద్వాక్యంలో చెప్పినట్లుగా పాఠం ఒంటబట్టాలంటే సరియైన గురువు ఆవశ్యకమని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. మరి ఇప్పటి స్కూళ్ళలోను, కాలేజీలలోను సరైన అధ్యాపకులు లేరా అంటే లేరనే అనుకోవాలి. ఉత్తమయోగ్యతలుండి, సరియైన అర్హతగలిగి విద్యార్థులను ప్రేరేపించి, వారికి స్ఫూర్తినిచ్చి ఆదర్శప్రాయంగా ఉండే ఉపాధ్యాయుల సంఖ్య తగ్గుతోందనే వాదన కూడా వినపడుతోంది.

ఈ పరిస్థితికి కారణాలు వెదకడానికి ఎక్కువ దూరం పోనక్కరలేదు. ఇటీవలి కాలంలో, అందునా గడచిన రెండు దశాబ్దాలుగా ప్రైవేటురంగం బాగా అభివృద్ధి చెందుతూ, కంప్యూటర్ సాఫ్ట్-వేర్, మార్కెటింగ్ మరియు మేనేజిమెంట్ భాగాలలో అధిక జీతభత్యాలు, మరియు ఇతర అనేక సౌకర్యాలతో ఉద్యోగావకాశాలు అధిక సంఖ్యలో రావడం వలన అత్యుత్తమ విద్యార్హతలతోపాటు ఇతర నైపుణ్యాలున్న అభ్యర్థులు వాటివైపు ఆకర్షితులై ఇటు విద్యాలయాలలో అధ్యాపకులగను, అటు పరిశోధనాసంస్థలలో శాస్త్రవేత్తలగను పోవడానికి విముఖంగా ఉన్నారని, విద్యావేత్తలేకాక, ప్రభుత్వమువారు కూడా ఆందోళన చెందుతున్నారు. ఆయాఉద్యోగాలకు సమర్థులైనవారి ఆవశ్యకత ఎంత ఉన్నా, యువతీయువకులలో ఆ సమర్థతనాపాదించడానికి తగుసమర్థతత కలిగిన ఉపాధ్యాయులు విద్యాలయాలలో లేకపోతే ఫలితం ఏమిటో మరల చెప్పనవసరంలేదు. మరి ప్రస్తుత పరిస్థితిలో ఆధ్యాపక వృత్తికి వచ్చేవారెవరైనా వారు మంచి గురువులుగా మారడానికి ప్రేరణ ఎక్కడనుండి వస్తుంది?

ప్రతి మనిషికి పదిమందీ తనని ప్రత్యేకంగా గుర్తించాలని కోరిక ఉంటుంది. 'గుంపులో గోవిందు'డిగా ఉండిపోడానికి ఇష్టపడడు. దానికోసం నానా అవస్థలు పడుతూంటారు కొంతమంది. మనం తరచూ చూస్తూ ఉంటాం, పదిమంది చేరిన చోట - పెళ్ళి పేరంటాలలోనూ, అలాంటి ఇతర కార్యక్రమాలలోను - కొంతమంది, ముఖ్యంగా వయసులో ఉన్నవారు తళుకు తళుకు రంగురంగుల దుస్తులు ధరించి ఉండటమో, లేదా అవసరం ఉన్నా లేకున్నా బిగ్గరగా మాట్లాడటమో లేదా నవ్వటమో చెస్తూ ఉంటారు. ఇవన్నీ ఇతరుల దృష్టిని తమవేపు తిప్పుకొని ఆకర్షింపబడటానికి వాళ్ళు పడే తిప్పలు.

అంతేగాక చాలామందికి సమాజంలో కొద్దో గొప్పో పేరు తెచ్చుకోవాలని కూడా ఒక కోరిక ఉంటుంది. అదొక కల. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారన్నట్లు కలలు కనడం తప్పుకాదు. ఆమాటకొస్తే కనాలికూడా. మానసిక వైద్యుల్ని అడిగితే పగటి కలలు ఆరోగ్యానికి మంచివని కూడా చెప్తారు. ఆ కలలే ఆలోచనలవుతాయి. ఆ ఆలోచనలకి కార్యరూపం ఇచ్చి సార్థకం చేసుకోగలిగినవారికి అడ్డే ఉండదు. మరి ఆ కలలను సాకారం చేసుకోవాలంటే గట్టి ప్రయత్నం కావాలి. 'కృషితో నాస్తి దుర్భిక్షం' అని కదా పెద్దలు అన్నారు. "కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు" అని కూడా ఒక సినిమా కవి అన్నాడు. గాలిలో దీపం పెట్టి దేముడా అంటే ప్రయోజనం ఉండదుకదా. దేనికైనా మానవ యత్నం తప్పనిసరి.

పేరు సంపాదించటం మాత్రమే ధ్యేయమైతే మీసాల వీరప్పన్ కీ పేరు వచ్చింది, వీరపాండ్యకట్టబొమ్మన్ కీ (శివాజి గణేశన్ కి కూడా) పేరు వచ్చింది. ఒకడు దేశద్రోహి అయితే, ఇంకొకడు దేశభక్తుడు. సుడిగుండాలు సినిమాలో అన్నట్లు "దేశభక్తుడుగా జైలుకెళితే వచ్చే గౌరవం దేశద్రోహిగా" వెళ్ళితే వస్తుందా? ఒక వ్యక్తి కీర్తి, ప్రతిష్ట్ఝలతోపాటు బహుజనాదరణ పొందడానికి కొన్ని మార్గాలున్నాయి. అవి ఏమిటంటే, మంచి రచయితగాగాని, మంచి గాయకుడుగాగాని, లేదా మంచి వక్తగానో అవాలి.

మంచి రచయిత కాలేనివాడు 'సంపాదుకునికి లేఖా' (Letters to the Editor) రచయితగా మిగిలిపోతాడని నానుడి. మరి గాయకుడు, వక్త కాలేని వాళ్ళేమవగలరు? ఈమధ్య పెళ్ళిసంబరాలలో సినిమా పాటల రికార్డులకు బదులుగా స్థానిక గాయనీగాయకులచేత పాడిస్తున్నారు. మంచి గాయకుడు కాలేనివాడు ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు, లేదా హీనం స్నానశాల గాయకునిగానైనా (బాత్రూమ్ భాగవతార్) మిగిలిపోవచ్చు. మరి మంచి వక్త కాలేనివాడు కోరిక తీరాలంటే ఏంచేయాలి? అధ్యాపకుడైతే సరి. కళాశాలల్లో అధ్యాపకుల్ని ఉపన్యాసకులని కదా అంటారు.

మంచి వక్త కావాలంటే ముందస్తుగా విషయజ్ఞానం ఉండాలి. అది ఉన్నా, లేకున్నా శ్రోతలను ఆకట్టుకొనే వాక్చాతుర్యం, దానితోపాటు భాషమీద పట్టు ఉండితీరాలి. వీటన్నిటికి మించి మంచి కంఠస్వరం కూడా తోడైతే ఇక చెప్పేదేముంది వారు ఉపన్యాసశిరోమణులే అవుతారు. అధ్యాపకుడికి ఈ గుణాలన్నీఉండనవసరం లేదు. తరగతిగదిలో బందీకృత ప్రేక్షకులే (Captive audience) ఉంటారు. మాష్టారు ఏంచెప్పినా, ఎలాచెప్పినా, విన్నా, వినకున్నా విద్యార్ధులు క్లాసు అయ్యేదాకా కుదురుగా(?) కూర్చునే ఉంటారు. అలాంటప్పుడు అధ్యాపకుడు ఉత్తమ గురువుగా పేరు తెచ్చుకోవాలంటే ఏంచెయ్యాలి? తన ఉపన్యాసంతో విధ్యార్ధులని ఆకట్టుకోవాలి.

ఆ బందీకృత ప్రేక్షకులను తన 'సంబంధిత' శ్రోతలుగా (captivated listeners) మార్చాలి. ఇది సాధించాలంటే ఏంచేయ్యాలి? 'బతకలేక బడిపంతులుగా' పని మొదలుపెట్టినా, అంటే ఇష్టం లేకున్నా, బలవంతంగా ఈ వృత్తిలో చేరినా సరే, పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయిన తరువాత భర్త భార్యను, లేక భార్య భర్తను ప్రెమించినట్లు, వృత్తిని ప్రేమించాలి, గౌరవించాలి. లేకపోతే సంసారం సజావుగా సాగదు. క్లాసులో పాఠాలూ అంతే. ప్రతిదినం నరకమే. ప్రేమ మొదలైనప్పుడే కదా జీవితం సాఫల్యమయ్యేది.

ఆవిధంగా ఎప్పుడు ఉపాధ్యాయులు తమ వృత్తిని ప్రేమించటం మొదలు పెడతారో అప్పుడు నాణ్యమైన ఫలసాయం సాధించడానికి వీలవుతుంది. ఆయితే ఉపాధ్యాయులు పండించగలిగినదేమిటి? నాణ్యమైన మణిదీపాలని వారు తయారు చేయగలరు. విద్యార్థులు వెలిగించని దీపాలవంటివారు. ఉపాధ్యాయులు చేయవలసిందల్లా వారిలోని ఙ్ఞానతృష్ణ అనే ఇంధనాన్ని వెలికితీసి, దానిని రాజేసి ఆ దీపాలని ప్రకాశింపజేయటమే. అలా చేసినప్పుడు, "ఓం అఙ్ఞాన తిమిరాంధస్య ఙ్ఞానాంజన శలాకయా; చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః" అన్నట్లుగా, అఙ్ఞానమనే చీకట్లు కమ్ముకున్న కళ్ళకు ఙ్ఞానమనే అంజనమద్ది కళ్ళు తెరిపించిన గురువుగా అందరి పూజలు పొందగలరు.

ఏ ఉపాధ్యాయునికైనా అతను వెలిగించిన ఆ ఙ్ఞానదీపాలు దేశవిదేశాలలో వెలుగుని పంచుచున్నపుడు, మరిన్ని దీపాలని ప్రకాశింపజేయటానికి ఉపయోగపడుతున్నపుడు, వచ్చే తృప్తి ఎంతసంపద ఇచ్చినా రాదు. ప్రముఖ కథా రచయిత, స్వయంగా పాఠశాలోపాధ్యాయుడు అయినటువంటి మధురాంతకం రాజారాం అన్నట్లుగా, ఆ కాంతులను చూసిన ఆ ఉపాధ్యాయుడు వారందరూ "తాను వెలిగించిన దీపాలే"నని తలచి మురిసి గర్వపడి తృప్తినొందుతాడు.

కాని, "ఆచార్యాత్ పాదమాదత్తే, పాదం శిష్యః స్వమేధయా; సబ్రహ్మచారిభ్యః పాదం, పాదం కాలక్రమేణ చ" అన్న శ్లోకంలో చెప్పినట్లుగా శిష్యుని విద్యార్జనా ప్రయత్నంలో గురువు పాత్ర నాలుగింట ఒకవంతు మాత్రమే అని అన్నా అది చాలా కీలకమయినది. విద్యాబోధన అనే కార్యం ఒకయఙ్ఞం అనుకొంటే, గురువు అందులో ఆరణిలాంటివాడు. తాను వెలిగించిన దీపం ఎంత కాంతితో వెలుగుతుందో దానిలోని ఇంధనంపైన ఆధారపడి ఉంటుంది. ప్రతి విద్యార్థిలో అ ఇంధనం నిబిడీకృతమై ఉంటుంది. దాన్ని వెలికితీసి వెలిగేటట్లు చేయడమే ఉపాధ్యాయుని పని. విద్యార్థులు ఆశక్తిని విఙ్ఞాన సముపార్జనకు, తన వ్యక్తిత్వ వికాసానికి, మంచి పౌరునిగా ఎదగటానికి, ఎదిగి సమాజానికి ఉపయోగపడే పనులు చేయటానికి వినియోగించాలి. అప్పుడే విద్యార్థులు విద్యావంతులవుతారు.

ప్రజలు విద్యావంతులవటానికి విద్యాలయాలలో చదవటమే మార్గమా? మరి లక్షలాదిమంది మన సోదర, సోదరీమణులు ఈ సౌకర్యానికి ఇంకా దూరంగానే ఉన్నారు కదా. మరి వారు విద్యావంతులు కారా. కారు అనడానికి ఆస్కారము లేదు. పెద్దలు చెప్పిన నాలుగు మంచిమాటలు వినికూడా విద్యావంతులు, సంస్కారవంతులు కావచ్చును. అసలు విద్య యొక్క ముఖ్యోద్దేశ్యం మానవులను సంస్కారవంతులుగా మలచటమే కదా.

మన రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలలోని సారాన్ని కథలుగాచేసి చెప్పగా వినిన మన పూర్వీకులలో చాలామంది నిరక్షరాస్యులేమోగాని విద్యలేనివాళ్ళని అనగలమా? ఈసందర్భంలొ చాలాకాలం క్రిందట జరిగిన ఒక సంఘటన, (పత్రికలలో వచ్చినది) ఙ్ఞప్తికొస్తూంది. సుమారు ఇరవై సంవత్సరాల క్రిందట 'వీధిబాలల'కు (Street children) విద్యగఱపటానికి అప్పటి ప్రభుత్వం 'చదువుల పండగ' అనే కార్యక్రమం చేసింది. ఆ సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి ఒక వీధిబాలుణ్ణి పెద్దవాడివయ్యాక నీకేమవాలని ఉంది అని అడుగగా, ఆబాలుడు, "సార్, నాకు మంచి మనిషిగా అవాలని ఉంది" అని తడుముకోకుండా సమాధానం ఇచ్చాడుట. వ్యాఖ్యాతలు ఆకుఱ్ఱవానికి విద్య అవుసరంలేదు, కావలసినది అక్షరాస్యతే అని వివరించారు.

ఇదివ్రాసిన నేను, చదివిన మీరు, అందరము అక్షరాశ్యులమే. మరి మనకి సరియైన విద్య ఉన్నదా?

- దాసు మధుసూదన రావు

English summary
Dasu Madhusudhan Rao has written an essay on the importance of education on the occasion of teachers day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X