వాటర్ బాటిల్స్: బాధపడ్డ బాలు, ఫేస్బుక్ పోస్ట్ హల్చల్
హైదరాబాద్: ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. నీరు వృథా చేయవద్దని పెట్టిన ఓ పోస్ట్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం దేశంలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశంలో చాలాచోట్ల నీటి సమస్య ఏవిధంగా ఉందో మనం రోజూ చూస్తున్నాం.
లాతూర్ ప్రాంతానికి అయితే ఏకంగా రైళ్లలో నీటిని తరలిస్తున్నారు. ప్రభుత్వాలు ఇంకుడు గుంతలు తవ్వాలని, నీటిని సంరక్షించాలని పిలుపునిస్తున్నాయి. బాలసుబ్రహ్మణ్యం కూడా నీటి సమస్య పైన స్పందించారు. ఆయన పెట్టిన పోస్ట్ ఇంటర్నెట్లో దూసుకుపోతోంది.

తాజాగా ఆయన ఫేస్బుక్లో నీటి సంరక్షణపై చేసిన ఒక వ్యాఖ్య అందర్నీ ఆకట్టుకుంటోంది. 'దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో జనం గుక్కెడు నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల నేను కొన్ని వివాహాలకు వెళ్లినప్పుడు కనిపించిన దృశ్యం నాకు బాధ కలిగించింది.
భోజన సమయాల్లో వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. చాలామంది వాటిలో సగం నీళ్లు మాత్రమే తాగి పారేస్తున్నారు. విసిరేసిన సీసాల్లో మిగిలిన నీళ్లను అక్కడ పనివాళ్లు పారబోయటాన్ని నేను చూశాను. ఇది బాధాకరం. దయచేసి నీటిని ఇలా వృథా చేయొద్దు. కావాల్సినంత వాడుకుని మిగతాది పొదుపు చేయండి' అని పోస్ట్ పెట్టారు.
ఈ పోస్టింగ్‌కు సామాజిక మాధ్యమంలో విపరీతమైన స్పందన వస్తోంది. వేలాది మంది ఈ పోస్ట్‌కు లైక్‌లు కొట్టారు. వేలాది మంది దీనిని షేర్ చేశారు. చాలామంది ఆయన కామెంటు పైన అభిప్రాయం వ్యక్తం చేసి, ఆయనను ప్రశంసించారు.