ఆశ్రమాల ముట్టడిలో భారత్: బాబాలు.. అత్యాచారాలకు నిలయాలు
న్యూఢిల్లీ: వారు దైవాంశ సంభూతులు..భక్తుల దృష్టిలో వారు పరమ పూజ్యులు.. బయటి సమాజానికి నిరాడంబర జీవనంతో అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన వారు. కానీ అనుచరులు పెరిగే కొద్దీ వారి బుద్ధి మారిపోతోంది. తమ ఆహార్యంతో, ప్రవచనాలతో వందలు, వేల సంఖ్యలో అనుచరులను తయారు చేసుకుని ఆశ్రమాలు కట్టుకోవటం, సొమ్ము కూడబెట్టుకోవటం సర్వసాధారణమైంది.
చెప్పేది భక్తి మార్గం... కానీ చేసేది నమ్మక ద్రోహం. భక్తురాళ్లను, అనుచరులను ఇష్టానుసారం వాడుకోవడం అలవాటుగా మారింది. హత్యలు, అత్యాచారాలు చేసే బాబాలకు కూడా కొదవ ఉండటం లేదు. తమని తాము చట్టానికి అతీతులుగా భావిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరించే బాబాలకు ఏదో ఒకరోజు పాపం పండుతోంది. అటువంటి వారు చట్టానికి చిక్కి జైలు వూచలు లెక్కించక తప్పటం లేదు.
డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్ రామ్ రహీం ఉదంతం దీనికి తాజా ఉదాహరణ. ఇటువంటి వివాదాస్పదమైన బాబాలు ఎందరో గతంలో కేసులు, విచారణ ఎదుర్కొని జైలు పాలయ్యారు. బాబాల నేరప్రవర్తనకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త వివాదాలు, కేసులు పుట్టుకొస్తూ ఉండటమే భారత దేశంలో నెలకొన్న వైచిత్రికి నిదర్శనం.

మహిళలపై లైంగిక దాడి.. ప్రశ్నిస్తే హత్యలు
కేవలం భక్తి, సేవా కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైతే గుర్మీత్ రామ్ రహీం కటకటాల పాలవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. కానీ తన భక్తురాళ్లైన మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఆయన స్థాయిని దిగజార్చాయి. 15 ఏళ్ల క్రితం నమోదైన కేసులో ఆయన కటకటాల పాలు కావలసి వచ్చింది. ఆయన జీవన శైలి, చర్యలు, నిర్ణయాలు పలుసార్లు వివాదాస్పదంగా మారాయి. గుర్మీత్ రామ్ రహీం 2007లో సిక్కుల మత గురువైన గురు గోవింద్ సింగ్ రూపంలో ప్రకటనల్లో కనిపించటం పెద్ద వివాదానికి తావిచ్చింది. పంజాబ్‌లో దీనిపై పెద్దఎత్తున అల్లర్లు చెలరేగాయి. రెండు హత్యా కేసుల్లోనూ ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. డేరా అనుచరుడైన రంజిత్ సింగ్, జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి ఒకే ఏడాదిలో హత్యకు గురయ్యారు. ఈ సంఘటనల్లో గుర్మీత్ రామ్ రహీం పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ముదిమి వయస్సులోనూ పాడు పనులు
భక్తి యోగ పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిన ఆశారాం బాపు ప్రస్తుత పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతంలో జన్మించారు. 1973లో ఐదుగురు అనుచరులతో ఆశ్రమాన్ని స్థాపించిన ఆశారాంకు దేశ, విదేశాల్లో 425 ఆశ్రమాలు ఉన్నాయి. తన 70 ఏళ్ల వయస్సులో లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో జైలు పాలయ్యారు. 2012లో జోథ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై కేసు నమోదైంది. ఆ తర్వాత ఎంతో మంది ముందుకు వచ్చి ఆశారాం బాపు అత్యాచారాలను పూసగుచ్చినట్లు చెప్పారు. తాము నోరుతెరిస్తే చంపేస్తామని బెదిరించే వారని బాధితులు వాపోయారు. ఆశారాం బాపుతోపాటు ఆయన కుమారుడు నారాయణ సాయి కూడా మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలయ్యారు. తండ్రీ కొడుకులిద్దరిపై భూఆక్రమణ కేసులు ఉన్నాయి. అంతేగాక 2008లో సబర్మతి నదీ తీరంలో శవాలై కనిపించిన ఇద్దరు పిల్లల హత్య కేసుల్లో బాపు, ఆయన కుమారుడిని పోలీసులు విచారించారు.

భూకబ్జా, అనుమానిస్తే ఇలా నిత్యానంద వేధింపులు
స్వామి నిత్యానంద అసలు పేరు రాజశేఖరన్. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ధ్యానపీఠ ఆశ్రమాలు స్థాపించి వెలుగులోకి వచ్చారు. తనను దైవంగా భావిస్తూ భక్తులను ఆకర్షించారు. బొమ్మలకు ప్రాణ ప్రతిష్ట చేస్తానని అనుచరులకు నమ్మబలికేవారు. తన ఆశ్రమంలో భారతీయ అమెరికన్ శిష్యురాలిపై అత్యాచారం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. 2010లో ఒక తమిళ సినీ నటితో స్వామి నిత్యానంద అసభ్యంగా ప్రవర్తించిన వీడియో దృశ్యాలు బయటకు రావటం దేశవ్యాప్త సంచలనం సృష్టించిందది. దీనిపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ వర్గాల ప్రజల ఆగ్రహాన్ని చవిచూశారు. భూముల ఆక్రమణ, తనను అనుమానించిన వారిని వేధించటం తరహా ఆరోపణలెన్నో ఆయనపై ఉన్నాయి.

పోలీసులతోనే రాంపాల్ మద్దతు దారుల ఘర్షణ
హర్యానాలోని థనానాలో ‘కబీర్ పంత్' పేరిట ఆశ్రమాన్ని స్ధాపించి ఎంతో మందిని తన భక్తులుగా మార్చుకున్న సంత్ రాంపాల్ పోలీసులు తన ఆశ్రమంలోకి అడుగుపెట్టకుండా ఆ భక్తులనే రక్షణ కవచంగా వాడుకొని దేశవ్యాప్తంగా విమర్శల పాలయ్యారు. ఆర్యసమాజ్ పవిత్ర గ్రంథమైన ‘సత్యార్థ ప్రకాష్' లోని కొన్ని భాగాలను ఆయన వ్యతిరేకించి విమర్శలు చేశారు. దీనిపై పెద్దఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ వ్యవహారంలో ఈ గొడవల్లో ఒక యువకుడు చనిపోగా 59 మంది గాయాల పాలయ్యారు. రాంపాల్‌పై పోలీసులు హత్యాకేసు నమోదు చేశారు. ఇదే కాకుండా ఆశ్రమం కోసం భూఆక్రమణకు పాల్పడ్డారనే ఆరోపణలు, విచారణను ఎదుర్కొన్నారు. 22 నెలల పాటు జైలు జీవితం గడిపిన తర్వాత 2008లో బెయిల్ మంజూరైంది. కానీ తర్వాత కోర్టు విచారణకు హాజరయ్యేందుకు నిరాకరించారు. అనుచరులు అల్లర్లకు పాల్పడతారనే ఆందోళనతో పలు సందర్భాల్లో ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. కానీ 2010 నుంచి 2014 వరకు 42 సార్లు కోర్టుకు హాజరు కాకపోవడంతో పంజాబ్ అండ్ హర్యానా ఉమ్మడి హైకోర్టు.. 2014 సెప్టెంబర్‌లో కోర్టు ధిక్కార నేరం కింద హాజరు కావాలని ఆదేశించినా ప్రయోజనం లేకపోయింది. భారీగా రాంపాల్ మద్దతుదారులు చండీగఢ్ నగరానికి తరలి రావడంతో ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. అదే ఏడాది నవంబర్ ఐదో తేదీన రాంపాల్ మద్దతుదారులు ఆందోళనకు దిగడంతో రైళ్లు స్తంభించాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది. నవంబర్ 9న అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులను అడ్డుకునేందుకు రాంపాల్ మద్దతుదారులు మానవ హారం ఏర్పాటు చేశారు. చివరకు నవంబర్ 19న 492 మంది అనుచరులతోపాటు రాంపాల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు దేశద్రోహం, తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అంతేకాదు..తన అనుచరులైన మహిళా సాధ్విలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి.

లండన్ వ్యాపారిని మోసగించిన కేసులో చంద్రస్వామి అరెస్ట్
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో స్వామి వికాసానంద్ అలియాస్ వికాస్ జోషి మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఇందులో ముఖ్యమైనవి. యువతులపై అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా వారితో నగ్న చిత్రాలు తీసినట్లు ఆరోపణలు ఎదుర్కొని కటకటాల పాలయ్యారు. తాంత్రిక్గా పేరుపొందిన చంద్ర స్వామి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు సన్నిహితుడు. దిల్లీ సమీపంలోని కుతుబ్ ఇనిస్టిట్యూషనల్ ప్రాంతంలో ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. చంద్రస్వామి చుట్టూ ఎన్నో వివాదాలు ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్య నిబంధనలను ఉల్లంఘించినట్లు వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారించింది. ఇటువంటి 13 కేసుల్లో ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూ. 9 కోట్ల అపరాధ రుసుము విధించింది. లండన్‌కు చెందిన ఒక వ్యాపారిని లక్ష డాలర్లకు మోసం చేసిన కేసులో 1996లో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. రాజీవ్ గాంధీ హత్యోదంతంలో ఆయన పాత్ర ఉందనే ఆరోపణలపై విచారణను ఎదుర్కొన్నారు. బ్రూనై, బహ్రెయిన్ సుల్తాన్లు, ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగ్గి, ప్రముఖ నటి ఎలిజిబెత్ టేలర్... తదితర ప్రముఖులతో ఆయనకు సంబంధాలు ఉండటం వివాదాస్పదమైంది.

స్వామి ప్రేమానంద కూడా మహిళ ఆరోపణలు ఇలా
కేరళలోని శివ శ్రీంగమ్ ఆశ్రమం వ్యవస్థాపకుడైన స్వామి జ్ఞానచైతన్య లైంగిక వేధింపులు, హింసకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. బ్రిటీష్ దేశీయురాలైన ఆయన భార్య ఆమండా విలియమ్స్ స్వామి అకృత్యాలను వెలుగులోకి తెచ్చారు. వ్యాపారంలో కష్టనష్టాల పాలైన ఆమందా విలియమ్స్ కుటుంబానికి ఎవరో ఇచ్చిన సలహా మేరకు భారతదేశానికి వచ్చి స్వామిజీని ఆశ్రయించారు. ఆందాను చూసిన వెంటనే తనను పెళ్లి చేసుకోవాలని లేనిపక్షంలో భగవంతుని ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని ఆజ్ఞాపించారు. అలా ఆమెను పెళ్లి చేసుకుంది గాక హింసకు గురిచేయటంతో ఎలాగో తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. ఇదేగాక మూడు హత్యకేసుల్లో ఆయన నిందితుడు. ఈ కేసుల్లో ఆయన జైలు పాలయ్యారు. తన అశ్రమంలోని శిష్యులపై అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై స్వామి ప్రేమానంద జైలు పాలయ్యారు. ఆయన శ్రీలంక వాస్తవ్యుడు. 1984లో భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. తిరుచురాపల్లి సమీపంలో ఆశ్రమాన్ని నెలకొల్పారు. 1994లో ఒక మహిళ ఆశ్రమం నుంచి తప్పించుకొని బయటకు వచ్చి తనపై స్వామి అత్యాచారం చేసినట్లు తత్ఫలితంగా తాను గర్భవతిని అయ్యానని ఆరోపించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా రవి అనే మరొక ఆశ్రమ వాసి హత్యకు గురైన ఉదంతం వెలుగుచూసింది. చివరికి హత్య, అత్యాచారం, లైంగిక వేధింపులు కేసుల్లో స్వామి ప్రేమానంద జైలు పాలయ్యారు.