హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిద్రపోనివ్వని కేటీఆర్, వరద నీటిలో నడక, ఆగ్రహం (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదుకు ఏ కష్టమొచ్చినా తాను ఉన్నానని జీహేచఎంసీ ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆ మాటను ఆయన నిలబెట్టుకుంటున్నారు. వర్షాల కారణంగా హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. దీంతో ఆయన నిత్యం సమీక్షలు, సూచనలు, పర్యటనలతో గడుపుతున్నారు.

పగలూ రాత్రి అన్న తేడా లేకుండా కేటీఆర్ పలు ప్రాంతాలను చుట్టేస్తున్నారు. జిహెచ్ఎంసి అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధుల పాత్ర ఉండేలా చూసుకుంటున్నారు. ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ ప్రజలను అప్రమత్తం చేసేలా చేస్తున్నారు.

గురువారం రోజంతా వివిధ ప్రాంతాలను చుట్టేసిన కేటీఆర్ గత అర్ధరాత్రి నిద్రపోలేదు. కేటీఆర్ పర్యటన సందర్భంగా జిహెచ్ఎంసి ఉద్యోగులు ఉరుకులు పరుగులు పెట్టారు. అర్ధరాత్రి అధికారులను వెంటబెట్టుకుని కేటీఆర్ ఖైరతాబాద్, సోమాజిగూడ, బంజారాహిల్స్ రోడ్ నెం.12 ప్రాంతాల్లోని బల్కాపూర్ నాలాను పరిశీలించారు.

 ఆర్మీని రంగంలోకి దింపుతామన్న కేటీఆర్

ఆర్మీని రంగంలోకి దింపుతామన్న కేటీఆర్

ప్రస్తుత వర్షాల వల్ల ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు జీహెచ్ఎంసీ, పోలీసు, ఇతర ప్రభుత్వ విభాగాలతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దించామని, వివిధ ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టామని, లోతట్టు ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రచారమయ్యే పుకార్లను నమ్మవద్దని సూచించారు.

వణికిస్తున్న వర్షం

వణికిస్తున్న వర్షం

భారీ వర్షాలు తెలంగాణను వణికిస్తూనే ఉన్నాయి. మంగళ, బుధవారాల మాదిరిగానే గురువారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. హైదరాబాద్, వరంగల్‌, నిజామాబాద్‌ తదితర జిల్లాల్లోనూ విస్తారంగా వానలు పడ్డాయి. గురువారం మధ్యాహ్నం వరకు వాన లేకపోవడంతో హైదరాబాద్‌ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

జలమయం

జలమయం

ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో జోరు వాన కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొద్ది సమయంలోనే దాదాపు మూడు సెంటీ మీటర్ల పైనే వర్షం పడింది. సాయంత్రం నాలుగు గంటల వరకు వెస్ట్‌మారేడుపల్లిలో 3.1 సెంమీ, చిలకలగూడలో 3 సెంమీ, మోండా మార్కెట్‌లో 2.9, నారాయణగూడలో 2.6, ఫీవర్‌ ఆసుపత్రి వద్ద 2.4, బాలానగర్‌లో 2.2 సెంమీ వర్షపాతం నమోదయింది.

ప్రయాణం నరకం

ప్రయాణం నరకం

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ నుంచి వరద దిగువకు చేరి పంజాగుట్ట మోడల్ హౌస్‌ వద్ద ముంబై జాతీయ రహదారిని ముంచెత్తింది. ఖైరతాబాద్‌ రైల్వే గేటు సమీపంలో కూడా వరద నీరు పోటెత్తడంతో వాహనచోదకులు తీవ్ర అగచాట్లు పడ్డారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో వరద నీటితో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ట్రాఫిక్‌ పోలీసులు మ్యాన్‌హోళ్లు తెరిచి నీటిని బయటకు విడిచిపెట్టారు.

మోటార్లు పెట్టి నీరు తోడుతున్నారు

మోటార్లు పెట్టి నీరు తోడుతున్నారు

కుత్బుల్లాపూర్‌, నిజాంపేట, మూసాపేట, కూకట్‌పల్లి, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లో కాలనీలు, అపార్ట్‌మెంట్లలో చేరిన వరద రెండు రోజులు గడిచినా తగ్గలేదు. స్థానికులు మోటార్లు పెట్టి నీరు బయటకు తోడించారు. అయితే గురువారం కురిసిన వానతో మళ్లీ నీళ్లు చేరాయి.

బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు

బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు

నిజాంపేటలోని బండారి లేఅవుట్‌లో కొందరు ఇళ్లకు తాళాలు వేసి బంధువులు, స్నేహితుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. అపార్ట్‌మెంట్లలో భారీగా చేరిన నీటిని బయటకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు కూడా చేయలేదని స్థానికులు వాపోయారు.

భారీ వర్షం

భారీ వర్షం

మహబూబ్‌నగర్‌ జిల్లాలో తాడూరు మండలంలో 18 సెం.మీల వర్షం కురిసింది. నల్గొండ జిల్లాలో పలు మండలాల్లో భారీ వర్షం పడింది. దామరచర్ల మండలంలో గురువారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మిర్యాలగూడలో 12 సెంమీ వర్షం పడింది. నిజామాబాద్‌ జిల్లా నవీపేటలో 7.2 సెం.మీ. వరంగల్‌ జిల్లావ్యాప్తంగా 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నల్లబెల్లి మండలంలో 8 సెంమీ వర్షం పడింది.

రైలు పట్టాలు కుంగాయి

రైలు పట్టాలు కుంగాయి

రంగారెడ్డి జిల్లాలోని తాండూరులో మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి సిమెంట్‌ కర్మాగారాల నుంచి సిమెంట్‌ను తరలించేందుకు ఏర్పాటు చేసిన రైల్వే లైను దెబ్బతింది. వరద ఉద్ధృతితో చంద్రవంచ గేటు సమీపంలో రైలు పట్టాల కింద ఉన్న కంకర కొట్టుకుపోయింది. బుధవారం తెల్లవారుజామున కలుబుర్గి సిమెంటు కర్మాగారం నుంచి సిమెంటు బస్తాలతో వచ్చిన గూడ్సు రైలును పట్టాలు కుంగినట్లు గుర్తించి ఆపేశారు. అనంతరం మరమ్మత్తులు చేశారు.

సమయం పడుతుంది

సమయం పడుతుంది

ప్రకృతి విపత్తుతో వచ్చిన సమస్యను పరిష్కరించడానికి 72 గంటల సమయం పడుతుందని, ప్రజలు సహకరించి అపార్టుమెంటుల నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లాలని మంత్రి కేటీఆర్ గురువారం విజ్ఞప్తి చేశారు. జలమయమైన నిజాంపేట్ గ్రామం బండారి లేఅవుట్ కాలనీలో గురువారం మంత్రి గంటన్నర సేపునకు పైగా పర్యటించారు.

కెటిఆర్ పర్యటన

కెటిఆర్ పర్యటన

కేటీఆర్ వెంట జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్ రావు, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, జలమండలి ఎండి దానకిషోర్, ఇరిగేషన్ ఎస్‌సి రాజశేఖర్‌లతో పాటు మేయర్ బొంతు రాంమోహన్, స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు కృష్ణారావు, అరికెపూడి గాంధీలు, ఇరిగేషన్, హెచ్‌ఎండబ్ల్యుఎస్, రెవెన్యూ, పోలీస్, ఫైర్, పంచాయతీ అధికారులు ఉన్నారు.

సమస్యలు అడిగి తెలుసుకున్న కేటీఆర్

సమస్యలు అడిగి తెలుసుకున్న కేటీఆర్

వరద నీటిలోనే పాదయాత్రగా సాగిన కేటీఆర్ అపార్ట్‌మెంట్‌లలోని ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అపార్ట్‌మెంట్‌లలోకి నీరు రావడంతో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు పడుతున్న ఇబ్బందులను అడిగారు. రెండు రోజులుగా విద్యుత్, తాగునీరు లేకపోవడంతో పడుతున్న ఇబ్బందిని కాలనీ మహిళలు మంత్రికి విన్నవించారు.

తవ్విస్తున్నామని కేటీఆర్

తవ్విస్తున్నామని కేటీఆర్

అధికారులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని ప్రజలు వివరించారు. దీనిపై స్పందించిన కేటీఆర్ చెరువు నుండి వస్తున్న నీటిని మూడు అడుగుల లోతు తవ్వి తరలిస్తున్నారని, అవసరమైతే పది అడుగుల లోతు వరకు తవ్వి రోడ్డును పగులగొట్టి నీటిని సాధ్యమైనంత త్వరలో తరలించేందుకు అధికార యంత్రాంగం పనిచేస్తున్నదని తెలిపారు.

పాలు, బ్రెడ్, చాయ్ బిస్కట్లు

పాలు, బ్రెడ్, చాయ్ బిస్కట్లు

కాలనీ వాసులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని, అధికారుల ద్వారా తాగునీరు, పాలు, బ్రెడ్, పిల్లలకు బిస్కెట్‌లను పంపిణీ చేయిస్తామని కేటీఆర్ చెప్పారు. అనంతరం తుర్క చెరువు తూమును, చెరువు కట్టను, అలుగును మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. చెరువు మ్యాప్‌ను పరిశీలించారు.

చరిత్రలో లేని వర్షాలు

చరిత్రలో లేని వర్షాలు

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ రాని విధంగా 23 సె.మీ. వర్షపాతం ఇక్కడ పడిందన్నారు. సంవత్సరానికి 32 సె.మీ. వర్షపాతం రావాలని, కానీ, ఒకేరోజు 23 సె.మీ. వర్షం కురవడంతో సమస్య ఉత్పన్నమైందని అన్నారు. మళ్లీ వర్ష సూచన ఉందని, కాలనీకి వచ్చే నీటికి అడ్డుకట్ట వేస్తామన్నారు. పెద్దతూము నుండి అవసరమైతే మరింత పెద్దగా తూమును తీసి నీటిని తరలిస్తామన్నారు.

పరిష్కరిస్తాం

పరిష్కరిస్తాం

సమస్యను పరిష్కరించేందుకు 48 గంటల నుంచి 72 గంటల వరకు సమయం పడుతుందని, అప్పటి వరకు కాలనీవాసులు సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని కేటీఆర్ సూచించారు. సెల్లార్‌లలోని నీటిని ఫైరింజన్‌లతో తొలగిస్తున్నామని తెలిపారు. చెరువు నుంచి నీటిని కృత్రిమంగా మూడు ఫీట్ల తూము ద్వారా ప్రగతినగర్ చెరువుకు తరలిస్తున్నామని, అవసరమైతే 10 ఫీట్ల తూమును తీసి త్వరగా నీటిని తరలిస్తామని చెప్పారు.

చెరువు ఆక్రమణపై ఆగ్రహం

చెరువు ఆక్రమణపై ఆగ్రహం

ప్రగతినగర్ చెరువు పూర్తిగా ఆక్రమణలకు గురైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి ఉందని మంత్రి పేర్కొన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని వివరించారు. లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను రెవెన్యూ యంత్రాంగం తరలిస్తున్నట్టు చెప్పారు. ఈ విపత్తును సవాలుగా తీసుకుని నగరంలో సెవరల్ వ్యవస్థను, రోడ్ల వ్యవస్థను, మురుగునీటి కాలువ వ్యవస్థను ఆధునీకరించేందుకు ముందుకు వెళతామన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరాన్ని ఆధునీకరిస్తామన్నారు. సమస్యలను పూర్తిగా తలెత్తకుండా చేస్తానని చెప్పడం అతిశయోక్తి అవుతుందన్నారు. ఆధునీకరించేందుకు సుమారుగా రూ.20 వేల కోట్లు కావాలని, సంవత్సర కాలంలో అన్ని పనులు కాలేవని, అవస్థను, సమస్యను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు.

English summary
Heavy rains in Hyderabad trigger flood like situation, no relief likely.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X