వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసుర సంధ్యలో ఐటీ పరిశ్రమ: అనిశ్చితిలో ఉద్యోగ భద్రత

ఐటీలో ఉద్యోగం అంటే అందరికీ కన్నుల పండువ. ఏటా సుమారు రూ.15 లక్షల వేతనం పొందుతున్న సీనియర్ ఉద్యోగులను సంస్థ తొలగించేస్తే.. అపార అనుభవం ఉన్నా..

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఐటీలో ఉద్యోగం అంటే అందరికీ కన్నుల పండువ. ఏటా సుమారు రూ.15 లక్షల వేతనం పొందుతున్న సీనియర్ ఉద్యోగులను సంస్థ తొలగించేస్తే.. అపార అనుభవం ఉన్నా.. తక్కువ వేతనంతో పనిచేసేందుకు సిద్ధ పడినా ఐటీ రంగంలో ఉద్యోగాలు లభించడం లేదు. సత్యప్రకాశ్ ఒక సాఫ్ట్‌వేర్‌ (ఐటీ) దిగ్గజ కంపెనీలో పదేళ్లుగా పని చేస్తున్నాడు. ఏడాదికి భారీగానే వేతనం వస్తోంది. అకస్మాత్తుగా తొలగించడంతో ఉద్యోగ వేటలో పడ్డా అనుభవం, పనితీరు అంతా బాగానే ఉంది. అతని వల్ల కంపెనీకొచ్చే ఆదాయం కంటే.. చెల్లించాల్సిన వేతనమే ఎక్కువగా ఉంది. ఫలితంగా ఉద్యోగం దొరకలేదు.

రెండు, మూడు కంపెనీలు తిరిగిన సత్య ప్రకాశ్.. చివరకు సగం వేతనానికి పని చేయడానికి సిద్ధపడినా.. ఉద్యోగం దొరకట్లేదు. జాబులు పోగొట్టుకున్న చాలామంది ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఇలాగే ఉన్నది. అమెరికాలో శాశ్వత ఉద్యోగుల కంటే కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాజెక్టు అయిపోగానే వారిని పంపేయవచ్చు. ఉద్యోగులను తొలగించారన్న అపవాదు ఉండదు. ఇప్పుడు అటువంటి విధానాన్ని భారత ఐటీ కంపెనీలు కూడా అవలంబించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఈఎంఐల చెల్లింపులపై ఐటీ ఉద్యోగుల్లో భయం

ఈఎంఐల చెల్లింపులపై ఐటీ ఉద్యోగుల్లో భయం

పలు కంపెనీలు బయటకు 1500 మందిని మాత్రమే తొలగిస్తున్నామని చెప్తున్నా.. ఆచరణలో ఐదారువేల మందికి ఉద్వాసన పలికేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. దాదాపు అన్ని కంపెనీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు నిర్ధాక్షిణ్యంగా వేలమంది ఉద్యోగులను తొలగిస్తుండడంతో ఆయా కంపెనీల్లోని ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. గృహ రుణాలు, ఇతర రుణాలు తీసుకుని భారీగా నెలవారీ వాయిదాలు చెల్లిస్తున్న ఉద్యోగులు ఏ క్షణంలో ఉద్యోగం ఊడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. నెల వారీ వాయిదా చెల్లింపులు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లిస్తున్న ఐటీ ఉద్యోగులు చాలామందే ఉన్నారు. ఈఎంఐలు కాక నెలవారీ ఖర్చు, దీర్ఘకాలానికి ఇతర తప్పనిసరి చెల్లింపులు (కమిట్‌మెంట్స్‌) పెట్టుకున్న వారు చాలా భయాందోళనలకు గురవుతున్నారని, ఉద్యోగం పోతే ఏంచేయాలోనని బిక్కుబిక్కుమంటున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తక్కువ వేతనాలకు పని చేయడానికి కూడా సిద్ధమవుతున్నారని చెబుతున్నారు..

ఉద్వాసనకు గల అవకాశాలన్నీవినియోగానికి సంస్థలు రెడీ

ఉద్వాసనకు గల అవకాశాలన్నీవినియోగానికి సంస్థలు రెడీ

40 లక్షల మంది ఉద్యోగులు ఉన్న పరిశ్రమలో పనితీరు బాగాలేని 1-2 శాతం ఉద్యోగులను తొలగించడం సర్వసాధారణమే. ఇది ప్రతి ఏటా జరిగే ప్రక్రియ అని కంపెనీలు చెబుతున్నాయి. ఇది వాస్తవమే కావొచ్చునేమోగానీ ఈసారి కంపెనీల దృక్పథంలో చాలా మార్పు వచ్చింది. గతంలో దేశీయ ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించేందుకు తొందరపడేవి కాదు. బెంచ్‌పైన ఉద్యోగులు ఎక్కువ కాలం ఉన్నా పెద్దగా పట్టించుకునేవి కాదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో, ప్రాజెక్టులు రావడానికి అవకాశం ఉన్న వాటిలో శిక్షణ ఇచ్చి వారిని కొనసాగించడానికి ప్రయత్నించేవి. చివరి ఐచ్ఛికంగా మాత్రమే ఉద్యోగిని తొలగించేవి. ఇప్పుడు పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఉద్యోగులను బయటకు పంపడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నింటిని వినియోగించుకోవడానికి కంపెనీలు సిద్ధం అవుతున్నాయి.

తక్కువ గ్రేడింగ్ ఉన్న వారి ఉద్వాసన ఇలా

తక్కువ గ్రేడింగ్ ఉన్న వారి ఉద్వాసన ఇలా

ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల పనితీరును అంచనా వేసి గ్రేడింగ్‌లు ఇస్తారు. పనితీరు బాగాలేని వారిని ‘స్వచ్ఛందం'గా పంపుతారు. ఐటీ రంగానికి ప్రస్తుతం ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల్లో టీమ్‌లో కనీసం 5-10 శాతం మందికి అతి తక్కువ గ్రేడింగ్‌ ఇవ్వాలని.. అత్యధిక గ్రేడింగ్‌ 10-15 శాతానికి మించి ఇవ్వొద్దని కంపెనీల యాజమాన్యాలు ప్రాజెక్టు, ప్రోగ్రామ్‌ మేనేజర్లకు ‘మార్గదర్శకాలు' ఇస్తున్నాయి. తక్కువ గ్రేడింగ్‌ ఉన్నవారిని బయటకు పంపుతున్నాయి. గ్రేడింగ్‌ను బట్టి విభిన్న వేతనం ఉంటుంది. వేతన భారాన్ని తగ్గించుకోవడానికి కూడా కొన్ని కంపెనీలు గ్రేడింగ్‌లు తగ్గిస్తున్నాయి. ఒక ప్రాజెక్టు పూర్తయితే.. మరో ప్రాజెక్టులో పని లభించేవరకూ కొంతకాలం ఉద్యోగులను ఖాళీగానే ఉంచుతాయి కంపెనీలు. ఇటువంటి వారిని బెంచ్‌పైన ఉన్నారంటారు. కొన్నేళ్ల వరకూ ఐటీ కంపెనీల్లో ఆరేడు నెలల పాటు బెంచ్‌ ఉద్యోగులు ఉండేవారు. ఈ కాల పరిమితిని కంపెనీలు క్రమంగా రెండు నెలలకు తగ్గించాయి.

ఆ తర్వాత వెళ్లనంటే పరిస్థితులు విషమం

ఆ తర్వాత వెళ్లనంటే పరిస్థితులు విషమం

ప్రస్తుతం మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం నెల రోజులు కూడా కొనసాగించడానికి కంపెనీలు ఇష్టపడడం లేదు. నెల రోజులు పూర్తి కాగానే స్వచ్ఛందంగా వెళ్లిపొమ్మని అనధికారికంగా చెబుతున్నాయి. కాదన్న వారికి ఏదో ఒక లోపం చూపి ‘టెర్మినేషన్‌ లేఖ' ఇస్తామని అంటున్నాయని, దీనివల్ల పని చేసిన అనుభవ ధ్రువీకరణ పత్రం మొదలైనవి ఉద్యోగికి అందవని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. శాశ్వత ఉద్యోగులకు బదులు అమెరికా తరహాలో కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తున్నాయి. ‘అమెరికాలో శాశ్వత ఉద్యోగుల కంటే కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాజెక్టు అయిపోగానే వారిని పంపేయవచ్చు. ఉద్యోగులను తొలగించారన్న అపవాదు ఉండదు. ఇప్పుడు అదే విధానాన్ని భారత ఐటీ కంపెనీలూ అవలంబించనున్నాయని' మానవ వనరుల సలహా కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు.

భారత ఐటీ కంపెనీల ఆదాయంలో ఇప్పటికీ 80-85 శాతం అమెరికా నుంచే లభిస్తోంది.

భారత ఐటీ కంపెనీల ఆదాయంలో ఇప్పటికీ 80-85 శాతం అమెరికా నుంచే లభిస్తోంది.

అమెరికాలో ట్రంప్‌ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందోనన్న భయం అక్కడ కంపెనీలకు ఉంది. దీంతో ఆ కంపెనీలు కొత్త ప్రాజెక్టులను ఇవ్వడం లేదు. ‘ఒక ప్రాజెక్టును ప్రారంభిస్తే.. మూడేళ్లపాటు కొనసాగుతుంది. మధ్యలో ఎటువంటి ప్రతికూల నిర్ణయాలు వచ్చినా అప్పటివరకూ పెట్టిన పెట్టుబడులు వృథా అవుతాయి. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో తెలియడం లేదు. అందుకే కంపెనీలు కొత్త ప్రాజెక్టులు ఇవ్వడం లేదు. ప్రభుత్వ విధానంపై స్పష్టత కోసం ఒక ఏడాది పాటు వేచి చూసే ధోరణిని అవలంబించాలని ఖాతాదారులు భావిస్తున్నారని' హైదరాబాద్‌కు చెందిన ఐటీ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పోటీ నేపథ్యంలో ఉన్న ప్రాజెక్టుల బిల్లింగును తగ్గించుకోవడానికి ఖాతాదారు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. గతంలో ప్రాజెక్టు, సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి ఖాతాదారుల నుంచి గంటకు 40 డాలర్ల వరకూ ఐటీ కంపెనీలు వసూలు చేసేవి. ఇప్పుడు 10 డాలర్లకు కూడా పని చేయడానికి సిద్ధమవుతున్నాయి. దీంతో లాభాలు, ఉనికిని కాపాడుకోవడానికి కంపెనీలకు కనిపిస్తున్న ఏకైక మార్గం ఉద్యోగుల తొలగింపు అని నిపుణులు చెబుతున్నారు. ఆదాయం రాని ఉద్యోగులను కంపెనీలు ఆలోచించకుండా తొలగిస్తున్నాయి.

సిబ్బంది స్వయంకృతం కారణమేనా?

సిబ్బంది స్వయంకృతం కారణమేనా?

పని చేయకుండా బెంచ్‌పై ఉండి పైరవీలు సాగిస్తూ నెలల తరబడి కొనసాగుతూ చాలామంది ఉద్యోగులు కంపెనీలకు భారం అవుతున్నారు. సాధారణంగా రెండు నెల పాటు బెంచ్‌పై ఉంటే ఆ తర్వాత బయటకు పోవాల్సి వస్తున్నది. ఈ పరిస్థితుల్లో బెంచ్‌పైన ఉన్న కొంతమంది ఉద్యోగులు గడువు రావడానికి ముందు పై స్థాయిలో తనకు తెలిసిన వారి (ప్రోగ్రామ్‌ మేనేజర్‌ తదితరులు) వద్దకు వెళుతున్నారు. రానున్న కొత్త ప్రాజెక్టులో తమ అవసరం ఉన్నదని, తమ ద్వారా బిల్లింగ్‌ రాగలదని చెప్పి అక్కడకు వెళుతున్నారు. ప్రాజెక్టు రాలేదని మళ్లీ బెంచ్‌పైకి వచ్చి మరో రెండు నెలలు ఉంటున్నారు. ఇలా కొనసాగుతూ.. కంపెనీ నుంచి భారీగా వేతనం తీసుకుంటూ.. బయట స్థిరాస్తి వంటి వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొత్త నైపుణ్యాలు పెంచుకోవడానికి ఇటువంటి వారు ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు. కంపెనీకి భారంగా తయారవుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీలో ఇటువంటి వారు 500 మంది వరకూ ఉన్నారని ప్రాజెక్టు మేనేజర్ ఒకరు తెలిపారు.

శిక్షణ పొందేందుకు సిబ్బంది రెడీ

శిక్షణ పొందేందుకు సిబ్బంది రెడీ

సరిగ్గా పని చేయకుండా, పైరవీలతో కాలం గడుపుతూ వేతనాలు పొందుతుంటే వారిని ఇప్పుడు కంపెనీలు వెంటనే తొలగిస్తున్నాయన్నారు. బెంచ్‌పైన ఉన్న కింది స్థాయి ఉద్యోగులను తీసుకోవాలంటే, ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను పై స్థాయి వారికి పంపి అనుమతి తీసుకోవాలని కంపెనీలు ఆదేశించాయన్నారు. కంపెనీకి వచ్చామా, వెళ్లామా అన్న ధోరణిలో ఇప్పటివరకూ చాలామంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రతి ఏడాది ప్రతి ఉద్యోగి కొత్త సాంకేతిక పరిజ్ఞానాల్లో కనీసం 40 గంటలు శిక్షణ తీసుకోవాలి. తమ కింద వారికి శిక్షణ ఇవ్వాలి. గతంలో ఇటువంటి వాటిపై ఉద్యోగులు శ్రద్ధ చూపే వారు కాదు. ఇప్పుడు అటువంటి ఉద్యోగులు భయపడుతున్నారు. శిక్షణలకు హాజరవుతున్నారు. ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి కంపెనీకి, ఖాతాదారు కంపెనీకి ప్రత్యేకంగా అదనపు విలువను చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నారు.

 పెద్ద కంపెనీలకే ఇబ్బందులు

పెద్ద కంపెనీలకే ఇబ్బందులు

ఐటీ పరిశ్రమ చాలా వేగంగా మారిపోతున్నది. ఖాతదారు సంస్థలు వ్యయాలు తగ్గించమని ఐటీ కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నాయి. గతంలో టెక్నాలజీ నైపుణ్యం లేని వారిని కూడా నియమించుకున్న ఐటీ కంపెనీలు.. పలు పనుల్లో ఆటోమేషన్‌, కృత్రిమ మేధను వినియోగించడం వల్ల వారిని తొలగిస్తున్నాయి. పెద్ద కంపెనీల్లో ఉద్యోగుల వలసలు 20 శాతం వరకూ ఉన్నాయి. గతంలో పరిశ్రమ వృద్ధిరేటు 200-300 శాతం ఉండేది. ప్రస్తుతం 8-9 శాతానికి పరిమితమైంది. ఆటోమేషన్‌తో ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధిరేటు స్థాయిలో పరిశ్రమలో భవిష్యత్‌లో ఉద్యోగావకాశాలు పెంచడానికి అవకాశాలు ఉండవు. పలు అంశాలు ప్రస్తుతం దేశీయ ఐటీ పరిశ్రమపై ప్రభావం చూపుతున్నాయి. రెండు మూడేళ్లపాటు ఐటీ పరిశ్రమ పరిస్థితి ఇలానే ఉంటుంది. ఒకటి, రెండు లక్షల మంది ఉద్యోగులు పనిచేసే కంపెనీల్లో నియామకాలపై పలు అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఐటీ కంపెనీలు ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నాయి. చిన్న కంపెనీలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, నైపుణ్యాలు ఉన్న వారినే ఈ కంపెనీలు ఎంచుకుంటున్నాయి. ఉద్యోగుల నిర్వహణ దశల్లో పారదర్శకత మొదలైనవి ఇందుకు దోహదం చేస్తున్నాయని పలు సంస్థల సాంకేతిక అధికారులు చెప్తున్నారు.

English summary
Indian IT Industry has in crisis. IT industries are ready to follow american companies policies in dismissal of their employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X