వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఐటీ’పై ‘యాంత్రీకరణ’ కత్తి: నైపుణ్యలేమి పేరిట ఉద్వాసన..

హైదరాబాద్ పరిధిలోని ఐటీ నిపుణులపై యాంత్రీకరణ ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఏళ్ల అనుభవాన్ని తోసిరాజని యాజమాన్యాలు నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగులను తొలగించడంతో వారు రోడ్డున పడుతున్నారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వెంకట్రావు ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి.. ఆయనకు ఐటీ రంగంలో 12 ఏళ్ల అనుభవం ఉంది. ఇంజినీరింగ్‌ పూర్తి చేశాక రెండేళ్లపాటు బ్యాంకింగ్‌ రంగంలో పనిచేసి, తర్వాత సాఫ్ట్‌వేర్‌పై మోజుతో ఈ రంగంలోకి వచ్చారు. నెలకు రూ.80 వేల వేతనం అందుకుంటారు.

కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఆటోమేషన్‌ దెబ్బతో ఆయనతో కంపెనీ యాజమాన్యం నాలుగు నెలల క్రితం ప్రతిభ పేరిట బలవంత రాజీనామా చేయించింది. అప్పుడు వచ్చిన నగదు నెల రోజులకే ఖర్చయిపోయింది. మూడు నెలలుగా ఉద్యోగం దొరకక, బ్యాంకులకు వాయిదాలు చెల్లించలేక ఆందోళన చెందుతున్నాడు.

మరో కంపెనీలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి యాజమాన్యం పింక్‌ స్లిప్‌ ఇచ్చింది. తెలంగాణలోని మారుమూల ప్రాంతానికి చెందిన అతను మూడు నెలలుగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా ఫలించడంలేదు. రుణ వాయిదాలు, తల్లిదండ్రుల వైద్యానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో మానసికంగా కుంగిపోయారు. అప్పులు పెరిగిపోయాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదని స్నేహితుల దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నారు.

 అదే ఉద్యోగం పోతే అగమ్య గోచరమే

అదే ఉద్యోగం పోతే అగమ్య గోచరమే

ఒకటో తేదీన రావాల్సిన వేతనం రెండు రోజులు ఆలస్యమైతేనే ఆందోళన ఉంటుంది. అలాంటి హఠాత్‌గా ఉద్యోగం ఊడిపోతే? ఇంటి అద్దె, పాఠశాల ఫీజులు, సామగ్రి, రుణాల నెలవారీ వాయిదాల గడువు సమీపిస్తుంటే? గుండె దడ పెరిగిపోతుంది. ఏం చేయాలో తోచక మానసికంగా కుంగిపోతుంటారు. ఐటీ రంగంలో పనితీరు, ప్రతిభ, యాంత్రీకరణ పేరిట ఉద్యోగాలు కోల్పోతున్నవారి పరిస్థితి అలాగే ఉంది. ఇల్లు, కారు వాయిదాలు, ఫీజులు, ఖర్చుల భారం గుదిబండల్లా మారుతున్నాయి. కుటుంబ భారాన్ని మోసేందుకు తక్కువ వేతనం వచ్చే ఉద్యోగాలకూ సిద్ధమవుతున్నారు.

దేశవ్యాప్తంగా ఐటీ సంస్థల్లో తొలగింపులు పెరుగుతున్నాయి. గత ఏడాది వరకు ఐదు నుంచి ఏడు శాతం వరకు ఉన్న తొలగింపుల సంఖ్య ఈ ఏడాదికి 10 శాతాన్ని మించనున్నదని గణాంకాలు చెబుతున్నాయి. అంటే ప్రతి పదిమందిలోనూ ఒకరికి కొలువు పోయే ముప్పు ఉందన్నమాట. పనితీరు, ప్రతిభ, నూతన సాంకేతిక పరిజ్ఞానం పేరిట ఇటీవల తొలగింపులు ఎక్కువయ్యాయి.

 ఉద్యోగం పోయిన వారి పరిస్థితి తలకిందులు

ఉద్యోగం పోయిన వారి పరిస్థితి తలకిందులు

అధిక వేతనాలు పొందుతున్నవారు, సీనియర్లు ఎక్కువగా ఉద్వాసనకు గురవుతున్నారు. హైదరాబాద్‌లో దాదాపు 1500కి పైగా ఏర్పాటైన ఐటీ సంస్థల్లో 4.3 లక్షల మంది ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు. ఇక్కడా తొలగింపులు ఎక్కువయ్యాయి. యాజమాన్యాలు నెలకు రూ.లక్షకు పైగా వేతనం పొందుతున్న ఉద్యోగుల పనితీరు బాగాలేదని తాఖీదులిచ్చి బయటకు పంపిస్తున్నాయి. ఈ చర్యలు ఐటీ పరిశ్రమను నమ్ముకుని భవిష్యత్‌కు పునాది వేసుకుంటున్న వారిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత ఆరు నెలల్లో ఉద్యోగాలు కోల్పోయిన నిపుణుల ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. నూతన కోర్సులు నేర్చుకున్నా తక్కువ వేతనాలకు కొత్తవారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడంతో కొలువు దక్కడం గగనమవుతోంది. ఏదైనా ఉద్యోగం చూసి గండం గట్టెక్కించాలని సహోద్యోగులను వేడుకుంటున్నారు. ఎంత ప్రయత్నించినా కొలువు దొరక్క తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొందరికి మానసిక ప్రవర్తనలో కూడా తేడాలు వస్తున్నాయి.

 బేసిక్ వేతనంపై పరిహారం చెల్లింపులు

బేసిక్ వేతనంపై పరిహారం చెల్లింపులు

కార్మిక చట్టాల ప్రకారం ఉద్యోగిని తొలగించాలంటే ముందుగా నోటీసు ఇచ్చి ఉద్యోగి అభిప్రాయం తీసుకోవాలి. తొలగింపు అనివార్యమైతే కారణాలు తెలుపుతూ పరిహారం చెల్లించాలి. ఐటీ ఉద్యోగాల్లో ఈ నిబంధనలు అమలు కావడం లేదు. ఎప్పుడు ఏ పిడుగు పడుతుందోనన్న ఆందోళన అధికమవుతోంది. ఉద్యోగికి ఇచ్చే వేతనం వేలల్లో ఉన్నా, మూల వేతనం తక్కువగా, ఇతర అలవెన్సులు ఎక్కువ. నెలకు రూ.60 వేలకు పైగా వేతనం పొందుతున్న ఉద్యోగికి మూలవేతనం రూ.12 నుంచి 14 వేలే ఉంటోంది.

ఈపీఎఫ్‌కు యాజమాన్యం చెల్లించాల్సిన వాటాను కూడా ఉద్యోగి నుంచే వసూలు చేస్తున్నారు. ఉద్యోగం నుంచి తొలగించినపుడు మూడు నెలల వేతనాన్ని ప్యాకేజీ అంటున్న కంపెనీలు మూలవేతనం మాత్రమే ఇస్తుండడంతో చేతికొచ్చే మొత్తం రూ.50 వేలు దాటడం లేదు. ‘పరిహారం కింద మూలవేతనం మాత్రమే ఇస్తూ కంపెనీలు సాయం చేసినట్లు చెప్పుకుంటున్నాయని, ఇది నెల కూడా సరిపోవడం లేదని ఒక ఐటీ ఉద్యోగి చెప్పారు. కార్మిక చట్టాలను అమలు చేయాలని ఉద్యోగులు ఇచ్చిన పిటిషన్లు కార్మిక శాఖలో మూలుగుతున్నాయి. అక్కడి అధికారులు న్యాయస్థానాలకు వెళ్లాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

స్కూళ్లలోనూ సెమిస్టర్ తరహా ఫీజులిలా

స్కూళ్లలోనూ సెమిస్టర్ తరహా ఫీజులిలా

ఐటీ రంగంలో పని చేస్తున్న నిపుణులంతా తమ పిల్లలకు నాణ్యమైన విద్య కోసమని ఎక్కువ ఫీజులు కట్టి పెద్ద పాఠశాలల్లో చేర్పించారు. ఏడాది ఫీజు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటోంది. పాఠ్యపుస్తకాలు, ప్రాజెక్టు వర్కుల ఖర్చు అదనం. ‘మా పిల్లలు ఒకరు ఏడో తరగతి, మరొకరు ఐదో తరగతి చదువుతున్నారు. తొలి రెండు సెమిస్టర్‌లకు కలిపి రూ.లక్ష ఫీజు కట్టాను. మూడు నెలలుగా ఉద్యోగం లేదు. బ్యాంకుల రుణ వాయిదాలు చెల్లించడానికి కష్టమవుతోంది. త్వరలోనే మూడో సెమిస్టర్‌ ఫీజు కట్టకపోతే పిల్లల చదువులకు ఇబ్బందులు వస్తాయి. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఏడాది తక్కువ ఫీజులు ఉండే పాఠశాలల్లో చేర్పించాల్సిందే' అని ఇటీవల ఉద్యోగం కోల్పోయిన ఓ నిపుణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ‘తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత నాదే. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. ఎకరం పొలం కూడా లేదు. సొంతంగా ఆదుకునేవారెవరూ లేరు. అకస్మాత్‌గా ఉద్యోగం నుంచి తొలగించడంతో ఏం చేయాలో తోచడం లేదు' అని మరో ఉద్యోగి వేదనకు గురవుతున్నాడు.

ఉద్యోగం లేదంటే రుణం కుదరదని స్పష్టీకరణ

ఉద్యోగం లేదంటే రుణం కుదరదని స్పష్టీకరణ

ఉద్యోగంలో ఉన్నపుడు అప్పులిచ్చేందుకు ముందుకొచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇప్పుడు వారివైపు చూడటం మానేశాయి. ‘ఎనిమిదేళ్లుగా పొదుపు - వేతన ఖాతా ఉన్న బ్యాంకులు అడిగినప్పుడు వెంటనే రుణాలు ఇచ్చాయి. ఏ రోజూ డీఫాల్ట్‌ కాకుండా చెల్లించాను. సిబిల్‌ స్కోరు చక్కగా ఉంది. నెల రోజుల క్రితం పరిస్థితి వివరించి రుణం కావాలని కోరా. కనీసం ట్రాక్‌ రికార్డు పరిశీలించాలని అడిగా. ఉద్యోగం లేకుండా రుణం ఇవ్వలేమని ఆ బ్యాంకు సిబ్బంది తెలిపారు' అని ఐటీ ఉద్యోగి తెలిపారు. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులకు వైద్యం చేయించడానికి చేతిలో నగదు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క ఆరోగ్య బీమా గడువు ముగుస్తోంది. దీంతో కుటుంబసభ్యులకు ఏమైనా అనారోగ్యం తలెత్తితే ప్రైవేటు వ్యక్తుల దగ్గర తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నారు.

ఐటీ ఉద్యోగులకు భరోసా కల్పించాలి

ఐటీ ఉద్యోగులకు భరోసా కల్పించాలి

ఐటీ ఉద్యోగులు తమ హక్కుల గురించి పోరాడటానికి సంఘాలుగా ఏర్పాటవుతున్నారు. ఈ సంఘాలు ఐటీ ఉద్యోగుల తరపున మాట్లాడం, కార్మికశాఖ వద్ద పిటిషన్లు దాఖలు చేయడం చేస్తున్నాయి. నిపుణులకు కొన్ని రోజుల వరకు భరోసా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. విదేశాల్లో మాదిరిగా ఇక్కడ కూడా కార్మిక చట్టాలను కఠినంగా అమలు చేయాలని, ఉద్యోగికి నైపుణ్యం తక్కువగా ఉందని భావిస్తే తొలగించకుండా శిక్షణ ఇప్పించాలని సూచిస్తున్నాయి. చట్టాలకు ఐటీ సంస్థలు లోబడి నోటీసిచ్చి, వివరణ తీసుకోవాలి. రాజీనామా చేయాలంటూ బెదిరించకూడదని చెబుతున్నాయి. మూడు నెలలు, ఆరు నెలల ప్యాకేజీ అన్నప్పుడు మూలవేతనం కాక భత్యాలను కూడా లెక్కించి ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. నైపుణ్యం ఉన్నప్పటికీ అధిక వేతనాల పేరిట తొలగించిన ఉద్యోగులను సంఘటితపరిచి ప్రభుత్వమే స్టార్టప్‌ల వైపు ప్రోత్సహించాలి.

 కేంద్ర ప్రభుత్వ తీరు శోచనీయంఅనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి

కేంద్ర ప్రభుత్వ తీరు శోచనీయంఅనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి

ఐటీ ఉద్యోగంలో కొత్తగా చేరిన ఉద్యోగికి నెల వేతనం రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వస్తుంది. వేతనం చూసి మురిసిపోకుండా భవిష్యత్‌కు పునాదులు వేసుకోవాలని ఐటీ ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రణాళిక ఉండాలని, పొదుపు చేస్తూ అవసరమైన మేరకే ఖర్చు చేయాలని సూచిస్తున్నారు. గొప్పలకు పోవద్దని, ఉన్నంతలో సర్దుకోవడం బెటరని ఐటీ ప్రొఫెషనల్స్‌ ఫర్‌ ఐటీ ప్రతినిధి ప్రవీణ్‌, తెలంగాణ ఐటీ అసోసియేషన్‌ ప్రతినిధి సందీప్‌కుమార్‌ అన్నారు.

ఐటీ ఉద్యోగులు అనవసర ఖర్చులు, వృథా షాపింగ్‌లు తగ్గించుకోవడంతోపాటు ఖరీదైన హోటళ్లలో భోజనాలు, జంక్‌ఫుడ్‌ కన్నా ఇంటి ఆహారం ఆరోగ్యానికి, జేబుకు కూడా మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఫ్లాట్‌ కొన్నాక అదనపు హంగుల కోసం అప్పులు చేయొద్దని సూచిస్తున్నారు. భారీ నగదుతో కొనాలనుకున్నప్పుడు వ్యక్తిగత గృహాలు కొని, ఒక పోర్షన్‌ అద్దె వచ్చినా ఖర్చులకు పనికొస్తుందని చెప్తున్నారు. ఎక్కువ శాతం ప్రభుత్వ రవాణా వ్యవస్థను వినియోగించుకుంటే కొంత సొమ్ము ఆదా అవుతుందని, ఒకవేళ సొంత కారు కొనాలనుకుంటే ముందుగా పాతది తీసుకోవడం ఉత్తమమని అంటున్నారు. నెలకు కొంత నగదును పింఛను పథకాలు, ఇతర పథకాల్లో పొదుపు చేసుకోవాలని, దీనివల్ల అత్యవసరాలకు గానీ, ఏదైనా వ్యాపారానికి పెట్టుబడిగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

English summary
Automation severly effected on IT industry. IT professionals facing uncertainity. America President Donald Trump polices and aumation effects leads to re - think IT industry managements. They dismissed senior level professionals on the basis of merit and performance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X