వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందాల కాశ్మీరంలో కల్లోలం: అనిశ్చితికి తెర పడేదెన్నడు?

అందాల లోగిలి కశ్మీర్.. దాయాది దేశం పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న జమ్ము కశ్మీర్.. ఇప్పుడు అనునిత్యం ఘర్షణలతో అనిశ్చిత పరిస్థితితో సతమతం అవుతున్నది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్/ న్యూఢిల్లీ: అందాల లోగిలి కశ్మీర్.. దాయాది దేశం పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న జమ్ము కశ్మీర్.. ఇప్పుడు అనునిత్యం ఘర్షణలతో అనిశ్చిత పరిస్థితితో సతమతం అవుతున్నది. అల్లకల్లోలమవుతోంది. నిత్యం అల్లర్లు, హింసాత్మక ఘటనలతో రగిలిపోతోంది.

తీవ్రవాదుల హెచ్చరిక వీడియోలు, భద్రతా బలగాల 'మానవ కవచాల' ఉదంతాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అల్లర్లు తగ్గినట్లే తగ్గి మళ్లీ మొదలవుతున్నాయి.ఏడాది పొడవునా జాతీయంగా, అంతర్జాతీయంగా పర్యాటకుల నెలవు.. రాష్ట్ర ప్రగతికి మేలైన మార్గం.. కానీ అనునిత్యం ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు. వారికి దన్నుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత సైన్యంపై పాకిస్థాన్ కాల్పులు జరుపుతూ నిత్యం రావణ కాష్టంగా మారింది.

2014లో కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం కొలువు దీరినప్పటి నుంచి పరిస్థితి మరింత దిగజారింది. జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర చరిత్రలో 2014లో జరిగిన ఎన్నికలకు ప్రత్యేక స్థానం ఉంది. అంతకుముందు పాతికేళ్లలో ఎన్నడూ నమోదు కానంత అధిక ఓటింగ్‌ శాతం 2014 ఎన్నికల్లో నమోదైంది. నాలుగు ప్రధాన పార్టీలు గట్టిగా తలపడిన ఈ ఎన్నికల్లో దాదాపు 65 శాతం ఓటింగ్‌ నమోదైంది.

బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తర్వాత విషమించిన పరిస్థితి

బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తర్వాత విషమించిన పరిస్థితి

జమ్ముకశ్మీర్‌ ప్రజలు శాంతిని కోరుతున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు ఆకర్షితులవుతున్నారని ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి. కానీ రెండేళ్లలోనే పరిస్థితి తారుమారైంది. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ గత ఏడాది జులై 8న జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. దీనికి నిరసనగా చెలరేగిన అల్లర్లు, హింసాకాండలో 90 మంది చనిపోయారు. వేల మంది గాయపడ్డారు. కశ్మీరీ యువత తిరగబడ్డారు. ఫలితంగా భద్రతాబలగాలపై రాళ్లు రువ్వడం నిత్యక్రుత్యంగా మారింది.

ఉగ్రవాదులకు అండగా ముందుకొచ్చిన అల్లరిమూక

ఉగ్రవాదులకు అండగా ముందుకొచ్చిన అల్లరిమూక

తాజాగా గురువారం తెల్లవారు జామున కుప్వారా జిల్లాలోని సైనిక శిబిరంపై జైషే మహ్మద్ సంస్థ ఉగ్రవాదులుగా భావిస్తున్న ముగ్గురు మిలిటెంట్లు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. భారత సైనికుల ధైర్య సాహసాల ముందు ఇద్దరు మరణిస్తే, మరొక మిలిటెంట్ గాయంతో పారిపోయాడు. ఇదే సమయంలో మిలిటెంట్ల మ్రుతదేహాలను అప్పగించాలని అల్లరిమూక భద్రతాబలగాలపై దాడికి దిగారు. రాళ్లు రువ్వేందుకు వెనుకాడలేదు. విద్యార్థినులు సైతం వీధుల్లోకి ముందుకు రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది.

శాంతి నెలకొల్పాలని కేంద్రానికి సుప్రీం సూచన

శాంతి నెలకొల్పాలని కేంద్రానికి సుప్రీం సూచన

మరోవైపు శుక్రవారం అనంతనాగ్ జిల్లాలో మెహందీ కదాల్ ప్రాంతంలోని జమ్ము కశ్మీర్ బ్యాంక్ శాఖలో ఇద్దరు మిలిటెంట్లు దోపిడీకి పాల్పడేందుకు ప్రయత్నించారు. మిలిటెంట్లను ఎదుర్కొన్న సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కుడి చేతికి గాయం కాగా, మిలిటెంట్లు పారిపోయారు. కుప్వారా జిల్లాలో సైనిక శిబిరంపై దాడి తర్వాత జిల్లాలో సీఆర్పీసీ కింద 144 సెక్షన్ అమలులో ఉంది. మరోవైపు కశ్మీరీ లోయలో విద్యార్థుల భవిత్యవ్యాన్ని శాంతి నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని సూచించిన సుప్రీంకోర్టుకు కేంద్రం ఇచ్చిన సమాధానం మరింత ఇబ్బందికరంగా మారింది.

విద్యతోనే కశ్మీరీ యువతకు సాధికారత

విద్యతోనే కశ్మీరీ యువతకు సాధికారత

వేర్పాటువాద శక్తులతో కేంద్ర ప్రభుత్వం చర్చలకు అంగీకరించబోదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చేసిన వ్యాఖ్య అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఉన్నదని రాజకీయ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.కశ్మీరీ లోయలో శాంతి నెలకొల్పాలంటే ముందు భద్రతాదళాలపై విద్యార్థులు రాళ్లు రువ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, రెండు చర్యలు వెనక్కు తీసుకుని.. వారిని తిరిగి విద్యాసంస్థల వైపు మళ్లించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జెఎస్ ఖేహర్ చేసిన సూచనపై కేంద్రం మీన మేషాలు లెక్కిస్తున్నదన్న సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. విద్యే సాధికారతకు మార్గం అని చీఫ్ జస్టిస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని తేల్చి చెప్పింది.

శాంతి నెలకొల్పాలని కశ్మీర్ హైకోర్టు బార్ అసోసియేషన్ అభ్యర్థన

శాంతి నెలకొల్పాలని కశ్మీర్ హైకోర్టు బార్ అసోసియేషన్ అభ్యర్థన

స్కూళ్లు, విశ్వవిద్యాలయాల్లోకి భద్రతా సంస్థలు దూసుకొచ్చి విద్యార్థులను తీవ్రంగా కొట్టడం వల్లే పరిస్థితి విషమించడానికి కారణమని జమ్ముకశ్మీర్ హైకోర్టు బార్ అసోసియేషన్ వాదించింది. భద్రతాదళాలు అణచివేత ఉన్నంత వరకు విద్యార్థులు అల్లరి మూకలతో కలిసి రోడ్లెక్కుతారని పేర్కొన్నది. కశ్మీరీలు సైతం అంతరాయం లేకుండా, బేషరతుగా చర్చలు జరుపాలని బార్ కౌన్సిల్‌.. సుప్రీంకు నివేదించింది.

శాంతి కోసం మన్మోహన్ ప్రభుత్వ విశ్వయత్నం

శాంతి కోసం మన్మోహన్ ప్రభుత్వ విశ్వయత్నం

1998లో కేంద్రంలో వాజ్ పేయి ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత సైతం జమ్ముకశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు హురియత్ కాన్ఫరెన్స్ నేతలతోనూ తర్వాత పాక్ సర్కార్‌తోనూ సంప్రదింపులు జరిపింది. పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడి తర్వాత సైతం శాంతియుత వాతావరణం నెలకొల్పే చర్యలకు శ్రీకారం చుట్టిన నేపథ్యం ఉన్నది. తర్వాత 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ అనునిత్యం చర్యలు తీసుకున్నది. కానీ 2014లో మోదీ సర్కార్ ఏర్పాటైన తర్వాత పరిస్థితి విషమించింది.

సార్క్ సదస్సు వాయిదా ఇలా

సార్క్ సదస్సు వాయిదా ఇలా

పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడి, యురి సెక్టార్ ఆర్మీ క్యాంప్‌పై దాడి తర్వాత ఇస్లామాబాద్‌లో సార్క్ సదస్సు వాయిదా పడేందుకు దారి తీసింది. మరో గమ్మత్తేమిటంటే జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) - బీజేపీ సర్కార్ అధికారంలో ఉండగా పరిస్థితి మరింత విషమించడం ఆందోళనకర వాతావరణం ఏర్పడిందని విమర్శలు వల్లువెత్తుతున్నాయి.

1980వ దశకంలో కశ్మీర్‌లో ఇలా..

1980వ దశకంలో కశ్మీర్‌లో ఇలా..

జాతీయంగా, అంతర్జాతీయంగా కశ్మీర్‌లో తాజా పరిస్థితులు చర్చనీయాంశాలుగా మారాయి. 1980వ దశకంలో కశ్మీర్‌లో అనూహ్యమైన రీతిలో అల్లర్లు చెలరేగాయి. దాదాపు దశాబ్దకాలం పాటు కశ్మీర్‌ లోయ అట్టుడికిపోయింది. 1996లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన తర్వాత పరిస్థితి క్రమంగా పరిస్థితి నెమ్మదించింది. తాజా పరిస్థితులు మరిచిపోయిన గతాన్ని మళ్లీ గుర్తు చేసే రీతిలో ఇప్పుడు అల్లర్లు, హింస చెలరేగుతున్నాయి.

శ్రీనగర్‌ ఉప ఎన్నిక పోలింగ్ హింసాత్మకం

శ్రీనగర్‌ ఉప ఎన్నిక పోలింగ్ హింసాత్మకం

శ్రీనగర్‌ లోక్‌సభ స్థానంలో 12.61 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కానీ, ఈ నెల 9న ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కేవలం 7.14 శాతం ఓటింగ్‌ నమోదైంది. కశ్మీర్‌లో ఇటీవల ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయి ఓటింగ్‌ ఇది. ఈ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో 8 మంది చనిపోయారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఆ తర్వాత రీ పోలింగ్‌ జరిగింది. రీ పోలింగ్‌లోనూ నమోదైన ఓటింగ్‌ 2 శాతమే. మరోవైపు పాకిస్థాన్‌ అండతో చొరబాట్లు అధికమయ్యాయి. పొరుగుదేశం పెద్దఎత్తున ఉగ్రవాదులను సరిహద్దులు దాటించి కశ్మీర్‌ లోయలోకి పంపుతోంది.

భద్రతా సంస్థలకు మానవ కవచం ఇలా

భద్రతా సంస్థలకు మానవ కవచం ఇలా

ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలనే డిమాండ్లు, పునరావాస కాలనీల ఏర్పాటు యత్నాలు, విద్యా సంస్థల్లో ఆందోళనలు కశ్మీర్‌ యువతలో తమకు ఇష్టం లేనిదేదో జరగబోతోందనే భావం కలుగజేశాయి. తీవ్రవాదులకు సహాయపడే వారినీ తీవ్రవాదులుగానే చూస్తామని ఆర్మీ చీఫ్‌ చేసిన హెచ్చరిక ఆందోళనకారులకు మింగుడు పడడంలేదు. తీవ్రవాదులు విడుదల చేస్తున్న వీడియోలు కశ్మీర్‌లో అశాంతి రేకెత్తిస్తున్నాయి. ఇటీవల ఒక యువకుడిని భద్రతా బలగాలు తమ వాహనానికి కట్టిపడేసి ‘మానవ రక్షణ కవచం'లా వాడుకున్న ఉదంతం తీవ్ర విమర్శల పాలైంది.

కేంద్ర చట్టాల సమీక్షకు మరో కమిటీ అవసరమే

కేంద్ర చట్టాల సమీక్షకు మరో కమిటీ అవసరమే

జమ్ముకశ్మీర్‌ సమాజంలో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2010 అక్టోబరులో నాటి కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ ఎంఎం అన్సారీ సారథ్యంలో మధ్యవర్తుల కమిటీని నియమించింది. ఏడాది తర్వాత ఈ కమిటీ నాటి కేంద్ర హోం మంత్రి పీ చిదంబరానికి నివేదిక అందజేసింది. 1952 ఒప్పందం తర్వాత జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి వర్తింపజేసిన కేంద్ర చట్టాలను సమీక్షించటానికి రాజ్యాంగ నిపుణులతో ఒక రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయాలని, జమ్ముకశ్మీర్‌‌కు వర్తించే ఆర్టికల్‌ 370 లో ‘తాత్కాలికంగా' అనే పదాన్ని తొలగించాలని, దాన్ని శాశ్వతంగా వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నది.

స్వపరిపాలనకు అవకాశం కల్పనే పరిష్కారం

స్వపరిపాలనకు అవకాశం కల్పనే పరిష్కారం

అఖిల భారత సర్వీసులు అధికార్ల సంఖ్యను తగ్గించి వారి స్థానంలో జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర సివిల్‌ సర్వీసు అధికార్ల సంఖ్యను పెంచాలని, జమ్ము, కశ్మీర్‌, లడఖ్ ప్రాంతాలకు విడివిడిగా ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయాలని అన్సారీ కమిటీ సిఫార్సుల్లో ఒక అంశం. వీటికి పరిపాలన, శాసన, ఆర్ధిక అధికారాలు కట్టబెట్టాలి. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఓసీ) ఇరువైపులా సామాజిక, వ్యాపార సంబంధాలను పెంపుదలకు చర్యలు తీసుకోవాలని, జమ్ముకశ్మీర్‌లో ప్రత్యేక ఆర్ధిక మండళ్ల ఏర్పాటు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలకు ప్రోత్సాహం, విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా శ్రీనగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వినియోగంలోకి తేవాలని కమిటీ సూచించింది. కశ్మీరీ పండిట్లు కశ్మీర్ లోయలోకి వచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని, హురియత్‌ నేతలతో చర్చల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని పేర్కొన్నది.

చర్చలపైనే మెహబూబా ముఫ్తీ ఆశలు

చర్చలపైనే మెహబూబా ముఫ్తీ ఆశలు

తీవ్రవాద, వేర్పాటువాద శక్తులు కశ్మీర్‌ లోయలో పేట్రేగిపోవడానికి సోషల్‌ మీడియా కీలక సాధనంగా మారింది. వాట్సప్‌ గ్రూపులు, ఫేస్‌బుక్‌, ఇతర సోషల్‌ మీడియాల ద్వారా అల్లర్లు చేసే వారిని, రాళ్లు రువ్వేవారిని సమీకరించేందుకు వీలుకలుగుతున్నది. ఫలానా ప్రాంతంలో భద్రతా బలగాలపై దాడులకు పాల్పడాలని నిర్దేశించేందుకు కూడా అవకాశం లభిస్తోంది. అల్లర్లు సద్దుమణిగేలా చేయడానికి వేర్పాటువాదులతో చర్చించాలని జమ్ముకశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ భావిస్తున్నారు.

English summary
A militant was arrested on Friday after security forces foiled a bank robbery bid in Anantnag district of Kashmir, news agency PTI reported. Two militants opened fire after entering the Jammu and Kashmir Bank. A CRPF head constable sustained bullet injury in his right hand while the other militant, who was carrying a weapon, escaped from the spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X